Total Pageviews

Tuesday, 24 April 2012

అమ్మలగన్నయమ్మ


కం. అమ్మా, నీబిడ్డనునే
      నమ్మా! మాటల సొబగుల నిమ్మా! దయజూ
      డమ్మా! కాదన కమ్మా!
      సన్మా ర్గములో నడుపుమ! శారద! వాణీ!

కం. మెచ్చావట బుధ జనులను
      ఇచ్చావట సకల శుభము నిశ్చల మనమున్
      వచ్చావట వాగ్రూపిగ
      తెచ్చావట కీర్తిసుఖము తెలుగుల వాణీ!

కం. వలదని చెప్పిన వినదిక
     కలవరమున పలవరించు కలతల మనసున్
     నిలవదు నీధ్యానములో
     కొలవదు నిను నిరతరంబు కావుము వాణీ!

కం. చూడాలని నీరూపము,
      వేడాలని నిన్నునేను వెయ్యి విధములన్,
     పాడాలని నీ గుణములు,
     యాడాలని నీ ముంగిట! యాశలు తల్లీ!

కం. నాకూ యున్నది గోరిక
      నీకూనొకమారు పూజ నిజముగ జేయన్!
      రాకూడద మాయింటికి!
      చేకూడద మేలు నాకు జేజీ! వాణీ!

ఉ.  వాణివిగా పితామహుని రాణివిగా విభులేలు బాటలో
     వాణివిగాగ లోకముల పద్యములెన్నియొ వేలువేలు పా
     రాణిగ మారెనీకు! మృదుహాసిని చేకొనవమ్మ దాసుడీ
     ప్రాణములున్న మాధవుని ప్రార్థన వేల్పులవాణి భారతీ |

                                                                   - మాధవ తురుమెళ్ల 24th April 20112

Tuesday, 3 April 2012

ప్రాముఖ్యత అనే ఎండమావి

నిప్పులు చిమ్ముకుంటూ నింగికి నేనెగిరిపోతే. నిప్పులు చిమ్ముకుంటూ నింగికి నేనెగిరిపోతే నిబిడాశ్చర్యంతో వీరు, నెత్తురు కక్కుకుంటూ నేలకు నే రాలిపోతే నిర్దాక్షిణ్యంగా వీరే. - శ్రీశ్రీ

ప్రాముఖ్యత అనే ఎండమావి గురించి దాన్ని పొంది పోగొట్టుకున్న వారిగురించి (సెలబ్రిటీలు) ఒకసారి శోభన్ బాబుగారు చాలా బాధపడుతూ ఒకమాట అన్నారు అది నాకు ఎప్పుడూ గుర్తొస్తూంటుంది. ‘కాంతారావు చాలా ప్రముఖ కళాకారుడు ఆయనను నేను చాలా అభిమానించేవాడిని. తను సెలబ్రిటీగా ఉన్న రోజుల్లో ఆయన ఆటోగ్రాప్ కోసం నేనుగూడా క్యూలో నిలుచున్నాను... అటువంటి వ్యక్తి ముసలివాడైపోయిన తర్వాత సినిమాలో ఎక్శ్ట్రా వేషం కోసం నడిఎండలో క్యూలో నిలబడి ఉండటం చూసాను... నా హృదయం ఘోషించింది... ఛీ... అంతటి కళాకారుడికి వయసు మళ్లిపోయిన తర్వాత ఇదా వీళ్లు ఇచ్చేవిలువ అని అసహ్యం వేసింది... అప్పట్నించీ నేను సినిమాలకూ సినిమా వేషాలకూ దూరంగా జరిగిపోయాను. ఇవాళ నీకు బ్రహ్మరధం పట్టిన ప్రజలు నిన్ను మర్చిపోవడానికి ఒక్క క్షణం పట్టదు... "
శోభన్ బాబుగారి మాటలు అక్షర సత్యాలు.... నేను అనేకులు ఇదివరకు చాలా ప్రముఖులైనటువంటివాళ్లను కలుస్తుంటాను... వాళ్లగురించి ఈరోజు పట్టించుకున్నవారు లేరు...

కారే రాజులు రాజ్యముల్ గలుగవే గర్వోన్నతిం బొందరే
వా రేరీ సిరి మూటగట్టుకొని పోవంజాలిరే భూమిపైఁ
బే రైనం గలదే శిబిప్రముఖలుం బ్రీతిన్ యశఃకాములై
యీరే కోర్కులు వారలన్ మఱచిరే యి క్కాలమున్ భార్గవా ! - పోతనామాత్యులు

కాబట్టి ప్రఖ్యాతులుగా మారేటప్పుడు మనుషులుగా మనం అర్ధం చేసుకోవాల్సిందేంటంటే ఈ జగత్తులో ఏదీ శాశ్వతంకాదు... మిడిసిపాటు పడగూడదనీ మిన్నువిరిగి మీదపడే సమయం ఎంతోదూరంలో లేదన్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి..

Saturday, 31 March 2012

శ్రీరామచందృని స్వభావం పట్ల ఊహ అపోహలు

శ్రీరామచందృని స్వభావం పట్ల ఊహ అపోహలు

ప్రతిమానవునికి ఒక మానసిక సమతుల్యం (mindset) అనేది ఉంటుంది.  ఇది ఆ మానవుడు ఎక్కడ పుట్టాడో ఆ ప్రదేశాలవల్ల, ఆ జీవి తలిదండృలు నేర్పిన బుద్ధివల్ల, అలాగే తను పుట్టిపెరిగిన తెగల ఆవారవ్యవహారాలవల్ల (Tribal identity and culture) వస్తుంది...  

ఉదాహరణకు ఒక వందరూపాయలనోటు ఒక రోడ్డుపై పడి ఉన్నదనుకోండి... ఆ నోటుని చూసిన బిచ్చగాడు ’ఈరోజుకు నాకు అన్నం దొరికింది’ అని ఆనందంగా తీసేసుకుంటాడే తప్ప అయ్యో ఇది ఎవరుపోగొట్టుకున్నారో అనుకోడు... ఒక పోలీసు ఆ నోటు రోడ్డుమీద పడి ఉండటం చూసి ’ఈ నోటు ఎవరైనా తమదని చెబితే వాళ్లు నిజం చెబుతున్నారా అబద్ధం చెబుతున్నారా అనేది ఎలా కనుక్కోవడం.  ఒక వేళ అబద్ధం చెబితే వాళ్లని ఏ సెక్షనుక్రింద నేరస్థులుగా విచారించచ్చు’ అని ఆలోచిస్తాడు... అలాగే ఒక లాయరు చూస్తే అతని ఊహలు ఇంకొక విధంగా వెళతాయి.   వందనోటు ఒక్కటే కానీ బిచ్చగాడు ఒకవిధంగా, పోలీసు మరొకవిధంగా, లాయరు ఇంకొకవిధంగా దాన్ని చూసి ఆలోచిస్తారు...  దీన్నిబట్టి చూస్తే, మనకు అర్ధమయేదేంటంటే "కనబడే వస్తువు ఒకటే అయినా అది అనేకమందిలో అనేకరకాలైన భావజాలాలను రేకెత్తించగల అవకాశం ఉంది" అని!   వీరిలో ఎవరి ఆలోచనా తప్పుకాదు... దీన్నే ’స్వభావం’ అని గూడా అంటారు (భావం అంటే ఆలోచన, స్వ భావం అంటే సొంత ఆలోచన)...  అయితే వచ్చే చిక్కల్లా నా ఆలోచనే నిజం అవతలివానిది కాదు అనుకోవడంలో ఉంది...

హైందవుల నమ్మకం ప్రకారం జీవితం అనేది ఒక అనివార్యమైన ఒక మహా చక్రం... ‘జాతస్య హి ధృవో మృత్యుః ధృవం జన్మ మృతస్యచ‘  జీవి జననమరణాలమధ్య వృత్తాకారంలో తిరుగుతాడు అని గాఢంగా నమ్మేవారి స్వభావం ఒకవిధంగా ఉంటుంది... ఆ స్వభావాన్ని అర్ధంచేసుకోకపోవడం వల్ల హైందవులపట్ల అపార్థం ఎక్కువ కలుగుతుంటుంది...  ఈ జన్మ ఒక్కటే సత్యం ఇంకొక జన్మ రాదు అనుకున్నప్పుడు కలిగే స్వభావం వేరు... ఎవరి స్వభావం వారిది...

శ్రీరాముడు సీతమ్మని కష్టపెట్టాడు అనుకోవడం ఒక స్వభావం.... లేదు ఆయన కష్టపెట్టలేదు అనుకోవడం ఇంకొక స్వభావం...   సీతమ్మని అగ్నిలో దూకమన్నాడు అని ఆరోపణ చేస్తాము... కానీ ఈరోజు మనకు తెలిసిన సత్యం ఏంటంటే అగ్నిగుండంలోనుండి దూకడం నడవటం అంత పెద్దకష్టమైన పని కాదని!  మానవులు కొన్నికొన్నిసార్లు తాము బాధల్లో ఉన్నప్పుడు ఉక్రోషంలో అనాలోచితంగా ఏవేవో పరుషమైన మాటలు అనేస్తారు ’సీతమ్మ లక్ష్మణుడి పట్ల అలాగే పరుషంగా మాట్లాడింది, కైక తన భర్త దశరధునిపట్ల పరుషంగా మాట్లాడింది, అలాగే మంధర కైక పట్ల, రావణుడు విభీషణునిపట్ల, రావణుడు మారీచునిపట్ల, శూర్పణక రావణునిపట్ల --- ఇలా రామాయణంలో మంచివారు దుర్మార్గులు అందరూ తమ పాత్రలకు విరుద్ధంగా మాట్లాడతారు..... దీన్ని బట్టి చూస్తే ’రాముడు సీత పట్ల పరుషంగా మాట్లాడటం’ అనే విషయం మనకు తెలిసిపోతుంది... శ్రీరాముడు మానవులలోని దేవుడు.... ఆయన మర్యాదాపురుషోత్తముడు... తన స్వభావాన్ననుసరించి ఆయన ప్రవర్తించాడు, అదేవిధంతా తన స్వభావాన్ననుసరించి సీతమ్మా ప్రవర్తించింది..... లక్ష్మీనారాయణుల అవతారాలైన వారు లక్ష్మీనారాయణుల స్వభావులుగానే ప్రవర్తించారు...

అందువల్ల నాకు శ్రీమద్రామాయణంలో ఎందుకో తప్పు కనబడదు... అది నా స్వభావం అనుకోండి... మీ అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు... శ్రీరామ రామ రామేతి రమేరామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే... ---- మాధవ తురుమెళ్ల ౩౧ మార్చి ౨౦౧౨

Monday, 26 March 2012

భోజ్యానాయక్ మరణం


భోజ్యానాయక్ మరణ చిత్రాన్ని నిన్న నాకెవరో పంపించారు... చూసి నా మనసు చలించిపోయింది... ఎందుకీ యుద్ధాలు బలవన్మరణాలు వాళ్లడిగిన రాజ్యం వాళ్లకు ఇచ్చెయ్యగూడదా అని నా మనసు నాలుగు పద్యాలు పలికింది వాటిని ఇక్కడ ఇస్తున్నాను...

భోజ్యానాయక్ మరణం
============
పద్యరచన: తురుమెళ్ల మాధవ '26 మార్చి 2012'
...
మ.
మరపో మారిన రాజ్యమో ఎవరి లాభంబీ తెలంగాణమో
కరవై పోయెన రాజమా ర్గముల యోకారు ణ్యమేలేదహో
మరణా న్నావహ మేలజే యవలె? యామంటల్బడెన్గాలె! యే
షరతుల్బెట్టక యేల నేగవలె భోజ్యానాయకుండ క్కటా!

చేతికందిరావాల్సిన ఆ బిడ్డని పోగొట్టుకున్న ఆ తల్లి మనసుగూర్చి ఆలోచిస్తే....

కం.
కాడా బిడ్డడు యమ్మకు?
లేడాయని బాధపడద రేతిరి పగలున్?
చూడాలనుకొని బిడ్డను
వేడాలనుకొను తనకిక వేదనె మిగిలెన్!

కం.
బాధిత వర్గపు కోరిక
శోధిత మున్జేయ దలువర సోదరు లెవరూ?
వేధిత పామర జనములు
వీధిన పడియున్నతీరు విశదము గాదా!

ఉ.
చిందరవందరై నటుల చించిన విస్తరి తీరుతెన్నుగా
ఎందుల కీయుద్ధ మసలు? ఎవ్వని రాజ్యము లేవిబోవునో!
వందల వేలసంఖ్యలుగ వీధినబోవుచు వాదులా డగా
తొందరలేదు లేదనుచు తోచిన రీతిన జాగులేలనో!

కం.
సోదరులేగద చూడగ
వాదనపడు వారు తెలుగు వారలు గారా!

రోదన కూడదు వారిని
వేదన బాల్జే యవద్దు వేరు పడెదమో... 


కం.
చాలిక ఈ మరణంబులు
పోలికలేనిది జగడము పోనీరాదా!
వాళ్లిక అడిగిన రాజ్యము
వాళ్లకు ఇచ్చెయ్యమనుచు వినతుల జేతున్!

------xxx-----

Tuesday, 20 March 2012

ఒక మధుర క్షణం



నిశిరాతిరి కాటుక కళ్ళు నవ్వితే ఒలికినట్లున్న నక్షత్రాలు
కొంచెం బిడియంగా చుట్టుకున్నట్లున్న పల్చటి వెన్నెల చీరలో
దాచాలని ఎంత ప్రయత్నంచేసినా దాగని అందాలు...
సృష్టి రహస్యాలను
చెవుల్లో గుసగుసలుగా చెప్పే
పిల్ల తెమ్మెరల మంద్రద్వ్హనులలో,
నునుసిగ్గుగా -
నా గుండెచప్పుడు నేపధ్యంగా
నాలో నిశ్శబ్దంగా ఆలాపించబడుతున్న ప్రేమ గీతం...

వికసించిందో, పుష్పించిందో, అహ్లాదభరితంగా చలించిందో,
మల్లెలుగా జాజులుగా అగరొత్తుల పొగలు పొగలుగా
సువాసనలుగా ఆఘ్రాణితమైన ఆ మధుర క్షణం
నేను నేను మరిచిపోలేని క్షణం....

నా హృదయపు ప్రేమ సింహాసనం మీద
నమ్మకంగా ఒదిగిన నా నెలవంక
అలవోడ్పుగా నను చూస్తూ హత్తుకున్న సిగ్గుల మొగ్గయింది...
నాకొక అస్తిత్వాన్నందిస్తూ తను నాలో కరిగిపోయింది,
నేనేతనుగా తనే నేనుగా త్వమేవాహంగా
ఆహ్లాదంగా ఆప్యాయంగా ఆనందంగా మారిపోయింది...

