Total Pageviews

Showing posts with label కధలు. Show all posts
Showing posts with label కధలు. Show all posts

Monday, 3 February 2014

సుభాషితం: దైవఘటన

పంచైతాని మహాబాహో కారణాని నిబోధ మే ! సాంఖ్యే కృతాంతే ప్రోక్తాని సిద్ధయే సర్వకర్మణామ్||అధిష్ఠానం తథా కర్తా కరణం చ పృథగ్విధమ్ ! వివిధాశ్చ పృథక్ చేష్టా దైవం చైవాత్ర పంచమమ్ !! శరీరవాజ్మనోభిర్యత్ కర్మ ప్రారభతే నరః ! న్యాయ్యం వా విపరీతం వా పంచైతే తస్య హేతవః !! భగవద్గీత 18: 13,14,15

అర్జునా ! సర్వకర్మలసిద్ధికి ఐదు కారణములున్నాయంటూ కర్మలను అంతముచేయు ఉపాయాలని తెలుపే సాంఖ్యశాస్త్రంలో పేర్కొనబడ్డాయి. వీటి గురించి చెబుతాను విను... కర్మల సిద్ధియందు అధిష్ఠానమగు దేహము , పనిచేసేవ్యక్తి (కర్త), వివిధములైన జ్ఞానేంద్రియకర్మేంద్రియాలు, నానావిధమైన చేష్టలు (కర్మలు).... కానీ ’దైవము’ అనునది అక్కడ ఐదవ కారణం.. మానవుడు మనోవాక్కాయములచే ఆచరించు శాస్త్రానుకూలమైన లేక శాస్త్ర విరుద్ధమైన విపరీతమైన యేకర్మలైనాసరే ఈ యైదిటి కారణంగానే నడుస్తాయి!


ఇందులో ’దైవం చైవాత్ర పంచమం’ అంటే ’Fifth Element' అనేదాన్ని మన హైందవ పూర్వీకులు విపరీతంగా నమ్మేవారు. ఇదుగో మనం చేసే పూజలన్నీ ఈ ’దైవానికే’ -- ఈ దేవుని ఇచ్చనే ’భగవదేఛ్ఛ’ అంటాము... మనకు అనుకూలంగా (న్యాయంవా) లేదా ప్రతికూలంగా (విపరీతంవా) జరిగే సంఘటనలన్నింటి వెనుకా ’దైవం చైవ అత్ర పంచమం’ ఇది తెలుసుకుని నడుచుకోగలిగిన మానవుడు చీకూచింతాలేకుండా నిర్భయంగా ప్రవర్తించగలుగుతాడు. జీవితాన్ని అనుభవించగలుగుతాడు అని మనకు ఋషులు బోధించారు.

జీవితంలో మనందరికీగూడా అనేక ఘటనలు ఎదురవుతుంటాయి. కొన్ని మంచి కొన్ని చెడు... ఒక్కోసారి అవి తీవ్రమైన బాధని కలిగిస్తాయి, భగవంతుని పట్ల మన విశ్వాసాన్ని శంకించేటట్లు చేస్తాయి. అదిగో అప్పుడే నిజమైన విశ్వాసానికి పరీక్ష.

ఉదాహరణగా నిజంగా జరిగిన ఒక సంఘటనగూర్చి చెబుతాను... నాకు అతి దగ్గరగా తెలిసిన వ్యక్తికి 2000 సంవత్సరంలో జర్మనీనుండి, అమెరికానుండి రెండు దేశాలనుండి ఒకేసారి ఉద్యోగావకాశాలు వచ్చాయి. అతడు అమెరికా వెళ్లాలనుకున్నాడు. అమెరికా ఉద్యోగం వీసాకోసం చెన్నైలో అప్లికేషన్ పెడితే వాళ్లు ’ఫ్రాడ్ ప్రివెంషన్’ అనే నెపంపై ఇతడికి వీసా ఇవ్వడాన్ని చాలా ఆలస్యం చేసారు. ఈ లోపల అతడేమో ’నాకు అమెరికా వీసా రావాలి’ అని హోమాలు చేయించాడు, తిరుపతి వెళ్లి గుండు గీయించుకున్నాడు, అనేగ గుడుల ప్రదక్షిణలు చేసాడు, జ్యోతిష్కులను సంప్రదించాడు, తాయెత్తులను కట్టుకున్నాడు.. అలా మొక్కుకోని దేవుడు లేడు! కానీ అమెరికా వీసా ఎంత ఎదురుచూసినా ఎన్ని తపస్సులుచేసినా రాలేదు.

దాంతో ’దేవుడనేవాడున్నాడా .... అని మనిషికి కలిగెను సందేహం!’ అని విషాదపు పాటలు పాడుకుంటూ దిగులుగా గాలితిరుగుడు తిరగడం మొదలుపెట్టాడు... చివరకి అతడి అమెరికా పిచ్చి ఎంతదూరం వెళ్లిందంటే అతడు ఏసుక్రీస్తుకు, అల్లాకు గూడా ప్రార్ధనలు సమర్పించాడు... కానీ వీసా ఇంకా రాలేదు... నెలలుగడిచిపోతున్నాయి.... అటుపక్క జర్మనీదేశంలో మాత్రం ఉద్యోగం రెడీగా ఉంది. దాంతో ఉన్న అవకాశాన్ని ఎందుకు పోగొట్టుకుంటావు అని ఎవరో పెద్దలు సలహాఇస్తే సరే అనుకుని చేసేది లేక అమెరికా వెళ్లే అవకాశం రాక జర్మనీ వీసా అప్లికేషన్ పెట్టాడు. మర్సటిరోజే వీసా వచ్చేసి అతడు జర్మనీ వెళ్లిపోయాడు. తనకి అమెరికా వీసా రానందుకు చాలా దిగులుపడి తను నమ్మిన దేవుడిని నానా తిట్లూ తిట్టుకుని జర్మనీలో ఉద్యోగం మొదలుపెట్టాడు.

ఇంతలో అమెరికాలో ఒక ఘోరం జరిగింది! సెప్టెంబరు 11 వ తారీకున వరల్డ్ ట్రేడ్ సెంటర్ లో మూడువేలమంది చనిపోయారు. ఇతడికి అమెరికాలో ఉద్యోగం ఇచ్చిన కంపెనీ ఆ వరల్డ్‌ట్రేడ్ సెంటర్ లోనే ఉంది. అంటే ఒకవేళ ఇతనికి అమెరికా వీసా వచ్చి ఉంటే మాత్రం ఖచ్చితంగా ఆ దుర్ఘటన జరిగినరోజు వరల్డ్‌ట్రేడ్ సెంటర్ లో ఉండి ఉండేవాడు, బహుశా ప్రాణాలు పోగొట్టుకుని ఉండేవాడు. పైగా ఏ కంపెనీ అయితే ఇతడికి ఉద్యోగం ఇచ్చిందో ఆ కంపెనీ ఉద్యోగస్తులు చాలామంది ఆరోజు దుర్ఘటనలో మరణించారు. ఆ తర్వాత ఆ కంపెనీ మూతపడిపోయింది. అంటే ఇతడికి వీసా వచ్చి ఉంటే ఒకవేళ మరణం సంభవించి ఉండేది, లేదా ఒకవేళ అదృష్టవశాత్తూ బ్రతికినా వెళ్లిన నాలుగునెలలకే ఉద్యోగం పోగొట్టుకుని నానా కష్టాలూ పడి ఉండేవాడు. అందుకే అతడి ప్రార్ధనలు ఫలించక అతడికి అమెరికా ఉద్యోగం రాలేదు!

అందుకే దైవఘటన అనే దానిపట్ల మనం నమ్మకం పెట్టుకోవాలి. అడిగినవన్నీ ఇచ్చేవాడైతే ’దైవం’ అనిపించుకోడు! దైవం అంటే మనకి ఏది కనబడదో దాన్ని ఎరిగినవాడు, మన గమ్యం ఏంటో మనకంటే స్పష్టంగా ఎరిగినవాడు భగవంతుడు... "ఉత్పత్తించ వినాశంచ భూతానాం ఆగతాం గతిః వేత్తి విద్యాం అవిద్యాంచ సవాచ్యో భగవానితి" జీవుల ఉత్పత్తి వినాశనాలు, వచ్చి వెళ్లే దారులు, విద్యలు అవిద్యలు అనే ఆరిటిగురించి అత్యంత విశదంగా ఎరిగినవాడే భగవంతుడు... అతడే దైవం!

పూర్వం ఒక రాజుగారి వద్ద చాలా నమ్మకస్తుడైన తెలివితేటలుగలిగిన మంత్రి ఉండేవాడు. అతడు ఏం జరిగినా అది దైవఘటన ‘భగవదేఛ్ఛ‘ అంటూండేవాడు. ఒకరోజు రాజు మంత్రీ ఇద్దరూ కలిసి వేటకు వెళ్లారు. ఇద్దరూ దారితప్పి అడవుల్లో ఎక్కడో లోపలికి వెళ్లిపోయారు. వాళ్లిద్దరే ఇక చుట్టుపక్కల సైనికులు ఇంకెవ్వరూ లేకుండా ఉన్నారు. ఇంతలో ఒక పులి ఎక్కడ్నించి వచ్చిందో హఠాత్తుగా పొదల్లోంచి బైటికి దూకి రాజుగారి చేతిని తీవ్రంగా గాయపరిచింది. రాజుగారు మంత్రిగారు కలిసి తీవ్రంగా పోరాడి మొత్తానికి ఆ పులిని చంపేసారు. కానీ రాజుగారి చేతివేళ్లు రెండు తెగిపోయాయి. ఆయన చాలా బాధలో ఉంటే మంత్రిగారు కట్టుకడుతూ ‘భాధపడకండి రాజా! అంతా ‘భగవదేచ్చ‘ ఇవాళ మీ చేతివేళ్లు తెగి మీరు బాధపడుతుండచ్చు. కానీ మీకు కలిగిన ఈ నష్టంలో భగవంతుడు ఎక్కడో లాభాన్ని పెట్టాడు‘ అన్నాడు. అసలే బాధలో ఉన్న రాజుగారికి ఈ మంత్రి వేదాంతం విని ఒళ్లు భగభగా మండిపోయింది. చాలా కోపం వచ్చి ఆ మంత్రిని అక్కడే ఉన్న పాడుబడ్డబావిలో తోసేసి ఆ మంత్రి పైకి రాకుండా ఎవరినీ పిలిచి సహాయం అడక్కుండా ఒక పెద్ద బండరాయి అడ్డంపెట్టి అక్కడ్నుండి వెళ్లిపోయాడు. పాపం మంత్రి ‘మా రాజుగారికి నామీద కోపం రావడంగూడా భగవదేఛ్ఛ మాత్రమే‘అని మనసులో అనుకున్నాడు. ‘ఎలాగూ నన్ను రక్షించేవారు రారు, ఎలాగూ చనిపోతాను, కాబట్టి ఎప్పట్నించో చేద్దామనుకున్న లక్షకోటి గాయత్రీ జపం చెయ్యడానికి ఇదే మంచి సమయం‘ అనుకుని హాయిగా ఆ పాడుబడ్డబావిలో ధ్యానంలో మునిగిపోయాడు.

అదే అడవిలో కొందరు ఆటవికులు నివసిస్తున్నారు. వాళ్లు తమ కులదేవతకు నరబలి ఇవ్వాలని వెదుకుతుంటే ఒంటరిగా వెళ్తున్న రాజు కనబడ్డాడు. దాంతో వాళ్లు ఆ రాజును బందీగా పట్టుకుని బలి ఇవ్వడానికి సిద్ధం చేసారు. ‘అయ్యో! భగవంతుడి పేరును నిత్యం జపిస్తూ తన కర్మయోగాన్ని తను చేస్తున్న నా మంత్రిని నిర్దాక్షిణ్యంగా బావిలో తోసాను, అందుకే నాకు ఈ ఖర్మపట్టింది‘ అని ఆ రాజు తన మనసులో చాలా దుఃఖిస్తూ బలిపశువుగా రాబోయే కత్తివేటుకోసం సిద్ధంగా కూర్చున్నాడు. ఇంతలో ఆ ఆటవికుల కులగురువు అక్కడికి వచ్చి బలి ఇవ్వబోతున్న వ్యక్తిని నఖశిఖపర్యంతమూ పరీక్షించాడు. రాజు కుడిచేతికి రెండువేళ్లు లేకుండా ఉండడం చూసి ‘శరీరావయవాలు పూర్తిగా లేని నరుడు బలికి పనికిరాడు కాబట్టి వదిలెయ్యండి అని ఆజ్ఞాపించాడు‘. దాంతో ఆ ఆటవికులు ఆ రాజును ఎక్కడ పట్టుకున్నారో అక్కడికి తెచ్చి వదిలేసారు.


దాంతో రాజుకు జ్ఞానోదయం అయింది. "ఆ పులిగానీ నా మీదపడి నా చేతి వేళ్లు తీసేసి ఉండకపోతే ఇవాళ నన్ను ఆ ఆటవికులు ఖచ్చితంగా బలిచ్చి ఉండేవారు. నా ప్రాణాలు ఖచ్చితంగా పోయి ఉండేవి. నిజంగానే మా మంత్రిగారు చెప్పిన మాటలు సత్యం అయాయి. చేతివేళ్లు రెండు తీసుకుని పూర్తిప్రాణాలు నిలబెట్టాడు దేవుడు... ఇది ఖచ్చితంగా భగవదేఛ్ఛ" అని సమాధానపడి పశ్చాత్తాపపడి తిరిగి ఎక్కడడైతే మంత్రిని బావిలోకి తోసాడో అక్కడికి తిరిగి వచ్చి మంత్రిగారిని బావిలోనుండి పైకి తీసాడు. "మంత్రిగారూ మిమ్మల్ని అనవసరంగా అవమానించినందుకు క్షమించండి. మీరన్నట్లు భగవదేఛ్ఛవల్లే నా ప్రాణాలు ఇలా కాపాడబడ్డాయి" అని చెప్పి మంత్రిగారిని ఆలింగనం చేసుకున్నాడు. మంత్రిగారుగూడా చాలా సంతోషించి. "రాజా మీరు నన్ను బావిలో తోయడం గూడా భగవదేఛ్ఛే! నరబలి ఇవ్వడం కోసం వెదుకుతున్న ఆటవికులు శరీరంలో రెండువేళ్లు లేని కారణంగా మిమ్మల్ని వదిలేసారు, కానీ పూర్తి అవయవాలన్నీ భేషుగ్గా ఉన్న నన్ను పట్టుకుని మాత్రం బలిచ్చి ఉండేవారు - చూసారా నాకు మీపట్ల అపకారం జరిగిందని మీరనుకుంటున్నారు. కానీ నాకు మాత్రం ఉపకారమే జరిగింది అని అన్నారు. అలా రాజు మంత్రి తిరిగి రాజ్యానికి చేరుకున్నారు. అలా కధ ‘భగవదేఛ్ఛ‘ వలన సుఖాంతం అయింది.

స్వస్తి! - మాధవ తురుమెళ్ల, లండన్, యుకె

Tuesday, 21 January 2014

చదువుకున్నవాడికంటే చాకలివాడు ఎలా నయం? - కధ!

