Total Pageviews

Showing posts with label కవితలు. Show all posts
Showing posts with label కవితలు. Show all posts

Saturday, 25 January 2014

కవిత: పొలిటికల్ కరపత్రిక

పొలిటికల్ కరపత్రిక
---

ఎక్కడో
మస్తిష్కంలో మూలలో దాగిన
ఒక మాటకి అందని మౌనానికి-
తిరస్కృత పరిష్వంగానికి
తిమిరనిరంకుశ నిశీధికి
తితీక్షకు, తీతువుపిట్టకు,
హాలాహలానికి హాహాకారానికి
అవినాభావ సంబంధం ఉన్నదని -
ఒక మునికి జ్ఞానోదయమైంది.

వెలిగించండి మెదడుల్లో కాగడాలను
తొలగించండి జ్ఞానేంద్రియ కవాక్షాల కెరటాలను
చల్లండి బతుకువీధుల్లో పాపప్రక్షాళితంగావించే పావనగంగను....

రేపొక మహోదయం కాబోతోంది
అకించనితయై 
అనారోగ్య 
రక్కసి కాటేస్తున్న కన్నపేగును
పసిపాపను పొత్తిళ్లలో ఎత్తుకున్న తల్లి
ముసిముసి నవ్వులు నవ్వబోతోంది....
పూటతిండికి నోచుకోని దౌర్భాగ్యపు ముసలి ఒకతె
రేపు భారతదేశం నాది అని గర్వపుగీతిక పాడబోతోంది.

రోపొక మహోదయం కాబోతోంది.

[రేపు రిపబ్లిక్‍ డే కదా.....!!!!! ]
-మాధవ తురుమెళ్ల 25/1/2013

Sunday, 1 September 2013

కవిత - పడకకి రాని నిద్ర



పడకకి రాని నిద్ర
===========
పడకకి రాని నిద్ర
అలిగిన ప్రియురాలికంటే
ఎక్కువగా బాధిస్తుంది..!
విసుగుని కళ్లలో
చిరాకును నొసట్లో నింపేసి - 
అహ్లాదమనే బిడ్డని కనే
అవకాశం లేకుండా చేస్తుంది...

నిద్రరాని ప్రతిరాత్రి
బలవంతంగా విడాకులకు గురైన
భర్తలాగా అంతరంగంలో బాధ..!

నిద్ర పడకకి రాని పతిరాత్రీ
వెలయాలిని ఆశ్రయించిన విటుడిలాగా
పుస్తకమో -
సంగీతమో -
టీవినో,
మరింత ముదిరిన వేశ్యా వ్యసనంలో -
నిద్రమాత్రలో బ్రాందీసీసానో
ఏదో ఒకదాన్ని ఆశ్రయించి
బలవంతంగా నిద్రతో రమించి,
మర్సటిరోజు మామూలుగానే
రాత్రి ఏమీ జరగనట్లు మొహం..|

మనిషికి రాని నిద్ర
మరణంతో సమానం,
కానీ విచిత్రం -
మరణం మాత్రం
అదేంటో శాశ్వతమైన
నిద్రలాగానే భ్రమింప జేస్తుంది...

-మాధవ తురుమెళ్ల

Monday, 19 August 2013

కవిత: పడవ ప్రయాణం

పడవ ప్రయాణం

ఓ నావికుడా ఈ 
ప్రపంచం ఒక మహాసముద్రం 
నేను ఒంటరి ప్రయాణీకుడిని.

నీవొక్కడివే నాకు తోడు నీడ... 
నేను నమ్మిన నావికుడా!
నా ప్రియబంధువా!
నన్నీ సముద్రాన్ని- 
దాటించి శాంతి తీరానికి చేర్చు.
నేను నీ ఆశ్రితుడిని,
నిన్నే శరణన్నవాడిని!

నేను నమ్మిన నా దైవమా!

నా నావ నీటిలో ఉండేట్లు చూడు
కానీ
నీటిని మాత్రం
నా నావలో ఉండేట్లు చూడకు...

ప్రపంచాన్ని నా పడవలో చేర్చి
నా ఆత్మను నడి సముద్రంలో ముంచకు...

-మాధవ తురుమెళ్ల

Saturday, 3 August 2013

దృశ్యం - కవిత

దృశ్యం

ఒక్కోసారి ప్రకృతిలో  దృశ్యాన్ని చూసి
అంతరంగం
అద్భుత అచేతనత్వాన్ని పొందుతుంది.
మేనంతా పులకించి
మనసును లయంచేసి
మనిషిని మహర్షిలా మారుస్తుంది....