- మాధవ తురుమెళ్ల
కౌముది మాసపత్రిక మార్చి ౨౧౦౧౨ సంచికలో ప్రచురితమైన కవిత
http://www.koumudi.net/Monthly/2012/march/index.html 

Thursday, 1 March 2012

మద్యంలేకుండా మత్తెక్కించేది ప్రేమ


మాటకు అందనిది, మౌనంలో ఒదిగిపోయినది
చిరునవ్వుల క్రీగంటచూపుల గాలులకు
తలలూపుతూ --
స్పందించిన
హృదయపుష్పపు పుప్పొడిలా
సృష్టిక్రమంలో భాగంగా -
అవ్యక్తంగా ఆప్యాయంగా -
మనసును హత్తుకునేది
మద్యంలేకుండా మత్తెక్కించేది ప్రేమ.  - మాధవ తురుమెళ్ల


Saturday, 18 February 2012

పిచ్చిరాతలు

‘పిచ్చిరాతలు‘

రాత్రి చీకటి కళ్లు కప్పుకున్న ఉషస్సు సూర్యుడినింకా జనించనేలేదు..
తుఫానుల అల్లకల్లోలాలలో లోకాలన్నిటినీ హాహాకారాలకు గురి చేయగల
బడబానలాన్ని సముద్రం ఇంకా ప్రసవించనేలేదు
కానీ నీ వెందుకు ప్రపంచగర్భాన్ని మోస్తూ మూలుగుతూ
శాంతికి జన్మనిద్దామని ప్రయత్నంచేస్తున్నావు? - - మాధవ తురుమెళ్ల

Tuesday, 31 January 2012

Interview in Gemini TV యూరోప్ లోని తెలుగువారి గుండె గొంతుక‘ ను స్థాపించిన కారణం

ఈ ఇంటర్వ్యూలో నేను ఇంగ్లండు రాజకీయాలలోకి ఎందుకు ప్రవేశించాను,  బ్రిటీష్ రాజకీయాలలో పోటీచేసిన మొదటి తెలుగువానిగా ఎలా మిగిలాను,  గాంధీగారంటే నాకున్న అభిమానం వారి బాటలో నడవాలని అనుకునే నా ఆకాంక్ష, ‘తెలుగువాణి రేడియో - యూరోప్ లోని తెలుగువారి గుండె గొంతుక‘ ను స్థాపించిన కారణం మరియు అనేక విషయాలు ముచ్చటించడం జరిగింది.  విని మీ అభిప్రాయాలు తెలుపగలరు. నమస్కారం



Monday, 16 January 2012

దైవాసుర సంపత్తులనుగూర్చి భగవంతుడు

భగవద్గీత లో పదహారవ అధ్యాయం చాలా ముఖ్యమైనది.. దీన్ని నేను రోజూ రైల్లో నా ఆపీసుకు వెళ్లుతున్నప్పుడు స్మరణకు తెచ్చుకుంటాను. దీంట్లో దైవాసుర సంపత్తులనుగూర్చి భగవంతుడు చెప్పాడు.

శ్రీకృష్ణుడు దైవగుణాలు అంటే ఏంటో ఇలా చెప్పాడు:
భయం లేకుండడం,నిర్మలమైన మనసు,అధ్యాత్మిక జ్ఞాన నిష్ఠ, ఆత్మనిగ్రహం, యజ్ఞాచరణ, వేదాధ్యయనం, తపస్సు, సరళత, అహింస, సత్యం, కోపం లేకుండడం, త్యాగం, శాంతి, [ఇతరులలో] దోషాలు ఎంచకుండడం, [జీవులపట్ల] మృదుత్వం, భూతదయ, లోభం లేకుండడం, అసూయ లేకుండడం, కీర్తిపట్ల ఆశ లేకుండడం.

కానీ ఆ తర్వాత గీతలో భగవానుడు చెప్పిన ఆసుర లక్షణాలే నన్ను నిజంగా వణికింపజేస్తాయి..

ఇదమ్ అద్య మయా లబ్ధమ్ ఇమమ్ ప్రాప్స్యే మనొరథమ్
ఇదమ్ అస్తిదమ్ అపి మే భవిష్యతి పునర్ ధనమ్ ||
అసౌ మయా హతః శతృః హనిష్యేచా పరాన్ అపి
ఈశ్వరోహం అహం భోగీ సిద్ధోహం బలవాన్ సుఖీ ||
ఆఢ్యోభి జనవాన్ అస్మి కోన్యోస్తి సదృశో మయా
యక్షేదాస్యామి మోదిష్య ఇత్యజ్ఞాన విమోహితాః ||

మూర్ఖులు అజ్ఞాన విమోహితులు --- "ఇది నాకు దొరికింది. దీనితో ఈ కోరిక తీర్చుకుంటాను.నాకు ఇంత ఆస్తి ఉంది,ఇంకా ఆస్తి పోగేసుకుంటాను. ఈవేళ (చూడు నేను) ఈ విధంగా నా శత్రువును చంపాను! ఇక మిగిలిన శత్రువులందరినీ చంపుతాను (వ్యాపారంలో శతృత్వమే కావచ్చు). నాదగ్గర సర్వమైన అధికారాలున్నాయి. నేను చాలా బలవంతుడిని, నేను చాలా సుఖపడేవాడిని, నా దగ్గర బోల్డంత డబ్బుంది (ధనికుడిని), నేను తలచుకుంటే నాకిక ఎదురే లేదు, నాకు ఎవరూ సమానం కాదు, నేనే యాగలూ,దానాలూ చేస్తాను. నేనెప్పుడూ సంతోషినే" --- అని అజ్ఞానంచేత అనుకుంటూ కామం, భోగాలలో మునిగి చివరకు నరకంలో పడతారు.

ఆత్మస్తుతి,డబ్బు మదం తో శాస్త్రాన్ని విడిచిపెట్టి ఈ మూర్ఖులు పేరుకు మాత్రం డాంబికంగా యాగాలు చేస్తారు.అన్ని దుర్గుణాలు కలిగి తోటివారిపట్ల అసూయతో పడి కొట్టుకుపోతూ అంతర్యామి నైన [అంతరాత్మను] నన్ను తిరస్కరిస్తారు. వీరు తిరిగి తిరిగి ఇలాంటి పాపపు జన్మలే పొందుతారు. వీరు ఎన్నటికీ నన్ను చేరలేక [అమూల్యమైన మనుష్యజన్మని వ్యర్ధం చేసుకుని] అంతకంతకూ హీనజన్మలనే [పురుగు పుట్ర, సంక్రాంతి కోళ్లలాగా కొట్టుకునే జన్మలని] పొందుతుంటారు.

Thursday, 15 December 2011

కలలు పోగొట్టే మంత్రం



జీవితంలో తనకు జరిగిన అన్యాయాన్ని గూర్చిగానీ -
తనని నమ్మించి మోసగించిన తను అతిగా నమ్మిన తనవారిని గూర్చిగానీ -
తనకు జరిగిన అవమానాలను గూర్చిగానీ,
ఎవరికీ ఫిర్యాదు చెయ్యకుండా -
చనిపోయిన ప్రియబంధువు శవం చుట్టూ
కుండనీరు తీసుకుని తలదించుకు  ప్రదక్షిణలు చేసిన వాడికి మల్లే.,
తనను కికురించిన ప్రేమకు -
ఏనాడో మానసిక దహనసంస్కారం చేసి,
జ్ఞాపకాల నీటికుండలనుండి కావాలని పెట్టిన
కళ్ల చిల్లులద్వారా కన్నీళ్లన్నీ కార్చేసి,
పెదవులు రెంటినీ సంస్కారం అనే దబ్బనపు పురికొసతో కుట్టి
మౌనంగా తలదించుకుని -
తన దురదృష్టం అంతే అని అనుకుంటూ
అక్రమంగా జీవితం తనపై విధించిన కర్కశపు శిక్షని భరిస్తూ,
చిరునవ్వు తొడుగుని ముఖంపై తొడుక్కుని
తనదారిన తానుపోయే వాడు
ఎవ్వరినీ ఏమీ అనేవాడు కాడు...

అయినాసరే -
ఆ అమాయకుడికి శిక్ష ఇంకా చాలదన్నట్లు...
ఎప్పట్లానే
చీకట్లో
ఒక్కసారి నిశ్శబ్దం చుట్టుముట్టినవేళ,
కావాలని బలవంతంగా ఆమూలాగ్రమూ తగలెట్టి మోడువార్చిన
అతడు ప్రేమించిన
ఒకప్పటి పచ్చటి ప్రేమల జ్ఞాపకాల మహావృక్షం వెనుక,
తగలబడక అసహ్యంగా దెయ్యంలాగా
భయపెట్టే భూతంలాగా
ఏజన్మపాపమో పగతీర్చుకోవాలన్నట్లు
కనుమరుగవకుండా
బలవంతంగా మిగిలిపోయిన
ఆ మొండిమాను వెనుక,
నిస్సహాయంగా నిక్కి దాక్కుని నిద్రిస్తున్న వాడిని ...
 ఆ అమాయకుడిని ----
కర్కశంగా మెడపట్టి బయటకు ఈడుస్తున్నాయి
నరకపు చెరసాలలో నమ్మినబంట్లవంటివైన కలలు!

తనకు దక్కి దూరమైన అందమైన ఒకప్పటి అందాన్ని
దురదృష్టవశాత్తూ పొందలేక జారవిడుచుకున్న ప్రేమజీవితాన్ని
బలవంతంగా సినిమాలా చూపించేస్తూ ---
అవశుడిని అతడిని  ఏడిపిస్తాయి...

కలల కర్కశపు పట్టునుండి ఉలిక్కిపడి
విదిలించుకు మేలుకున్న అతడు
చెమర్చిన కళ్లని తుడుచుకుంటాడు
కలేకదా - అని గొణుక్కుంటాడు
గడిచిపోయిన క్షణాలను, నిమిషాలను, గంటలను, సంవత్సరాలను, దశాబ్దాలను
ఉరిస్థంభానికి వేలాడుతూ ఊగిసలాడుతున్న తాడుని చూస్తున్నట్లు
భయం భయం గానే కానీ ఊరికే లెక్కేసుకుంటాడు...
హఠాత్తుగా పిచ్చిగా నవ్వుకుంటాడు -
ఇవాళో రేపో మరణమనే ప్రియురాలు రాకపోతుందా -
నన్ను కౌగిలించుకోకపోతుందా అని ఆశగా అనుకుంటాడు...
కళ్లపై తిరిగి రెప్పలదుప్పటి కప్పుకుని
కలలని పోగొట్టే మంత్రాలను వెదుక్కుంటూ పడుకుంటాడు.

-- మాధవ తురుమెళ్ల (15 December 2011)

Saturday, 10 December 2011

British Library Beowulf book reading in Telugu


లండన్ బ్రిటీష్ లైబ్రరీ లో భద్రపరుచబడిన ఒక 1870 వ కాలంలో తెలుగులో ముద్రితమైన ఒక అపూర్వమైన గ్రంధం బియోవుల్ఫ్ ... దీన్ని నేను చదువుతూ ఉండగా రికార్డు చేసి భద్రపరిచారు.. అదేవిధంగా ఇక్కడ పోతన భాగవతం తాళపత్రాలు గూడ ఉన్నాయి... వాటిని చేతిలో పట్టుకుని చదివి ఉప్పొంగి పోయాను. ఇలాగే తెలుగులో అనేక అపురూప గ్రంధాలు ఇక్కడ ఉన్నాయి..

Some of you may know I am a friend of British Library. I try volunteering for their projects. Recently I participated in "Beowulf" project. This book is translated in 1870s and in the treasures of British Library. They recorded the book reading using my voice to keep it in their permanent archives. Please listen to my reading clicking the link "TELUGU"...

http://britishlibrary.typepad.co.uk/digitisedmanuscripts/2011/09/beowulf-in-hungarian-and-french-and-telugu-.html


Beowulf in Hungarian ... and French ... and Telugu ...

Ever wondered what Beowulf sounds like in Dutch, Greek or Russian, or in Telugu, a Dravidian language spoken in parts of southern India? Here at the British Library we've had some fun creating the recordings found here, representing nine different modern languages.

BEOWULF 3
Photo of Mr Madhava Turumella, reading the Telugu translation of Beowulf (courtesy of Nigel Bewley, The British Library).
We are extremely grateful to all our readers (Marja Kingma, Karen Eeckman, Juan Garces, Dimitrios Skrekas, Ildiko Wollner, Laura Nuvoloni, Yasuyo Ohtsuka, Irina Lester and Madhava Turumella), and to Nigel Bewley of the British Library's Sound and Vision for making the recordings.

Monday, 28 November 2011

పెంటఁదినెడు కాకి పితరుఁ డెట్లాయెనో

పిండములను జేసి పితరులఁదలపోసి
కాకులకును బెట్టు గాడ్దెలార
పెంటఁదినెడు కాకి పితరుఁ డెట్లాయెనో
విశ్వదాభిరామ వినర వేమ!

కాకి గురించి వేమనకు తెలియని సత్యాలు:

1) మనిషి చనిపోతే అనాధ శవాలను రాబందులు పీక్కుతింటాయి. ఆ రాబందుల బారిన శవం పడకుండా కాపలాకాస్తాయి కాకులు. రాబందులతో పోట్లాడగల పక్షులు కాకులు మాత్రమే

2) కాకులు పక్షిజాతికంతటిలోకి తెలివిగలిగిన పక్షులు. అవి రామచిలుకలకంటే తెలివిగలవి.
3) కాకుల మెదడు చాలా పెద్దది.
4) కాకులు మరణ శౌచాన్ని పాటిస్తాయి. అంటే తమ తోటి కాకి చనిపోతే అవి శోకాన్ని మూకుమ్మడిగా వ్యక్తపరచడమే కాకుండా ఒక గంట తర్వాత కలిసి నదికిపోయి స్నానం చేస్తాయి. (అచ్చం మనుషులు అవబృతం పాటించినట్లుగా)
5) కాకుల మాంసం చాలా ప్రసిద్ధి పొందింది. వాటి మాంసం పందిమాంసంకంటే రుచిగా ఉంటుందని మాంసాహారులు చెబుతారు. ఇప్పటికీ పాశ్చాత్యదేశాలలో కాకిమాంసం తింటారు. ఒకప్పుడు పధ్నాలుగవశతాబ్దానికి ముందర దక్షిణ భారతదేశంలో కాకులను తినేవారు. దేశంలో క్షామం వచ్చినప్పుడు కాకులమాసం వారు తినడానికి పనికొచ్చేది.
6) కాకులు మనుషుల తర్వాత అతి త్వరగా నేర్చుకునే జీవులు. వీటికి విషయం కోతులకంటే తొందరగా అర్ధమవుతుంది.
7) కాకులు భయంకరమైన విషసర్పాలను, క్రూరమృగాలను అతి త్వరగా పసిగడతాయి. పెద్దగా కా కా అని గోలచేస్తాయి. కాబట్టి కాకుల అరుపులు విని ప్రమాదాన్ని పసిగట్టవచ్చు.
8) మనకి మామూలుగా ’కా కా’ అన్నట్లు వినిపించినా కాకి భాష చాలా అభివృద్ధి చెందిన భాష అని చెబుతారు. ఆ భాషతో కాకులు ఒకదానితో వేరొకటి సందెశాలిచ్చుకుంటాయని, కలిసి పనిచేస్తాయని తెలిసింది.

ఏ రకంగా చూసినా కాకులు అతి తెలివిగలిగిన పక్షులు, పైగా మానవాళికి ఉపయోగపడేవి, ప్రమాదాలనుండి హెచ్చరికలు అందజేయగలిగేవి అనేది నిస్సందేహంగా ఋజువైన సత్యం. అటువంటి కాకులకు తమ పితృదేవతల పేరిట ఇంత అన్నం పెట్టడంలో నాకయితే తప్పేమీ కనబడలేదు. కాబట్టి వేమన విమర్శకు అర్ధంలేదని నేననుకుంటాను. పాతంతా రోతకాదు, కొత్తంతా వింతాకాదు... మనపాతలో తరతరాలనుండీ తెలుసుకుని అర్ధంచేసుకున్న ఒక సత్యం ఉంది. ఇవాళ మనకది అర్ధంకాకపోవచ్చు కానీ సరిగా విశ్లేషిస్తే మన పాత తరాలవారి పద్ధతుల్లో వారునమ్మిన కొన్ని విషయాల్లో మనకు అర్ధం ద్యోతకమవుతుంది... అందుకే శ్రద్ధ పెట్టి వినండి అని చెబుతారు.

