Total Pageviews

Monday 3 February 2014

సుభాషితం: దైవఘటన

పంచైతాని మహాబాహో కారణాని నిబోధ మే ! సాంఖ్యే కృతాంతే ప్రోక్తాని సిద్ధయే సర్వకర్మణామ్||అధిష్ఠానం తథా కర్తా కరణం చ పృథగ్విధమ్ ! వివిధాశ్చ పృథక్ చేష్టా దైవం చైవాత్ర పంచమమ్ !! శరీరవాజ్మనోభిర్యత్ కర్మ ప్రారభతే నరః ! న్యాయ్యం వా విపరీతం వా పంచైతే తస్య హేతవః !! భగవద్గీత 18: 13,14,15

అర్జునా ! సర్వకర్మలసిద్ధికి ఐదు కారణములున్నాయంటూ కర్మలను అంతముచేయు ఉపాయాలని తెలుపే సాంఖ్యశాస్త్రంలో పేర్కొనబడ్డాయి. వీటి గురించి చెబుతాను విను... కర్మల సిద్ధియందు అధిష్ఠానమగు దేహము , పనిచేసేవ్యక్తి (కర్త), వివిధములైన జ్ఞానేంద్రియకర్మేంద్రియాలు, నానావిధమైన చేష్టలు (కర్మలు).... కానీ ’దైవము’ అనునది అక్కడ ఐదవ కారణం.. మానవుడు మనోవాక్కాయములచే ఆచరించు శాస్త్రానుకూలమైన లేక శాస్త్ర విరుద్ధమైన విపరీతమైన యేకర్మలైనాసరే ఈ యైదిటి కారణంగానే నడుస్తాయి!


ఇందులో ’దైవం చైవాత్ర పంచమం’ అంటే ’Fifth Element' అనేదాన్ని మన హైందవ పూర్వీకులు విపరీతంగా నమ్మేవారు. ఇదుగో మనం చేసే పూజలన్నీ ఈ ’దైవానికే’ -- ఈ దేవుని ఇచ్చనే ’భగవదేఛ్ఛ’ అంటాము... మనకు అనుకూలంగా (న్యాయంవా) లేదా ప్రతికూలంగా (విపరీతంవా) జరిగే సంఘటనలన్నింటి వెనుకా ’దైవం చైవ అత్ర పంచమం’ ఇది తెలుసుకుని నడుచుకోగలిగిన మానవుడు చీకూచింతాలేకుండా నిర్భయంగా ప్రవర్తించగలుగుతాడు. జీవితాన్ని అనుభవించగలుగుతాడు అని మనకు ఋషులు బోధించారు.

జీవితంలో మనందరికీగూడా అనేక ఘటనలు ఎదురవుతుంటాయి. కొన్ని మంచి కొన్ని చెడు... ఒక్కోసారి అవి తీవ్రమైన బాధని కలిగిస్తాయి, భగవంతుని పట్ల మన విశ్వాసాన్ని శంకించేటట్లు చేస్తాయి. అదిగో అప్పుడే నిజమైన విశ్వాసానికి పరీక్ష.

ఉదాహరణగా నిజంగా జరిగిన ఒక సంఘటనగూర్చి చెబుతాను... నాకు అతి దగ్గరగా తెలిసిన వ్యక్తికి 2000 సంవత్సరంలో జర్మనీనుండి, అమెరికానుండి రెండు దేశాలనుండి ఒకేసారి ఉద్యోగావకాశాలు వచ్చాయి. అతడు అమెరికా వెళ్లాలనుకున్నాడు. అమెరికా ఉద్యోగం వీసాకోసం చెన్నైలో అప్లికేషన్ పెడితే వాళ్లు ’ఫ్రాడ్ ప్రివెంషన్’ అనే నెపంపై ఇతడికి వీసా ఇవ్వడాన్ని చాలా ఆలస్యం చేసారు. ఈ లోపల అతడేమో ’నాకు అమెరికా వీసా రావాలి’ అని హోమాలు చేయించాడు, తిరుపతి వెళ్లి గుండు గీయించుకున్నాడు, అనేగ గుడుల ప్రదక్షిణలు చేసాడు, జ్యోతిష్కులను సంప్రదించాడు, తాయెత్తులను కట్టుకున్నాడు.. అలా మొక్కుకోని దేవుడు లేడు! కానీ అమెరికా వీసా ఎంత ఎదురుచూసినా ఎన్ని తపస్సులుచేసినా రాలేదు.