కవిర్మనీషీ పరిభూస్వయంభూః....

దృశ్యలీనిత నిశ్శబ్దానికి
ఇంక వేరే అర్ధాలేవీ ఉండవు.
అద్వైతభావనలో మునిగిన పెదవులు అరవిందాల్లా విచ్చుకున్నా -
మాటల సీతాకోకల్ని తమపై వాలనివ్వవు
దృశ్యాన్ని కొలవనివ్వవు,

తెలిమబ్బు కిరణం,
పురివిప్పిన నెమలి,
సముద్రంలోంచి ఉదయిస్తున్న సూర్యుడు,
తనని తానర్పించుకుని ప్రియుడి గుండెలపై నమ్మకంగ  -
ఒదిగి గువ్వపిట్టలా నిద్రిస్తున్న అలిసిన ప్రియురాలి మోము,
నిద్రించే పసిపాపన ముసిముసి నవ్వులు,
వసంతంలో చిగురించిన అడవి
అన్నీ దృశ్యాలే!

దృశ్యాన్ని చూసిన -
మహర్షి హృదయంలో
అవ్యక్తభావమేదో
మౌనరాగాలు పలుకుతుంది,
విచ్చుకున్న కన్నుల్లోని కాంతి దృశ్యాన్ని  స్పష్టంగా సృజిస్తూ
నిశ్శబ్దంగా నీరాజనం పడుతుంది.

-మాధవ తురుమెళ్ల

Thursday, 1 August 2013

నా కోరిక - కవిత


చీమలు పెట్టిన పుట్టలో
పాములు చేరుతున్నాయి.
సాకలేని కోకిల
కాకిగూటిలో తనబిడ్డని వదుల్తోంది.
కురవని మేఘం
తన నల్లదనంతో నేలను -
నమ్మిన రైతును మభ్యపెడుతోంది.
ముద్దొచ్చే గులాబీ ముళ్లకంపలో దాక్కుంది.
పతితపావనమైన గంగలో బండరాళ్లే మునిగున్నాయి.

కొందరు అనూచానంగా -
వంచన, కర్కశత్వం, నిర్దయత్వం
ఇవేనా  ప్రకృతిధర్మాలు అని ప్రశ్నిస్తున్నారు.

ఎందుకో తెలియని మాయ!
ఆత్మలో లయమై త్వమేవాహం అనాల్సిన మనిషి
తనలోపల లోలోపల
ఎక్కడోదాగిన
అరిషడ్వర్గాల ఆరాటాల్లో మునిగి
తన ప్రకృతిని తానే బలాత్కరిన్నాడు...

కొందరు
శూన్యత ముసుగు కప్పుకుని
విషాదపు చెలమలవద్ద
ఆశ్రువులతో స్నానం చేస్తున్నారు...

మరికొందరు
పోరాటపు జెండాకింద నిలబడి
తమ రుధిరంతో తామే వీరతిలకం దిద్దుకుంటున్నారు,
తమ సమాధుల్లో తామే స్వచ్చందంగా ఆడుగుపెడుతున్నారు...

కానీ నాకు
గతిస్తున్న కాలాన్ని
స్తుతిస్తున్న తాత్వికులనీ,
నిర్భయత్వంతో నడిచే నిజాయితీపరుల్నీ,
అలసిపోని గొంతుకతో
ఆత్మవిశ్వాసపు గీతిక పాడెవారినీ
ఇంకా
మహర్షులను, మమతనందించేవారినీ,
నిజమైన మానవులనీ
చూడాలని నిజంగా కోరికగాఉంది...
వీరు ఎప్పుడో ఒకప్పుడు
ప్రపంచగమనాన్ని
మారుస్తారని ఏదో
అంతు తెలియని ఆశ - నాలో దాగుంది...

-మాధవ తురుమెళ్ల
---ఽఽఽ----

Saturday, 27 July 2013

కవిత - రివర్స్ మెటమార్ఫిసిస్



సీతాకోకచిలుకలు కొల్లలు కొల్లలుగా
చెట్టుచెట్టుకూతిరుగుతూ ఆటలాడుతున్న బడిపిల్లలు.
ఆ పక్కనే మురికిగుంటపక్కన
ముడుచుకుపోయి కూర్చున్న ఒక ముసలి
అతడిని కర్కశంగా వదిలేసిన బిడ్డ.....
పిల్లలు పెద్దలౌతారు
కానీ -
రివర్స్ మెటమార్ఫిసిస్ లో  గొంగళి పురుగులవుతారా?!