Friday, 7 October 2011

ఈ రోజు సమ్మెవేళ


పైన నడినెత్తిన ప్రపంచాన్ని దగ్ధం చేసేటట్లు
ఆగ్రహోదగ్రంగా సూర్యగోళం భగబగా మండుతోంది.

రోడ్ఛుపక్క ఏ చీడపురుగు చేతపడిందో కాలంకాని కాలంలో
ఆకులు పూర్తిగా రాల్చేసుకున్న చెట్టు సిగ్గుతో నగ్నంగా నిల్చోనుంది...

నీరు దొరక్క గొంతు ఆర్చుకుపోయిన కాకి
దిక్కుతెలియక పోయినట్లు అటూ ఇటూ అదేపనిగా తలతిప్పుతూ
ఏవో విపరీతపు అరుపులు అరుస్తోంది....

తోక కాళ్ల మధ్యకు ముడుచుకుని జీవితంలో ఓడిపోయి
అన్నీ పోగట్టుకున్న దానికి మల్లే ఒక పిచ్చికుక్క
బ్రతకటానికి ఆరాటపడుతూ తోటికుక్కల
దంష్ట్రాకరాళాలనుండి రక్కసి రక్కులనుండి దూరంగా పారిపోతోంది....

డొక్కలు వెన్నెముకకానుకొని,
వెన్నెముకేమో -
మానవుడైన రామునిచేతిలో -
విరచబడ్డ భగవంతుడైన శివునివిల్లులాగా -
అప్రాకృతికంగా మెలికలు తిరిగిపోయి,
నోటిలో పండ్లూడిపోయి,
ఎండిన చనుగవల కప్పేందుకు -
బూడిద దుమ్ముతో దుప్పటిలాగా అలముకొని
ఒక ముసలి బిచ్చగత్తె - కొరడాతో కర్కశంగా కొట్టబడ్డ బానిసవలె మూలుగుతోంది...

లోకమంతా ఈ సమ్మెవేళ -
ఒక రోగగ్రస్థవలె, ఒక తూర్ణీకృత వికృతిగా
ఇక యుగాంతమే తరువాయన్నట్లు
ఉరికంబాన్నెక్కబోయే ఖైదీలా,
బలిస్థంబాన్నలంకరించబోయే మూగజీవంలా
ఇలా దీనంగా... దరిద్రంగా....
కాళ్లీడుస్తూ నడుస్తోంది....

--- మాధవ తురుమెళ్ల

Monday, 26 September 2011

ఆత్మ క్షోభ


ఆత్మ క్షోభ
--------

[చూసావా!]
ఈ సంధ్యని గూడా మనం జారవిడుచుకున్నాము....
ఈ  సాయంత్రపు సమయంలో
నీలపు రాత్రి  - ఆత్రంగా ప్రపంచంపై పడిపోబోతున్నవేళ
 చేయి చేయి కలుపుకు నిలుచోవాల్సిన
 మనం ఎవరికీ కనిపించనేలేదు...

దూరదూరపు కొండలపై అంచులపై ముగిసిపోతున్న
ఈ సూర్యాస్తమయపు సంబరాన్ని
నేను ఒక్కడినే నా కిటికీలోంచి పరికిస్తున్నాను.

కొన్నిసార్లు సూర్యుని లోని ఒక భాగం
నా [బీదరికపు] అరచేతిలో నాణెంలాగా మండిపోతుంది...

నీకు తెలుసా -
నా  ఆత్మ క్షోభిస్తూన్న
ఆ అంతులేని విషాదంలో
నిన్ను నేను గుర్తుచేసుకున్నానని....

అసలు ఎక్కడున్నావు అప్పుడు నీవు?
ఇంకెవరున్నారు అప్పుడు నీతో?
ఏం చెబుతూ ఉండి ఉంటారు?
నువ్వెక్కడో అందనంత దూరంలో ఉన్నావన్న -
పుట్టెడు దుఃఖాన్ని నేను అనుభవిస్తున్నవేళ
ఎందుకంత అమాతంగా మొత్తంగా ప్రేమ  విరహంగా మారి నాపై పడిపోతుంది?

మూసిన పుస్తకం సంధ్యవేళ ఎప్పుడూ కిందేపడిపోతుంది
గాయపడినా విశ్వాసపు కుక్కలాగా
నా నీలపుస్వెట్టర్ నా కాళ్లదగ్గరే పడి నలిగిపోతుంది.

ఇంతే నీవు... ఎప్పుడూ.... ఎప్పుడూ
సంధ్యరంగులలో కరిగిపోతున్న విగ్రాహాలలాగా
సాయంత్రాలలోపాటే కనుమరుగైపోతావు.

-- పాబ్లో నెరుడా [అనువాదం: మాధవ తురుమెళ్ల ]

ఇది నాకు అతిబాగా నచ్చే పాబ్లో కవిత.  ఆయన తన బీదరికాన్ని, తనకూ ప్రేయసికి ఉన్న అంతులేని దూరాన్ని తలచుకుంటూ సాయంత్రాన్ని తన అసహాయతను తిట్టుకుంటూన్న ప్రియుడిగురించి రాసిన కవిత....

ఇది 25 September 2011, చిలీదేశంలోని నెరుడా యొక్క ఇంటి పెరటిభాగంలో కూర్చుని ఆలోచిస్తూ ’Clenched Soul' అనే నెరుడా విరహపు కవితకు చేసుకున్న అనువాదం - ఒప్పులుంటే అవన్నీ పాబ్లోవి తప్పులుంటే తెలియక అనువాదానికి సాహసించిన నావని తలచి నన్ను మన్నించండి..







Friday, 9 September 2011

కొండలతో బండల ఉనికిని అడగకు
సముద్రాన్ని అలలంటే ఏంటని అడగకు
నిరంతర జీవన ప్రయాణంలో అహరహమూ శ్రమిస్తున్న
నా హృదయంలో విషాదం ఎక్కడుందని అడగకు...
-- మాధవ తురుమెళ్ల

Wednesday, 17 August 2011

అన్నా హజారే కీ జై - చిన్నకధ

’అన్నాహజారే జై అన్నాహజారే జై’ అని స్కూటర్మీద ఇద్దరు కుర్రాళ్లు వెళ్తున్నారు. ట్రాఫిక్ కానిస్టేబుల్ వాళ్లని పట్టుకుని ఆపాడు. 

’హెల్మెట్ ఏదీ’ అని అడిగాడు... 

’పోలీసన్నా! అన్నా! హెల్మెట్ మర్చిపోయి వచ్చాము... ఈ వంద తీసుకుని మమ్మల్ని వదిలెయ్యన్నా అంటూ ఓ వందనోటిచ్చారు’. 

అది పుచ్చుకుని పోలీసు మొహం అటు తిప్పుకున్నాడు. 

ఆ పోసీసుఅన్నకి హజారు(వెయ్యి) సార్లు థాంక్స్ చెబుతూ ’అన్నా హజారేకీ జై’ అంటూ ఈ కురాళ్లిద్దరూ తమదారిన తాము పొయ్యారు...

-మాధవ తురుమెళ్ల ’ఒక చిన్న కధ’ :-)

Tuesday, 16 August 2011

ముక్తెన్నడు నీకు మునులగడ్డ భారతమా



ఎవరు పేద ఎవరు రాజు ఎవరికెవరు భారతమా,
ఎవరి నెవరు దోస్తారో ఎవరికెరుక భారతమా,
ఏనాటికి ముక్తి నీకు నిరుపేదల భారతమా,
ముందుకెపుడు సాగుతావు మునులగడ్డ భారతమా!

విచ్చలవిడి అన్యాయం వెదజల్లెను లంచాలను
భారతదేశపు సంపద కొల్లగొట్టు రాబందులు...
గనులనొకడు కాంట్రాక్టులనింకొక్కడు
ఎక్కడబడితే అక్కడ అక్రమాలకు పాల్పడె
రాజకీయ రాబందుల లంచగొండి సామ్రాజ్యం
పేపర్లలో టీవీలలో రేడియోలొ ఎటుచూసిన
పీక్కుతిన్న శవాలపై ప్రతిదినమూ దుర్గంధం..

అన్యాయం ఇది ఏంటని అడిగెను అన్నాహాజారె
రాబందుల నెదుర్కొనగ పూనుకొన్న రామదేవ్
ఇకసాగదు అన్యాయం ఇకచాలీ అరాచకం
ప్రాణాలని పణంచేసి పోరాడె వీరులు
ఉద్యామాల బాటలలో అక్రమాల నెదిరించి
ముక్తినీకు తెస్తారు నిరుపేదల భారతమా
ముదమును కలిగిస్తారు మునులగడ్డ భారతమా....

- మాధవ తురుమెళ్ల

Sunday, 14 August 2011

మూడురంగుల పతాకం


మూడురంగుల పతాకం మధ్యలో ఒక ధర్మ చక్రం
ఆ ధర్మచక్రంలానే నాలోకూడా
అంతుతెలియని మనో పరిభ్రమణం,
గాందీగారిని స్వర్గంలో కలిస్తే అడగాలనుకునే ఒక ధర్మసందేహం.
గాంధీతాతా! నాకు తెలియక ఆదుగుతున్నాను
ఏమీ అనుకోకు, తప్పయితే క్షమించు.
ఆ మువ్వన్నెల రంగుల జెండా -
వచ్చేసిందొచ్చేసింది నాకు స్వతంత్ర్యం అంటూ
ఆ స్తంభాన్నెక్కేసి ఆనందంగా రెపరెపలాడుతోందా,
లేక -
ఇక్కడగూడా నేను బందీనే అంటూ
రాజకీయపు రాకాసుల కోరల్లోచిక్కి విలవిలలాడుతోందా... 

               - మాధవ తురుమెళ్ల

Sunday, 7 August 2011

స్నేహం

ఎత్తుపల్లాలెరుగని ఈ జీవితపు
సమాంతరపు భూమిపైనుండి
అవకాశాల ఆకాశంపైకి ఎగబాకు
నిచ్చెనలకోసం వెదుకకు
రా....
నీకు నా భుజాలనిచ్చి మోస్తాను...


నీకోసం నేను చేసే త్యాగంలో నీవు వామనుడిలా మారినా
నన్ను బలి చక్రవర్తిలాగా నీ పాదాలతో భూమిలోకి తొక్కినా
నాకు సంతోషమే... నాకు మిగిలేది సంతృప్తే...



నీవెక్కిన ఆకాశం వంకచూసి
నీవు తిరుగాడే మేఘాలను చూసి
నీవందుకుంటున్న విజయాలను చూసి

నీవెక్కిన బరువుని మోసి బరువెక్కి కాయలుకాచిన నా భుజాలను తడువుకుంటూ
నిన్నుగమనిస్తూ ఆనందాశృవులు నిండిన కళ్లతో
సగర్వంగా భూమిలో పాతుకుపోయిన కాళ్లతో
కదలలేని నేను ఇక్కడే మిగిలిపోతాను.

నీవు చూసినా చూడకపోయినా,
జీవితపు చివరి మజిలీ వరకు మనం తిరిగి కలిసినా కలవకపోయినా,
మరణించి భూమిలో మిగిలిపోయే నా శవానికి పైనున్న బండరాళ్ల సమాధిపై
ఒక సున్నితపు స్నేహపు పుష్పాన్నుంచి నన్ను పలకరించడానికి నీవు వచ్చినా రాకపోయినా
ఏమయినా సరే -
నిరంతరం నీకోసం
స్నేహపతాకం ఎగురవేస్తూ నిలబడిపోతాను -

ఏదో ఒకనాడు
స్నేహితునిగా నీ మంచిని నిరంతరం కోరిన అనామకునిగా
భగవంతుని ధర్మపు కౌగిలిలో తృప్తిగా ఒదిగిపోతాను...

[ఇలా అనుకుని జీవితపు మజిలీలలో మిగిలి పోయిన అనేకమంది స్నేహితులు, నాకు అవకాశాల ఆకాశాలందించడానికి వాళ్లవంతు ప్రయత్నం చేసిన వాళ్లకి నా మనస్సులో క్రుతజ్ఞతాభావాన్ని వెలిబుచ్చుకుంటూ,,, శిరసువంచి వాళ్లందించిన ధర్మానికి నమస్కరించుకుంటూ .. - మాధవ తురుమెళ్ల 7th August 2011]

Thursday, 28 July 2011

కాళ్లబరువు సూరీడు

నడిచి నడిచి కాళ్లు బరువెక్కిన సూరీడు
నేలమీద కూర్చుని కొంచెం సేదతీరాలనుకుంటే
తనతోటి చలి చీమలకి కోపంవచ్చి కుట్టబోతాయి
తన ఓట్లడుక్కుని బతికే రెండు నాలుకల రాజకీయ పాములకు కోపంవచ్చి కరవబోతాయి
సిద్ధాంతం ఒక్కటే తెలిసిన కప్పలకి కోపం వచ్చి బెకబెకమంటూ లెక్చర్లు ఇస్తాయి
పాపం ఆకాశం తల్లికి ఒక్కదానికే సూరీని కష్టం తెలుస్తుంది
నీకు ఈ పనికిమాలిన దాస్యంనుండి
ముక్తెన్నడునాయనా అని
మేఘాల చినుగుల చీర కళ్ల్తొత్తుకుంటూ భోరున ఏడుస్తుంది...
- మాధవ తురుమెళ్ల 
(బందురోజు నాతో తన గోడు పంచుకున్న ఒక రిక్షా సూరీడు గుర్తొచ్చి)

Tuesday, 19 July 2011

సాధించు - కవిత


ఆలోచించు నిదానించు సాధించు...
ప్రకృతికి తెలియనిది ఓటమి ఒక్కటే
నీవూ మట్టిలోంటి పెరిగిన మొక్కలాంటివాడివే
పెను వృక్షంగా ఎదగాల్సినవాడివే
కాకపోతే నీవు
కాళ్లుండి నడుస్తావు,
అవి కావలనుకొని నడవవు...
మరి నీకెందుకీ పిరికితనపు ఆలోచన, ఓడినట్లు వేదన!
సూర్యరశ్మిని వెదుకకుండా పెరిగే తీగ ఆగుతుందా,
పూలబాలను చేరకుండా తేనటీగ వెనుదిరుగుతుందా..
నీ గమ్యం నీవు చేరు, నీ లక్షాన్ని నీవు ఎరుగు...
దాన్ని సాధించడానికై నీవే 
ఇంతింతై వటుడింతై ఆపైనల్లంతై అన్నట్లు ఎదుగు... ఎగురు...

Wednesday, 13 July 2011

ఆకతాయితనం

భారతమాత చీరచెంగుని మళ్లీ బాంబులతో పేల్చే ఆకతాయితనం
ఏ మతానికీ చెందని తీవ్రవాదుల పిచ్చితనం
బాంబులతో భగ్గుమన్న ముంబయిలో
మరొకసారి ఆవిరయిన అమాయకపు జీవితాలు
ఎప్పటికి కలుగుతుంది భారతమాతకు ఈ ఈవ్‍టీజింగ్ నుండి విముక్తి!