చదువుకున్నవాడికంటే చాకలివాడు ఎలా నయం? - కధ! 

ఒకసారి ఒక గ్రామంలో పండితులు, తర్కశాస్త్రజ్ఞులు, మీమాంసకులు ఇలా అందరూ కలిసి ఓ ఇంటి అరుగుమీద సభ జరుపుకుంటున్నారు. అటుజరిగి ఇటుజరిగి వాళ్ల చర్చ ‘వైకుంఠం ఎక్కడ ఎంతదూరంలో ఉండి ఉంటుంది?‘ అనే విషయంవైపు జరిగింది. ఒక పండితుడేమో వైకుంఠం కొన్నివేలకోట్ల ఖగోళాలకు అవతల నిజంగా ఉన్న ఒక పాలసముద్రంలో ఉన్నదన్నాడు, తార్కికుడేమో అలాగాదు చంద్రుడు లక్ష్మీదేవితోపాటే పుట్టాడు ఆయనని మనం రోజూ చూడగలుగుతున్నాము. తన అక్క లక్ష్మీదేవికి దూరంగా చంద్రుడు ఉండడు కాబట్టి వైకుంఠం ఎక్కడో చంద్రమండలానికి అవతలవైపు ఉండచ్చు అని తార్కికంగా చెప్పాడు. 

అదే గ్రామంలో ఒక చాకలివ్యక్తి నివసిస్తున్నాడు. అతడు తన బట్టలను తీసుకుని చెరువుకుపోతూ ఈ పండితులనందరినీ గమనించాడు. తనదారిన తాను వెళ్లిపోయాడు. సాయంత్రం అతడు తిరిగి వస్తూ ఆ పండితులు ఇంకా గట్టిగావాదించుకుంటూనే ఉండడం గమనించాడు. ‘ఈ పండితులు ఉదయంనుండీ సాయంత్రందాకా ఏం వాదించుకుంటున్నారా!‘ అని సందేహం వచ్చి వాళ్లని వెళ్లి కారణం అడిగాడు. వాళ్లు ‘మేం వైకుంఠం ఎక్కడఉందో వాదించుకుంటున్నాము‘ అంటే అతడు తలగుడ్డతీసి తన తలగోక్కుని. ‘ఇంతమాత్రం దానికి ఉదయంనుండి సాయంత్రం దాకా వాదించుకోవాలా బాబయ్యా?!‘ అని ఆశ్చర్యంగా ఆడిగాడు. దాంతో ఈ సారి ఆశ్చర్యపోవడం ఆ పండితుల వంతయింది. "అంటే ఏంటి?! నీకు వైకుంఠం ఎక్కడుందో తెలుసా?! ఇంత చదువుకున్నాము మాకే తెలియని అతి సూక్ష్మమైన ఈ శాస్త్ర రహస్యం నీకెలా తెలుస్తుంది... పో పో నీ పనిచేసుకో..." అని ఈసడింపుగా పలికారు. "అయ్యా! నేను తమరంత చదువుకోలేదండీ. కానీ నాకు వైకుంఠం ఎక్కడుందో చూచాయగా తెలుసండీ... నేను మా పంతులోరు మొన్నీమధ్య బాగోతం (భాగవతం) చెబుతాఉంటే ఇన్నానండీ బాబయ్య! మా పంతులోరు చెప్పారు ఆ ఏనుగు (గజేంద్రుడు) ప్రాణంబుల్ ఠావుల్ దప్పె మూర్చవచ్చె... అని మరంత మూర్చవచ్చే పరిస్థితుల్లో మాటలే రావు గదా బాబయ్యా. మనం చావబోయె మనిషి చెప్పేమాటలు వినాలంటే నోటిదగ్గర చెవిబెడితే గానీ వినబడవు గదా బాబయ్యా! మరి ఆ ఏనుగు చాలా బలహీనంగా అరిచిందిగదా... ‘రావే ఈశ్వరా... రావే వరదా.... రావే గోవిందా...‘ అని అయినాగూడా ఆ ఏనుగు మాటలు ఆ వైకుంఠయ్యకు వినపడ్డాయి అంటే బహుశా ఆ వైకుంఠం ఇక్కడే ఎక్కడో మహా అయితే ఓ నాలుగిళ్ల అవతల ఉండుంటుందండీ‘ అని చెప్పి తనదారిన తాను వెళ్లిపోయాడు. ఎన్నో శాస్త్రాలను అభ్యసించి వైకుంఠం ఎక్కడ ఉందో తెలియని చదువుకున్న పండితులకంటే, ‘తన పంతులయ్య చెప్పిన భక్తి వెనుక తనదైన నమ్మకం పెట్టుకుని వైకుంఠం మా ఇంటిపక్కనే ఎక్కడో ఉంది అని తార్కికంగా సమాధానపడి తన రోజువారీ పని (కర్మయోగం) చేసుకుంటున్న చాకలివాడు కొన్ని లక్షలరెట్ల నయం‘ అని అప్పట్నించీ ‘చదువుకున్నవానికంటే చాకలివాడు నయం‘ అన్న నానుడి పుట్టింది. -మాధవ తురుమెళ్ల

Friday, 19 July 2013

’మొసళ్లు పండగ’ ఒక చిన్నకధ

Once upon a time there was a lake.  A lot of crocodiles were living around the lake.  They used to eat the fish in the lake and live happily.  But their habitat is invaded by Human pests.  Human pests started taking away their fish starving them to death!  So they started praying to their Sky God asking Him to show a miracle and drop some food in the lake.  Their GOD listened to them... Lo... Food dropped from sky ;-) - A small story by Madhava Turumella

ఒక చిన్నకధ:  అనగనగా ఒక చెరువు  ఆ చెరువులో బోల్డన్ని చేపలుండేవి.  ఆ చెరువుని ఆశ్రయించుకుని బోల్డన్ని మొసళ్లుగూడ ఉండేవి.  ఆ చెరువులో సమృద్ధిగా దొరికే చేపలని తిని హాయిగా బ్రతుకు వెళ్లదీస్తూ ఉండేవి... అలా ఉండగా ఈ మొసళ్లు ఉండే చోటికి మనుష్యపురుగులు (మొసళ్ల లెక్కలో) వచ్చి చేరాయి.  ఆ మొసళ్ల ఆహారమైన చేపలన్నింటినీ ఈ మనుష్యపురుగులు తినెయ్యడం మొదలుపెట్టాయి.  దాంతో మొసళ్లకు ఆహారం దొరక్కుండా పోయింది... అవి చాలా బాధపడుతూ చెరువుచుట్టూచేరి భక్తికా వాళ్ల  వానదేవుడికి మెరపెట్టుకున్నాయి. "దేవుడా దేవుడా... ఈ మనుష్యపురుగులవల్ల మాకు తిండిలేకుండాపోతోంది... ఆకలితో చచ్చిపోయేలాఉన్నాము... నువ్వు మాపై జాలితలిచి మాకు ఆకాశంనుండి కొంచెం తిండి మా చెరువులో పారేస్తే నీ పేరు చెప్పి మేం పండగచేసుకుంటాం" అని మొరపెట్టుకున్నాయి... అంతే ఆకాశంలో మెరుపులు మెరిశాయి, ఉరుములు ఉరిమాయి, గాలి భయంకరంగా వీచింది... మేఘాలు తెరుచుకున్నాయి... మొసళ్ల మొరను ఆలకించిన దేవుడు ఆకాశంలోనుండి వాళ్లకోసం చెరువులో ఆహారాన్ని పడేశాడు అంతే ’మొసళ్లు పండగ’ చేసుకున్నాయి... - మాధవ తురుమెళ్ల


Saturday, 16 February 2013

ఐలయ్య కధ


ఐలయ్య అంటే ఏ హిందూ దేవుడు?  అని నిన్న ఎవరో నన్ను అడిగారు.  దీనికి సమాధానం:
ఐల అనేదేవుని ప్రసక్తి ఋగ్వేదంలో వస్తుంది.  ఇల దేవతకు కు బుధునివల్ల పుట్టినవాడు. కానీ ఇలాదేవత వేరే తండ్రిఅనేది లేకుండా కన్నది అని మహాభారతంలోఉన్నది.  ఈ ఐలదేవుడే తెలుగువారి నోళ్లలో నాని ’ఐల+అయ్య’ ఐలయ్యగా అయాడు.  ఋగ్వేదములో ’మంచివానిగా’, ’మృదుస్వభావిగా’,  [వెర్ర్రిబాగులవానిగా] ’ఊర్వశితో పిచ్చి ప్రేమలో పడినవాడిగా’ ఆడవారి పట్ల గాఢంగా మనసు పారేసుకుంటే జరిగే అనర్ధాలకు ఉదాహరణగా ఐలయ్య గురించి చెబుతారు.

ఐలయ్య  ఋగ్వేదంలో ఊర్వశి నిర్దాక్షిణ్యంగా వదిలి వెళ్లిపోతే  ఏడుస్తూ "ఆడవారితో శాశ్వతస్నేహాన్ని ఆశించగూడదు [అంత తెలివితక్కువపని ఇంకొకటిలేదు] ఆడవారి గుండెలు [బొమికలనిగూడ మిగలకుండా బొందిని కొరికి తినగల] దుమ్ములగొండి గుండెలు" అని చెప్పాడు?! [ఋగ్వేదం 10-95-15]

ఇలాదేవి క్షత్రియుడైన మనువు కూతురు అందువల్ల మనువుయొక్క రాజ్యభాగాన్ని తను పొంది తర్వాత దాంట్లో ’ప్రతిష్ఠాన’ అనే నగరాన్ని ఐలయ్యకు ఇచ్చినట్లు పురాణంలో ఉన్నది. ఈ ఐలయ్యకే పురూరవస్ అని మరొకపేరు  ’విక్రమోర్వశీయం’ నాటకంలో ఇతడు ముఖ్యపాత్రధారి (హీరో). పురూరవస్ విక్రమునిగా ఐలయ్యగా ప్రతిష్టానపుర రాజ్యాన్ని ఏలుతున్నప్పుడు మిత్రవరుణ దేవతలు స్వర్గలోకంలోని ఊర్వశిని భూలోకంలో ఉండమని శపించారు.  ఊర్వశి భూలోకంలో ప్రతిష్ఠానపురంలో అడుగుపెట్టింది.  ఆవిడ అందాన్ని చూసిన ఐలయ్య ముగ్థుడై ఆవిడతో ప్రేమలో పడ్డాడు.  ఆవిడగూడా మంచివ్యక్తి ఐన అతనితో ప్రేమలో పడింది... వాళ్లు కలుసుకుని తిరుగుతున్న రోజుల్లో ’మనం పెళ్లిచేసుకుందాం’ అన్నాడు.  దానికి ఊర్వశి ’సరే... కానీ నావి రెండు షరతులు’ (౧) నావద్ధ రెండు పొటేళ్లు ఉన్నాయి.  ఆ రెండూ నాకు పిల్లల్లాంటివి. అవంటే నాకు ప్రాణం. అవి నా పక్కనే ఉండాలి.  నేను పడుకునే గదిలోనే అవీ పడుకోవాలి (౨) నీవు పూర్తి నగ్నంగా నా కనులకు కనబడగూడదు.  ఈ షరతులకు సరేనన్నాడు ఐలయ్య.  వారిద్దరూ అన్యోన్యంగా కాలం గడుపుతూంటే గంధర్వుల లోకంలో వారికి ఊర్వశి లేని వెలితి తెలిసి వచ్చింది.  ఆవిడ ఐలయ్యని వదిలి రాదు అని వారికి తెలుసు.  అందుకని వారు ఒకరోజురాత్రి ఆ పొటేళ్లని దొంగతనం చేసి పట్టుకుపోతారు.  తన పొటేళ్లని ఎత్తుకుపోతున్నారని తెలిసి ఊర్వశి పెద్దగా కేకలు వేస్తుంది.  పక్కగదిలో బట్టలు మార్చుకుంటానికి నగ్నంగా తయారయిన ఐలయ్య ఆ కేకలు విని ’ఒక్క క్షణం ఆగు నేను నగ్నంగా ఉన్నాను బట్టలు కట్టుకుని ఆ దొంగల వెంట పడతాను’ అంటాడు.  ’నన్ను నిజంగా ప్రేమించినవాడివైతే ఉన్నఫళంగా బైటికిరా పో నా పొటేళ్లు ఎత్తుకుపోతున్నవారిని నాలుగు తన్ని నా పొటేళ్లను నాకు తెచ్చిపెట్టు’ అంటుంది. దాంతో ’తను నగ్నంగా కనబడను’ అన్న ప్రతిజ్ఞను తెలిసినాగూడా ’నన్ను నువ్వు నిజంగా ప్రేమిస్తే’ అన్నదిగదా! అందుకని నగ్నంగా కత్తి తీసుకుని ఆ పొటేళ్ల దొంగలవెంట పడతాడు. కానీ ఆ పరుగులో ఊర్వశి కనులకు నగ్నంగా కనబడతాడు.  ఆవిడ శాపవిమోచమనం పొంది మాయమైపోతుంది.  దాంతో ఊర్వశిని పోగొట్టుకుని పిచ్చివాడై ఏడుస్తూ నగ్నంగా వీధులవెంట ఐలయ్య తిరగడం మొదలుపెట్టాడు. తన రాజ్యాన్ని త్యజించి దేశ సంచారం చేస్తూ ’ఊర్వశీ ఊర్వశీ’ అని పిలుస్తూ తిరుగుతుంటాడు.  అప్పుడు కురుక్షేత్రంలోని తీర్ధంలో తన స్నేహితురాళ్లు నలుగురితో కలిసి స్నానం చేస్తున్న ఊర్వశి ఆయన కంట కనబడుతుంది.  ’నన్ను అలా అర్ధాంతరంగా వదిలి వెళ్లడం నీకు భావ్యమా? నీవులేక నాకు జీవించాలనిపించడంలేదు ’ అని ఊర్వశి కాళ్లు పట్టుకుని ఏడుస్తాడు. ఎంత చంచలస్వభావి అయినా ఊర్వశికి ఐలయ్యపట్ల మనసులో ఎక్కడో ప్రేమ ఉంది. ఆయనని లేపి ’బాధపడకు నిజానికి నేను ఇప్పుడు గర్భవతిని నీ బిడ్డకు తల్లిని’ అని అతనికి చెప్పి తిరిగి రాజ్యభారం స్వీకరించమని చెబుతుంది.  కానీ ఐలయ్యతో తిరిగివెళ్లడానికి అంగీకరించదు.  ’చంచలస్వభావినైన నేను నీతో భార్యగా కాపురం చెయ్యలేను అందువల్ల నీవు తిరిగి ఒక సంవత్సరం తర్వాత ఇదే ప్రదేశానికి రా.  అప్పుడు నేను నీతో ఒక్క రాత్రి గడుపుతాను.’ అని వరం ఇస్తుంది. ఆ విధంగా తనని నిర్దాక్షిణ్యంగా విడిచివెళ్లిన ఊర్వశి ఇచ్చిన స్వాంతనతో స్వస్థుడై ఐలయ్య తిరిగి ప్రతిష్టానపురానికి తిరిగివస్తాడు.  మహావీరునిగా అజేయునిగా రాజ్యాన్ని ఏలుతాడు.  ఊర్వశినుండి మొదటిబిడ్డ ’ఆయుస్’ ను పొందుతాడు.  తిరిగి అదేవిధంగా ప్రతిసంవత్సరానికి ఒక్కరాత్రి ఊర్వశితో గడిపి మొత్తం ఆరుగురు పండంటి మగబిడ్డలను పొందుతాడు.  [కొన్ని కావ్యాలలో ఎనిమిదిమంది బిడ్డలు అని ఉన్నది] ఊర్వశిని స్వేచ్చగా తన దారిన తనని వదిలేసినందుకు కట్టడి చెయ్యనందుకు సంతోషించిన గంధర్వులు ’నీవు ఏదైనా వరంకోరుకో ఇస్తాము’ అని ఊర్వశిద్వారా కబురుపంపుతారు.  ఐలయ్య మనసులో ఊర్వశితోనే శాశ్వతంగా గడపాలని ఉన్నది.  అదే విషయం ఐలయ్య గంధర్వులకు చెబుతాడు. దాంతో గంధర్వులు ఒక పాత్రలో అగ్నిని ఇచ్చి "ఈ అగ్నిని తీసుకు వెళ్ళు... వేదములు చెప్పిన ప్రకారం ఈ అగ్నిని మూడుగా విభజించు, తర్వాత ’ఊర్వశితో నేను శాశ్వతంగా నివసించాలి’ అనే కోరిక మనసులో పెట్టుకుని ఆహుతులు అర్పించు... నీకు తప్పనిసరిగా జయం అవుతుంది" అని చెబుతారు.  ఐలయ్య ఆవిధంగా చేసినవాడై గంధర్వలోకంలో స్థానం పొందుతాడు.... అంటే ఊర్వశి చంచలస్వభావి భూలోకంలో ఐలయ్యపక్కన ఉండలేదు అందుకని ఐలయ్యే గంధర్వునిగా యజ్ఞంవల్ల మారాడు.  దాంతో తను అత్యంత గాఢంగా ప్రేమించే ఊర్వశి పొందు ఐలయ్య సొంతం అయింది. ఆ విధంగా అతని కోరిక నెరవేరింది.