-మాధవ తురుమెళ్ల

Wednesday, 24 July 2013

కవిత- శరణుగీతం

కవిత- శరణుగీతం



ఈ నది -
చాలా భయంకరంగా ఉంది!
అక్కడక్కడా సుడిగుండాలతో -
అయోమయాన్ని సృష్టించే నల్లని గుండ్రని వలయాలతో,
నురగలు కక్కుకుంటూ నడుస్తోంది...
ఎప్పుడో ఎక్కడో వడలిపోయి నిస్సహాయంగా -
రాలిన ఎండిన మోడులనీ, మోడుల్లాగామారి తేలుతూ వస్తున్న శవాల్ని
అమాంతంగా కావులించుకుని ,
భీభత్సానికి మారుపేరైన  కాలభైరవునిలా భయంగొల్పుతోంది...

చెట్లువిదిల్చేసిన పూలని,
ఎవరో భక్తులు  తొమ్మిదిరోజులు
పూజించి నెత్తికెక్కించుకుని నైవేద్యాలిచ్చి
చివరకి తమకేమీ పట్టనట్లు
ఏట్లో కలిపేస్తూ విసర్జించిన వినాయకులనీ,
ఏ ఆసరా దొరక్క తనఅనేవారు దయచూడక -
నదిలోదూకి ఆత్మహత్యచేసుకున్న అసహాయులు ఆడపిల్లల్నీ,
పసితనపు సరదాతో ఈతకొట్టడానికి దిగి
సుడిగుండాల్లోచిక్కుకు మరణించిన చిన్నిపిల్లల్నీ,
కాన్పునిచ్చి కన్నపేగునిచ్చి కని
పెంచలేక నదిలో వదిలిన శిశువులను,
అ శిశువులను నిర్దాక్షిణ్యంగా నలుచుకుతినే శిశుమారాల్ని,
గుడ్డిభక్తితో తమచావు యాత్రచేయడానికి వచ్చిన
లెక్కకు మిక్కిలి భక్తులను తన వరదల్లో కబళిస్తూ
సాగిపోతున్న ఈ నది - కరాళనృత్యం చేస్తోంది...

భయంకరపు జీవనం నది...
భీభత్సపూరితం నది...

ఒక్కోసారి
నాకనిపిస్తుంది -  జీవితమే ఈ నది!
ఈ నదికి జీవితానికి ఒక అస్పష్టమైన పోలిక!
నాభావాలలో కనిపించి నన్ను సృజించి
నన్నేడిపించి నన్ను నవ్వించి నన్ను ప్రశ్నించి
పీడకలలాంటి నిద్రలో నన్ను ఉలిక్కిపడేటట్లు చేస్తుంది.

హటాత్తుగా మెలకువ వచ్చిన నేను
నిశ్శబ్దంగా ప్రార్థిస్తుంటాను...
శరణుగీతం పాడుతూంటాను...

ప్రభూ,
ఈ నదిపై చూసావా!
ఒక తెరచాప పడవ నిశ్శబ్దంగా సాగిపోతోంది...
కానీ పడవకి గమనాన్నందిస్తూ
మహత్తులాగా
ఒక బలమైన గాలి వీస్తోంది.
కనబడకుండా, హోరెత్తిస్తూ, శరీరాన్ని
ఆహ్లాదపరిచే చల్లని గాలి వీస్తోంది.
అప్పుడప్పుడూ మనసును మత్తెక్కించే సుగంధాన్ని
తేలుస్తూ తెస్తోంది...
చుట్టుపక్కలే నదిలో నర్తిస్తున్న
భయంకరదృశ్యాలను మరుగునపరుస్తూ నన్ను స్వాంతనపరుస్తోంది.

ప్రభూ,
నీ చల్లని అమృత స్పర్శలే ఆశీస్సులే ఆ గాలి
నా పడవను నిశ్శబ్దంగా నెడుతూ ‘నే‘నున్నాననే
నీపట్ల నాకు త్వమేవాహమనే నమ్మకాన్ని కల్గిస్తోంది.