Saturday, 9 July 2011

పేదవాని బతుకు సోమయాజి బతుకు

పేదవాని బతుకు సోమయాజి బతుకు
విధి విరిచేసిన రెక్కల రంగుల సీతాకోక చిలుక,
దురదృష్టపు రధం కింద పడి నలిగి నజ్జైపోయిన
చక్కని సువాసనలు వెదజల్లే పూజార్హమైన రంగుల పుష్పం.
రాక్షసులు చెరబట్టిన సీతలాంటి విధి...
వారధి కట్టి సముద్రందాటి పోకతప్పని పోరాడక తప్పని ఆశయం.
తధాస్తు...

Wednesday, 22 June 2011

Why Indian Government is not interested in fighting corruption - My speech during protest



Chanakya Said – Corruption must be stopped at the highest authorities.  You may wonder why!

We must stop the highest authorities from being corrupt.  We must set an example out of them.  India has been a great nation for a very long time.  Columbus wanted to discover sea route to India, did you ever wonder why?!  It is because India was very wealthy.  But this is not the case any more.

Government of India wanted to know how many people are actually not having a descent meal a day.  So they invited a committee to find this out.  This committee is called Tendulkar Committee. This committee in its report stated that that 40% of  population in India are BELOW poverty line! Isn’t that a shame?! Those who eat less than 2100 calories of food a day are called below poverty.

All of you know for a healthy body to function on an average you require 2400 calories of food.  That is just to do your day to day activities such as walking at normal pace, eating, talking etc., if you get below that level then the body starts cannibalizing.  It starts eating itself.  People become sick, they suffer from anemia. The Indian government spends only 1 per cent of its gross domestic product on healthcare facilities, forcing millions to struggle to get medicines, Oxfam and 62 other agencies said this in a report called: Your Money or Your Life last year.

Every day 20000 people die in India.  This is a human rights problem. Every human has a right to life guaranteed by Indian constitution, yet in reality we let people die.

There are 450 million Indians living in poverty in India this is the official admission of the Prime Minister of India. More over only 60% ever bother to vote in India.

India is rich with mineral resources.  It exports a lot of that stuff to the world.  But this money is being siphoned off by the top brass. There is a huge conspiracy behind this.

‘National Election Watch’ in its report stated that If you are worth Rs.50 million, you are 75 times more likely to win the elections to the Lok Sabha (Parliament of India) than if you are worth under Rs.1 million. The 543 MPs of the current Lok Sabha are worth Rs.80 billion.  So Indian Parliament has become a Rich man’s club.

So there is basically an artificial vacuum that is being created.  40% of Indian electorate are kept under poverty through the means of corruption so that their votes, their loyalty can be bought.  And I believe it is for this reason Indian Elite, the people who are in power, mercilessly attacked the peaceful protesters.

Deliberately keeping the people in poverty will serve the vested interests.  These 40% of Indians go to vote once in every 5 years. And you all know that during Elections Liquor, Money flow on the streets.  Elections are often bought.  And Politics is a very lucrative business in India.  Basically by keeping these 40% of electorate under poverty, politicians in India are buying the
elections.  A person who is hungry will show his loyalty not to the state, but to the person who gave him a Rs500 note.  And so is the power calculation.

It is known that in recent by-elections in India money was spent by all major parties.   News archives will confirm this fact.  It was estimated that around Rs. 200 Million spent over night by various parties to buy the votes of the poor.

Congress Party politicians say they are elected representatives.  But what kind of election is it?  How could there be a fair election, when people of India especially 40% of Indian electorate are living below the poverty line?   It is a known fact that Money and liquor flows during the election time.  It is this poverty stricken people who are being enticed.  Our vedic culture teaches people to be loyal!  It teaches not to bite the hand that feeds you.  So the corrupt politicians bribe the electorate, they feed the electorate.  They buy the loyalty,  and they get back in to power.   This exploitation has to stop.

It is now clear that the government is not helping the poor.  So in the name of helping the poor NGOs do a  very big business.  Billions of Dollars every year gets in to India in the name of charity.  But again you all know this money is not being used to remove the poverty.  My friends, I feel that there is a two pronged approach to undermine the independence of India.

(1) Allow the highest authorities to stash away money illegally and deny the basic needs for the 40% of Indians.

(2) Allow NGOs to target these 450 Million Indians.  Show their begging faces, go to USA, UK and developed countries to beg their money, tell the sad stories of poverty.

So it is time to wake-up.... You must see the reasons why Indian government is not interested in fighting corruption.  Corruption allows two things:

(1) Steal away the money that is rightfully belong to Indian public and keep 40% people below poverty line.  Buy their loyalty in throw away prices, securing your victory all the time

(2) Allow NGOs to thrive in India.   90% of these NGOs are not there to help the poor, they are really there for ---- you know for what!!!

So to counter the effects of corruption, to save regularly 20000 humans from unnecessary untimely death,  Indian Citizens wanted to have a strong Anti-corruption bill, Baba Ramdev wanted to bring back the black money.    But Indian Government has offered maximum resistence to these legitimate demands.    So in protest Baba Ramdev asked his supporters to gather in peace.  Indian Constitution gives a right to protest under Article 19A.

Instead of protecting the constitutional rights of the Indian citizen, which is the first and foremost duty of any elected Government, the government of India had mercilessly beaten all protesters who are exercising their democratic right to protest.  Alas! Little did they know that there is no such thing called Democracy!  In an election that was contested on wrong grounds it is false democracy that thrives, it has really become not a democracy but what Henry Kissinger had famously stated ‘it is an organized chaos’.

We must fight, I am convinced my friends, if we make fighting corruption our sole aim, we help building a real Bharat.  So let us stand together.... Jai Hind...

Monday, 20 June 2011

రామరాజ్యం


ఈ భీకర మానవమృగాలు సంచరించే సమాజపు అరణ్యంలో
అయోధ్యను వెదకాలని చూడకు.
అలిగి నేలపై కుందేలులా కూర్చోకు.
ఏ దాపున దాగివున్న మానవుని తోలు కప్పుకున్న నక్కో 
నిన్ను లాక్కుని పోగలదు, నీ అస్తిత్వాన్ని భోంచెయ్యగలదు.


రామరాజ్యం పొందాలనుకొంటూ 
గుడిలో కూర్చుని భజనలు చేస్తూ కలవరించకు.
నీ ఆలోచనలే రాముని బాణాలుగా
నీ శరీరమే రాముని విల్లుగా
నీ ఉద్యమమే రాముని నడకగా సాగించు, నడువు, సాధించు....


Thursday, 16 June 2011

Dark nights of my soul

It pains me unbearably
tackling the two tongued
vicious snakes
for some strage reason
appear in human form...

It Pains me unbearably
dealing with cunning foxes
for some strage reason
appear in human form...

I look at the sky
the sun about to set,
it is not beautiful any more.
The rage in the pained heart
is painting it dark and red.
I started to stare
in to the onsetting darkness,
life inevitable...
What ever destined is bound to happen...

I turn to my God in silent prayer
for I can't really stare in to this blindening darkness
My heart longing for solace.

I wonder if there is a wee bit of spark,
the light of hope somewhere in this human existence.

Is it! I wonder,
the beginning of
the dark nights of my wandering soul.

-Madhava Turumella

Tuesday, 31 May 2011

చిటారుకొమ్మ

చిటారుకొమ్మపై నిలబడి అంతాబాగుందని అనుకోకు
అరాచకత్వం పిడుగుపడితే కిందపడితే 
వెన్ను విరిగే ఫెళఫెళా శబ్దం నీదే! 



- మాధవ తురుమెళ్ల

Thursday, 26 May 2011

రంగుల కల - కవిత

రంగుల కల



కనులముందు నిలువక  కలవరపెట్టేసావు
ప్రేమపూల మందులు చల్లి నన్ను పిచ్చిదాన్ని చేసావు
బ్రతుకుల సాలెగూడునల్లి  బందీనే చేసావు
ఒక్కసారె చంపకుండ నన్ను ఎందుకిలా చేసావు!

జగమంతా నాకే నీవై అణువణువూ నిండావు
అంతరంగమంతా నిండి ఆనందం నింపావు
వేకువల్లె వచ్చిన నీవు కలలాగా వెళ్లావు
కుమిలిమిగిలి పోయిన నేను శవంలాగా నిలిచాను

నా రంగుల కలలో నీవుంటే చాలని అనుక్షణం అనుకుంటూ
మెలుకువ చెరసాల వద్దని కనులు మూసి పడుకున్నా
జ్జాపకాల దేవుడు నీవని ఇసుక గుడులు కడుతున్నా
బాధలనే అలలు చెరిపినా తిరిగి - గుడులు నీకు  కడుతున్నా

నీకోసం చూసి చూసి  విరిగి పడిన మనసుతో
నీకోసం ఏడ్చి ఏడ్చి  పిచ్చిదాని కనులతో
నీ ఆరాధన చెస్తూ నేను ఏ నాడో చనిపోతాను
కానీ తిరిగి నాకు జన్మే వస్తే నీ శిక్షనే కోరతాను...

రచన: మాధవ తురుమెళ్ల

Monday, 16 May 2011

మనిషి మనిషి కన్నీటిలొ వెదకని అర్ధం

మనిషి మనిషి కన్నీటిలొ వెదకని అర్ధం
దూరమయ్యి పోతోందిర  జీవిత పరమార్ధం

అనుక్షణం అవేదన అంతరంగ క్షోభతో
ఆకలితో మగ్గుతూ చూరుకింద ముడుచుకుని
వాననీరు తాగుతూ కడుపాకలి తీర్చుకుంటు
ఎవరు నన్ను కాపాడే దెవరు నన్ను అనుకుంటూ
వాడు కార్చె కన్నీటిలొ ఉన్నది ఒక అర్ధం
తెలుసుకొంటే దొరుకును నీ జీవన పరమార్ధం.

ఏడుసముద్రాల వెనుక దాగిన ఆ నీరే
జీవనదుల సుడుల వెనుక పరుగు రూపు నీరే
నీటి బ్రతుకు నీదిరా నింగి నేల వేరురా
పరతత్వం తెలుసుకొని కన్నీటిని తుడవరా

మనిషి మనిషి కన్నీటిలొ వెదకని అర్ధం
దూరమయ్యి పోతోందిర  జీవిత పరమార్ధం

రచన: మాధవ తురుమెళ్ల 16-5-2011

Tuesday, 10 May 2011

అద్దంలో దాగిన నేను - కవిత


అద్దంలో
నన్ను నేను చూసుకోవడానికి
పుట్టుకతోటే అలవాటుపడిపోయాను..

చిన్నప్పట్నించీ,
అద్దం నన్ను ప్రతిబింబిస్తూ
నన్ను నాకు చూపిస్తూ ప్రపంచాన్ని కప్పేస్తూ వచ్చింది.
అద్దం మెల్లగా -
కర్ణుడి కవచంలాగా -
నా కళ్లకు డాలుగా మారిపోయింది.

నిరంతరం నన్ను నేను ప్రతిబింబచేసుకుంటూ
నన్ను నేను ప్రేమించుకుంటూ -
నువ్వనే దానివి ఉన్నావనిగానీ,
మూసిన పెదవుల వెనుక శబ్దంచెయ్యని
ఆర్తనాదాలు చేస్తున్నావనిగానీ,
వంటింటికోరల్లో నలిగి మగ్గిపోతున్నావనిగానీ,
ప్రేమకు నోచుకోక దీనంగా అవనతవదనంతో దారిపక్క నిలుచున్నావనిగానీ,
ఏదోఒక రోజు మారకపోతాడా అని -
మోడువారిన సంసారపు మొక్కకు -
సహనం నీరుపోస్తూ నిరీక్షిస్తున్నావనిగానీ,
గమనించలేకపోయాను...

నీవులేని నాడు
నీ సహాయంపొందని నాడు
నా ప్రతిబింబానికి అర్ధంలేదని
నా అద్దం నాకెప్పుడూ చెప్పలేదు

నా కళ్లముందు పరుచుకున్న అద్దం నన్నేచూపిస్తూ
ఆకలితీరిన నా బొజ్జని చూపిస్తూ,
నిన్ని చూపించకుండా నీచే
అందంగా తీరైన నా ఇల్లుని చూపిస్తూ,
అధ్బుతమైన జీతంగా మారిన నా కొలువుని చూపిస్తూ,
అద్దం -
నా జీవితాన్ని చుట్టలా చుట్టుకుని అందమైన అబద్ధంగా మార్చింది.

పసిపిల్లలకి అద్దంచూపించకు ఎత్తుపళ్లువస్తాయంటూ అంటే
మూఢనమ్మకమేమో అని భావించిన నేను
పెరుగుతూ పెరుగుతూ
నా చుట్టూ ఎత్తుగా కట్టుకున్న అద్దపుగోడను చూడలేకపోయాను,
నీవనేదాన్ని
అద్దానికి ఆవల ఉంచానని
గమనించలేకపోయాను.

క్రమక్రమంగా
నీవు నాపై చూపించిన ప్రేమతోనో
నీ చక్కటి మాలిమితోనొ
నీవు కురిపించిన దయార్ద్ర వర్షంతోటొ
నీవు పెట్టిన అన్నంతోటో
నీవు పంచిఇచ్చిన ప్రణయంతోటో

చలించిననేను
నీకు బహుమతి ఇవ్వాలనుకుంటూ,
నా మనసనే పూలసజ్జను అందమైన
ప్రేమపూలతో నింపాలనుకుంటూ
అనుకోకుండా -
అప్పటిదాకా
నా గుండెలో నిండిన బండరాళ్లను
రివ్వున విసిరేసాను
అప్పుడే -
నిన్ను నాకు నిజంగా బహుమతిగా ఇచ్చిన
భగవంతుని దయతో
నా  అద్దం, నా జీవితపు అబద్ధం ---
భళ్లుమని బద్దలైంది...

ఆరోజు ---
అనేకానేకాలుగా చిద్రమైన నా రూపం
పోల్చుకోలేనంత పగిలిపోయింది
నీవే నేనుగా మారిపోయింది
అందాన్నే ప్రతిబింబింపచేయ ప్రారంభించింది.

ఈవేళ -
నా కళ్లముందు నన్ను చూపించే అద్దం లేదు,
నీకూ నాకూ ఎలాంటి అడ్డూ లేదు,
నిన్ను పలకరించాలన్న నా తహతహలో వ్యాపారంలేదు,
నీ చేతిని పట్టుకున్న నా చేతలో స్వార్ధంలేదు,
నిన్నుచూసి ప్రేమగా నవ్విన నా కళ్లలో వ్యభిచారంలేదు.

ప్రియతమా -
నా అద్దం బద్దలై నేను
సిద్ధుడిలా మారాను
సిద్దార్దుడిలా నవ్వాను
ఆనందతాండవం ఆడేందుకు సిద్ధమైన శివునిలా
ఇప్పుడిలా నీ ముందు నిలుచున్నాను....
నీ ప్రేమలో నా జీవితానికి ఆనందగీతం
నిన్ను నాకిచ్చిన భగవంతునికై ధన్యవాదగీతం పాడుతున్నాను.