పురూరవస్ కు ఊర్వశికి మధ్యన జరిగిన అధివాస్తవికమైన సంభాషణ ఋగ్వేదంలో ఉన్నది.  ఈ పైన చెప్పిన కధ ’శతపధ బ్రాహ్మణం’లో ఉన్నది, ఆ తర్వాత అనేక పురాణాల్లో కనబడుతుంది. భాగవత పురాణంలో ’ఈ పురూరవుడు విభజించిన మూడు అగ్నులే మూడు వేదములుగా త్రేతాయుగం మొదట్లో వేదవిభజన జరిగింది’ అని ఉన్నది.... స్వస్తి.... --మాధవ తురుమెళ్ల

Wednesday, 17 August 2011

అన్నా హజారే కీ జై - చిన్నకధ

’అన్నాహజారే జై అన్నాహజారే జై’ అని స్కూటర్మీద ఇద్దరు కుర్రాళ్లు వెళ్తున్నారు. ట్రాఫిక్ కానిస్టేబుల్ వాళ్లని పట్టుకుని ఆపాడు. 

’హెల్మెట్ ఏదీ’ అని అడిగాడు... 

’పోలీసన్నా! అన్నా! హెల్మెట్ మర్చిపోయి వచ్చాము... ఈ వంద తీసుకుని మమ్మల్ని వదిలెయ్యన్నా అంటూ ఓ వందనోటిచ్చారు’. 

అది పుచ్చుకుని పోలీసు మొహం అటు తిప్పుకున్నాడు. 

ఆ పోసీసుఅన్నకి హజారు(వెయ్యి) సార్లు థాంక్స్ చెబుతూ ’అన్నా హజారేకీ జై’ అంటూ ఈ కురాళ్లిద్దరూ తమదారిన తాము పొయ్యారు...

-మాధవ తురుమెళ్ల ’ఒక చిన్న కధ’ :-)

Thursday, 5 May 2011

ఒక ప్రేమ కధ - సీరియస్‍గా తీసుకోకండి

రచన:  మాధవ తురుమెళ్ల 


గుడీవినింగ్ లేడీస్ అండ్ జెంటిల్‍మెన్ వెల్‍కమ్ టు మలేషియన్ ఏర్‍లైన్స్....  అంటూ చాలా యాంత్రికంగా విమానం టేకాఫ్ చేయబోయేముందరగా సేప్టీ డిమాన్‍స్ట్రేషన్ ఇస్తోంది ఎయిర్‍హోస్టెస్ కిరణ్మయి. అది మలేషియా విమానం కౌలాలంపూర్ నుండి లండన్ వెళుతోంది.  దాదాపు పదకొండుగంటల ప్రయాణం.  తను సర్వ్ చేసేది ఫష్ట్ క్లాస్ కాబిన్ కావడంతో కొంచెం ఈజీ..   చాలా రొటీన్‍గా ఆ సేఫ్టీ  డిమోన్‍స్ట్రేషన్ కొన్ని వేలసార్లు చేసి వుంటుంది.  అందుకే తన శరీరం డెమో ఇస్తున్నా మనసుమాత్రం ఎక్కడో వుంది.  ఈ ఉద్యోగం మానేయాలని మానసికంగా సిద్ధపడటంతో కొంచెం పరధ్యానంగానే వుంది.

కిరణ్ వాళ్ల నాన్న ఇండియానుండి చదువుకోసం కౌలాలంపూర్ వచ్చి తన చదువు పూర్తికాగానే అదే దేశంలో ఒక చిన్న ఫాక్టరీ పెట్టి కొద్దికాలంలోనే  గొప్పగా అభివృద్ధి  చేశారు.  ఇప్పుడు ఆయన మలేషియాలో ఒక పెద్ద ఇండస్ట్రియలిష్ట్.  బాగా ఉన్నవాళ్లు.  అనేకమంది నౌకర్లు చాకర్లు. తనొక్కతే కూతురవడంవల్ల చాలా గారాబంగా పెంచారు.  కిరణ్మయి ఒక రాజకుమారి లాంటిది.  అసలు ఎయిర్ హోస్టెస్ గా చేరాల్సిన అవసరం తనకు లేనే లేదు. అయినాగూడా ఫట్టుపట్టి ఇంట్లో వాళ్లను ఒప్పించి మరీ ఎయిర్‍హోస్టెస్ గా చేరింది...  ఆ ఉద్యోగంలో చేరడానికి ఎంత గట్టిగా పోట్లాడాల్సివచ్చిందో గుర్తొచ్చి కిరణ్ మనసు మరింత దిగులు పడింది.

"ప్లైట్ క్రూ... ప్లీజ్ టేక్ యువర్ సీట్స్ టు టేకాఫ్" అని కెప్టెన్ చెప్పడంతో వెళ్ళి కాబిన్ క్రూ కోసం కేటాయించిన సీట్లో కూర్చుంది.  ఈ లోపల తన కొలీగ్ స్టెల్లా గూడా పేసింజర్ కేబిన్ లో డెమో పూర్తిచేసి వచ్చి  తన పక్కనే కూర్చుంది. 

"బహుశా ఇదే ఆఖరి ఫ్లైట్ ... ఇంక లాభంలేదు ట్రై చేసాను... విధిని నమ్ముతాను కాబట్టి అతను తప్పనిసరిగా ఎదురుపడతాడనే ఆశతో దాదాపు ఆరేళ్లనుండీ ఇంటర్నేషనల్ సెక్టర్‍లో ఎయిర్‍హోస్టెస్ గా చేస్తూ దేశాలన్నీ తిరిగాను. ఎప్పుడో ఒకప్పుడు ఎదురుపడకపోతాడా అనే పిచ్చి నమ్మకం.. అయినాగూడా అతనెప్పుడూ ఎదురుపడలేదు... ఇక ఈ ఉద్యోగం మానేసి మా నాన్న చెప్పినట్లుగా విని పెళ్లిచేసుకుని ఇంటిపట్టున ఉండటం మంచిది"  చాలా నిరాశతో అనేసింది కిరణ్మయి.  

అలా అంటున్న కిరణ్ చెయ్యిపై ’నేను అర్థం చేసుకోగలను‘ అన్నట్లుగా ఆసరాగా చేయివేసి మౌనంగా కూర్చుంది స్టెల్లా... అంతేకానీ ‘అయ్యో అదేంటి ఉద్యోగం మానేస్తావా‘ అని మాత్రం అడగలేదు... అసలు కిరణ్ అలా ఎయిర్‍హోస్టెస్ పనిచెయ్యడమే తనని ఎప్పుడూ ఆశ్చర్య పరిచేది.  కిరణ్ తన బ్రతుకు తెరువు కోసం ఎయిర్‍హోస్టెస్ ఉద్యోగంలో చేరలేదని వేరే కారణం ఉంటుందని ఊహించ గలిగింది.  కానీ దాదాపు ఆరేళ్లపాటు నిజమైన కారణం చెప్పకుండా దాటవేస్తూ వచ్చి ఇవాళ మాత్రం సడన్ గా ‘ఉద్యోగం మానెయ్య బోతున్నానని చెప్పి దాంతో బాటు అసలు నిజానికి తను ఏ కారణంతో ఉద్యోగం లో చేరిందోగూడా చెప్పింది.  కానీ ఆ కారణం విన్న స్టెల్లా మాత్రం తన చెవులను తానే నమ్మలేక పోయింది... ఇండియన్ ఆడపిల్లలు చాలా సెంటిమెంటల్ గా ఆలోచిస్తారని చెబుతారుగానీ తనెప్పుడూ నమ్మలేదు.. ఇప్పుడు కిరణ్ మాటలు వింటూంటే అది నిజమేనేమో అనిపిస్తోంది...

ఇంటర్నేషనల్ సెక్టర్స్ లో పనిచేసే ఎయిర్హోస్టెస్ లని ఇతరప్రాంతాల భాషలు నేర్చుకోమని ప్రోత్సహిస్తారు.  అందుకని స్టెల్లా తెలుగుభాషకావాలని నేర్చుకుంది.  ఎప్పుడు అవకాశం వచ్చినా తెలుగులో సంభాషించడానికి ప్రయత్నం చేస్తుంది.  

మౌనంగా ఉండాలనుకున్నా స్టెల్లాకి ఎందుకో మనసు ఉండబట్టలేదు.  

"కిరణ్... మళ్లీ ఆలోచిందు... ’ఇటీజ్ అబ్సర్డ్‘  అసలు ఇంతకాలం నువ్వు బాయ్‍ఫ్రెండ్స్‌ని దూరంగా వుంచితే బహుశా నీకు మొగపిల్లలంటే ఇష్టం లేదేమో అనుకున్నాను.... ఇంత అమాయకంగా ఎవడో చిన్నప్పుడు కాపాడాడట అందుకని అతనికే నీ బాయ్‍ఫ్రెండయే అర్హత ఉంది... అని ఆలోచించడం చైల్డిష్,  కిరణ్ ప్లీజ్ డోంట్ వేష్ట్ యువక్ లైఫ్ అన్ నెసిసరీలీ... ఊరికే సినిమాలాంటి ఆలోచనల్లోలాగా నీ జీవితాన్ని వృధా చేసుకోకు...  ప్లీజ్ నీ మంచి కోరి చెబుతున్నాను... మళ్లీ ఆలోచించు..." అంది..

"అతని ఎవరో కాదు... హి హాజ్ ఎ నేమ్... అతని పేరు రవి"  వీళ్లెవరికీ నాకు రవి మీద ఉన్న ప్రేమ అర్ధంకాదు.. అనుకుంటూ ఉక్రోషంగా చెప్పింది కిరణ్...  

"ఒకె బాబా సారీ... అదే మీ రవి... అతనెక్కడున్నాడో తెలియదు... ఏం చేస్తూంటాడో తెలియదు... ఏదో మంచి ఉద్యోగస్తుడో వ్యాపారస్తుడో అయి ఇంటర్నేషల్‍ ట్రావెల్ చేస్తాడు అతన్ని అలా మళ్లీ కలుసుకోవచ్చు అన్న నీ ఆలోచన నాకు నిజంగానే సిల్లీ అనిపిస్తోంది"  అంది స్టెల్లా... 

"ప్లీజ్ కిరణ్... నువ్వు ఉద్యోగం మానేస్తానంటే నేనేమీ ఆపను.. నాకు తెలుసు నీకు ఈ ఉద్యోగం ఒక లెక్క కాదని.   కానీ అలా సెంటిమెంటల్  ఫూల్ లాగా నీ జీవితాన్ని పాడుచేసుకోకు... ప్లీజ్ థింక్ ఆవ్ ఇట్ అగైన్"

కిరణ్మయి మనసు వేపాకు తిన్నట్లు చేదుగా అయిపోయింది... తన రవిని తను ఇక జీవితాంతం పొందలేకపోతానేమో నన్న భావనే తనకు ఏడుపు తెప్పించేస్తోంది...  కిరణ్ మనసు రవివైపు రవి జ్ఞాపకాలవైపు పరిగెట్టింది... అవి తన పదహారవ యేట కాలేజి సెలవుల్లో ఇండియా తన తాతగారి ఊరు కృష్ణా జిల్లా నాగాయలంకలో గడుపుదామని వెళ్లింది.  తన తాతగారిపేరు చౌదరిగారు.  ఆయన పెద్ద మోతుబరి రైతు.  ఆయన భార్య చనిపోయి చాలాకాలం అయింది.  అయినా ఆయన మళ్లీ పెళ్లనేది చేసుకోకుండా ఒక్కరే అక్కడి పొలం పనులలో కాలం గడిపేస్తున్నారు.  తనకి అక్కడే ఆ తాతగారి ఊరిలోనే పరిచయమయ్యాడు రవి.

******

చుట్టూతా పచ్చటి పంటపొలాలు. అక్కడక్కడా చిక్కటి మామిడితోటలు.  మధ్యలోంచి కృష్ణానది పాములాగా మెలికలు తిరుగుతూ  ఉరకలెత్తుతూ పరిగెత్తుతోంది.   నది మద్యలో తెరచాప పడవలు సాగిపోతున్నాయి... మిట్ట మద్యాహ్నం కావడంతో ప్రకృతి అంతా నిశ్శబ్దంగా వుంది.. ఆ నిశ్శబ్దాన్ని చీలుస్తూ అప్పుడప్పుడూ పడవల్లో వెళ్లే నావికులు మాట్లాడుకొనే మాటలు గాలిని చీలుస్తూ వినవస్తున్నాయి...  

కిరణ్మయి మెల్లగా పొలంగట్ల వెంట జాగ్రత్తగా అడుగులో అడుగు వేసుకుంటూ నడుస్తోంది.  తాతగారు ఎంత అడిగినా ఏటి గట్ల వెంట ఒంటరిగా వెళ్లటానికి ఒప్పుకోలేదు.  ఆయనకి భయం తను విదేశాల్లో పుట్టి పెరిగినందువల్ల పల్లెటూరి వాతావరణం గురించి అసలు తెలియదని.  "ఇక్కడ కృష్ణా నదిలో సుడిగుండాలుంటాయి.. చాలా లోతైన గట్లు.. జారిపడిపోతే కష్టం.  అందుకే బుద్ధిగా ఇంటిపట్టున వుండు.  కావాలంటే నువ్వంతగా తిరగాలంటే మన పాలేర్లనిచ్చి పంపిస్తాను కానీ వాళ్లందరూ కలుపులు తియ్యడంలో చాలా బిజీగా వున్నారు.  కాబట్టి ఒకట్రెండు రోజులు ఆగు" అని చెప్పారు తాతగారు.. కానీ కిరణ్మయికి రెండురోజులు ఖాళీగా ఇంట్లో కూర్చోవాలంటే మనసనిపించలేదు. 