దాంతో ’దేవుడనేవాడున్నాడా .... అని మనిషికి కలిగెను సందేహం!’ అని విషాదపు పాటలు పాడుకుంటూ దిగులుగా గాలితిరుగుడు తిరగడం మొదలుపెట్టాడు... చివరకి అతడి అమెరికా పిచ్చి ఎంతదూరం వెళ్లిందంటే అతడు ఏసుక్రీస్తుకు, అల్లాకు గూడా ప్రార్ధనలు సమర్పించాడు... కానీ వీసా ఇంకా రాలేదు... నెలలుగడిచిపోతున్నాయి.... అటుపక్క జర్మనీదేశంలో మాత్రం ఉద్యోగం రెడీగా ఉంది. దాంతో ఉన్న అవకాశాన్ని ఎందుకు పోగొట్టుకుంటావు అని ఎవరో పెద్దలు సలహాఇస్తే సరే అనుకుని చేసేది లేక అమెరికా వెళ్లే అవకాశం రాక జర్మనీ వీసా అప్లికేషన్ పెట్టాడు. మర్సటిరోజే వీసా వచ్చేసి అతడు జర్మనీ వెళ్లిపోయాడు. తనకి అమెరికా వీసా రానందుకు చాలా దిగులుపడి తను నమ్మిన దేవుడిని నానా తిట్లూ తిట్టుకుని జర్మనీలో ఉద్యోగం మొదలుపెట్టాడు.

ఇంతలో అమెరికాలో ఒక ఘోరం జరిగింది! సెప్టెంబరు 11 వ తారీకున వరల్డ్ ట్రేడ్ సెంటర్ లో మూడువేలమంది చనిపోయారు. ఇతడికి అమెరికాలో ఉద్యోగం ఇచ్చిన కంపెనీ ఆ వరల్డ్‌ట్రేడ్ సెంటర్ లోనే ఉంది. అంటే ఒకవేళ ఇతనికి అమెరికా వీసా వచ్చి ఉంటే మాత్రం ఖచ్చితంగా ఆ దుర్ఘటన జరిగినరోజు వరల్డ్‌ట్రేడ్ సెంటర్ లో ఉండి ఉండేవాడు, బహుశా ప్రాణాలు పోగొట్టుకుని ఉండేవాడు. పైగా ఏ కంపెనీ అయితే ఇతడికి ఉద్యోగం ఇచ్చిందో ఆ కంపెనీ ఉద్యోగస్తులు చాలామంది ఆరోజు దుర్ఘటనలో మరణించారు. ఆ తర్వాత ఆ కంపెనీ మూతపడిపోయింది. అంటే ఇతడికి వీసా వచ్చి ఉంటే ఒకవేళ మరణం సంభవించి ఉండేది, లేదా ఒకవేళ అదృష్టవశాత్తూ బ్రతికినా వెళ్లిన నాలుగునెలలకే ఉద్యోగం పోగొట్టుకుని నానా కష్టాలూ పడి ఉండేవాడు. అందుకే అతడి ప్రార్ధనలు ఫలించక అతడికి అమెరికా ఉద్యోగం రాలేదు!

అందుకే దైవఘటన అనే దానిపట్ల మనం నమ్మకం పెట్టుకోవాలి. అడిగినవన్నీ ఇచ్చేవాడైతే ’దైవం’ అనిపించుకోడు! దైవం అంటే మనకి ఏది కనబడదో దాన్ని ఎరిగినవాడు, మన గమ్యం ఏంటో మనకంటే స్పష్టంగా ఎరిగినవాడు భగవంతుడు... "ఉత్పత్తించ వినాశంచ భూతానాం ఆగతాం గతిః వేత్తి విద్యాం అవిద్యాంచ సవాచ్యో భగవానితి" జీవుల ఉత్పత్తి వినాశనాలు, వచ్చి వెళ్లే దారులు, విద్యలు అవిద్యలు అనే ఆరిటిగురించి అత్యంత విశదంగా ఎరిగినవాడే భగవంతుడు... అతడే దైవం!

పూర్వం ఒక రాజుగారి వద్ద చాలా నమ్మకస్తుడైన తెలివితేటలుగలిగిన మంత్రి ఉండేవాడు. అతడు ఏం జరిగినా అది దైవఘటన ‘భగవదేఛ్ఛ‘ అంటూండేవాడు. ఒకరోజు రాజు మంత్రీ ఇద్దరూ కలిసి వేటకు వెళ్లారు. ఇద్దరూ దారితప్పి అడవుల్లో ఎక్కడో లోపలికి వెళ్లిపోయారు. వాళ్లిద్దరే ఇక చుట్టుపక్కల సైనికులు ఇంకెవ్వరూ లేకుండా ఉన్నారు. ఇంతలో ఒక పులి ఎక్కడ్నించి వచ్చిందో హఠాత్తుగా పొదల్లోంచి బైటికి దూకి రాజుగారి చేతిని తీవ్రంగా గాయపరిచింది. రాజుగారు మంత్రిగారు కలిసి తీవ్రంగా పోరాడి మొత్తానికి ఆ పులిని చంపేసారు. కానీ రాజుగారి చేతివేళ్లు రెండు తెగిపోయాయి. ఆయన చాలా బాధలో ఉంటే మంత్రిగారు కట్టుకడుతూ ‘భాధపడకండి రాజా! అంతా ‘భగవదేచ్చ‘ ఇవాళ మీ చేతివేళ్లు తెగి మీరు బాధపడుతుండచ్చు. కానీ మీకు కలిగిన ఈ నష్టంలో భగవంతుడు ఎక్కడో లాభాన్ని పెట్టాడు‘ అన్నాడు. అసలే బాధలో ఉన్న రాజుగారికి ఈ మంత్రి వేదాంతం విని ఒళ్లు భగభగా మండిపోయింది. చాలా కోపం వచ్చి ఆ మంత్రిని అక్కడే ఉన్న పాడుబడ్డబావిలో తోసేసి ఆ మంత్రి పైకి రాకుండా ఎవరినీ పిలిచి సహాయం అడక్కుండా ఒక పెద్ద బండరాయి అడ్డంపెట్టి అక్కడ్నుండి వెళ్లిపోయాడు. పాపం మంత్రి ‘మా రాజుగారికి నామీద కోపం రావడంగూడా భగవదేఛ్ఛ మాత్రమే‘అని మనసులో అనుకున్నాడు. ‘ఎలాగూ నన్ను రక్షించేవారు రారు, ఎలాగూ చనిపోతాను, కాబట్టి ఎప్పట్నించో చేద్దామనుకున్న లక్షకోటి గాయత్రీ జపం చెయ్యడానికి ఇదే మంచి సమయం‘ అనుకుని హాయిగా ఆ పాడుబడ్డబావిలో ధ్యానంలో మునిగిపోయాడు.