రచన: మాధవ తురుమెళ్ల
============= &&&&&&&& ============

Thursday, 5 May 2011

ఒక ప్రేమ కధ - సీరియస్‍గా తీసుకోకండి

రచన:  మాధవ తురుమెళ్ల 


గుడీవినింగ్ లేడీస్ అండ్ జెంటిల్‍మెన్ వెల్‍కమ్ టు మలేషియన్ ఏర్‍లైన్స్....  అంటూ చాలా యాంత్రికంగా విమానం టేకాఫ్ చేయబోయేముందరగా సేప్టీ డిమాన్‍స్ట్రేషన్ ఇస్తోంది ఎయిర్‍హోస్టెస్ కిరణ్మయి. అది మలేషియా విమానం కౌలాలంపూర్ నుండి లండన్ వెళుతోంది.  దాదాపు పదకొండుగంటల ప్రయాణం.  తను సర్వ్ చేసేది ఫష్ట్ క్లాస్ కాబిన్ కావడంతో కొంచెం ఈజీ..   చాలా రొటీన్‍గా ఆ సేఫ్టీ  డిమోన్‍స్ట్రేషన్ కొన్ని వేలసార్లు చేసి వుంటుంది.  అందుకే తన శరీరం డెమో ఇస్తున్నా మనసుమాత్రం ఎక్కడో వుంది.  ఈ ఉద్యోగం మానేయాలని మానసికంగా సిద్ధపడటంతో కొంచెం పరధ్యానంగానే వుంది.

కిరణ్ వాళ్ల నాన్న ఇండియానుండి చదువుకోసం కౌలాలంపూర్ వచ్చి తన చదువు పూర్తికాగానే అదే దేశంలో ఒక చిన్న ఫాక్టరీ పెట్టి కొద్దికాలంలోనే  గొప్పగా అభివృద్ధి  చేశారు.  ఇప్పుడు ఆయన మలేషియాలో ఒక పెద్ద ఇండస్ట్రియలిష్ట్.  బాగా ఉన్నవాళ్లు.  అనేకమంది నౌకర్లు చాకర్లు. తనొక్కతే కూతురవడంవల్ల చాలా గారాబంగా పెంచారు.  కిరణ్మయి ఒక రాజకుమారి లాంటిది.  అసలు ఎయిర్ హోస్టెస్ గా చేరాల్సిన అవసరం తనకు లేనే లేదు. అయినాగూడా ఫట్టుపట్టి ఇంట్లో వాళ్లను ఒప్పించి మరీ ఎయిర్‍హోస్టెస్ గా చేరింది...  ఆ ఉద్యోగంలో చేరడానికి ఎంత గట్టిగా పోట్లాడాల్సివచ్చిందో గుర్తొచ్చి కిరణ్ మనసు మరింత దిగులు పడింది.

"ప్లైట్ క్రూ... ప్లీజ్ టేక్ యువర్ సీట్స్ టు టేకాఫ్" అని కెప్టెన్ చెప్పడంతో వెళ్ళి కాబిన్ క్రూ కోసం కేటాయించిన సీట్లో కూర్చుంది.  ఈ లోపల తన కొలీగ్ స్టెల్లా గూడా పేసింజర్ కేబిన్ లో డెమో పూర్తిచేసి వచ్చి  తన పక్కనే కూర్చుంది. 

"బహుశా ఇదే ఆఖరి ఫ్లైట్ ... ఇంక లాభంలేదు ట్రై చేసాను... విధిని నమ్ముతాను కాబట్టి అతను తప్పనిసరిగా ఎదురుపడతాడనే ఆశతో దాదాపు ఆరేళ్లనుండీ ఇంటర్నేషనల్ సెక్టర్‍లో ఎయిర్‍హోస్టెస్ గా చేస్తూ దేశాలన్నీ తిరిగాను. ఎప్పుడో ఒకప్పుడు ఎదురుపడకపోతాడా అనే పిచ్చి నమ్మకం.. అయినాగూడా అతనెప్పుడూ ఎదురుపడలేదు... ఇక ఈ ఉద్యోగం మానేసి మా నాన్న చెప్పినట్లుగా విని పెళ్లిచేసుకుని ఇంటిపట్టున ఉండటం మంచిది"  చాలా నిరాశతో అనేసింది కిరణ్మయి.  

అలా అంటున్న కిరణ్ చెయ్యిపై ’నేను అర్థం చేసుకోగలను‘ అన్నట్లుగా ఆసరాగా చేయివేసి మౌనంగా కూర్చుంది స్టెల్లా... అంతేకానీ ‘అయ్యో అదేంటి ఉద్యోగం మానేస్తావా‘ అని మాత్రం అడగలేదు... అసలు కిరణ్ అలా ఎయిర్‍హోస్టెస్ పనిచెయ్యడమే తనని ఎప్పుడూ ఆశ్చర్య పరిచేది.  కిరణ్ తన బ్రతుకు తెరువు కోసం ఎయిర్‍హోస్టెస్ ఉద్యోగంలో చేరలేదని వేరే కారణం ఉంటుందని ఊహించ గలిగింది.  కానీ దాదాపు ఆరేళ్లపాటు నిజమైన కారణం చెప్పకుండా దాటవేస్తూ వచ్చి ఇవాళ మాత్రం సడన్ గా ‘ఉద్యోగం మానెయ్య బోతున్నానని చెప్పి దాంతో బాటు అసలు నిజానికి తను ఏ కారణంతో ఉద్యోగం లో చేరిందోగూడా చెప్పింది.  కానీ ఆ కారణం విన్న స్టెల్లా మాత్రం తన చెవులను తానే నమ్మలేక పోయింది... ఇండియన్ ఆడపిల్లలు చాలా సెంటిమెంటల్ గా ఆలోచిస్తారని చెబుతారుగానీ తనెప్పుడూ నమ్మలేదు.. ఇప్పుడు కిరణ్ మాటలు వింటూంటే అది నిజమేనేమో అనిపిస్తోంది...

ఇంటర్నేషనల్ సెక్టర్స్ లో పనిచేసే ఎయిర్హోస్టెస్ లని ఇతరప్రాంతాల భాషలు నేర్చుకోమని ప్రోత్సహిస్తారు.  అందుకని స్టెల్లా తెలుగుభాషకావాలని నేర్చుకుంది.  ఎప్పుడు అవకాశం వచ్చినా తెలుగులో సంభాషించడానికి ప్రయత్నం చేస్తుంది.  

మౌనంగా ఉండాలనుకున్నా స్టెల్లాకి ఎందుకో మనసు ఉండబట్టలేదు.  

"కిరణ్... మళ్లీ ఆలోచిందు... ’ఇటీజ్ అబ్సర్డ్‘  అసలు ఇంతకాలం నువ్వు బాయ్‍ఫ్రెండ్స్‌ని దూరంగా వుంచితే బహుశా నీకు మొగపిల్లలంటే ఇష్టం లేదేమో అనుకున్నాను.... ఇంత అమాయకంగా ఎవడో చిన్నప్పుడు కాపాడాడట అందుకని అతనికే నీ బాయ్‍ఫ్రెండయే అర్హత ఉంది... అని ఆలోచించడం చైల్డిష్,  కిరణ్ ప్లీజ్ డోంట్ వేష్ట్ యువక్ లైఫ్ అన్ నెసిసరీలీ... ఊరికే సినిమాలాంటి ఆలోచనల్లోలాగా నీ జీవితాన్ని వృధా చేసుకోకు...  ప్లీజ్ నీ మంచి కోరి చెబుతున్నాను... మళ్లీ ఆలోచించు..." అంది..

"అతని ఎవరో కాదు... హి హాజ్ ఎ నేమ్... అతని పేరు రవి"  వీళ్లెవరికీ నాకు రవి మీద ఉన్న ప్రేమ అర్ధంకాదు.. అనుకుంటూ ఉక్రోషంగా చెప్పింది కిరణ్...  

"ఒకె బాబా సారీ... అదే మీ రవి... అతనెక్కడున్నాడో తెలియదు... ఏం చేస్తూంటాడో తెలియదు... ఏదో మంచి ఉద్యోగస్తుడో వ్యాపారస్తుడో అయి ఇంటర్నేషల్‍ ట్రావెల్ చేస్తాడు అతన్ని అలా మళ్లీ కలుసుకోవచ్చు అన్న నీ ఆలోచన నాకు నిజంగానే సిల్లీ అనిపిస్తోంది"  అంది స్టెల్లా... 

"ప్లీజ్ కిరణ్... నువ్వు ఉద్యోగం మానేస్తానంటే నేనేమీ ఆపను.. నాకు తెలుసు నీకు ఈ ఉద్యోగం ఒక లెక్క కాదని.   కానీ అలా సెంటిమెంటల్  ఫూల్ లాగా నీ జీవితాన్ని పాడుచేసుకోకు... ప్లీజ్ థింక్ ఆవ్ ఇట్ అగైన్"

కిరణ్మయి మనసు వేపాకు తిన్నట్లు చేదుగా అయిపోయింది... తన రవిని తను ఇక జీవితాంతం పొందలేకపోతానేమో నన్న భావనే తనకు ఏడుపు తెప్పించేస్తోంది...  కిరణ్ మనసు రవివైపు రవి జ్ఞాపకాలవైపు పరిగెట్టింది... అవి తన పదహారవ యేట కాలేజి సెలవుల్లో ఇండియా తన తాతగారి ఊరు కృష్ణా జిల్లా నాగాయలంకలో గడుపుదామని వెళ్లింది.  తన తాతగారిపేరు చౌదరిగారు.  ఆయన పెద్ద మోతుబరి రైతు.  ఆయన భార్య చనిపోయి చాలాకాలం అయింది.  అయినా ఆయన మళ్లీ పెళ్లనేది చేసుకోకుండా ఒక్కరే అక్కడి పొలం పనులలో కాలం గడిపేస్తున్నారు.  తనకి అక్కడే ఆ తాతగారి ఊరిలోనే పరిచయమయ్యాడు రవి.

******

చుట్టూతా పచ్చటి పంటపొలాలు. అక్కడక్కడా చిక్కటి మామిడితోటలు.  మధ్యలోంచి కృష్ణానది పాములాగా మెలికలు తిరుగుతూ  ఉరకలెత్తుతూ పరిగెత్తుతోంది.   నది మద్యలో తెరచాప పడవలు సాగిపోతున్నాయి... మిట్ట మద్యాహ్నం కావడంతో ప్రకృతి అంతా నిశ్శబ్దంగా వుంది.. ఆ నిశ్శబ్దాన్ని చీలుస్తూ అప్పుడప్పుడూ పడవల్లో వెళ్లే నావికులు మాట్లాడుకొనే మాటలు గాలిని చీలుస్తూ వినవస్తున్నాయి...  

కిరణ్మయి మెల్లగా పొలంగట్ల వెంట జాగ్రత్తగా అడుగులో అడుగు వేసుకుంటూ నడుస్తోంది.  తాతగారు ఎంత అడిగినా ఏటి గట్ల వెంట ఒంటరిగా వెళ్లటానికి ఒప్పుకోలేదు.  ఆయనకి భయం తను విదేశాల్లో పుట్టి పెరిగినందువల్ల పల్లెటూరి వాతావరణం గురించి అసలు తెలియదని.  "ఇక్కడ కృష్ణా నదిలో సుడిగుండాలుంటాయి.. చాలా లోతైన గట్లు.. జారిపడిపోతే కష్టం.  అందుకే బుద్ధిగా ఇంటిపట్టున వుండు.  కావాలంటే నువ్వంతగా తిరగాలంటే మన పాలేర్లనిచ్చి పంపిస్తాను కానీ వాళ్లందరూ కలుపులు తియ్యడంలో చాలా బిజీగా వున్నారు.  కాబట్టి ఒకట్రెండు రోజులు ఆగు" అని చెప్పారు తాతగారు.. కానీ కిరణ్మయికి రెండురోజులు ఖాళీగా ఇంట్లో కూర్చోవాలంటే మనసనిపించలేదు. 

నేనేమీ చిన్నపిల్లను కాదు కాలుజారి ఏట్లో పడిపోవడానికి... అని ఉక్రోషంగా అనుకుంది. అందుకే ఇంట్లో ఎవరికీ తెలియకుండా మద్యాహ్నం తాతగారు నిద్రపోతున్నప్పుడు బైటపడింది... అలా పొలం గట్లవెంట చుట్టూరా ఉన్న ప్రకృతిని గమనిస్తూ నడిచి వెళ్తోంది.  దగ్గర్లోనే మామిడితోటలో వీలయితే ఒకట్రెండు మామిడికాయలు కోసుకోవాలి.. అనే ఆలోచన తనది.  ‘ఎవరి తోటో తెలియదు కానీ చూడ్డానికి మాత్రం ఎంత బాగుందో..‘  అనుకుంది.  ఆ తోటలోనుంచి ఓ కోయిల కుహు కుహు అంటూ పాడుతోంది.  కిరణ్మయికి కోయిల గానమంటే చాలా ఇష్టం.  కానీ ఎప్పుడూ కోయిలని చూడలేకపోయింది.  చూడడానికి నల్లగా అసహ్యంగా ఉంటుందని చెబుతారు కానీ కిరణ్మయికి నమ్మకం కలగలేదు.  దగ్గర్నించి చూసిగానీ నమ్మాలనుకోలేదు.  కానీ ఎంత ప్రయత్నించినా కోకిలని చూడలేకపోయింది.  ఎక్కడో చిటారుకొమ్మలో రహస్యంగా దాక్కుని పాటలు పాడుతూంటుంది.  ఈసారయినా కోకిలని తప్పనిసరిగా చూసి తీరాలి అనుకుంటూ మామిడితోటవైపు  అడుగులు వేసింది.

అలా నడుస్తుంటే నిశ్శబ్దాన్ని చీలుస్తూ పైన ఎక్కడో చాలా చిన్నదిగా కనబడుతూ ఆకాశంలో ఒక విమానం వెళుతున్న శబ్దం.  

"చూస్తూ ఉండరా... ఏదో ఒకనాడు నేను గూడా చాలా గొప్పవాణ్ణయి అదో ఆ విమానాల్లొ ప్రయాణం చేస్తాను"  మాటలు వినబడ్డాయి.

ఎవరా అని తలతిప్పిచూసింది.  ఏటి గట్టవడంవల్ల అక్కడే గట్టుమీద వీపుమీద పడుకొని తీరుబడిగా ఆకాశంవంక చూస్తున్నారు ఇద్దరు కుర్రవాళ్లు.  వాళ్లలో ఒకతను అన్న మాటలవి.  ఏటిగట్టు ఏటవాలుగా ఉండటంవల్ల ముందరే వాళ్లను గమనించలేకపోయింది.  బహుశా ఏట్లో ఈతకొట్టి వచ్చినట్లున్నారు తడిబట్టలు పిండి పక్కన ఆరేసి శరీరం ఆరబెట్టుకుంటూ అక్కడ పడుకుని ఆకాశం వంక చూస్తున్నారు.

"ఓసోసి... ఎల్లవో ఈరో... బోల్డంత చెప్పనొచ్చాడు... ఏంది నువ్విమానం ఎక్కేది? చాల్లే బడాయిలాపు"  అన్నాడు ఆ పక్కనే ఉన్నతను.  వాళ్లింకా ఏం మాట్లాడుకుంటారో వినాలనే కుతూహలంతో కొంచెం కొంచెంగా వాళ్లకు కనబడకుండా ముందుకు జరుగుతూ వాళ్ల మాటలు వినసాగింది.