నేనేమీ చిన్నపిల్లను కాదు కాలుజారి ఏట్లో పడిపోవడానికి... అని ఉక్రోషంగా అనుకుంది. అందుకే ఇంట్లో ఎవరికీ తెలియకుండా మద్యాహ్నం తాతగారు నిద్రపోతున్నప్పుడు బైటపడింది... అలా పొలం గట్లవెంట చుట్టూరా ఉన్న ప్రకృతిని గమనిస్తూ నడిచి వెళ్తోంది.  దగ్గర్లోనే మామిడితోటలో వీలయితే ఒకట్రెండు మామిడికాయలు కోసుకోవాలి.. అనే ఆలోచన తనది.  ‘ఎవరి తోటో తెలియదు కానీ చూడ్డానికి మాత్రం ఎంత బాగుందో..‘  అనుకుంది.  ఆ తోటలోనుంచి ఓ కోయిల కుహు కుహు అంటూ పాడుతోంది.  కిరణ్మయికి కోయిల గానమంటే చాలా ఇష్టం.  కానీ ఎప్పుడూ కోయిలని చూడలేకపోయింది.  చూడడానికి నల్లగా అసహ్యంగా ఉంటుందని చెబుతారు కానీ కిరణ్మయికి నమ్మకం కలగలేదు.  దగ్గర్నించి చూసిగానీ నమ్మాలనుకోలేదు.  కానీ ఎంత ప్రయత్నించినా కోకిలని చూడలేకపోయింది.  ఎక్కడో చిటారుకొమ్మలో రహస్యంగా దాక్కుని పాటలు పాడుతూంటుంది.  ఈసారయినా కోకిలని తప్పనిసరిగా చూసి తీరాలి అనుకుంటూ మామిడితోటవైపు  అడుగులు వేసింది.

అలా నడుస్తుంటే నిశ్శబ్దాన్ని చీలుస్తూ పైన ఎక్కడో చాలా చిన్నదిగా కనబడుతూ ఆకాశంలో ఒక విమానం వెళుతున్న శబ్దం.  

"చూస్తూ ఉండరా... ఏదో ఒకనాడు నేను గూడా చాలా గొప్పవాణ్ణయి అదో ఆ విమానాల్లొ ప్రయాణం చేస్తాను"  మాటలు వినబడ్డాయి.

ఎవరా అని తలతిప్పిచూసింది.  ఏటి గట్టవడంవల్ల అక్కడే గట్టుమీద వీపుమీద పడుకొని తీరుబడిగా ఆకాశంవంక చూస్తున్నారు ఇద్దరు కుర్రవాళ్లు.  వాళ్లలో ఒకతను అన్న మాటలవి.  ఏటిగట్టు ఏటవాలుగా ఉండటంవల్ల ముందరే వాళ్లను గమనించలేకపోయింది.  బహుశా ఏట్లో ఈతకొట్టి వచ్చినట్లున్నారు తడిబట్టలు పిండి పక్కన ఆరేసి శరీరం ఆరబెట్టుకుంటూ అక్కడ పడుకుని ఆకాశం వంక చూస్తున్నారు.

"ఓసోసి... ఎల్లవో ఈరో... బోల్డంత చెప్పనొచ్చాడు... ఏంది నువ్విమానం ఎక్కేది? చాల్లే బడాయిలాపు"  అన్నాడు ఆ పక్కనే ఉన్నతను.  వాళ్లింకా ఏం మాట్లాడుకుంటారో వినాలనే కుతూహలంతో కొంచెం కొంచెంగా వాళ్లకు కనబడకుండా ముందుకు జరుగుతూ వాళ్ల మాటలు వినసాగింది.

"ఏం నేనెందుకు విమానం ఎక్కలేను... మన చౌదరిగారబ్బాయి సుజనాచౌదరిగారు చదువుకోని విమానాలెక్కలేదా విదేశాళెల్లలేదా గొప్పవాడవలేదా ... ఆయనీవూరోడు గాడా.... ఆయన చేసి చూపించంగా లేంది నే చెయ్యలేనా.. ఆయనని మనం ఆదర్శంగా తీసుకోవాలి... సాధించాలి" చాలా ధైర్యంగా ధీమాగా ప్రపంచంలో తను ఏదికావాలన్నా సాధించగలను అన్న నమ్మకంతో పలికినట్లుంది అతని గొంతు... అతనిది చాలా గంభీరమైన స్వరం.  అతనెవరోకానీ తన తండ్రిని ఆదర్శంగా తీసుకోవాలి అని చెబుతూంటే కిరణ్మయికి చాలా సంతోషంగా అనిపించింది... తన తండ్రి గురించి కొంచెం గర్వంగా అనిపించింది... 
"అవునరే చౌదరిగారంటే గురొచ్చింది.  ఆయన మనవరాలు ఊళ్లోకొచ్చింది తెల్సా.."  సంభాషణ తన గురించే నడవబోతోందని తెలిసి కిరణ్మయి మరింత చెవులు రిక్కించి వినసాగింది.

"ఏది ఆ చీమిడిముక్కు పిల్లా?"...  తనని చీమిడి ముక్కంటాడా! ఒక్కసారి వెళ్లి అతన్ని గట్టిగా తన్నాలనిపించింది.

"లేదురా బాబూ అది ఎప్పుడో క్రితంసారి అదీ చాలాకాలం క్రితం వచ్చినప్పటి మాట.. పైగా ఆ పిల్ల దగ్గరికిగూడా నువ్వెళ్లలేదు. నీకేం తెలుసు.  నేనప్పుడు దగ్గర్నుండి చూసాగదా... అప్పుడే చూడ్డానికి బాగుండేది.. నిన్నే మళ్లీ ఊళ్లోకొచ్చింది.  నువ్వేమో ఇవాళ ఉదయమే కాలేజి హాస్టల్ నుంచి సెలవలకని ఇంటికి చేరావు.. ఆ పిల్లని నువ్వు చూడలేదు అందుకే ఆ మాటంటున్నావు... అందంలో రంభరా బాబూ... చూడ్డానికి రెండు కళ్లూ చాలవు తెలుసా! "

తన అందం గురించి పొగడ్త వినడంతో కొంచెంగా సిగ్గుపడింది.

"అవునా... అయినా మనకెందుకు.." కిరణ్మయి చాలా అందంగా వుంటుందన్న విషయం తనకి అస్సలు  అనవసరమన్నట్లు చాలా సాదాగా అనేసాడు.

‘అందంగా ఉన్నానని స్నేహితుడు చెబుతున్నాడుకదా!... తన తండ్రి గురించి అంత గౌరవంగా మాట్లాడినవాడు... ఆ తండ్రి కూతురిని అంతంత అందగత్తెను  తన గురించి ఇంకా తెలుసుకోవాలన్న ఉత్సాహంగూడా చూపించట్లేదు.. ఏం చలిమిడి ముద్దరా బాబూ‘... అనుకుంది కిరణ్మయి.... ఆ అమ్మాయి అక్కడే వుందనీ తమ మాటలు వింటోందని గమనించని వాళ్లిద్దరూ తమ ధ్యాసలో తాము మాట్లాడుకొంటున్నారు.   కానీ ఆ తర్వాత వాళ్లు ఏవేవో కాలేజి విషయాలు మాట్లాడుకున్నారు గానీ కిరణ్మయి గురించి ఇంక మాట్లాడుకోలేదు.   వాళ్ల మాటలు చాటుగా దాగి వినాలన్న కుతూహలంలో సమయం చూసుకోలేదు.  ఒక్కసారి టైం గమనించి... అమ్మో తాతగారు నిద్రలేచే వేళయింది అని గబగబా వెనక్కు తిరిగి ఇంటికి చేరింది కిరణ్మయి.  ఆ రాత్రి ఎంత కాదనుకున్నా తన మనసు తన తండ్రిని ఆదర్శంగా తీసుకుని జీవితంలో గొప్పవిషయాలు సాధించాలి అని పలికిన ఆ అబ్బాయి గురించే ఆలోచిస్తోంది..  వాళ్లు ఈ వూళ్లో ఎక్కడుంటారో... వీలయితే వాళ్లను గూర్చి తెలుసుకోవాలి.. రేపు వాళ్లని మరింత దగ్గరగా పరిశీలనగా గమనించాలి....  అనుకుంటూ నిద్రపోయింది.

మరుసటిరోజు అదే సమయానికి ఆ ఏటు గట్టుకి వెళ్లింది.  వాళ్లు కనిపించలేదు.  నిరాశతో వెనక్కి తిరిగింది.  అలా రెండ్రోజులు గడిచిపోయాయి...  కిరణ్మయికి వాళ్లు కనబడితే బాగుంటుంది అని అనిపిస్తోంది.  పోనీ తాతగారిని అడిగితే ... "హమ్మో! ఇంకేమైనా వుందా ఎవరో మొగపిల్లలగురించి ఆరా తీస్తోందని వళ్లు చీరేస్తారు.." అనుకుని భయపడింది.  చూద్దాం నెలరోజులు ఉండబోతున్నాను ... కనబడకపొతారా అనుకుని సమాధాన పడింది.

అది కిరణ్మయి తన తాతగారి ఊరొచ్చిన నాలుగో రోజు.  కిరణ్మయికి ఇప్పుడు రెండు లక్ష్యాలు. ఒకటి అతన్ని చూడాలి, రెండు ఆ కోకిలని కూడా చూడాలి.  అతని మాటలు ఎలాగూ వినబడలేదు కానీ కోకిల మాత్రం ఎప్పట్లానే తోటలో కూర్చుని కూస్తోంది. కనీసం ఇవాళైనా దాన్ని చూడాలి అనుకుంటూ మామిడితోటవైపు నడిచింది.  

ఆ కోకిల ఎక్కడినుంచి పాడుతోందా అని పరీక్షగా వెదికింది.  తోట ఏటి వొడ్డునే వుండటంతో ఒక మామిడిచెట్టు దాదాపు ఏటినానుకొని పెరిగింది.  దాదాపు కొమ్మలు దాదాపు నీటివైపు వంగి వున్నాయి.  ఎవరైనా ఆ కొమ్మల మీదకెక్కి  ఏట్లోకి దూకచ్చు.    అదిగో ఆ చెట్టు చిటారి కొమ్మల్లో ఎక్కడో దాగి పాడుతోంది ఆ కోయిల.   ఆ చిటారు కొమ్మన ఉన్న కోయిలను చూడాలనే ఉత్సాహంలో అపాయం అనే మాట మర్చిపోయి ఆ ఏటిమీద వాలివున్న కొమ్మల మీదకి ఎక్కేసింది.  కొమ్మల్ని గట్టిగా పట్టుకుంటూ కొన్ని ఆకులని మండలని తప్పిస్తూ కోకిల ఎక్కడవుందా అని వెదకసాగింది.  ఆ వెదకటంలో చెట్టుకొమ్మలమీద పాకుతున్న ఒక పసరికపాముని తను చూసుకోలేదు.  ఒక్కసారి తన చేతివేళ్లు ఆ పాముని తాకగానే కంగారు పడిపోయి కొమ్మని వదిలేసింది... దాంతో సరాసరి కృష్ణానదిలో పడిపోయింది.

కిరణ్మయి సహజంగా ధైర్యవంతురాలు.  కొంచెం ఈతగూడా వచ్చు.  అందుకే నదిలోపడినా కంగారు పడకుండా ఈది ఒడ్డుకెళదామన్న ప్రయత్నం చేసింది... కానీ అది దివిసీమ... పైగా నది సముద్రంలో కలవడానికి కొంచెమే దూరం ఉండటంతో కృష్ణానది పరవళ్లెత్తుతూ కిరణ్మయిని తనతో లాక్కెళ్లిపోవడం మొదలుపెట్టింది.  తను ఈతకొట్టటానికి చేస్తున్న ప్రయత్నం ఫలించడం లేదు ఎంత ప్రయత్నించి ఈతకొట్టినా తను అంగుళంకూడా కదలడంలేదు... పైగా ఏట్లో కొట్టుకుపోతోంది.  సుకుమారమైన చేతులు కావడంతో ఒకటి రెండు నిమిషాల్లోనే ఈతకొట్టి చేతులు బాగా నెప్పిపుట్టి అలసిపోయింది.  ఇవాళ ఇక్కడ నేను చచ్చిపోవడం ఖాయం అనుకుని అప్రయత్నంగానే నీరుమింగుతూ మునకలేయసాగింది.  అలా మెల్లగా నీట్లో మునిగిపోసాగింది. అలాగే ఇంకొంతసేపుంటే పూర్తిగా మునిగొపోయేదేమో!

అప్పుడు కనబడ్డాడతను.  ఎక్కడ్నించి వచ్చాడో తను నీళ్లలో పడ్డ విషయం గమనించినట్లున్నాడు... ఒక్కసారిగా నీళ్లలోకి దూకేశాడు.  చేతులతో బారలు వేస్తూ శరవేగంగా తనవైపే వస్తున్నాడు.  తను ఎంత ప్రయత్నంచేసి ఈతకొట్టినా దారి ఇవ్వని కృష్ణమ్మ తల్లి అతను వేసే బారలతో సహకరిస్తున్నట్లుంది శరవేగంగా అతన్ని ముందుకు తోస్తోంది.   కను మూసి తెరిచేటంతలో తనవైపు దూసుకు వచ్చాడతను.  ఒక్కసారి దగ్గరకొచ్చి మునిగిపోతున్న తన చెయ్యి పట్టుకుని తనపైకి లాక్కున్నాడు.  అప్పటికే బాగా నీరుతాగేసి దాదాపు మునిగిపోబోయిన కిరణ్మయి స్పృహతప్పి అసహాయంగా అతని చేతుల్లో అచేతనంగా వాలిపోయింది. 

మళ్లీ కిరణ్మయి నీరసంగా కళ్లు తెరిచేసరికి ఒడ్డుమీద వుంది.  బట్టలన్నీ తడిసి ముద్దయి ఒంటిమీద అతుక్కుపోయాయి.  తనని గట్టుపక్కనే ఉన్న మామిడిచెట్టు నీడలో పడుకోబెట్టి తనవంకే పరిశీలనగా చూస్తున్నాడతను.  

"ఏవూరండీ మీది?  ఇక్కడి కృష్ణానది చాలా ప్రమాదకరం అని తెలియదా... అయినా ఆ మామిడిచెట్టు కొమ్మమీదకి ఎవ్వరూ ఎక్కరు... మీరెవరోగానీ చాలా అమాయకురాలిలాగా ఉన్నారు... జారి ఏట్లో పడతారని తెలియదా?  ఇంతకీ ఎవరమ్మాయి మీరు?" అని అడుగుతున్న అతన్నే చూస్తూ  ఉండిపోయింది కిరణ్మయి.