అదే అడవిలో కొందరు ఆటవికులు నివసిస్తున్నారు. వాళ్లు తమ కులదేవతకు నరబలి ఇవ్వాలని వెదుకుతుంటే ఒంటరిగా వెళ్తున్న రాజు కనబడ్డాడు. దాంతో వాళ్లు ఆ రాజును బందీగా పట్టుకుని బలి ఇవ్వడానికి సిద్ధం చేసారు. ‘అయ్యో! భగవంతుడి పేరును నిత్యం జపిస్తూ తన కర్మయోగాన్ని తను చేస్తున్న నా మంత్రిని నిర్దాక్షిణ్యంగా బావిలో తోసాను, అందుకే నాకు ఈ ఖర్మపట్టింది‘ అని ఆ రాజు తన మనసులో చాలా దుఃఖిస్తూ బలిపశువుగా రాబోయే కత్తివేటుకోసం సిద్ధంగా కూర్చున్నాడు. ఇంతలో ఆ ఆటవికుల కులగురువు అక్కడికి వచ్చి బలి ఇవ్వబోతున్న వ్యక్తిని నఖశిఖపర్యంతమూ పరీక్షించాడు. రాజు కుడిచేతికి రెండువేళ్లు లేకుండా ఉండడం చూసి ‘శరీరావయవాలు పూర్తిగా లేని నరుడు బలికి పనికిరాడు కాబట్టి వదిలెయ్యండి అని ఆజ్ఞాపించాడు‘. దాంతో ఆ ఆటవికులు ఆ రాజును ఎక్కడ పట్టుకున్నారో అక్కడికి తెచ్చి వదిలేసారు.


దాంతో రాజుకు జ్ఞానోదయం అయింది. "ఆ పులిగానీ నా మీదపడి నా చేతి వేళ్లు తీసేసి ఉండకపోతే ఇవాళ నన్ను ఆ ఆటవికులు ఖచ్చితంగా బలిచ్చి ఉండేవారు. నా ప్రాణాలు ఖచ్చితంగా పోయి ఉండేవి. నిజంగానే మా మంత్రిగారు చెప్పిన మాటలు సత్యం అయాయి. చేతివేళ్లు రెండు తీసుకుని పూర్తిప్రాణాలు నిలబెట్టాడు దేవుడు... ఇది ఖచ్చితంగా భగవదేఛ్ఛ" అని సమాధానపడి పశ్చాత్తాపపడి తిరిగి ఎక్కడడైతే మంత్రిని బావిలోకి తోసాడో అక్కడికి తిరిగి వచ్చి మంత్రిగారిని బావిలోనుండి పైకి తీసాడు. "మంత్రిగారూ మిమ్మల్ని అనవసరంగా అవమానించినందుకు క్షమించండి. మీరన్నట్లు భగవదేఛ్ఛవల్లే నా ప్రాణాలు ఇలా కాపాడబడ్డాయి" అని చెప్పి మంత్రిగారిని ఆలింగనం చేసుకున్నాడు. మంత్రిగారుగూడా చాలా సంతోషించి. "రాజా మీరు నన్ను బావిలో తోయడం గూడా భగవదేఛ్ఛే! నరబలి ఇవ్వడం కోసం వెదుకుతున్న ఆటవికులు శరీరంలో రెండువేళ్లు లేని కారణంగా మిమ్మల్ని వదిలేసారు, కానీ పూర్తి అవయవాలన్నీ భేషుగ్గా ఉన్న నన్ను పట్టుకుని మాత్రం బలిచ్చి ఉండేవారు - చూసారా నాకు మీపట్ల అపకారం జరిగిందని మీరనుకుంటున్నారు. కానీ నాకు మాత్రం ఉపకారమే జరిగింది అని అన్నారు. అలా రాజు మంత్రి తిరిగి రాజ్యానికి చేరుకున్నారు. అలా కధ ‘భగవదేఛ్ఛ‘ వలన సుఖాంతం అయింది.

స్వస్తి! - మాధవ తురుమెళ్ల, లండన్, యుకె

No comments:

Post a Comment