"ఏం నేనెందుకు విమానం ఎక్కలేను... మన చౌదరిగారబ్బాయి సుజనాచౌదరిగారు చదువుకోని విమానాలెక్కలేదా విదేశాళెల్లలేదా గొప్పవాడవలేదా ... ఆయనీవూరోడు గాడా.... ఆయన చేసి చూపించంగా లేంది నే చెయ్యలేనా.. ఆయనని మనం ఆదర్శంగా తీసుకోవాలి... సాధించాలి" చాలా ధైర్యంగా ధీమాగా ప్రపంచంలో తను ఏదికావాలన్నా సాధించగలను అన్న నమ్మకంతో పలికినట్లుంది అతని గొంతు... అతనిది చాలా గంభీరమైన స్వరం.  అతనెవరోకానీ తన తండ్రిని ఆదర్శంగా తీసుకోవాలి అని చెబుతూంటే కిరణ్మయికి చాలా సంతోషంగా అనిపించింది... తన తండ్రి గురించి కొంచెం గర్వంగా అనిపించింది... 
"అవునరే చౌదరిగారంటే గురొచ్చింది.  ఆయన మనవరాలు ఊళ్లోకొచ్చింది తెల్సా.."  సంభాషణ తన గురించే నడవబోతోందని తెలిసి కిరణ్మయి మరింత చెవులు రిక్కించి వినసాగింది.

"ఏది ఆ చీమిడిముక్కు పిల్లా?"...  తనని చీమిడి ముక్కంటాడా! ఒక్కసారి వెళ్లి అతన్ని గట్టిగా తన్నాలనిపించింది.

"లేదురా బాబూ అది ఎప్పుడో క్రితంసారి అదీ చాలాకాలం క్రితం వచ్చినప్పటి మాట.. పైగా ఆ పిల్ల దగ్గరికిగూడా నువ్వెళ్లలేదు. నీకేం తెలుసు.  నేనప్పుడు దగ్గర్నుండి చూసాగదా... అప్పుడే చూడ్డానికి బాగుండేది.. నిన్నే మళ్లీ ఊళ్లోకొచ్చింది.  నువ్వేమో ఇవాళ ఉదయమే కాలేజి హాస్టల్ నుంచి సెలవలకని ఇంటికి చేరావు.. ఆ పిల్లని నువ్వు చూడలేదు అందుకే ఆ మాటంటున్నావు... అందంలో రంభరా బాబూ... చూడ్డానికి రెండు కళ్లూ చాలవు తెలుసా! "

తన అందం గురించి పొగడ్త వినడంతో కొంచెంగా సిగ్గుపడింది.

"అవునా... అయినా మనకెందుకు.." కిరణ్మయి చాలా అందంగా వుంటుందన్న విషయం తనకి అస్సలు  అనవసరమన్నట్లు చాలా సాదాగా అనేసాడు.

‘అందంగా ఉన్నానని స్నేహితుడు చెబుతున్నాడుకదా!... తన తండ్రి గురించి అంత గౌరవంగా మాట్లాడినవాడు... ఆ తండ్రి కూతురిని అంతంత అందగత్తెను  తన గురించి ఇంకా తెలుసుకోవాలన్న ఉత్సాహంగూడా చూపించట్లేదు.. ఏం చలిమిడి ముద్దరా బాబూ‘... అనుకుంది కిరణ్మయి.... ఆ అమ్మాయి అక్కడే వుందనీ తమ మాటలు వింటోందని గమనించని వాళ్లిద్దరూ తమ ధ్యాసలో తాము మాట్లాడుకొంటున్నారు.   కానీ ఆ తర్వాత వాళ్లు ఏవేవో కాలేజి విషయాలు మాట్లాడుకున్నారు గానీ కిరణ్మయి గురించి ఇంక మాట్లాడుకోలేదు.   వాళ్ల మాటలు చాటుగా దాగి వినాలన్న కుతూహలంలో సమయం చూసుకోలేదు.  ఒక్కసారి టైం గమనించి... అమ్మో తాతగారు నిద్రలేచే వేళయింది అని గబగబా వెనక్కు తిరిగి ఇంటికి చేరింది కిరణ్మయి.  ఆ రాత్రి ఎంత కాదనుకున్నా తన మనసు తన తండ్రిని ఆదర్శంగా తీసుకుని జీవితంలో గొప్పవిషయాలు సాధించాలి అని పలికిన ఆ అబ్బాయి గురించే ఆలోచిస్తోంది..  వాళ్లు ఈ వూళ్లో ఎక్కడుంటారో... వీలయితే వాళ్లను గూర్చి తెలుసుకోవాలి.. రేపు వాళ్లని మరింత దగ్గరగా పరిశీలనగా గమనించాలి....  అనుకుంటూ నిద్రపోయింది.

మరుసటిరోజు అదే సమయానికి ఆ ఏటు గట్టుకి వెళ్లింది.  వాళ్లు కనిపించలేదు.  నిరాశతో వెనక్కి తిరిగింది.  అలా రెండ్రోజులు గడిచిపోయాయి...  కిరణ్మయికి వాళ్లు కనబడితే బాగుంటుంది అని అనిపిస్తోంది.  పోనీ తాతగారిని అడిగితే ... "హమ్మో! ఇంకేమైనా వుందా ఎవరో మొగపిల్లలగురించి ఆరా తీస్తోందని వళ్లు చీరేస్తారు.." అనుకుని భయపడింది.  చూద్దాం నెలరోజులు ఉండబోతున్నాను ... కనబడకపొతారా అనుకుని సమాధాన పడింది.

అది కిరణ్మయి తన తాతగారి ఊరొచ్చిన నాలుగో రోజు.  కిరణ్మయికి ఇప్పుడు రెండు లక్ష్యాలు. ఒకటి అతన్ని చూడాలి, రెండు ఆ కోకిలని కూడా చూడాలి.  అతని మాటలు ఎలాగూ వినబడలేదు కానీ కోకిల మాత్రం ఎప్పట్లానే తోటలో కూర్చుని కూస్తోంది. కనీసం ఇవాళైనా దాన్ని చూడాలి అనుకుంటూ మామిడితోటవైపు నడిచింది.  

ఆ కోకిల ఎక్కడినుంచి పాడుతోందా అని పరీక్షగా వెదికింది.  తోట ఏటి వొడ్డునే వుండటంతో ఒక మామిడిచెట్టు దాదాపు ఏటినానుకొని పెరిగింది.  దాదాపు కొమ్మలు దాదాపు నీటివైపు వంగి వున్నాయి.  ఎవరైనా ఆ కొమ్మల మీదకెక్కి  ఏట్లోకి దూకచ్చు.    అదిగో ఆ చెట్టు చిటారి కొమ్మల్లో ఎక్కడో దాగి పాడుతోంది ఆ కోయిల.   ఆ చిటారు కొమ్మన ఉన్న కోయిలను చూడాలనే ఉత్సాహంలో అపాయం అనే మాట మర్చిపోయి ఆ ఏటిమీద వాలివున్న కొమ్మల మీదకి ఎక్కేసింది.  కొమ్మల్ని గట్టిగా పట్టుకుంటూ కొన్ని ఆకులని మండలని తప్పిస్తూ కోకిల ఎక్కడవుందా అని వెదకసాగింది.  ఆ వెదకటంలో చెట్టుకొమ్మలమీద పాకుతున్న ఒక పసరికపాముని తను చూసుకోలేదు.  ఒక్కసారి తన చేతివేళ్లు ఆ పాముని తాకగానే కంగారు పడిపోయి కొమ్మని వదిలేసింది... దాంతో సరాసరి కృష్ణానదిలో పడిపోయింది.

కిరణ్మయి సహజంగా ధైర్యవంతురాలు.  కొంచెం ఈతగూడా వచ్చు.  అందుకే నదిలోపడినా కంగారు పడకుండా ఈది ఒడ్డుకెళదామన్న ప్రయత్నం చేసింది... కానీ అది దివిసీమ... పైగా నది సముద్రంలో కలవడానికి కొంచెమే దూరం ఉండటంతో కృష్ణానది పరవళ్లెత్తుతూ కిరణ్మయిని తనతో లాక్కెళ్లిపోవడం మొదలుపెట్టింది.  తను ఈతకొట్టటానికి చేస్తున్న ప్రయత్నం ఫలించడం లేదు ఎంత ప్రయత్నించి ఈతకొట్టినా తను అంగుళంకూడా కదలడంలేదు... పైగా ఏట్లో కొట్టుకుపోతోంది.  సుకుమారమైన చేతులు కావడంతో ఒకటి రెండు నిమిషాల్లోనే ఈతకొట్టి చేతులు బాగా నెప్పిపుట్టి అలసిపోయింది.  ఇవాళ ఇక్కడ నేను చచ్చిపోవడం ఖాయం అనుకుని అప్రయత్నంగానే నీరుమింగుతూ మునకలేయసాగింది.  అలా మెల్లగా నీట్లో మునిగిపోసాగింది. అలాగే ఇంకొంతసేపుంటే పూర్తిగా మునిగొపోయేదేమో!

అప్పుడు కనబడ్డాడతను.  ఎక్కడ్నించి వచ్చాడో తను నీళ్లలో పడ్డ విషయం గమనించినట్లున్నాడు... ఒక్కసారిగా నీళ్లలోకి దూకేశాడు.  చేతులతో బారలు వేస్తూ శరవేగంగా తనవైపే వస్తున్నాడు.  తను ఎంత ప్రయత్నంచేసి ఈతకొట్టినా దారి ఇవ్వని కృష్ణమ్మ తల్లి అతను వేసే బారలతో సహకరిస్తున్నట్లుంది శరవేగంగా అతన్ని ముందుకు తోస్తోంది.   కను మూసి తెరిచేటంతలో తనవైపు దూసుకు వచ్చాడతను.  ఒక్కసారి దగ్గరకొచ్చి మునిగిపోతున్న తన చెయ్యి పట్టుకుని తనపైకి లాక్కున్నాడు.  అప్పటికే బాగా నీరుతాగేసి దాదాపు మునిగిపోబోయిన కిరణ్మయి స్పృహతప్పి అసహాయంగా అతని చేతుల్లో అచేతనంగా వాలిపోయింది. 

మళ్లీ కిరణ్మయి నీరసంగా కళ్లు తెరిచేసరికి ఒడ్డుమీద వుంది.  బట్టలన్నీ తడిసి ముద్దయి ఒంటిమీద అతుక్కుపోయాయి.  తనని గట్టుపక్కనే ఉన్న మామిడిచెట్టు నీడలో పడుకోబెట్టి తనవంకే పరిశీలనగా చూస్తున్నాడతను.  

"ఏవూరండీ మీది?  ఇక్కడి కృష్ణానది చాలా ప్రమాదకరం అని తెలియదా... అయినా ఆ మామిడిచెట్టు కొమ్మమీదకి ఎవ్వరూ ఎక్కరు... మీరెవరోగానీ చాలా అమాయకురాలిలాగా ఉన్నారు... జారి ఏట్లో పడతారని తెలియదా?  ఇంతకీ ఎవరమ్మాయి మీరు?" అని అడుగుతున్న అతన్నే చూస్తూ  ఉండిపోయింది కిరణ్మయి.

రోజూ వ్యాయామం చేస్తున్నట్లు కండలు తిరిగిన శరీరంతో, చామనచాయలో, నూనూగు మీసాలతో చూడడానికి బాగున్నాడు.  ఇతని గొంతు ఇంకా బాగుంది.  నా తండ్రిని పొగిడాడు.  ఇప్పుడు తనకి ప్రాణభిక్షపెట్టాడు.  ఎందుకో అతన్ని చూస్తూనే కిరణ్మయికి అతని పట్ల ప్రేమభావం పొంగిపోసాగింది.  

"సారీ అండీ.. కోయిలను చూడాలనే ఉత్సాహంలో అపాయాన్ని గమనించలేదు.  అయినా నా హీరో మీరున్నారుగదా ఇంక నాకేం భయం" కొంటెగా అనేసింది.

తను అలా అన్న మాటలకు తేలికగా నవ్వేస్తూ... "అంత మాటనకండి... మీరెప్పుడు ఏట్లోకి దూకేస్తారో కాపాడుదాం అని చూస్తూ కూర్చోవడానికి నాకంత తీరిక లేదు.  బై ది వే నా పేరు రవి.  మీ పేరేంటి" అడిగాడు. ఆమె తన పేరు చెప్పి తను చౌదరి గారి మనుమరాలినని చెప్పింది.

తను చౌదరిగారి మనుమరాలనగానే అతని నుదురు కుతూహలంగా కొంచెం పైకిలేచింది.   "ఓ మీరేనన్నమాట ఆ భూలోక రంభ. మా వాడు చెబుతుంటే ఏదో వాగుతున్నాడులే అనుకున్నాను కానీ మీరు వాడు చెప్పిందానికంటే రెట్టింపు అందంగా వున్నారు" అన్నాడు.  ఆ మాటలు విన్న కిరణ్మయి ఒక్కసారిగా సిగ్గుపడింది.  "ఫర్లేదు నేను ఊహించుకున్నంత చలిమిడిముద్దకాదు..." అని మనసులో అనుకుంది.

"ప్లీజ్ నేను ఇలా ఏటి గట్టుకు వస్తున్నానన్న విషయం మా తాతగారికి తెలియదు..  ఇలా కృష్ణానదిలో పడి ఆల్‍మోష్ట్ మునిగిపోయానని తెలిస్తే మా తాతగారు నన్ను చాలా తిడతారు... ఇక మళ్లీ నన్ను పొలంగట్లవెంట తిరగనియ్యరు.  పైగా నన్ను తిరిగి మలేషియా పంపించేస్తారేమో... ప్లీజ్ ప్లీజ్ దయచేసి ఈ విషయం ఎక్కడా చెప్పకండీ ప్లీజ్" బ్రతిమాలింది.  "సరేనండీ... ఈ విషయం ఎవరికీ చెప్పను... కానీ మీరు మాత్రం దయచేసి ఇలా ఒంటరిగా తిరక్కండి.. ఏదయినా జరగరానిది జరిగితే అందరమూ బాధపడతాము" అంటూ జాగ్రత్తలు చెబుతున్న అతనివంకే కృతజ్ఞతగా చూస్తూ ఉండిపోయింది.  

ఆ తర్వాత వాళ్లిద్దరూ అక్కడ ఏటిగట్టున కూర్చుని చాలా విషయాలు మాట్లాడుకున్నారు.  రవిది చాలా సామాన్య కుటుంబం. అతను విజయవాడ కాలేజిలో ఇంజనీరింగ్ చదువుతున్నాడు. వాళ్ల నాన్నగారు  వాటర్ వర్క్స్ డిపార్ట్‍మెంటులో సూపర్‍వైజర్ గా చేస్తూంటారు. ఆ రోజు రవితో తన గుంరించి చెప్పినతని పేరు సుభ్రమణ్యం.  కాలేజి మార్కులు తెచ్చుకుందామని విజయవాడ వెళ్లి ఆరోజు ఉదయమే తిరిగి వచ్చారు.  రవి కాలేజిలో అధ్లెటిక్ చాంపియన్.  ఆ రోజు కృష్ణానదిలో ఎప్పట్లాగా ఈత కొడదామని వచ్చి మునిగిపోతున్న కిరణ్మయిని గమనించాడు. అతను చాలా ఆశయాలతో వుంటాడు.  ఎప్పటికైన చాలా గొప్పవాడినవుతాడన్న గట్టి నమ్మకం.

ఆ రాత్రికి కిరణ్మయికి నిద్రపట్టలేదు.  ఆమె మనసు పదే పదే రవి గురించి ఆలోచిస్తోంది.  రవిలో ఏదో ఆకర్షణ వుంది.  వయసుకి మించి పెద్దరికంతో ఆదర్శాలతో మాట్లాడతాడు.  ఎందుకో అతను తన పక్కనుంటే ఇక ప్రపంచంలో తనని ఎవ్వరూ ఏమీ చెయ్యలేరు అనిపిస్తోంది... అతను పక్కనుంటే తనకి ఏ ఆపదా కలగదు.. కృష్ణానదిగూడా నన్ను ముంచెయ్యలేదు... అనే గట్టి నమ్మకం కిరణ్మయిలో కలిగింది...  ఆ నమ్మకాన్నే ప్రేమ అంటారనీ, ఆ ప్రేమే అల్లుకుని అనుబంధంగా మిగిలిపోతుందనీ అప్పు డు తనకి తెలియదు. 