రోజూ వ్యాయామం చేస్తున్నట్లు కండలు తిరిగిన శరీరంతో, చామనచాయలో, నూనూగు మీసాలతో చూడడానికి బాగున్నాడు.  ఇతని గొంతు ఇంకా బాగుంది.  నా తండ్రిని పొగిడాడు.  ఇప్పుడు తనకి ప్రాణభిక్షపెట్టాడు.  ఎందుకో అతన్ని చూస్తూనే కిరణ్మయికి అతని పట్ల ప్రేమభావం పొంగిపోసాగింది.  

"సారీ అండీ.. కోయిలను చూడాలనే ఉత్సాహంలో అపాయాన్ని గమనించలేదు.  అయినా నా హీరో మీరున్నారుగదా ఇంక నాకేం భయం" కొంటెగా అనేసింది.

తను అలా అన్న మాటలకు తేలికగా నవ్వేస్తూ... "అంత మాటనకండి... మీరెప్పుడు ఏట్లోకి దూకేస్తారో కాపాడుదాం అని చూస్తూ కూర్చోవడానికి నాకంత తీరిక లేదు.  బై ది వే నా పేరు రవి.  మీ పేరేంటి" అడిగాడు. ఆమె తన పేరు చెప్పి తను చౌదరి గారి మనుమరాలినని చెప్పింది.

తను చౌదరిగారి మనుమరాలనగానే అతని నుదురు కుతూహలంగా కొంచెం పైకిలేచింది.   "ఓ మీరేనన్నమాట ఆ భూలోక రంభ. మా వాడు చెబుతుంటే ఏదో వాగుతున్నాడులే అనుకున్నాను కానీ మీరు వాడు చెప్పిందానికంటే రెట్టింపు అందంగా వున్నారు" అన్నాడు.  ఆ మాటలు విన్న కిరణ్మయి ఒక్కసారిగా సిగ్గుపడింది.  "ఫర్లేదు నేను ఊహించుకున్నంత చలిమిడిముద్దకాదు..." అని మనసులో అనుకుంది.

"ప్లీజ్ నేను ఇలా ఏటి గట్టుకు వస్తున్నానన్న విషయం మా తాతగారికి తెలియదు..  ఇలా కృష్ణానదిలో పడి ఆల్‍మోష్ట్ మునిగిపోయానని తెలిస్తే మా తాతగారు నన్ను చాలా తిడతారు... ఇక మళ్లీ నన్ను పొలంగట్లవెంట తిరగనియ్యరు.  పైగా నన్ను తిరిగి మలేషియా పంపించేస్తారేమో... ప్లీజ్ ప్లీజ్ దయచేసి ఈ విషయం ఎక్కడా చెప్పకండీ ప్లీజ్" బ్రతిమాలింది.  "సరేనండీ... ఈ విషయం ఎవరికీ చెప్పను... కానీ మీరు మాత్రం దయచేసి ఇలా ఒంటరిగా తిరక్కండి.. ఏదయినా జరగరానిది జరిగితే అందరమూ బాధపడతాము" అంటూ జాగ్రత్తలు చెబుతున్న అతనివంకే కృతజ్ఞతగా చూస్తూ ఉండిపోయింది.  

ఆ తర్వాత వాళ్లిద్దరూ అక్కడ ఏటిగట్టున కూర్చుని చాలా విషయాలు మాట్లాడుకున్నారు.  రవిది చాలా సామాన్య కుటుంబం. అతను విజయవాడ కాలేజిలో ఇంజనీరింగ్ చదువుతున్నాడు. వాళ్ల నాన్నగారు  వాటర్ వర్క్స్ డిపార్ట్‍మెంటులో సూపర్‍వైజర్ గా చేస్తూంటారు. ఆ రోజు రవితో తన గుంరించి చెప్పినతని పేరు సుభ్రమణ్యం.  కాలేజి మార్కులు తెచ్చుకుందామని విజయవాడ వెళ్లి ఆరోజు ఉదయమే తిరిగి వచ్చారు.  రవి కాలేజిలో అధ్లెటిక్ చాంపియన్.  ఆ రోజు కృష్ణానదిలో ఎప్పట్లాగా ఈత కొడదామని వచ్చి మునిగిపోతున్న కిరణ్మయిని గమనించాడు. అతను చాలా ఆశయాలతో వుంటాడు.  ఎప్పటికైన చాలా గొప్పవాడినవుతాడన్న గట్టి నమ్మకం.

ఆ రాత్రికి కిరణ్మయికి నిద్రపట్టలేదు.  ఆమె మనసు పదే పదే రవి గురించి ఆలోచిస్తోంది.  రవిలో ఏదో ఆకర్షణ వుంది.  వయసుకి మించి పెద్దరికంతో ఆదర్శాలతో మాట్లాడతాడు.  ఎందుకో అతను తన పక్కనుంటే ఇక ప్రపంచంలో తనని ఎవ్వరూ ఏమీ చెయ్యలేరు అనిపిస్తోంది... అతను పక్కనుంటే తనకి ఏ ఆపదా కలగదు.. కృష్ణానదిగూడా నన్ను ముంచెయ్యలేదు... అనే గట్టి నమ్మకం కిరణ్మయిలో కలిగింది...  ఆ నమ్మకాన్నే ప్రేమ అంటారనీ, ఆ ప్రేమే అల్లుకుని అనుబంధంగా మిగిలిపోతుందనీ అప్పు డు తనకి తెలియదు. 

ఆ తర్వాత తను ఉన్నన్ని రోజులూ అతనితో చెట్టాపట్టాలు వేసి తిరిగింది.  ఒకరోజు రవి తనకి ఏదో చూబిస్తానని తీసుకువెళ్లాడు.. ఏంటా అని చూస్తే కోకిల.  అలా కోకిలని చూడగలిగినందుకు కిరణ్మయి చాలా సంతోషపడింది.   తను అక్కడ ఉన్నన్ని రోజులు రవికి ఇష్టమని తెల్లని రంగు వోణీలు బారు జడ వేసుకుని చెవిపక్కన ఎర్ర గులాబి పెట్టుకునేది.  తనని ఆ గెటప్ లో చూసిన రవి కళ్లు ఆనందంతో తెకుచుకోవడం తనకి చాలా సంతోషం అనిపించింది.

కిరణ్మయి తిరిగి మలేషియా వెళ్లిపోయే రోజు దగ్గరపడింది. రవి తనగురించి ఏమనుకుంటున్నాడో కిరణ్మయికి తెలియదు.  అతనికి చదువంటే చాలా ఇష్టం. తనని ఒక స్నేహితురాలిగా భావిస్తూ మర్యాదగా మాట్లాడుతున్నాడు...  కిరణ్మయికి ఎందుకో రవిని వదిలి వెనక్కు వెళ్లిపోవాలంటే మనసంతా దిగులుగా అనిపించింది.  ఆ విషయమే రవితో చెప్పింది.

"ఎందుకు దిగులు పడటం.  నేను నీకు ఉత్తరాలు రాస్తానుగదా. పైగా సెలవుల్లో నువ్వు ఎలాగూ ఇక్కడకు వస్తూంటావు.. కాంసంట్రేట్ ఆన్ యువర్ ఎడ్యుకేషన్" అని ఎప్పట్లానే వయసుకు మించిన పెద్దరికంతో  ధైర్యం చెప్పాడు... అతనంటే తను పిచ్చిగా ఇష్టపడుతున్నాననీ అతనులేకుండా వుండలేననీ చెప్పాలనుకుంది.  కానీ చెప్పలేకపోయింది....

"ఒక వేళ మనం కలవలేక పోతేనో?"

"ఎందుకు కలవలేము?  నేను చదువుకొని పెద్దవాణ్ణయి విమానాల్లో దేశదేశాలు తిరిగుతాను... మీ నాన్నగారి లాగా... నువ్వుగూడా చదువుకుని గొప్పదానివైపో.. మనిద్దరమూ అప్పుడప్పుడ గాల్లో సరదాగా విమానాల్లో కలుసుకోవచ్చు"  ఎంతొ ఉత్సాహంగా ఏదో జరగబోయేది తెలిసిపోయినట్లు మాట్లాడాడు.  కానీ కిరణ్మయి అతని మాటలు పూర్తిగా నమ్మింది... ప్రేమించిన మనసు తన ప్రేమికుడు చెప్పిన ఏ విషయాన్నయినా గుడ్డిగా సాధ్యాసాధ్యాలు ఆలోచించకుండా నమ్మేస్తుంది. అందుకే ప్రేమ గుడ్డిది అన్నారు.

కిరణ్మయి మలేషియా తిరిగి వచ్చేసిన కొంతకాలంవరకూ రవినుండి క్రమం తప్పకుండా ఉత్తరాలు వచ్చేవి.  కానీ ఒక సారి హటాత్తుగా ఉత్తరాలు రావడం ఆగిపోయాయి.  ఆ తర్వాత కొద్దినెలలకే తన తాతగారు చనిపోవడంతో కిరణ్మయి తండ్రి పొలాలన్నీ అమ్మేయడంతో ఆ వూరితో సంబంధాలు తెగిపోయాయి.  తర్వాత రవిగురించి జాడ తెలియకుండా పోయింది.  కానీ కిరణ్మయి తనని బ్రతికించిన రవిని మర్చిపోలేకపోయింది. కాలక్రమేణా రవిపట్ల ఉన్న ఆ నమ్మకం అనే చిన్న విత్తనం ’ ప్రేమ’ అనే పెను వటవృక్షం క్రింద మారింది.  రవి లేనిదే తను బ్రతకలేదనీ ఎప్పటికైనా రవిని తను జీవిత భాగస్వామిగా పొందాలనీ నిర్ణయించుకుంది.

అలా ఎప్పటికైనా రవిని కలుస్తానన్న ఒక పిచ్చి ఆశ కిరణ్మయిది.  ఆ ఆశలోనే దాదాపు పదిహేనేళ్లు గడిపేసింది.  రవి తను కలలు కన్నట్లుగా గొప్పవాడయి వుంటాడనీ విమానాల్లో తిరుగుతాడనీ తనని అలా కలవచ్చనీ నమ్మి ఎయిర్‍హోస్టెస్ గా చేరింది.  కానీ దాదాపు ఆరేళ్లయిపోయాయి.... ఇప్పటిదాకా రవి కనబడలేదు.   ఆ విషయమే కిరణ్మయిని చాలా దిగులుకి గురిచేస్తోంది.  ఈ శరీరం అతను బ్రతికించినది... ఈ ప్రాణం అతనిచ్చినది... నేనతని సొత్తు... అతనికి ఈ విషయం తెలిస్తే ... తనని కలిస్తే ఎంతబాగుంటుంది... అని ఒక పిచ్చి ఆశ... ఆ ఆశ ఇక అడియాసగా మారేటట్లుందనే ఊహే తన మనసును పుట్టెడు దుఃఖానికి గురిచేస్తోంది.

ఎక్కడున్నావు రవీ! ఏమయిపోయావు?  నిన్ను ప్రేమించే ఒక మూగ ప్రేమికురాలు ఇక్కడ వుందని అసలు నీకు తెలుసా.... జీవితం గొప్పవాడినవ్వాలనే తపనలో నన్ను మర్చిపోయావేమో.... కానీ నేను నిన్ను మర్చిపోలేదు.  నాకు నువ్విచ్చిందే ప్రాణం.  నేను నీకే సొంతం... అసలు నువ్వనుకున్నట్లుగా గొప్పవాడివయావాలేదా?  నువ్వు గొప్పవాడివయితే నా ప్రేమికుడు నేను ఆరాధించే మగాడు అనుకున్నది సాధించాడని సంతోషిస్తాను. అయినా నువ్వు గొప్పవాడివో బీదవాడివో అదినాకు అనవసరం.   నువ్వు గొప్పవాడివి కాకముందరే నేను నిన్ను ప్రేమించాను.  నాకు నువ్వు కావాలి రవీ... నువ్వుగా కావాలి.... మా నాన్న అంటే నువ్వు చిన్నప్పుడే బోల్డంత గౌరవంగా మాట్లాడేవాడివి.  మా నాన్నకి నిన్ను చూబిస్తాను. నిన్ను ప్రేమించాననీ నిన్నే పెళ్లిచేసుకుంటాననీ చెబుతాను.  నీకు డబ్బున్నా లేకపోయినా, నువ్వు ఎంత సామాన్యుడివైనా ఫరవాలేదు... ఒక్కసారి కనిపించు... నేను నీకు ఎన్నో చెప్పాలి. నువ్వు నాకు కావాలని చెప్పాలి..   కిరణ్మయి మనసు రవి గురించిన ఆలోచనల్లో తహతహలాడుతోంది.  

*******

ఫ్లైట్ లండన్ చేరుకుంది.  హోటల్ రూం కి వెళ్లి ప్రెషప్ అయి బైటికి వచ్చేసరికి పోన్ మోగుతోంది.   కిరణ్మయి వెళ్లి రిసీవర్ తీసింది.

"అమ్మా బంగారాలూ ఎలా వున్నావురా?"  ఆదరంగా పిలిచిన తన తండ్రి గొంతువినగానె తనకెందుకో ఏద్చెయ్యాలనిపించింది.   తను మౌనంగా వుండటంతో "ఏమయిందిరా బంగారాలూ... వంట్లో బాగానే వుందా?  వద్దువద్దన్న కొద్దీ ఆ ఎయిర్‍హోస్టెస్ ఉద్యోగం చేస్తున్నావు.  అ జెట్‍లాగ్ తోటి ఆరోగ్యం పాడవుతుందన్నా వినవు." తన తండ్రి ఆందోళనగా అడుగుతూ సున్నితంగానే మందలించాడు. కిరణ్మయికి ఇక ఎందుకో అక్కడ ఉండాలనిపించలేదు.  వెంటనే తన తండ్రిని చూడాలని ఆయన ఒడిలో తలపెట్టి బావురుమని ఏడ్చెయ్యాలనిపించింది.

"లేదు నాన్న... ఇంక నేను ఈ ఉద్యోగం చెయ్యదలచుకోలేదు... ఉన్న పళంగా నాకు మీ దగ్గరకు వచ్చెయ్యాలని వుంది." అంటూ కళ్లవెంట నీరు పెట్టుకుంది.  ఎప్పుడూలేనిది తన కూతురు అలా బేలగా మాట్లాడుతుండటంతో ఏమయిందో అనుకుని ఆయన కంగారు పడిపోయాడు.

"బంగారాలూ!  నువ్వు నా కూతురివిరా... బాధపడద్దురా...  నీకేంతక్కువమ్మా ... వచ్చెయ్యి. వెంటనే వచ్చెయ్యి...  నేను ప్రైవేట్ జెట్ ఏర్పాటు చేస్తాను.  నువ్వు ఉన్న పళంగా నా దగ్గరకు వచ్చెయ్యి.  నాకు ఒక్క పదినిముషాలు సమయమియ్యి... విమానం ఏర్పాటు చేసి ఇప్పుడే కబురుచేస్తాను"  అనునయంగా చెప్పారాయన.  తన కూతురు ఎందుకో ఆరాట పడుతోంది.  తనని ఉన్నపళంగా చూడాలనుకుంటోంది... అదే ఆ తండ్రి మనసుకు అర్ధమైంది.