నీ నిశ్వాసం సోకిన నేను నమ్మకస్తుడిగామారాను
నీవు దయతో చిలికించిన
ఆత్మవిశ్వాసపు అమృతవర్షాంబుదులని త్రావిన
నేను - నావికుడిగా మారాను,
నా పడవ చుక్కానిని  అందుకున్నాను,
నా నౌకను గమ్యంవైపు నడుపుకుంటున్నాను.

అందుకే  ప్రభూ, నేను నిర్లజ్జగా చెబుతున్నాను,
నేను నీదయపై నివసిస్తున్నాను...
నీకు పదేపదే నమస్కరిస్తున్నాను...

-మాధవ తురుమెళ్ల


Sunday, 3 March 2013

ఒక మేనక అన్నది



ఒక మేనక అన్నది

రాత్రికి రహస్యం పోదు
పగటికి పచ్చిదనం రాదు...
ప్రాక్పశ్చిమ దిశల సమావర్తనం కొలవడం దేనికి
చుట్టూచూస్తే అనుభూతికి తెలియడంలేదా ఈ భూమి గుండ్రమని!
కళ్లువిచ్చిచూస్తే తెలిసే
సృష్టిరహస్యాన్ని కన్నులుమూసి కనుక్కోవాలనుకునే
ఓ పిచ్చిబాపడా!
నీకు తెలుస్తోందా నీవేం పోగొట్టుకున్నావో!

రా...
నీకొక కౌగిలింతల స్వర్గం చూపించి
నీకు తపోభంగం చేస్తాను
నిన్ను నాలోకి చేర్చుకుని -
అద్వైతం అంటే ఏంటో నిజంగా బోధిస్తాను.
నా కళ్లలోకి చూడు
నీలినీడలవెనుక తేలుతున్న కాంక్షా విహంగాలను చూడు...

ఈ చలిలో ఈ ఉషస్సులో
ఏ స్వర్గాన్ని కోరి నీకీ తపస్సు
నీ ఉనికిని పూర్తిగా మాయంచెసే
ఏ మోక్ష పరిష్వంగంకోసం నీకీ తమస్సు
రా...
నా విరహపు నిట్టూర్పుల
వెచ్చని మేఘాలను నిన్నావరింపజేసి
నీకు నా శరీరాన్ని చలిమంట చేసి
నా యోగాగ్నిలో నీకు ఆహుతులిస్తాను
నీకిక ఏ స్వర్గమూ వద్దనుకునేటట్లుగా చేస్తాను.

******
 --మాధవ తురుమెళ్ల


Wednesday, 20 June 2012

Tuesday, 24 April 2012

అమ్మలగన్నయమ్మ


కం. అమ్మా, నీబిడ్డనునే
      నమ్మా! మాటల సొబగుల నిమ్మా! దయజూ
      డమ్మా! కాదన కమ్మా!
      సన్మా ర్గములో నడుపుమ! శారద! వాణీ!

కం. మెచ్చావట బుధ జనులను
      ఇచ్చావట సకల శుభము నిశ్చల మనమున్
      వచ్చావట వాగ్రూపిగ
      తెచ్చావట కీర్తిసుఖము తెలుగుల వాణీ!

కం. వలదని చెప్పిన వినదిక
     కలవరమున పలవరించు కలతల మనసున్
     నిలవదు నీధ్యానములో
     కొలవదు నిను నిరతరంబు కావుము వాణీ!

కం. చూడాలని నీరూపము,
      వేడాలని నిన్నునేను వెయ్యి విధములన్,
     పాడాలని నీ గుణములు,
     యాడాలని నీ ముంగిట! యాశలు తల్లీ!

కం. నాకూ యున్నది గోరిక
      నీకూనొకమారు పూజ నిజముగ జేయన్!
      రాకూడద మాయింటికి!
      చేకూడద మేలు నాకు జేజీ! వాణీ!

ఉ.  వాణివిగా పితామహుని రాణివిగా విభులేలు బాటలో
     వాణివిగాగ లోకముల పద్యములెన్నియొ వేలువేలు పా
     రాణిగ మారెనీకు! మృదుహాసిని చేకొనవమ్మ దాసుడీ
     ప్రాణములున్న మాధవుని ప్రార్థన వేల్పులవాణి భారతీ |

                                                                   - మాధవ తురుమెళ్ల 24th April 20112

Monday, 26 March 2012

భోజ్యానాయక్ మరణం


భోజ్యానాయక్ మరణ చిత్రాన్ని నిన్న నాకెవరో పంపించారు... చూసి నా మనసు చలించిపోయింది... ఎందుకీ యుద్ధాలు బలవన్మరణాలు వాళ్లడిగిన రాజ్యం వాళ్లకు ఇచ్చెయ్యగూడదా అని నా మనసు నాలుగు పద్యాలు పలికింది వాటిని ఇక్కడ ఇస్తున్నాను...