ఆ తర్వాత తను ఉన్నన్ని రోజులూ అతనితో చెట్టాపట్టాలు వేసి తిరిగింది.  ఒకరోజు రవి తనకి ఏదో చూబిస్తానని తీసుకువెళ్లాడు.. ఏంటా అని చూస్తే కోకిల.  అలా కోకిలని చూడగలిగినందుకు కిరణ్మయి చాలా సంతోషపడింది.   తను అక్కడ ఉన్నన్ని రోజులు రవికి ఇష్టమని తెల్లని రంగు వోణీలు బారు జడ వేసుకుని చెవిపక్కన ఎర్ర గులాబి పెట్టుకునేది.  తనని ఆ గెటప్ లో చూసిన రవి కళ్లు ఆనందంతో తెకుచుకోవడం తనకి చాలా సంతోషం అనిపించింది.

కిరణ్మయి తిరిగి మలేషియా వెళ్లిపోయే రోజు దగ్గరపడింది. రవి తనగురించి ఏమనుకుంటున్నాడో కిరణ్మయికి తెలియదు.  అతనికి చదువంటే చాలా ఇష్టం. తనని ఒక స్నేహితురాలిగా భావిస్తూ మర్యాదగా మాట్లాడుతున్నాడు...  కిరణ్మయికి ఎందుకో రవిని వదిలి వెనక్కు వెళ్లిపోవాలంటే మనసంతా దిగులుగా అనిపించింది.  ఆ విషయమే రవితో చెప్పింది.

"ఎందుకు దిగులు పడటం.  నేను నీకు ఉత్తరాలు రాస్తానుగదా. పైగా సెలవుల్లో నువ్వు ఎలాగూ ఇక్కడకు వస్తూంటావు.. కాంసంట్రేట్ ఆన్ యువర్ ఎడ్యుకేషన్" అని ఎప్పట్లానే వయసుకు మించిన పెద్దరికంతో  ధైర్యం చెప్పాడు... అతనంటే తను పిచ్చిగా ఇష్టపడుతున్నాననీ అతనులేకుండా వుండలేననీ చెప్పాలనుకుంది.  కానీ చెప్పలేకపోయింది....

"ఒక వేళ మనం కలవలేక పోతేనో?"

"ఎందుకు కలవలేము?  నేను చదువుకొని పెద్దవాణ్ణయి విమానాల్లో దేశదేశాలు తిరిగుతాను... మీ నాన్నగారి లాగా... నువ్వుగూడా చదువుకుని గొప్పదానివైపో.. మనిద్దరమూ అప్పుడప్పుడ గాల్లో సరదాగా విమానాల్లో కలుసుకోవచ్చు"  ఎంతొ ఉత్సాహంగా ఏదో జరగబోయేది తెలిసిపోయినట్లు మాట్లాడాడు.  కానీ కిరణ్మయి అతని మాటలు పూర్తిగా నమ్మింది... ప్రేమించిన మనసు తన ప్రేమికుడు చెప్పిన ఏ విషయాన్నయినా గుడ్డిగా సాధ్యాసాధ్యాలు ఆలోచించకుండా నమ్మేస్తుంది. అందుకే ప్రేమ గుడ్డిది అన్నారు.

కిరణ్మయి మలేషియా తిరిగి వచ్చేసిన కొంతకాలంవరకూ రవినుండి క్రమం తప్పకుండా ఉత్తరాలు వచ్చేవి.  కానీ ఒక సారి హటాత్తుగా ఉత్తరాలు రావడం ఆగిపోయాయి.  ఆ తర్వాత కొద్దినెలలకే తన తాతగారు చనిపోవడంతో కిరణ్మయి తండ్రి పొలాలన్నీ అమ్మేయడంతో ఆ వూరితో సంబంధాలు తెగిపోయాయి.  తర్వాత రవిగురించి జాడ తెలియకుండా పోయింది.  కానీ కిరణ్మయి తనని బ్రతికించిన రవిని మర్చిపోలేకపోయింది. కాలక్రమేణా రవిపట్ల ఉన్న ఆ నమ్మకం అనే చిన్న విత్తనం ’ ప్రేమ’ అనే పెను వటవృక్షం క్రింద మారింది.  రవి లేనిదే తను బ్రతకలేదనీ ఎప్పటికైనా రవిని తను జీవిత భాగస్వామిగా పొందాలనీ నిర్ణయించుకుంది.

అలా ఎప్పటికైనా రవిని కలుస్తానన్న ఒక పిచ్చి ఆశ కిరణ్మయిది.  ఆ ఆశలోనే దాదాపు పదిహేనేళ్లు గడిపేసింది.  రవి తను కలలు కన్నట్లుగా గొప్పవాడయి వుంటాడనీ విమానాల్లో తిరుగుతాడనీ తనని అలా కలవచ్చనీ నమ్మి ఎయిర్‍హోస్టెస్ గా చేరింది.  కానీ దాదాపు ఆరేళ్లయిపోయాయి.... ఇప్పటిదాకా రవి కనబడలేదు.   ఆ విషయమే కిరణ్మయిని చాలా దిగులుకి గురిచేస్తోంది.  ఈ శరీరం అతను బ్రతికించినది... ఈ ప్రాణం అతనిచ్చినది... నేనతని సొత్తు... అతనికి ఈ విషయం తెలిస్తే ... తనని కలిస్తే ఎంతబాగుంటుంది... అని ఒక పిచ్చి ఆశ... ఆ ఆశ ఇక అడియాసగా మారేటట్లుందనే ఊహే తన మనసును పుట్టెడు దుఃఖానికి గురిచేస్తోంది.

ఎక్కడున్నావు రవీ! ఏమయిపోయావు?  నిన్ను ప్రేమించే ఒక మూగ ప్రేమికురాలు ఇక్కడ వుందని అసలు నీకు తెలుసా.... జీవితం గొప్పవాడినవ్వాలనే తపనలో నన్ను మర్చిపోయావేమో.... కానీ నేను నిన్ను మర్చిపోలేదు.  నాకు నువ్విచ్చిందే ప్రాణం.  నేను నీకే సొంతం... అసలు నువ్వనుకున్నట్లుగా గొప్పవాడివయావాలేదా?  నువ్వు గొప్పవాడివయితే నా ప్రేమికుడు నేను ఆరాధించే మగాడు అనుకున్నది సాధించాడని సంతోషిస్తాను. అయినా నువ్వు గొప్పవాడివో బీదవాడివో అదినాకు అనవసరం.   నువ్వు గొప్పవాడివి కాకముందరే నేను నిన్ను ప్రేమించాను.  నాకు నువ్వు కావాలి రవీ... నువ్వుగా కావాలి.... మా నాన్న అంటే నువ్వు చిన్నప్పుడే బోల్డంత గౌరవంగా మాట్లాడేవాడివి.  మా నాన్నకి నిన్ను చూబిస్తాను. నిన్ను ప్రేమించాననీ నిన్నే పెళ్లిచేసుకుంటాననీ చెబుతాను.  నీకు డబ్బున్నా లేకపోయినా, నువ్వు ఎంత సామాన్యుడివైనా ఫరవాలేదు... ఒక్కసారి కనిపించు... నేను నీకు ఎన్నో చెప్పాలి. నువ్వు నాకు కావాలని చెప్పాలి..   కిరణ్మయి మనసు రవి గురించిన ఆలోచనల్లో తహతహలాడుతోంది.  

*******

ఫ్లైట్ లండన్ చేరుకుంది.  హోటల్ రూం కి వెళ్లి ప్రెషప్ అయి బైటికి వచ్చేసరికి పోన్ మోగుతోంది.   కిరణ్మయి వెళ్లి రిసీవర్ తీసింది.

"అమ్మా బంగారాలూ ఎలా వున్నావురా?"  ఆదరంగా పిలిచిన తన తండ్రి గొంతువినగానె తనకెందుకో ఏద్చెయ్యాలనిపించింది.   తను మౌనంగా వుండటంతో "ఏమయిందిరా బంగారాలూ... వంట్లో బాగానే వుందా?  వద్దువద్దన్న కొద్దీ ఆ ఎయిర్‍హోస్టెస్ ఉద్యోగం చేస్తున్నావు.  అ జెట్‍లాగ్ తోటి ఆరోగ్యం పాడవుతుందన్నా వినవు." తన తండ్రి ఆందోళనగా అడుగుతూ సున్నితంగానే మందలించాడు. కిరణ్మయికి ఇక ఎందుకో అక్కడ ఉండాలనిపించలేదు.  వెంటనే తన తండ్రిని చూడాలని ఆయన ఒడిలో తలపెట్టి బావురుమని ఏడ్చెయ్యాలనిపించింది.

"లేదు నాన్న... ఇంక నేను ఈ ఉద్యోగం చెయ్యదలచుకోలేదు... ఉన్న పళంగా నాకు మీ దగ్గరకు వచ్చెయ్యాలని వుంది." అంటూ కళ్లవెంట నీరు పెట్టుకుంది.  ఎప్పుడూలేనిది తన కూతురు అలా బేలగా మాట్లాడుతుండటంతో ఏమయిందో అనుకుని ఆయన కంగారు పడిపోయాడు.

"బంగారాలూ!  నువ్వు నా కూతురివిరా... బాధపడద్దురా...  నీకేంతక్కువమ్మా ... వచ్చెయ్యి. వెంటనే వచ్చెయ్యి...  నేను ప్రైవేట్ జెట్ ఏర్పాటు చేస్తాను.  నువ్వు ఉన్న పళంగా నా దగ్గరకు వచ్చెయ్యి.  నాకు ఒక్క పదినిముషాలు సమయమియ్యి... విమానం ఏర్పాటు చేసి ఇప్పుడే కబురుచేస్తాను"  అనునయంగా చెప్పారాయన.  తన కూతురు ఎందుకో ఆరాట పడుతోంది.  తనని ఉన్నపళంగా చూడాలనుకుంటోంది... అదే ఆ తండ్రి మనసుకు అర్ధమైంది.

సిక్‍లీవ్ పెట్టేసి ప్రివేట్ ఏరోడ్రోమ్ కి వచ్చింది.  తన్ తండ్రి తనకు చెప్పినట్టుగా ఒక చిన్న విమానాన్ని ఏర్పాటు చేశాడు.  సామాన్యులందరూ బస్సులో వెళ్ళినట్లుగా  విమానాల్లో వెళితే, బాగా దనవంతులు సొంతకారులో వెళ్లినట్లుగా సొంత విమానాలలో వెళ్లడం జరుగుతుంది.   కిరణ్మయి తండ్రి సుజనాచౌదరిగారికి సొంత విమానం లేదు.  ఆయనకి సొంతవిమానం కొనుక్కోగలిగినంత స్తోమత వున్నా చాలా నిరాడంబర మనస్తత్వం అవడంవల్ల ఎప్పుడూ ప్రయత్నం చెయ్యలేదు.  

ఒక చక్కటి చిన్నగా ముచ్చటగా ఉన్న ట్విన్ ఇంజన్ విమానం నార్త్‌హోల్ట్ ప్రెవేట్ ఏరోడ్రోం లో ఆగి వుంది.  పైలట్ కిందకి దిగి కిరణ్మయిని విష్ చేసి లోపలికి ఆహ్వానించాడు.  లోపల చాలా ఖరీదయిన నాలుగే నాలుగు సీట్లున్నాయి.  ఆఫీస్ పని చేసుకోవడానికి వీలుగా ఆ నాలుగు కుర్చీలకు మధ్యగా ఒక బల్లగూడా వుంది.  ఒక ధనవంతుడు ఎంత విలాసాన్ని కావాలనుకుంటడో ఆ విలాసాలన్నీ అందులో వున్నాయి.

"మేడమ్ మీరు ఎప్పుడు రడీ అంటే అప్పుడు చెప్పండి మేము టేకాఫ్ చేస్తాము." అని చెప్పాడు పైలట్  "బైదివే మై బాస్ అదే ఈ విమానం ఓనర్ మీకిమ్మని పాక్స్ మెసేజ్ ఇచ్చారు" అంటూ ఒక సీల్డ్ కవర్ అందించాడు.   ఈ విమానం ఓనర్ ఎవరబ్బా అనుకుంది.  బహుశా తన తండ్రి స్నేహితులెవరో అయి వుంటారులే అనుకుని ఆ  కవర్ అందుకుని తర్వాత తీరికగా చదవచ్చులే అని హాండ్‍బాగ్ లో పడేసుకుంది.

తను ఇక బయల్దేరదాం అని చెప్పగానే పైలట్ టేకాఫ్ చేసి విమానాని మలేషియావైపు పొనించాడు.  కిరణ్మయికి మనసంతా ఇంకా బాధగానే వుంది.  తలబాగా నెప్పిపెడుతుండటంతో పడుకుందామని అనుకుంది.  ఆ విమానంలో ఇంకొక సౌకర్యం ఏంటంటే ఎప్పుడయినా పడుకుందామని అనిపిస్తే నాలుగు కుర్చీలూ కలిపి ఒక క్వీన్‍సైజ్ బెడ్ లాగా మారుతాయి.  కిరణ్మయి పడుకొని నిద్రపోయింది.

విమానం కొలలంపూర్ లో ఇంకొక్క కొద్ది నిమిషాల్లో లాండ్ అవుతుందనగా పైలట్ వచ్చి "గుడ్ మార్నిం గ్ మేడమ్ మనం ఇంకొంచెం సేపట్లో లాండ్ అవబోతున్నాం" అని చెబుతూ నిద్రలేపాడు.    అప్పుడు కిరణ్మయికి ఆ ఉత్తరం గుర్తొచ్చి తీసుకుని చదవడం మొదలుపెట్టింది.

"కిరణ్మయీ.. చిన్నప్పుడు నీతో కలిసి తిరిగిన రవి నీకు గుర్తున్నాడా.... నేను అదే రవిని... "  కిరణ్మయి గుండెలు గబగబా కొట్టుకున్నాయి... ఈ ఉత్తరం నా రవి రాసిందా...  తను ప్రయాణింస్తోంది  రవి సొంత విమానంలోనా.. ఎప్పుడో గొప్పవాడినై విమానాల్లో తిరుగాను అని చిన్నప్పుడు చెబుతుంటే, అతను అంతకు సమర్ధుడు అని గట్టిగా నమ్మింది కానీ అతను సొంత విమానాల్లోనే తిరిగేటంత గొప్పవాడవుతాడని ఊహించలెకపోయింది.  ఎక్కడైనా కనబడకపోతాడా అని ఎయిర్ హోస్టెస్‍లాగా మారి దేశదేశాలు తిరిగింది.  కానీ తన రవి తన సొంతవిమానంలో దర్జాగా తిరుగుతున్నాడు అని ఊహించలేకపోయింది.