సిక్‍లీవ్ పెట్టేసి ప్రివేట్ ఏరోడ్రోమ్ కి వచ్చింది.  తన్ తండ్రి తనకు చెప్పినట్టుగా ఒక చిన్న విమానాన్ని ఏర్పాటు చేశాడు.  సామాన్యులందరూ బస్సులో వెళ్ళినట్లుగా  విమానాల్లో వెళితే, బాగా దనవంతులు సొంతకారులో వెళ్లినట్లుగా సొంత విమానాలలో వెళ్లడం జరుగుతుంది.   కిరణ్మయి తండ్రి సుజనాచౌదరిగారికి సొంత విమానం లేదు.  ఆయనకి సొంతవిమానం కొనుక్కోగలిగినంత స్తోమత వున్నా చాలా నిరాడంబర మనస్తత్వం అవడంవల్ల ఎప్పుడూ ప్రయత్నం చెయ్యలేదు.  

ఒక చక్కటి చిన్నగా ముచ్చటగా ఉన్న ట్విన్ ఇంజన్ విమానం నార్త్‌హోల్ట్ ప్రెవేట్ ఏరోడ్రోం లో ఆగి వుంది.  పైలట్ కిందకి దిగి కిరణ్మయిని విష్ చేసి లోపలికి ఆహ్వానించాడు.  లోపల చాలా ఖరీదయిన నాలుగే నాలుగు సీట్లున్నాయి.  ఆఫీస్ పని చేసుకోవడానికి వీలుగా ఆ నాలుగు కుర్చీలకు మధ్యగా ఒక బల్లగూడా వుంది.  ఒక ధనవంతుడు ఎంత విలాసాన్ని కావాలనుకుంటడో ఆ విలాసాలన్నీ అందులో వున్నాయి.

"మేడమ్ మీరు ఎప్పుడు రడీ అంటే అప్పుడు చెప్పండి మేము టేకాఫ్ చేస్తాము." అని చెప్పాడు పైలట్  "బైదివే మై బాస్ అదే ఈ విమానం ఓనర్ మీకిమ్మని పాక్స్ మెసేజ్ ఇచ్చారు" అంటూ ఒక సీల్డ్ కవర్ అందించాడు.   ఈ విమానం ఓనర్ ఎవరబ్బా అనుకుంది.  బహుశా తన తండ్రి స్నేహితులెవరో అయి వుంటారులే అనుకుని ఆ  కవర్ అందుకుని తర్వాత తీరికగా చదవచ్చులే అని హాండ్‍బాగ్ లో పడేసుకుంది.

తను ఇక బయల్దేరదాం అని చెప్పగానే పైలట్ టేకాఫ్ చేసి విమానాని మలేషియావైపు పొనించాడు.  కిరణ్మయికి మనసంతా ఇంకా బాధగానే వుంది.  తలబాగా నెప్పిపెడుతుండటంతో పడుకుందామని అనుకుంది.  ఆ విమానంలో ఇంకొక సౌకర్యం ఏంటంటే ఎప్పుడయినా పడుకుందామని అనిపిస్తే నాలుగు కుర్చీలూ కలిపి ఒక క్వీన్‍సైజ్ బెడ్ లాగా మారుతాయి.  కిరణ్మయి పడుకొని నిద్రపోయింది.

విమానం కొలలంపూర్ లో ఇంకొక్క కొద్ది నిమిషాల్లో లాండ్ అవుతుందనగా పైలట్ వచ్చి "గుడ్ మార్నిం గ్ మేడమ్ మనం ఇంకొంచెం సేపట్లో లాండ్ అవబోతున్నాం" అని చెబుతూ నిద్రలేపాడు.    అప్పుడు కిరణ్మయికి ఆ ఉత్తరం గుర్తొచ్చి తీసుకుని చదవడం మొదలుపెట్టింది.

"కిరణ్మయీ.. చిన్నప్పుడు నీతో కలిసి తిరిగిన రవి నీకు గుర్తున్నాడా.... నేను అదే రవిని... "  కిరణ్మయి గుండెలు గబగబా కొట్టుకున్నాయి... ఈ ఉత్తరం నా రవి రాసిందా...  తను ప్రయాణింస్తోంది  రవి సొంత విమానంలోనా.. ఎప్పుడో గొప్పవాడినై విమానాల్లో తిరుగాను అని చిన్నప్పుడు చెబుతుంటే, అతను అంతకు సమర్ధుడు అని గట్టిగా నమ్మింది కానీ అతను సొంత విమానాల్లోనే తిరిగేటంత గొప్పవాడవుతాడని ఊహించలెకపోయింది.  ఎక్కడైనా కనబడకపోతాడా అని ఎయిర్ హోస్టెస్‍లాగా మారి దేశదేశాలు తిరిగింది.  కానీ తన రవి తన సొంతవిమానంలో దర్జాగా తిరుగుతున్నాడు అని ఊహించలేకపోయింది.

"కిరణ్ నీకు కనబడకుండా ఇలా ఉత్తరం రాస్తున్నందుకు క్షమించు.  చిన్నప్పుడు నీతోటి స్నేహం నాకు దొరికిన ఒక గొప్ప అదృష్టం.   నాకు తెలియకుండానే నా హృదయం నీతోటి ప్రేమలో పడింది.  కానీ ఆ ప్రేమ నా చదువుకి అడ్డం పడుతుందేమోనని తలుచుకొని భయపడిపోయాను.  అందుకే నీకు ఉత్తరాయలు రాయడం ఆపేసాను.   నాకు మీ నాన్నగారన్నా, మీ తాతగారన్నా చాలా ఇష్టం గౌరవం... ఆ రోజుల్లో అతి పేదవాడినైన్ నాకు నిన్ను ప్రేమిస్తున్నానని చెప్పే అర్హతగూడా లేదని తెలుసు.  అలాచేసి మీ పెద్దలకు మనస్తాపం కలిగించలేకపోయాను.  అందుకే నీకు దూరంగా వుంటూ నిన్నూ నీ అందాన్నీ మౌనంగా ఆరాధిస్తూ గడిపేశాను.  ఒక్క ఆరుసంవత్సరాలక్రితం నేను అనుకున్నట్లుగా ఒక గొప్పస్థాయికి చేరుకుని నీ చేయందుకునే అర్హత సంపాదించాననుకొన్న తర్వాత  నీకోసం వెళ్లి మీ నాన్నగారిని కలిసాను.  మన మధ్య పరిచయం ఉందన్న విషయం ఆయనకు చెప్పలేదు.  నిన్ను పెళ్లిచేసుకోవాలనుకుంటున్నానని ఆయునతో చెప్పాను.  కానీ నీవు పెళ్లంటే ఇష్టపడటంలేదని మీ నాన్నగారు చెబితే తెలిసి చాలా బాధపడ్డాను.  అప్పట్నించీ మీ నాన్నగారితో చనువుగా ఉన్నానే తప్ప నీకు ఇష్టం లేకుండా ఆయనతో చెప్పి ఆయనద్వారా బలవంతంగా నిన్ను పెళ్లికి ఒప్పించాలని నేను అనుకోలేదు...  నాకు నువ్వంటే చాలా ఇష్టం.  నిన్ను నేను దూరంనుంచే చూసుకుని సంతోషించానే తప్ప నీకు ఎదురుపడి నిన్ను బాధపెట్టాలనుకోలేదు.  

కానీ ఇవాళ నీకు ప్రత్యేకించి ఈ ఉత్తరం ఎందుకు రాస్తున్నానంటే నేనిప్పుడు మలేషియాలో ఉన్నాను.   మీ నాన్నగారు నీగురించి చాలా ఆందోళనలో ఉన్నారు.  నిన్ను బలవంతంగా నాతొ పెళ్లికి వొప్పిస్తాననీ నిన్ను పెళ్లి చేసుకొమ్మనీ నన్ను అడిగారు.  కానీ నీకు ఇష్టం లేకుండా నిన్ను బలవంతంగా పెళ్లిలోకి దింపలేను... అలాగని చిన్నప్పట్నించీ నా ఆదర్శంగా ఒక మార్గ దర్శకుడిగా భావించిన మీ నాన్నగారి మనసుని నొప్పించలేను.  మళ్లీ మళ్లీ చెప్పలేను... నాకు నువ్వంటే చచ్చేటంత ఇష్టం... నీకుకూడా నేనంటే నాతో పెళ్లంటే ఇష్టమే అయితే దయచేసి నేను నీగుంరించి ప్రత్యేకంగా కొనుక్కున్న తెల్లచీర కట్టుకుని ఒక ఎర్రగులాబీ పెట్టుకుని ప్లైట్ దిగి  మీ నాన్నగారి ముందుకు వచ్చి నిలబడు...  నేను నిన్ను చేసుకుంటానని నిన్ను నాకిచ్చి చెయ్యమనీ సర్వదేవతల సాక్షిగా కోరతాను.  మనిద్దరికీ అదే మంచిది.  నువ్వు నన్ను కాదనుకుంటే ఆ చీర నీవు కట్టుకోనక్కర్లేదు.... అది తెలిసి నేను ఖచ్చితంగా బాధపడతాను.  అయినా సరే మీ నాన్నగారితో నాకుగూడా పెళ్లి ఇష్టం లేదని చెప్పి మిగిలిపోతాను.  ఇలా చెబుతున్నందుకు క్షమించు. బై ది వే విమానం లో ఉన్న కేబిన్ తలుపు తెరిచి చూడు.."

ఆ ఉత్తరం చదివుతూ అది కలో నిజమో ఊహించుకోలేని పరిస్థితిలో పడింది కిరణ్మయి... ఆమె మనసు ఆనందంతో పొంగి పరవళ్లు తొక్కుతోంది.  గబగబా లేచి కేబిన్ తెరిచి చూసింది.  ఒక ఖరీదయిన ఎక్సిక్యూటివ్ కాబిన్ అని చూడగానే తెలిసిపోతోంది.  అవసరమైతే బట్టలు మార్చుకోవడానికి కొన్నిసూట్స్ అక్కడ హాంగ్ చేసి వున్నాయి.  ఆ పక్కనే వాల్‍మీద కిరణ్మయి ఫోటొ చాలా అందంగా నవ్వుతూ ఉంది.  ఆ ఫోటో చూడగానే కిరణ్మయి మనసు సంతోషంతో మరింత దూదిపింజెలాగా తేలికయిపోయింది.  తన రవి తనని ఆరాధిస్తున్నాడు.. తన సొంత విమానంలో తన ప్రైవేట్ కాబిన్‍లో తన ఫోటో పెట్టుకున్నాడు. ఆ ఊహే కిరణ్మయికి హాయిగా అనిపించింది.  అప్పటికప్పుడు వెళ్లి రవిబాహువుల్లో వాలిపోవాలని అనిపించింది.   కిరణ్మయి ఫోటో కింద ఒక నీట్‍గా ఉన్న ఒక పాకేజి.  ఆ పాకేజి మీద రాసుంది... "టు మై కిరణ్మయి విత్ లవ్" అని....  ఆ పాకేజి పక్కనే ఒక చిన్న నీటి గ్లాస్‍లో ప్రెష్‍గా ఉన్న ఒక ఎర్రగులాబి.    ఆ పాకేజిని ఓపెన్ చేసి చూసింది... ప్రత్యేకించి నేయించిన అతి ఖరీదయిన తెల్లటి కంచిపట్టు చీర...

****** 

మలేషియా ప్రివేట్ ఏరోడ్రోంలో ప్లేన్ లాండయేసరికి తన తండ్రి రవి ఇద్దరూ ఎదురు చూస్తున్నారు. ... "బంగారాలూ!  అయామ్ సో గ్లాడ్ యుఆర్ హోమ్... ఎలావున్నావు?  నన్ను చాల ఖంగారు పెట్టేశావు తెలుసా" అని పలుకుతూనే ఎంతో అందంగా తెల్లటి కంచిపట్టుచీరలో జడలో ఎర్రగులాబి పెట్టుకుని చాలా సంతోషంతో ప్లేన్ దిగివచ్చిన కిరణ్మయిని చూసి... హమ్మయ్య అంతా బాగానే ఉన్నట్లుంది.. అనుకొని తేలిగ్గా ఊపిరిపీల్చుకున్నాడాయన.

"బంగారాలూ... ఇతను రవి అని.  చిన్నప్పుడు మన తాతగారి ఊర్లోనే పెరిగాడట. నాకు ఒక అయిదారేళ్ల నుంచి పరిచయం.  నేను పాటించిన పద్ధతులే ఆదర్శంగా తీసుకుని ఇతను సాప్ట్‌వేర్ వ్యాపారం మొదలెట్టాడట.  ఆ వ్యాపారంలో అతను అతి కొద్దికాలంలో  కొన్ని వేల కోట్ల ఆస్తి సంపాదించాడు.  ఇవాళ ఇతను ప్రపంచంలోని మొదటి వందమంది ధనవంతుల జాబితాలో ఒకడు.  కానీ గొప్ప మీడియా షై పర్సన్ ... పత్రికలవాళ్లతో తన పేరు రాయనివ్వడు.. తన ఫోటో వేసుకోనివ్వడు... గొప్ప సిగ్గు... అయినా నిన్న నీకు వొంట్లో బాగోలేదని తెలిసుకొని ఎంత కంగారు పడిపోయానో తెలుసా... ఇతనిక్కడికి బిజెనెస్ పనిమీద వచ్చాడు.  నేను నీకు పోన్‍చేసిన సమయంలో నాదగ్గరే వున్నాడు.  నేను అడిగేలోపలో లండన్ లో ఎప్పుడూ సిద్ఢంగా ఉండే తన సొంత విమానాన్ని నువ్వు రావడం కోసం ఏర్పాటు చేసాడు. చాలా మంచి కుర్రాడు.  ఐ లైక్ హిం"  అని చెబుతూ... రవీ మై బోయ్ అయామ్ సో ప్రౌడ్ ఆఫ్ యు... నా కూతురు పెళ్లి చేసుకోను అని చెబుతూ ఆరేళ్లనించీ  ఎయిర్ హోస్టెస్ లా మారి దేశాలు పట్టి తిరుగుతోంది... అదిగానీ నాన్నా నేను పెళ్లిచేసుకుంటాను అని చెప్పివుంటే నీ అంతస్తుకి తగిన వాళ్లం కాకపోయినా నా కూతురిని చేసుకోవయ్యా అని ఏనాడో అడిగేవాడిని.  నా కూతురిని ఉన్నపళంగా సహాయం చేసి తీసుకొచ్చి నాకు అప్పగించావు.  నేను నీకెంతో రుణపడివున్నాను... అని ఇంకా ఏదేదో చెప్పుకు పోతున్నారు సుజనా చౌదరిగారు...  ఆయన ఎప్పుడూ అంతే మనసులో ఉన్నది బైటికి మాట్లాడేస్తూంటారు... 