భోజ్యానాయక్ మరణం
============
పద్యరచన: తురుమెళ్ల మాధవ '26 మార్చి 2012'
...
మ.
మరపో మారిన రాజ్యమో ఎవరి లాభంబీ తెలంగాణమో
కరవై పోయెన రాజమా ర్గముల యోకారు ణ్యమేలేదహో
మరణా న్నావహ మేలజే యవలె? యామంటల్బడెన్గాలె! యే
షరతుల్బెట్టక యేల నేగవలె భోజ్యానాయకుండ క్కటా!

చేతికందిరావాల్సిన ఆ బిడ్డని పోగొట్టుకున్న ఆ తల్లి మనసుగూర్చి ఆలోచిస్తే....

కం.
కాడా బిడ్డడు యమ్మకు?
లేడాయని బాధపడద రేతిరి పగలున్?
చూడాలనుకొని బిడ్డను
వేడాలనుకొను తనకిక వేదనె మిగిలెన్!

కం.
బాధిత వర్గపు కోరిక
శోధిత మున్జేయ దలువర సోదరు లెవరూ?
వేధిత పామర జనములు
వీధిన పడియున్నతీరు విశదము గాదా!

ఉ.
చిందరవందరై నటుల చించిన విస్తరి తీరుతెన్నుగా
ఎందుల కీయుద్ధ మసలు? ఎవ్వని రాజ్యము లేవిబోవునో!
వందల వేలసంఖ్యలుగ వీధినబోవుచు వాదులా డగా
తొందరలేదు లేదనుచు తోచిన రీతిన జాగులేలనో!

కం.
సోదరులేగద చూడగ
వాదనపడు వారు తెలుగు వారలు గారా!

రోదన కూడదు వారిని
వేదన బాల్జే యవద్దు వేరు పడెదమో... 


కం.
చాలిక ఈ మరణంబులు
పోలికలేనిది జగడము పోనీరాదా!
వాళ్లిక అడిగిన రాజ్యము
వాళ్లకు ఇచ్చెయ్యమనుచు వినతుల జేతున్!

------xxx-----

Tuesday, 20 March 2012

ఒక మధుర క్షణం



నిశిరాతిరి కాటుక కళ్ళు నవ్వితే ఒలికినట్లున్న నక్షత్రాలు
కొంచెం బిడియంగా చుట్టుకున్నట్లున్న పల్చటి వెన్నెల చీరలో
దాచాలని ఎంత ప్రయత్నంచేసినా దాగని అందాలు...
సృష్టి రహస్యాలను
చెవుల్లో గుసగుసలుగా చెప్పే
పిల్ల తెమ్మెరల మంద్రద్వ్హనులలో,
నునుసిగ్గుగా -
నా గుండెచప్పుడు నేపధ్యంగా
నాలో నిశ్శబ్దంగా ఆలాపించబడుతున్న ప్రేమ గీతం...

వికసించిందో, పుష్పించిందో, అహ్లాదభరితంగా చలించిందో,
మల్లెలుగా జాజులుగా అగరొత్తుల పొగలు పొగలుగా
సువాసనలుగా ఆఘ్రాణితమైన ఆ మధుర క్షణం
నేను నేను మరిచిపోలేని క్షణం....

నా హృదయపు ప్రేమ సింహాసనం మీద
నమ్మకంగా ఒదిగిన నా నెలవంక
అలవోడ్పుగా నను చూస్తూ హత్తుకున్న సిగ్గుల మొగ్గయింది...
నాకొక అస్తిత్వాన్నందిస్తూ తను నాలో కరిగిపోయింది,
నేనేతనుగా తనే నేనుగా త్వమేవాహంగా
ఆహ్లాదంగా ఆప్యాయంగా ఆనందంగా మారిపోయింది...

