Total Pageviews

Wednesday, 24 July 2013

కవిత- శరణుగీతం

కవిత- శరణుగీతం



ఈ నది -
చాలా భయంకరంగా ఉంది!
అక్కడక్కడా సుడిగుండాలతో -
అయోమయాన్ని సృష్టించే నల్లని గుండ్రని వలయాలతో,
నురగలు కక్కుకుంటూ నడుస్తోంది...
ఎప్పుడో ఎక్కడో వడలిపోయి నిస్సహాయంగా -
రాలిన ఎండిన మోడులనీ, మోడుల్లాగామారి తేలుతూ వస్తున్న శవాల్ని
అమాంతంగా కావులించుకుని ,
భీభత్సానికి మారుపేరైన  కాలభైరవునిలా భయంగొల్పుతోంది...

చెట్లువిదిల్చేసిన పూలని,
ఎవరో భక్తులు  తొమ్మిదిరోజులు
పూజించి నెత్తికెక్కించుకుని నైవేద్యాలిచ్చి
చివరకి తమకేమీ పట్టనట్లు
ఏట్లో కలిపేస్తూ విసర్జించిన వినాయకులనీ,
ఏ ఆసరా దొరక్క తనఅనేవారు దయచూడక -
నదిలోదూకి ఆత్మహత్యచేసుకున్న అసహాయులు ఆడపిల్లల్నీ,
పసితనపు సరదాతో ఈతకొట్టడానికి దిగి
సుడిగుండాల్లోచిక్కుకు మరణించిన చిన్నిపిల్లల్నీ,
కాన్పునిచ్చి కన్నపేగునిచ్చి కని
పెంచలేక నదిలో వదిలిన శిశువులను,
అ శిశువులను నిర్దాక్షిణ్యంగా నలుచుకుతినే శిశుమారాల్ని,
గుడ్డిభక్తితో తమచావు యాత్రచేయడానికి వచ్చిన
లెక్కకు మిక్కిలి భక్తులను తన వరదల్లో కబళిస్తూ
సాగిపోతున్న ఈ నది - కరాళనృత్యం చేస్తోంది...

భయంకరపు జీవనం నది...
భీభత్సపూరితం నది...

ఒక్కోసారి
నాకనిపిస్తుంది -  జీవితమే ఈ నది!
ఈ నదికి జీవితానికి ఒక అస్పష్టమైన పోలిక!
నాభావాలలో కనిపించి నన్ను సృజించి
నన్నేడిపించి నన్ను నవ్వించి నన్ను ప్రశ్నించి
పీడకలలాంటి నిద్రలో నన్ను ఉలిక్కిపడేటట్లు చేస్తుంది.

హటాత్తుగా మెలకువ వచ్చిన నేను
నిశ్శబ్దంగా ప్రార్థిస్తుంటాను...
శరణుగీతం పాడుతూంటాను...

ప్రభూ,
ఈ నదిపై చూసావా!
ఒక తెరచాప పడవ నిశ్శబ్దంగా సాగిపోతోంది...
కానీ పడవకి గమనాన్నందిస్తూ
మహత్తులాగా
ఒక బలమైన గాలి వీస్తోంది.
కనబడకుండా, హోరెత్తిస్తూ, శరీరాన్ని
ఆహ్లాదపరిచే చల్లని గాలి వీస్తోంది.
అప్పుడప్పుడూ మనసును మత్తెక్కించే సుగంధాన్ని
తేలుస్తూ తెస్తోంది...
చుట్టుపక్కలే నదిలో నర్తిస్తున్న
భయంకరదృశ్యాలను మరుగునపరుస్తూ నన్ను స్వాంతనపరుస్తోంది.

ప్రభూ,
నీ చల్లని అమృత స్పర్శలే ఆశీస్సులే ఆ గాలి
నా పడవను నిశ్శబ్దంగా నెడుతూ ‘నే‘నున్నాననే
నీపట్ల నాకు త్వమేవాహమనే నమ్మకాన్ని కల్గిస్తోంది.

నీ నిశ్వాసం సోకిన నేను నమ్మకస్తుడిగామారాను
నీవు దయతో చిలికించిన
ఆత్మవిశ్వాసపు అమృతవర్షాంబుదులని త్రావిన
నేను - నావికుడిగా మారాను,
నా పడవ చుక్కానిని  అందుకున్నాను,
నా నౌకను గమ్యంవైపు నడుపుకుంటున్నాను.

అందుకే  ప్రభూ, నేను నిర్లజ్జగా చెబుతున్నాను,
నేను నీదయపై నివసిస్తున్నాను...
నీకు పదేపదే నమస్కరిస్తున్నాను...

-మాధవ తురుమెళ్ల


No comments:

Post a Comment