కానీ కిరణ్మయికి తన తండి చెబుతున్న ఏ కబుర్లూ చెవికెక్కడంలేదు... తన చూపులన్నే తన తండ్రి పక్కనే హుందాగా సుమధుర మందహాసంతో ప్రపంచాన్నే జయించగలిగానన్న ధీమాతో నిలబడి వున్న తన రవి మీదే వున్నాయి. రవి తన చిన్నప్పటికంటే ఇంకా ఎంతో హేండ్‍సమ్ గా కనబడుతున్నాడు..   రవిగూడా కిరణ్మయినే గమనిస్తున్నాడు.  కంచిపట్టుచీర కట్టి, నుదుటిన రమణీయమైన తిలకందిద్ది వాలు జడతో భూలోకానికి దిగివచ్చిన అప్సరసలాగా కనిపిస్తున్న తన కిరణ్మయి అందాల్ని తనివితీరా చూస్తున్నాడతను.  కిరణ్మయికి తనంటే ఇష్టమేనని ఆమె కట్టుకున్న చీరద్వారా తెలిసి అతని మనసు ఆనందంతో పొంగి పరవళ్లు తొక్కుతోంది...  

అలా ఇద్దరూ ఒకరినొకరు చూసుకుంటూ ఒకరి చేతులు ఒకరు పట్టుకుని ఎదురెదురుగా నిలబడి వుండిపోయారు.. కిరణ్మయి పెదవులు పలకడంలేదు కానీ మనసుమాత్రం కృష్ణా ప్రవాహంలాగా రవితోటి బిరబిరా అనేకమైన కబుర్లు చెప్పేస్తోంది.  తన చూపులు కిందకి దింపి తన చేతులని పట్టుకుని హుందాగా నిలుచుని వున్న రవి చేతులనే గమనిస్తోందామె.  అవే దృఢమైన చేతులు... ఒకప్పుడు కృష్ణానదిలో మునిగిపోబోయిన తనకి ప్రాణభిక్షపెట్టిన అందమైన చేతులు... ఇవాళ ప్రేమగా నీతో నేనున్నానని దైర్యాన్నిస్తూ తన చేతులని పదిలంగా పట్టుకొనివున్నాయి... కిరణ్మయి అప్రయత్నంగానే రవి చేతులను పైకి తీసుకుని తన బుగ్గలకు హత్తుకుంది. తన తండ్రి పక్కన ఉన్నాడనే విషయం మర్చిపోయి అతని భుజంపై, అప్పటిదాకా మోసిన ఏదో దయ్యపుబరువు దించేసుకున్నదానిలాగా వాలిపోయి హాయిగా బావిస్తూ కనులు మూసుకుంది... అప్పుడు పలికాయామె పెదవులు... "అయామ్ సచ్ ఎ ఫూల్ రవీ... ఐ షుడ్ హావ్ నోన్ యు బెటర్... బట్ నతింగ్ మేటర్స్ నౌ... ఐ లవ్ యు.. అండ్ ఐ వాంట్ యు ఫర్ ఎవర్ అండ్ ఎవర్... డోంట్ యు ఎవక్ లీవ్ మి అలోన్ అగైన్" అంటూ మధురంగా కనులు మూసుకొని పలికింది.  రవికూడా "ఐ లవ్ యు టూ కిరణ్" అని పలుకుతూ ఇక నిన్ను ఇక ఎక్కడికీ పోనివ్వను అన్నట్లుగా తన చేతి పట్టును కిరణ్మయి చుట్టూతా మరింతగా బిగించాడు.

"అదేమిటి.. మీ ఇద్దరికీ ఇంతకు ముందే పరిచయం ఉందా!"  వాళ్లిద్దరూ అంతగా ఒకరిమీద ఒకరు వాలిపోవడం చూసి ఆశ్చర్యపోతూ అందులోనూ తన కూతురు రవి తోటి ఐ లవ్ యు అని చెప్పడం చూసి ఒక విధంగ సంబరపడిపోతూ అడిగారాయన.

అప్పుడు  తన తండ్రి అక్కడే ఉన్నాడని గుర్తువచ్చి ఈ లోకంలోకి వచ్చి సిగ్గుగా రవికి కొంచెం దూరంగా జరిగింది కిరణ్మయి.  ఆమెను దూరంగా పోనివ్వకుండా మళ్లీ దగ్గరకి లాక్కుంటూ "సర్ మీరు నన్ను అడిగారుకదా మీ అమ్మాయి కిరణ్మయిని చేసుకొమ్మని... ఇప్పుడే చెప్పేస్తున్నాను. మీ కిరణ్మయి అంటే నాకు ఇప్పుడుకాదు నా చిన్నప్పట్నుంచీ ప్రాణం.  తను నా భార్య అయితే నాకంటే అదృష్టవంతుడు ఈ ప్రపంచంలో ఇంకొకరు లేరనుకుంటాను." అని అన్నాడు రవి...

"మీ ఇద్దరికీ చిన్నప్పిట్నించే పరిచయం వుందా... మరి ఆ విషయం నాకెందుకు చెప్పలేదు  మీ ఇద్దరికీ ఎలా పరిచయం?" కుతూహలంగా అడుగుతున్న చౌదరిగారి మాటలను మధ్యలోనే ఆపుచేస్తూ.   "నాన్నా! నేను నీకు అంతా వివరిస్తాను. కానీ ఒక చిన్న రిక్వెష్ట్.  నన్నూ రవినీ ఒక అరగంట పాటు వదిలెయ్యండి.  నేనూ రవీ గాల్లో విమానంలో తిరుగుతూ సరదాగా మాట్లాడుకోవల్సింది బోల్డంత వుంది. వియ్ హావ్ టు కాచప్ ఎ లాట్" అని కొంటెగా అంటూ  రవి చెయ్యి పట్టుకుని ఇంకా అక్కడే ఆగివున్న  రవి విమానంవైపుకు లాక్కుంటూ వెళ్లింది కిరణ్మయి.  ఆ ప్రేమ పక్షులను  ఎక్కించికుని గాల్లో సరదాగా ఎగిరిపోయిందా విమానం....

********* శుభం **********

Saturday, 5 February 2011

నర్మద - కధ

నర్మద

రచన: మాధవ తురుమెళ్ల

[ఈ కధ పాశ్చాత్య దేశాలలో ఉంటూన్న ఇద్దరు వ్యక్తుల నేపధ్యం ఉన్నది.  అందుకని  వారు సహజంగా మాట్లాడే ఇంగ్లీషు తెలుగు కలిసిన భాష ఎక్కువగా  ఉంటుంది... తెలుగులో పదాలు తెలిసినా ఎందుకో మొదట్లో రాయాలనిపించలేదు... కానీ  తెలుగులో చదవడమే బాగుంటుంది అనుకున్న వారికోసం ఇలా తిరిగి రాయడం మొదలుపెట్టాను... అనుకోకుండా ఇంకొంచెం జమ చేసాను... అందుకని ఇందులో విషయం ఇంకొంచెం ఎక్కువ ఉంటుంది...]

నర్మద అంటే భారతదేశంలో పుట్టి తూర్పునుండి పడమరకు ప్రవహించే ఒక జీవనది



పాండిచ్చేరినుండి కారులో చెన్నై ఏర్‌పోర్టు చేరుకునేసరికి సాయంత్రం అయింది. నా ఫ్లైట్‌కు ఇంకా టైం ఉందని తెలియడంతో వెయిటింగ్‌ లాంజ్‌కువెళ్లి కూర్చున్నాను.

నేను భారతదేశం ఉద్యోగరీత్యా వదిలిపెట్టి దాదాపు ఇరవైఏళ్లవుతోంది. నేను పనిచేసే కంపెనీకి భారతదేశంలో బ్రాంచి ఉండటంతో కనీసం మూడునెలలకు ఒక్కసారయినా బాంబే వస్తూంటాను. వీకెండ్స్‌ వీలైనంతగా నాకు నచ్చిన ప్రదేశాలను చూడటానికి వెళ్తూంటాను. నాకు అరబిందో మహర్షి అంటే చాలా ఇష్టం. అందుకే భారతదేశం వెళ్లినప్పుడు వీలైతే వీకెండ్స్ పాండిచ్చేరి వెళ్లి ఆ మహర్షి సమాధివద్ద కూర్చుని కొంతసేపు ధ్యానంలో గడిపి వస్తుంటాను.

తీవ్రమైన ఆవేదన కలిగినవారెవరైనా అరబిందో రచన ఏదోఒకటి చదివితే మనశ్శాంతిని తప్పకుండా పొందుతారు అని నా నమ్మకం. నాకంటూ నేను ప్రత్యేకించి ఆయన వ్రాసిన "సావిత్రి' కవిత్వాన్ని చదివిప్పుడల్లా అనిర్వచనీయమైన ఒక అనుభూతిని పొందుతాను. సతీసావిత్రి కధ తెలియని వారుండరు! ఆవిడ ఒక మహాసాధ్వి. తన భర్త ప్రాణాలను తీసుకు వెళ్లటానికి వచ్చిన యమధర్మరాజును అదిరించి, బెరిదించి చివరకు అదమరిపించి మూడు వరాలు తీసుకొని చివరకు తన భర్తప్రాణాలను కూడా కాపాడుకోగలిగిన సాధ్వి!

అరవిందమహర్షిగారి సావిత్రిని చదివి లోకంలో ఇంతగా భర్తను ప్రేమించే అడవారుంటారా అని ఆశ్చర్యపోయాడట ఒక ఇంగ్లండుభాబాగారు .... (భాబా అంటే భార్యాబాధితుడు అని). భర్తను ప్రేమించేవారు ఉంటారు, ఎందుకు ఉండరు?! అన్ని చెడ్డపనులు చేసిన రావణాసురునికి మండోదరి లేదా! మండోదరి యొక్క పాతివ్రత్యాన్ని అనూచానంగా సీత సావిత్రిలతోటి సమానంగా పొగుడుతూంటారు. అంత గొప్పదనం ఆవిడది...

ప్రేమ మానసికం, అది శరీరంతో ముడిపడింది కాదు. శరీరంతో మొదలయిన ఆకర్షణ శరీరంతోటే అంతమవుతుంది కానీ మనసుతోటి ప్రేమ ఆత్మబంధంగా మారుతుంది. వివాహం ఒక ఆత్మబంధం హైందవ వివాహం అందుకే మనసా, వాచా, కర్మణా అని మనసే ప్రధానంగా మొదలవుతుంది.

శరీరంయెక్క అందాన్నిచూసి ప్రేమలో పడినవారు మర్చిపోవడం చాలాతేలిక, కానీ మనసిచ్చి ప్రేమించినవారు మర్చిపోలేరు చాలా ఆవేదన చెందుతారు. అది సహజం.

మనసిచ్చి ప్రేమించే భార్యదొరకడం సత్యవంతుడి అదృష్టం. అటువంటి ప్రేమపొందాడు కాబట్టే మృత్యువునుండి బైటపడ్డాడు. సావిత్రిది మనసున మనసైన ప్రేమ. అటువంటి అందమైన భావనకు చక్కటి రూపాన్ని ఇంగ్లీషుభాషలో ఇవ్వగలగడం అరవిందమహర్షికే చెల్లింది....

ఇలాఏదో ఆలోచిస్తూ పరధ్యానంగా ఉన్ననాకు ఎవరో నన్నే నిశితంగా గమనిస్తున్నారన్న భావనకలిగి తలతిప్పి చూసాను.... దూరంగా వెయిటింగ్‌ ఏరియాలో కూర్చుని ఉన్న ఒకమ్మాయి నన్నే గమనిస్తోంది. ఎవరో మనకెందుకులే అనుకొని నా చేతిలో ఉన్న పుస్తకంలో మునిగిపోయాను.


********

"ఎక్స్యూజ్‌మీప్లీజ్‌! సర్‌ హౌరాయూ డూయింగ్‌! నన్ను గుర్తు పట్టారా'
ఇందాక నన్నే గమనిస్తోందనుకున్న అమ్మాయి ఎదురుగా నుంచుని పలకరించడంలో పుస్తకంలోంచి తలతిప్పి తనని చూసాను.

"నర్మదా! నువ్వేనా' ఆశ్చర్యంగా అడిగాను. తనని అక్కడ ఊహించకపోవడంతో మొదట గుర్తుపట్టలేకపోయాను.

"ధేంక్‌గాడ్‌ మీకు నేను గుర్తున్నాను' సంతోషంగా మొహంపెట్టి "చెప్పండిసర్‌ ఎలావున్నారు' అన అడుగుతూ నా పక్కన కూర్చుంది.

నర్మద చూడటానికి చాలా బాగుంటుంది. నర్మద పేరు ఎంత బాగుంటుందో, అంతకు తగ్గ అందాన్ని తనకు భగవంతుడు ఇచ్చాడు. చాలా తెలివితేటలు కలిగిన అమ్మాయి. అంతకుమించి ఆధునికభావాలు కలిగిన అమ్మాయి.

అదేమి చిత్రమో భారతదేశంలోని మిగిలిన జీవనదులన్నీ పడమటినుండి తూర్పుకు ప్రవహిస్తే నర్మదానది మాత్రం  అనూచానంగా వస్తున్న సంప్రదాయాన్ని ధిక్కరిస్తున్నట్లు, తూర్పునుండి పడమరకు ప్రవహిస్తుంది.... నర్మదపేరు తన భావాలకు తగినట్లుగా సరిపోతుంది....

నర్మద నాకు ఒక పదేళ్ల క్రితం చాలా విచిత్రమైన పరిస్థితుల్లో పరిచయం అయింది. అవి నాకు గ్లోబల్ డైరెక్టర్‌గా ప్రమోషన్‌ వచ్చినరోజులు. నేను కంపెనీ పనిమీద జపాన్‌ వెళ్లాను. మా కంపెనీలో చాలామంది అవుట్‌సోర్సింగ్‌ కాంట్రాక్టులతో పనిచేస్తుంటారు. నర్మద అలాగే కాంట్రక్టు వర్కు చెయ్యడానికి అక్కడికి వచ్చింది. అలా అక్కడ టోక్యోలో పరిచయం అయింది నర్మద.

"నువ్వేమిటి ఆశ్చర్యంగా ఇండియాలో?' అడిగాను.

"ఏంచేస్తానుసర్‌! మీకు తెలియనిదేముంది.  భారతదేశంలో విదేశాలతోటి పోటీపడేటట్లుగా జీతాలు ఇస్తున్నారు. ఆ డబ్బుకి ఆశపడి తిరిగి రాక తప్పలేదు.'

"హా కానీ నీక ఇక్కడి ఆచార వ్యవహారాలు నచ్చవుగదా...' అడిగాను. నాగురించి తనకు బాగా తెలిసిఉండటంతో నాప్రశ్నను తను తప్పుగా అర్ధంచేసుకోలేదు.

"ఊహించుకోండి ఏంటో! నేనిప్పుడు నా నాలుగో భర్తతో ఉన్నాను ' తేలికగా తీసుకుని నవ్వుతూ చెప్పింది.

"హాస్యానికి అంటున్నావా!" అలా అంతపెద్ద విషయం అంత తేలిగ్గా ఎలా చెప్పిందా అనుకుని ఖంగుతిని  అడిగాను.

"లేదు సర్‌ మీతో ఎందుకు అబద్ధం చెబుతాను. నిజంగానే నేను ఇప్పుడు నాలుగో పెళ్లిచేసుకుని  వున్నాను.'.

"అదేంటి ఎందుకలా' ఆశ్చర్యంగా అడిగాను.