- మాధవ తురుమెళ్ల
కౌముది మాసపత్రిక మార్చి ౨౧౦౧౨ సంచికలో ప్రచురితమైన కవిత
http://www.koumudi.net/Monthly/2012/march/index.html 

Thursday, 1 March 2012

మద్యంలేకుండా మత్తెక్కించేది ప్రేమ


మాటకు అందనిది, మౌనంలో ఒదిగిపోయినది
చిరునవ్వుల క్రీగంటచూపుల గాలులకు
తలలూపుతూ --
స్పందించిన
హృదయపుష్పపు పుప్పొడిలా
సృష్టిక్రమంలో భాగంగా -
అవ్యక్తంగా ఆప్యాయంగా -
మనసును హత్తుకునేది
మద్యంలేకుండా మత్తెక్కించేది ప్రేమ.  - మాధవ తురుమెళ్ల


Saturday, 18 February 2012

పిచ్చిరాతలు

‘పిచ్చిరాతలు‘

రాత్రి చీకటి కళ్లు కప్పుకున్న ఉషస్సు సూర్యుడినింకా జనించనేలేదు..
తుఫానుల అల్లకల్లోలాలలో లోకాలన్నిటినీ హాహాకారాలకు గురి చేయగల
బడబానలాన్ని సముద్రం ఇంకా ప్రసవించనేలేదు
కానీ నీ వెందుకు ప్రపంచగర్భాన్ని మోస్తూ మూలుగుతూ
శాంతికి జన్మనిద్దామని ప్రయత్నంచేస్తున్నావు? - - మాధవ తురుమెళ్ల

Thursday, 15 December 2011

కలలు పోగొట్టే మంత్రం



జీవితంలో తనకు జరిగిన అన్యాయాన్ని గూర్చిగానీ -
తనని నమ్మించి మోసగించిన తను అతిగా నమ్మిన తనవారిని గూర్చిగానీ -
తనకు జరిగిన అవమానాలను గూర్చిగానీ,
ఎవరికీ ఫిర్యాదు చెయ్యకుండా -
చనిపోయిన ప్రియబంధువు శవం చుట్టూ
కుండనీరు తీసుకుని తలదించుకు  ప్రదక్షిణలు చేసిన వాడికి మల్లే.,
తనను కికురించిన ప్రేమకు -
ఏనాడో మానసిక దహనసంస్కారం చేసి,
జ్ఞాపకాల నీటికుండలనుండి కావాలని పెట్టిన
కళ్ల చిల్లులద్వారా కన్నీళ్లన్నీ కార్చేసి,
పెదవులు రెంటినీ సంస్కారం అనే దబ్బనపు పురికొసతో కుట్టి
మౌనంగా తలదించుకుని -
తన దురదృష్టం అంతే అని అనుకుంటూ
అక్రమంగా జీవితం తనపై విధించిన కర్కశపు శిక్షని భరిస్తూ,
చిరునవ్వు తొడుగుని ముఖంపై తొడుక్కుని
తనదారిన తానుపోయే వాడు
ఎవ్వరినీ ఏమీ అనేవాడు కాడు...

అయినాసరే -
ఆ అమాయకుడికి శిక్ష ఇంకా చాలదన్నట్లు...
ఎప్పట్లానే
చీకట్లో
ఒక్కసారి నిశ్శబ్దం చుట్టుముట్టినవేళ,
కావాలని బలవంతంగా ఆమూలాగ్రమూ తగలెట్టి మోడువార్చిన
అతడు ప్రేమించిన
ఒకప్పటి పచ్చటి ప్రేమల జ్ఞాపకాల మహావృక్షం వెనుక,
తగలబడక అసహ్యంగా దెయ్యంలాగా
భయపెట్టే భూతంలాగా
ఏజన్మపాపమో పగతీర్చుకోవాలన్నట్లు
కనుమరుగవకుండా
బలవంతంగా మిగిలిపోయిన
ఆ మొండిమాను వెనుక,
నిస్సహాయంగా నిక్కి దాక్కుని నిద్రిస్తున్న వాడిని ...
 ఆ అమాయకుడిని ----
కర్కశంగా మెడపట్టి బయటకు ఈడుస్తున్నాయి
నరకపు చెరసాలలో నమ్మినబంట్లవంటివైన కలలు!

తనకు దక్కి దూరమైన అందమైన ఒకప్పటి అందాన్ని
దురదృష్టవశాత్తూ పొందలేక జారవిడుచుకున్న ప్రేమజీవితాన్ని
బలవంతంగా సినిమాలా చూపించేస్తూ ---
అవశుడిని అతడిని  ఏడిపిస్తాయి...