"కిరణ్ నీకు కనబడకుండా ఇలా ఉత్తరం రాస్తున్నందుకు క్షమించు.  చిన్నప్పుడు నీతోటి స్నేహం నాకు దొరికిన ఒక గొప్ప అదృష్టం.   నాకు తెలియకుండానే నా హృదయం నీతోటి ప్రేమలో పడింది.  కానీ ఆ ప్రేమ నా చదువుకి అడ్డం పడుతుందేమోనని తలుచుకొని భయపడిపోయాను.  అందుకే నీకు ఉత్తరాయలు రాయడం ఆపేసాను.   నాకు మీ నాన్నగారన్నా, మీ తాతగారన్నా చాలా ఇష్టం గౌరవం... ఆ రోజుల్లో అతి పేదవాడినైన్ నాకు నిన్ను ప్రేమిస్తున్నానని చెప్పే అర్హతగూడా లేదని తెలుసు.  అలాచేసి మీ పెద్దలకు మనస్తాపం కలిగించలేకపోయాను.  అందుకే నీకు దూరంగా వుంటూ నిన్నూ నీ అందాన్నీ మౌనంగా ఆరాధిస్తూ గడిపేశాను.  ఒక్క ఆరుసంవత్సరాలక్రితం నేను అనుకున్నట్లుగా ఒక గొప్పస్థాయికి చేరుకుని నీ చేయందుకునే అర్హత సంపాదించాననుకొన్న తర్వాత  నీకోసం వెళ్లి మీ నాన్నగారిని కలిసాను.  మన మధ్య పరిచయం ఉందన్న విషయం ఆయనకు చెప్పలేదు.  నిన్ను పెళ్లిచేసుకోవాలనుకుంటున్నానని ఆయునతో చెప్పాను.  కానీ నీవు పెళ్లంటే ఇష్టపడటంలేదని మీ నాన్నగారు చెబితే తెలిసి చాలా బాధపడ్డాను.  అప్పట్నించీ మీ నాన్నగారితో చనువుగా ఉన్నానే తప్ప నీకు ఇష్టం లేకుండా ఆయనతో చెప్పి ఆయనద్వారా బలవంతంగా నిన్ను పెళ్లికి ఒప్పించాలని నేను అనుకోలేదు...  నాకు నువ్వంటే చాలా ఇష్టం.  నిన్ను నేను దూరంనుంచే చూసుకుని సంతోషించానే తప్ప నీకు ఎదురుపడి నిన్ను బాధపెట్టాలనుకోలేదు.  

కానీ ఇవాళ నీకు ప్రత్యేకించి ఈ ఉత్తరం ఎందుకు రాస్తున్నానంటే నేనిప్పుడు మలేషియాలో ఉన్నాను.   మీ నాన్నగారు నీగురించి చాలా ఆందోళనలో ఉన్నారు.  నిన్ను బలవంతంగా నాతొ పెళ్లికి వొప్పిస్తాననీ నిన్ను పెళ్లి చేసుకొమ్మనీ నన్ను అడిగారు.  కానీ నీకు ఇష్టం లేకుండా నిన్ను బలవంతంగా పెళ్లిలోకి దింపలేను... అలాగని చిన్నప్పట్నించీ నా ఆదర్శంగా ఒక మార్గ దర్శకుడిగా భావించిన మీ నాన్నగారి మనసుని నొప్పించలేను.  మళ్లీ మళ్లీ చెప్పలేను... నాకు నువ్వంటే చచ్చేటంత ఇష్టం... నీకుకూడా నేనంటే నాతో పెళ్లంటే ఇష్టమే అయితే దయచేసి నేను నీగుంరించి ప్రత్యేకంగా కొనుక్కున్న తెల్లచీర కట్టుకుని ఒక ఎర్రగులాబీ పెట్టుకుని ప్లైట్ దిగి  మీ నాన్నగారి ముందుకు వచ్చి నిలబడు...  నేను నిన్ను చేసుకుంటానని నిన్ను నాకిచ్చి చెయ్యమనీ సర్వదేవతల సాక్షిగా కోరతాను.  మనిద్దరికీ అదే మంచిది.  నువ్వు నన్ను కాదనుకుంటే ఆ చీర నీవు కట్టుకోనక్కర్లేదు.... అది తెలిసి నేను ఖచ్చితంగా బాధపడతాను.  అయినా సరే మీ నాన్నగారితో నాకుగూడా పెళ్లి ఇష్టం లేదని చెప్పి మిగిలిపోతాను.  ఇలా చెబుతున్నందుకు క్షమించు. బై ది వే విమానం లో ఉన్న కేబిన్ తలుపు తెరిచి చూడు.."

ఆ ఉత్తరం చదివుతూ అది కలో నిజమో ఊహించుకోలేని పరిస్థితిలో పడింది కిరణ్మయి... ఆమె మనసు ఆనందంతో పొంగి పరవళ్లు తొక్కుతోంది.  గబగబా లేచి కేబిన్ తెరిచి చూసింది.  ఒక ఖరీదయిన ఎక్సిక్యూటివ్ కాబిన్ అని చూడగానే తెలిసిపోతోంది.  అవసరమైతే బట్టలు మార్చుకోవడానికి కొన్నిసూట్స్ అక్కడ హాంగ్ చేసి వున్నాయి.  ఆ పక్కనే వాల్‍మీద కిరణ్మయి ఫోటొ చాలా అందంగా నవ్వుతూ ఉంది.  ఆ ఫోటో చూడగానే కిరణ్మయి మనసు సంతోషంతో మరింత దూదిపింజెలాగా తేలికయిపోయింది.  తన రవి తనని ఆరాధిస్తున్నాడు.. తన సొంత విమానంలో తన ప్రైవేట్ కాబిన్‍లో తన ఫోటో పెట్టుకున్నాడు. ఆ ఊహే కిరణ్మయికి హాయిగా అనిపించింది.  అప్పటికప్పుడు వెళ్లి రవిబాహువుల్లో వాలిపోవాలని అనిపించింది.   కిరణ్మయి ఫోటో కింద ఒక నీట్‍గా ఉన్న ఒక పాకేజి.  ఆ పాకేజి మీద రాసుంది... "టు మై కిరణ్మయి విత్ లవ్" అని....  ఆ పాకేజి పక్కనే ఒక చిన్న నీటి గ్లాస్‍లో ప్రెష్‍గా ఉన్న ఒక ఎర్రగులాబి.    ఆ పాకేజిని ఓపెన్ చేసి చూసింది... ప్రత్యేకించి నేయించిన అతి ఖరీదయిన తెల్లటి కంచిపట్టు చీర...

****** 

మలేషియా ప్రివేట్ ఏరోడ్రోంలో ప్లేన్ లాండయేసరికి తన తండ్రి రవి ఇద్దరూ ఎదురు చూస్తున్నారు. ... "బంగారాలూ!  అయామ్ సో గ్లాడ్ యుఆర్ హోమ్... ఎలావున్నావు?  నన్ను చాల ఖంగారు పెట్టేశావు తెలుసా" అని పలుకుతూనే ఎంతో అందంగా తెల్లటి కంచిపట్టుచీరలో జడలో ఎర్రగులాబి పెట్టుకుని చాలా సంతోషంతో ప్లేన్ దిగివచ్చిన కిరణ్మయిని చూసి... హమ్మయ్య అంతా బాగానే ఉన్నట్లుంది.. అనుకొని తేలిగ్గా ఊపిరిపీల్చుకున్నాడాయన.

"బంగారాలూ... ఇతను రవి అని.  చిన్నప్పుడు మన తాతగారి ఊర్లోనే పెరిగాడట. నాకు ఒక అయిదారేళ్ల నుంచి పరిచయం.  నేను పాటించిన పద్ధతులే ఆదర్శంగా తీసుకుని ఇతను సాప్ట్‌వేర్ వ్యాపారం మొదలెట్టాడట.  ఆ వ్యాపారంలో అతను అతి కొద్దికాలంలో  కొన్ని వేల కోట్ల ఆస్తి సంపాదించాడు.  ఇవాళ ఇతను ప్రపంచంలోని మొదటి వందమంది ధనవంతుల జాబితాలో ఒకడు.  కానీ గొప్ప మీడియా షై పర్సన్ ... పత్రికలవాళ్లతో తన పేరు రాయనివ్వడు.. తన ఫోటో వేసుకోనివ్వడు... గొప్ప సిగ్గు... అయినా నిన్న నీకు వొంట్లో బాగోలేదని తెలిసుకొని ఎంత కంగారు పడిపోయానో తెలుసా... ఇతనిక్కడికి బిజెనెస్ పనిమీద వచ్చాడు.  నేను నీకు పోన్‍చేసిన సమయంలో నాదగ్గరే వున్నాడు.  నేను అడిగేలోపలో లండన్ లో ఎప్పుడూ సిద్ఢంగా ఉండే తన సొంత విమానాన్ని నువ్వు రావడం కోసం ఏర్పాటు చేసాడు. చాలా మంచి కుర్రాడు.  ఐ లైక్ హిం"  అని చెబుతూ... రవీ మై బోయ్ అయామ్ సో ప్రౌడ్ ఆఫ్ యు... నా కూతురు పెళ్లి చేసుకోను అని చెబుతూ ఆరేళ్లనించీ  ఎయిర్ హోస్టెస్ లా మారి దేశాలు పట్టి తిరుగుతోంది... అదిగానీ నాన్నా నేను పెళ్లిచేసుకుంటాను అని చెప్పివుంటే నీ అంతస్తుకి తగిన వాళ్లం కాకపోయినా నా కూతురిని చేసుకోవయ్యా అని ఏనాడో అడిగేవాడిని.  నా కూతురిని ఉన్నపళంగా సహాయం చేసి తీసుకొచ్చి నాకు అప్పగించావు.  నేను నీకెంతో రుణపడివున్నాను... అని ఇంకా ఏదేదో చెప్పుకు పోతున్నారు సుజనా చౌదరిగారు...  ఆయన ఎప్పుడూ అంతే మనసులో ఉన్నది బైటికి మాట్లాడేస్తూంటారు... 

కానీ కిరణ్మయికి తన తండి చెబుతున్న ఏ కబుర్లూ చెవికెక్కడంలేదు... తన చూపులన్నే తన తండ్రి పక్కనే హుందాగా సుమధుర మందహాసంతో ప్రపంచాన్నే జయించగలిగానన్న ధీమాతో నిలబడి వున్న తన రవి మీదే వున్నాయి. రవి తన చిన్నప్పటికంటే ఇంకా ఎంతో హేండ్‍సమ్ గా కనబడుతున్నాడు..   రవిగూడా కిరణ్మయినే గమనిస్తున్నాడు.  కంచిపట్టుచీర కట్టి, నుదుటిన రమణీయమైన తిలకందిద్ది వాలు జడతో భూలోకానికి దిగివచ్చిన అప్సరసలాగా కనిపిస్తున్న తన కిరణ్మయి అందాల్ని తనివితీరా చూస్తున్నాడతను.  కిరణ్మయికి తనంటే ఇష్టమేనని ఆమె కట్టుకున్న చీరద్వారా తెలిసి అతని మనసు ఆనందంతో పొంగి పరవళ్లు తొక్కుతోంది...  

అలా ఇద్దరూ ఒకరినొకరు చూసుకుంటూ ఒకరి చేతులు ఒకరు పట్టుకుని ఎదురెదురుగా నిలబడి వుండిపోయారు.. కిరణ్మయి పెదవులు పలకడంలేదు కానీ మనసుమాత్రం కృష్ణా ప్రవాహంలాగా రవితోటి బిరబిరా అనేకమైన కబుర్లు చెప్పేస్తోంది.  తన చూపులు కిందకి దింపి తన చేతులని పట్టుకుని హుందాగా నిలుచుని వున్న రవి చేతులనే గమనిస్తోందామె.  అవే దృఢమైన చేతులు... ఒకప్పుడు కృష్ణానదిలో మునిగిపోబోయిన తనకి ప్రాణభిక్షపెట్టిన అందమైన చేతులు... ఇవాళ ప్రేమగా నీతో నేనున్నానని దైర్యాన్నిస్తూ తన చేతులని పదిలంగా పట్టుకొనివున్నాయి... కిరణ్మయి అప్రయత్నంగానే రవి చేతులను పైకి తీసుకుని తన బుగ్గలకు హత్తుకుంది. తన తండ్రి పక్కన ఉన్నాడనే విషయం మర్చిపోయి అతని భుజంపై, అప్పటిదాకా మోసిన ఏదో దయ్యపుబరువు దించేసుకున్నదానిలాగా వాలిపోయి హాయిగా బావిస్తూ కనులు మూసుకుంది... అప్పుడు పలికాయామె పెదవులు... "అయామ్ సచ్ ఎ ఫూల్ రవీ... ఐ షుడ్ హావ్ నోన్ యు బెటర్... బట్ నతింగ్ మేటర్స్ నౌ... ఐ లవ్ యు.. అండ్ ఐ వాంట్ యు ఫర్ ఎవర్ అండ్ ఎవర్... డోంట్ యు ఎవక్ లీవ్ మి అలోన్ అగైన్" అంటూ మధురంగా కనులు మూసుకొని పలికింది.  రవికూడా "ఐ లవ్ యు టూ కిరణ్" అని పలుకుతూ ఇక నిన్ను ఇక ఎక్కడికీ పోనివ్వను అన్నట్లుగా తన చేతి పట్టును కిరణ్మయి చుట్టూతా మరింతగా బిగించాడు.

"అదేమిటి.. మీ ఇద్దరికీ ఇంతకు ముందే పరిచయం ఉందా!"  వాళ్లిద్దరూ అంతగా ఒకరిమీద ఒకరు వాలిపోవడం చూసి ఆశ్చర్యపోతూ అందులోనూ తన కూతురు రవి తోటి ఐ లవ్ యు అని చెప్పడం చూసి ఒక విధంగ సంబరపడిపోతూ అడిగారాయన.

అప్పుడు  తన తండ్రి అక్కడే ఉన్నాడని గుర్తువచ్చి ఈ లోకంలోకి వచ్చి సిగ్గుగా రవికి కొంచెం దూరంగా జరిగింది కిరణ్మయి.  ఆమెను దూరంగా పోనివ్వకుండా మళ్లీ దగ్గరకి లాక్కుంటూ "సర్ మీరు నన్ను అడిగారుకదా మీ అమ్మాయి కిరణ్మయిని చేసుకొమ్మని... ఇప్పుడే చెప్పేస్తున్నాను. మీ కిరణ్మయి అంటే నాకు ఇప్పుడుకాదు నా చిన్నప్పట్నుంచీ ప్రాణం.  తను నా భార్య అయితే నాకంటే అదృష్టవంతుడు ఈ ప్రపంచంలో ఇంకొకరు లేరనుకుంటాను." అని అన్నాడు రవి...

"మీ ఇద్దరికీ చిన్నప్పిట్నించే పరిచయం వుందా... మరి ఆ విషయం నాకెందుకు చెప్పలేదు  మీ ఇద్దరికీ ఎలా పరిచయం?" కుతూహలంగా అడుగుతున్న చౌదరిగారి మాటలను మధ్యలోనే ఆపుచేస్తూ.   "నాన్నా! నేను నీకు అంతా వివరిస్తాను. కానీ ఒక చిన్న రిక్వెష్ట్.  నన్నూ రవినీ ఒక అరగంట పాటు వదిలెయ్యండి.  నేనూ రవీ గాల్లో విమానంలో తిరుగుతూ సరదాగా మాట్లాడుకోవల్సింది బోల్డంత వుంది. వియ్ హావ్ టు కాచప్ ఎ లాట్" అని కొంటెగా అంటూ  రవి చెయ్యి పట్టుకుని ఇంకా అక్కడే ఆగివున్న  రవి విమానంవైపుకు లాక్కుంటూ వెళ్లింది కిరణ్మయి.  ఆ ప్రేమ పక్షులను  ఎక్కించికుని గాల్లో సరదాగా ఎగిరిపోయిందా విమానం....

********* శుభం **********