కలల కర్కశపు పట్టునుండి ఉలిక్కిపడి
విదిలించుకు మేలుకున్న అతడు
చెమర్చిన కళ్లని తుడుచుకుంటాడు
కలేకదా - అని గొణుక్కుంటాడు
గడిచిపోయిన క్షణాలను, నిమిషాలను, గంటలను, సంవత్సరాలను, దశాబ్దాలను
ఉరిస్థంభానికి వేలాడుతూ ఊగిసలాడుతున్న తాడుని చూస్తున్నట్లు
భయం భయం గానే కానీ ఊరికే లెక్కేసుకుంటాడు...
హఠాత్తుగా పిచ్చిగా నవ్వుకుంటాడు -
ఇవాళో రేపో మరణమనే ప్రియురాలు రాకపోతుందా -
నన్ను కౌగిలించుకోకపోతుందా అని ఆశగా అనుకుంటాడు...
కళ్లపై తిరిగి రెప్పలదుప్పటి కప్పుకుని
కలలని పోగొట్టే మంత్రాలను వెదుక్కుంటూ పడుకుంటాడు.

-- మాధవ తురుమెళ్ల (15 December 2011)

Friday, 7 October 2011

ఈ రోజు సమ్మెవేళ


పైన నడినెత్తిన ప్రపంచాన్ని దగ్ధం చేసేటట్లు
ఆగ్రహోదగ్రంగా సూర్యగోళం భగబగా మండుతోంది.

రోడ్ఛుపక్క ఏ చీడపురుగు చేతపడిందో కాలంకాని కాలంలో
ఆకులు పూర్తిగా రాల్చేసుకున్న చెట్టు సిగ్గుతో నగ్నంగా నిల్చోనుంది...

నీరు దొరక్క గొంతు ఆర్చుకుపోయిన కాకి
దిక్కుతెలియక పోయినట్లు అటూ ఇటూ అదేపనిగా తలతిప్పుతూ
ఏవో విపరీతపు అరుపులు అరుస్తోంది....

తోక కాళ్ల మధ్యకు ముడుచుకుని జీవితంలో ఓడిపోయి
అన్నీ పోగట్టుకున్న దానికి మల్లే ఒక పిచ్చికుక్క
బ్రతకటానికి ఆరాటపడుతూ తోటికుక్కల
దంష్ట్రాకరాళాలనుండి రక్కసి రక్కులనుండి దూరంగా పారిపోతోంది....

డొక్కలు వెన్నెముకకానుకొని,
వెన్నెముకేమో -
మానవుడైన రామునిచేతిలో -
విరచబడ్డ భగవంతుడైన శివునివిల్లులాగా -
అప్రాకృతికంగా మెలికలు తిరిగిపోయి,
నోటిలో పండ్లూడిపోయి,
ఎండిన చనుగవల కప్పేందుకు -
బూడిద దుమ్ముతో దుప్పటిలాగా అలముకొని
ఒక ముసలి బిచ్చగత్తె - కొరడాతో కర్కశంగా కొట్టబడ్డ బానిసవలె మూలుగుతోంది...

లోకమంతా ఈ సమ్మెవేళ -
ఒక రోగగ్రస్థవలె, ఒక తూర్ణీకృత వికృతిగా
ఇక యుగాంతమే తరువాయన్నట్లు
ఉరికంబాన్నెక్కబోయే ఖైదీలా,
బలిస్థంబాన్నలంకరించబోయే మూగజీవంలా
ఇలా దీనంగా... దరిద్రంగా....
కాళ్లీడుస్తూ నడుస్తోంది....

--- మాధవ తురుమెళ్ల

Monday, 26 September 2011

ఆత్మ క్షోభ


ఆత్మ క్షోభ
--------

[చూసావా!]
ఈ సంధ్యని గూడా మనం జారవిడుచుకున్నాము....
ఈ  సాయంత్రపు సమయంలో
నీలపు రాత్రి  - ఆత్రంగా ప్రపంచంపై పడిపోబోతున్నవేళ
 చేయి చేయి కలుపుకు నిలుచోవాల్సిన
 మనం ఎవరికీ కనిపించనేలేదు...

దూరదూరపు కొండలపై అంచులపై ముగిసిపోతున్న
ఈ సూర్యాస్తమయపు సంబరాన్ని
నేను ఒక్కడినే నా కిటికీలోంచి పరికిస్తున్నాను.

కొన్నిసార్లు సూర్యుని లోని ఒక భాగం
నా [బీదరికపు] అరచేతిలో నాణెంలాగా మండిపోతుంది...

నీకు తెలుసా -
నా  ఆత్మ క్షోభిస్తూన్న
ఆ అంతులేని విషాదంలో
నిన్ను నేను గుర్తుచేసుకున్నానని....

అసలు ఎక్కడున్నావు అప్పుడు నీవు?
ఇంకెవరున్నారు అప్పుడు నీతో?
ఏం చెబుతూ ఉండి ఉంటారు?
నువ్వెక్కడో అందనంత దూరంలో ఉన్నావన్న -
పుట్టెడు దుఃఖాన్ని నేను అనుభవిస్తున్నవేళ
ఎందుకంత అమాతంగా మొత్తంగా ప్రేమ  విరహంగా మారి నాపై పడిపోతుంది?

మూసిన పుస్తకం సంధ్యవేళ ఎప్పుడూ కిందేపడిపోతుంది
గాయపడినా విశ్వాసపు కుక్కలాగా
నా నీలపుస్వెట్టర్ నా కాళ్లదగ్గరే పడి నలిగిపోతుంది.

ఇంతే నీవు... ఎప్పుడూ.... ఎప్పుడూ
సంధ్యరంగులలో కరిగిపోతున్న విగ్రాహాలలాగా
సాయంత్రాలలోపాటే కనుమరుగైపోతావు.

-- పాబ్లో నెరుడా [అనువాదం: మాధవ తురుమెళ్ల ]

ఇది నాకు అతిబాగా నచ్చే పాబ్లో కవిత.  ఆయన తన బీదరికాన్ని, తనకూ ప్రేయసికి ఉన్న అంతులేని దూరాన్ని తలచుకుంటూ సాయంత్రాన్ని తన అసహాయతను తిట్టుకుంటూన్న ప్రియుడిగురించి రాసిన కవిత....

ఇది 25 September 2011, చిలీదేశంలోని నెరుడా యొక్క ఇంటి పెరటిభాగంలో కూర్చుని ఆలోచిస్తూ ’Clenched Soul' అనే నెరుడా విరహపు కవితకు చేసుకున్న అనువాదం - ఒప్పులుంటే అవన్నీ పాబ్లోవి తప్పులుంటే తెలియక అనువాదానికి సాహసించిన నావని తలచి నన్ను మన్నించండి..







Friday, 9 September 2011

కొండలతో బండల ఉనికిని అడగకు
సముద్రాన్ని అలలంటే ఏంటని అడగకు
నిరంతర జీవన ప్రయాణంలో అహరహమూ శ్రమిస్తున్న
నా హృదయంలో విషాదం ఎక్కడుందని అడగకు...
-- మాధవ తురుమెళ్ల

Tuesday, 16 August 2011

ముక్తెన్నడు నీకు మునులగడ్డ భారతమా



ఎవరు పేద ఎవరు రాజు ఎవరికెవరు భారతమా,
ఎవరి నెవరు దోస్తారో ఎవరికెరుక భారతమా,
ఏనాటికి ముక్తి నీకు నిరుపేదల భారతమా,
ముందుకెపుడు సాగుతావు మునులగడ్డ భారతమా!

విచ్చలవిడి అన్యాయం వెదజల్లెను లంచాలను
భారతదేశపు సంపద కొల్లగొట్టు రాబందులు...
గనులనొకడు కాంట్రాక్టులనింకొక్కడు
ఎక్కడబడితే అక్కడ అక్రమాలకు పాల్పడె
రాజకీయ రాబందుల లంచగొండి సామ్రాజ్యం
పేపర్లలో టీవీలలో రేడియోలొ ఎటుచూసిన
పీక్కుతిన్న శవాలపై ప్రతిదినమూ దుర్గంధం..

అన్యాయం ఇది ఏంటని అడిగెను అన్నాహాజారె
రాబందుల నెదుర్కొనగ పూనుకొన్న రామదేవ్
ఇకసాగదు అన్యాయం ఇకచాలీ అరాచకం
ప్రాణాలని పణంచేసి పోరాడె వీరులు
ఉద్యామాల బాటలలో అక్రమాల నెదిరించి
ముక్తినీకు తెస్తారు నిరుపేదల భారతమా
ముదమును కలిగిస్తారు మునులగడ్డ భారతమా....

- మాధవ తురుమెళ్ల