*****
 
నర్మద టోక్యోలో మా ఆఫీసు పనిమీద ఒక ఆరునెలలు వుంది. తనవి చాలా చక్కటి తెలివితేటలు. ఆ అమ్మాయి చేసే పని నచ్చి నేను నేను మా షికాగో ఆఫీసులో పర్మనెంటు ఉద్యోగం చెయ్యమంటూ సిఫార్సు చేసాను. దాంతోటి తను చాలా సంతోషించింది. అలా మా షికాగో ఆఫీసులో ఉద్యోగానికి కుదిరింది.  మాకు పరిచయం అయింది జపాన్‌లోనైనా నాకు నర్మదగురించి పూర్తిగా తెలిసింది షికాగోలోనే. అదిగూడా తన తోటి ఇండియన్‌ వర్కర్సు గాసిప్‌ ఎక్కువవడంతో.

తనతోటిపనిచేసే ఒకమ్మాయి వచ్చి నాతో కంప్లయింట్‌ చేసింది. "సర్‌! ప్లీజ్‌ నేను నర్మదతో పని చెయ్యలేను' అని.

"ఎందుకని?'

"సర్‌ మూడురోజులకు ఒక వ్యక్తితో గడుపుతుంది. తనవి చాలా విచిత్రమైన భావాలు. నేను సాంప్రదాయ కుటుంబంలో పెరిగినదాన్ని. నాభావాలకు తన భావాలకు పడదు'

"సరే నేను కనుక్కుంటాను' అని ఆ అమ్మాయిని పంపించేసాను.

నిజానికి వ్యక్తిగతజీవతాలు వారివారి సొంతం అని నేను చాలా గట్టిగా నమ్ముతాను. నర్మద నిస్సందేహంగా చాలా బాగా పనిచేస్తుంది. తనవల్ల మా కంపెనీకి చాలా మంచి జరుగుతుందని నాకు తెలుసు అందుకే నాకు నర్మదను తన వ్యక్తిగత జీవితంపై వచ్చిన కంప్లెయింట్స్‌తోటి వదులుకోవడం నాకు ఇష్టంలేదు. కానీ తన వ్యక్తిగత జీవితం తన తోటి ఉద్యోగస్థులను ఇబ్బందికి గురిచేస్తోందని తెలియడంతో ఒక అధికారిగా దీనిని గూర్చి అవగతం చేసుకోవల్సిన బాధ్యత నాపైన పడింది. సరే నర్మదతోటి మాట్లాడి చూడాలని నిశ్చయించుకుని తనను నా ఛేంబర్‌ లోకి రమ్మని కబురుచేసాను.

"సర్‌ పిలిచారట!'

"ఆ రామ్మా! నీతో కొంచెం మాట్లాడాలి. రా కూర్చో' నర్మద వచ్చి నా ఎదురుగా కూర్చుంది.

"ఏంలేదు.. నువ్వు చాలా బాగా వర్క్‌ చేస్తున్నావన నీ మేనేజర్స్‌ అందరూ చెబుతున్నారు. ప్లీజ్‌ కీపప్‌ ద గుడ్‌వర్క్‌' 

"ధాంక్యూ సర్‌...' నర్మద పసిగట్టినట్లుంది నేను ఏదో తనగురించిన గంభీరమైన విషయాన్ని డిస్కస్‌ చెయ్యడానికే పిలిచానని. "చెప్పండి సర్‌' అడిగింది.

"ఏం లేదమ్మా, నీగురించి నాకు ఎక్కువగా తెలియదు... తోటి తెలుగు అమ్మాయివిగదా సరే ఈ దేశంకాని దేశంలో ఎలా వుంటున్నావు ఎలా తిరుగుతున్నావు అని తెలుసుకుందామనుకున్నాను. అన్యధా భావించకు" అన్నాను.

"ప్రస్తుతం నేను జార్జ్‌ తోటి ’పెళ్లిచేసుకోకుండా కలిసి కాపురం చేసున్నాను  సర్‌, అంతకు ముందర ప్రదీప్‌తోటి పెళ్లిచేసుకోకుండా కలిసి కాపురం చేస్తూ ఉన్నాను... బహుశా దానిగురించి మీకు  ఫిర్యాదులు వచ్చి వుంటాయి, అందుకే పిలిచారనుకుంటున్నాను' ఆ అమ్మాయి చాలా ఋజువుగా సుజావుగా నిజం చెప్పింది. నాకు అనుకోకుండానే విన్‌ష్టన్‌చర్చిల్‌ చెప్పిన ఒక గొప్ప విషయం  గుర్తువచ్చింది.  " ’సత్యం’ అనేది తిరుగులేనిది.  అవకాశవాదులు దానిని వాడుకుని తప్పుడర్ధాలు తీయవచ్చు,  అజ్ఞానం దానిని తక్కువచేసి చూడవచ్చు, కానీ చివరకు మిగిలేది ఒక్కటే ... అది సత్యమే"  

నర్మద నిర్భయంగా చెప్పిన ఆ నిజాన్ని విన్నతర్వాత ఇక తనగురించి ఎక్కువ అడగాల్సిన అవసరం నాకు లేదనిపించింది. కానీ తనే చెప్పడం మెదలుపెట్టింది...

"సర్‌ మీగురించి చాలామంది చాలా గొప్పగా చెబుతారు. భారతసాంప్రదాయాలపట్ల మీకున్న గౌరవం నాకు తెలుసు. కానీ ఆ సాంప్రదాయాలే నా ఇద్దరు అక్కలను నానుంచి దూరం చేసిందని నేననుకుంటాను.'

"ఏమైంది?' అడగకుండా వుండలేకపోయాను.

"మా నాన్నగారు శ్రోత్రియ బ్రాహ్మణుడు, మేము మొత్తం ముగ్గురం ఆడపిల్లలం. నర్మదానది పుష్కరాల సమయంలో పుట్టానని నాకు నర్మద అని పేరుపెట్టారు. అక్కలిద్దరికీ పెళ్లయింది పెద్దక్క భర్త బైట బోల్డంతమంది ఆడవాళ్లతోటి తిరుగుతూంటాడు, కానీ మా అక్క మాత్రం ఇంట్లో పేరుకు భార్య అనబడే పనిమనిషి. మా నాన్నగారు మా అక్కకు సీత సావిత్రిల పోలిక చెప్పి భర్తను భరించడమే పాతవ్రత్యమంటూంటారు. మా అమ్మ ఏమీ చెప్పలేక వ్యర్ధమైన అక్క జీవితాన్నిచూసి గుడ్లమ్మట నీళ్లుకుక్కుకుంటూంటే చూస్తూ పెరిగినదాన్ని...

ఇక మా చిన్నక్క భర్త తనని ప్రతిక్షణం అనుమానిస్తుంటాడు... బైట పాలవాడు పాలు పోస్తూ ఒక్కక్షణం ఎక్కువ నిలబడ్డా వాడితో ఏ శృంగారం వెలగబెడుతున్నావే లం**** అంటూ ఇష్టంవచ్చిన బూతులు మాట్లాడుతూ ఇల్లు నరకం చేస్తూంటాడు. అదిగో అటువంటి అక్కల కుటుంబాలు చూసి, సాంప్రదాయం కొంగు పట్టుకు వేళ్లాడే మా నాన్నని చూసి, చేతకానితనాన్ని కంటినీటితో తుడిచే వ్యర్ధప్రయత్నంచేసే నా తల్లిని చూసీ నాకు భారతదేశం అంటేనే రోతపుట్టింది... సీత, సావిత్రి అంటేనే అసహ్యం పుట్టింది.... అందుకే వీలయినంత ప్రయత్నం చేసి భారతదేశంనుండి బైటపడ్డాను. శరీరం ఉంది కాబట్టి దాని అవసరాలను తీర్చుకోవడం తప్పులేదనుకున్నాను. శరీరపు అవసరాన్ని తీర్చుకోవడానికి వివాహం అనే అబద్ధాన్ని ఆడాలని నాకెందుకో అనిపించలేదు. నమ్మండి నమ్మకపోండి ... ఇదీ సర్‌ నా జీవితం...' చెప్పింది నర్మద.

ఎందుకో నాకు నర్మదపట్ల జాలి కలిగింది. అవును అందులో తప్పేంవుంది? తన బ్రతుకు తను బ్రతకడంలో తప్పేంవుంది. ఈ ప్రపంచంలో స్వేచ్ఛగా బ్రతికే హక్కు ప్రతిజీవికీ ఉంది. అడవిలో పెరిగే ప్రతి చెట్టు చేమ, ప్రతి పూలమొక్కా ఎంత నిర్భయంగా తమదైన ఒంటరి జీవితాన్ని నింగినీ, నేలనూ, నీటినీ భగవంతుడినించి ఆశిస్తాయో అటువంటి స్వేచ్ఛకు మనిషిగూడా అర్హుడే...

నర్మద వ్యక్తిగతజీవితం ఆ అమ్మాయి స్వంతంత్రతకు స్వేచ్ఛకు నిదర్శనం. సంప్రదాయపు అద్దాలలోంచి చూస్తే చాలా చిరాకు అనిపించచ్చు కానీ, ఏది సంప్రదాయం?! ఎప్పుడు మొదలయింది? ఎందుకు మొదలయింది, అది ఎవరి అవసరాలను తీరుస్తోంది? ఇటువంటి ప్రశ్నలు మొదలవుతాయి. బహుశా నర్మదను తన మానానికి తనని వదలడమే మంచిదనే నిర్ణయానికి వచ్చాను. అటుతర్వాత నాకు నర్మదతోటి చాలా మంచి పరిచయం ఏర్పడింది. దాదాపు సంవత్సరం పాటు నాకు తిరిగి లండన్‌ హెడాఫీసు ట్రాన్స్‌ఫర్‌ అయిందాకా మేము దాదాపు ప్రతిరోజూ మాట్లాడుకునేవాళ్లం. నర్మదకు చలంగారి రచనలన్నా, తిలక్‌గారి వెన్నెల్లో ఆడపిల్ల కవితలన్నా చాలా ఇష్టం... నాకుగూడానూ... అలా మేము అనేకమైన విషయాలనుగూర్చి మాట్లాడుకునేవాళ్లం... నర్మద ఎట్టిపరిస్థితులలోనూ భారతదేశానికి వెళ్లనని చెబుతూండేది. నేనేమో భారతదేశంలో ఎప్పుడో ఒకప్పుడు తనని మనసిచ్చి ప్రేమించి పెళ్లిచేసుకునేవాడు దొరుకుతాడని చెబుతూండేవాడిని.

నేను లండన్‌ వచ్చేసి దాదాపు ఐదు సంవత్సరాలయింది. మొదట్లో నర్మద ఈమెయిల్స్‌ వ్రాసేది తర్వాది అదీలేదు... ఎవరో తర్వాత చెప్పారు తను రిజైన్‌ చేసి వెళ్లిపోయింది అని. నాకు ఆశ్చర్యం అనిపించలేదు.

అటువంటి నర్మద ఇప్పుడు ఇలా భారతదేశంలో, చెన్నై ఏర్‌పోర్టులో హటాత్తుగా కలవడం నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది. ఇప్పుడు అంతకంటే ఆశ్చర్యం తన నాలుగో పెళ్లిగురించి తెలుసుకోవడం... అందుకే అడిగాను..

*******

"అదేంటి ఎందుకలా' ఆశ్చర్యంగా అడిగాను...

"ఇక్కడికి వచ్చిన తర్వాత తెలిసింది భారతదేశం ఏమీ మారలేదని. ఇంటిగురించి వెదుకుతూంటే పెళ్లయినవాళ్లకే ఇల్లు ఇస్తామని చెబుతారు... అదేదే పెళ్లంటే చాలా మంచిదన్నట్లుగా...' నర్మద చిరాకుగా చెప్పింది...

"హూ...' నేను వింటున్నాను.

"ఇక చెప్పగలిగింది ఏముందిసర్‌! భారతదేశపు చట్టం పెళ్లిచేసుకోకుండా కలిసి కాపురాలు చేస్తున్నవారి  గురించి ఏమీ చెప్పదు... కానీ సమాజం మాత్రం సరేమిరా కాదు కుదరదు  అంటుంది... అందుకని ఒక సులభమైన పద్దతి  ఆలోచించాను.'

"ఏమిటది?' కుతూహలంగా అడిగాను...

"ఏముంది... రిజిష్ట్రార్‌ ఆఫీసులో పెళ్లిచేసుకోవడం... కుదిరినన్నిరోజులూ కలిసివుండటం... లేదంటే ఎమికబుల్‌ డైవోర్స్‌ తీసుకోవడం... నాకు ఈ పద్ధతి చాలా  సుజావుగా అనిపించింది.  సమాజం చూసేది నా మెడలో మంగలసూత్రం ఉందా లేదా నా నుదుటున సింధూరం ఉన్నదా లేదా అని మాత్రమే... అవి కనబడితే చాలు పతివ్రతననే అనుకుంటారు... చిలకా గోరింకలమనే చెప్పుకుంటారు.  వాళ్లకు ఆ అజ్ఞానం మాకు ఆ అవకాశం ఉండటం మంచిదే. ' చాలా తేలికగా చెప్పేసింది.

అదివిన్న నాకు నోట మాట రాలేదు. కానీ నా మనసులో ఒక భావన....  ’ఎంత అమాయకురాలు! సరాసరి పెరుగుతున్న ఒక చిన్న మొక్కకు సూర్యకాంతి తగులకుండా అడ్డుపెడితే అది అనేక వంకరలతో అడ్డదిడ్డంగా పెరుగుతుంది.  ఆ మొక్క పొందాలనుకున్నది సూర్యకాంతినే అయినా దాని వంకర టింకరలు మనకు అసహ్యన్ని కొలిపిస్తాయి... ఎదుటివ్యక్తుల సంసారాలని చూసి నచ్చక తనదైన రీతిలో సంసారాలను సృష్టించుకున్న ఈ అమాయకురాలికి నేను ఏం హితబోధ చెయ్యగలను!’ అనుకున్నాను.

మాట్లాడకుండా తననే చూస్తూ నాలో లేస్తున్న భావనలనే అలలు మాటలరూపంలో ఆ అమ్మాయిని ముంచెత్తకుండా పెదవుల అడ్డుకట్టలు వేస్తూ కూర్చున్న నన్ను గమనిస్తూ ఇంకా చెప్పింది... " నీ జీవితంపై నీవు అధికారం సంపాదించడం ముఖ్యం.  ఒక్కసారి నీ జీవితాన్ని నీ చేతుల్లోకి తీసుకున్న తర్వాత ఇక ఇతరులనుండిగానీ సమాజాన్నుండిగానీ అనుమతి తీసుకోవాల్సిన అవసరం లేదు... కానీ ఎప్పుడైతే నీ జీవితాన్ని జీవించడంలో సమాజం అనుమతికోసం ఎదురుచూస్తూ కూర్చుంటావో అప్పుడే నీజీవితాన్ని కోల్పోతావు... అప్పట్నించి అది నీజీవితం కాదు... వారు అడిగిన... వారు కోరుకున్న జీవితం..."  నా కళ్లలోకే పరిశీలనగా చూస్తూ చెప్పింది....

నేను ఇంకా మాట్లాడలేదు... ఏం చెప్పగలను... నీవు చేస్తోంది ఖచ్చితంగా ’తప్పు’ అని ఎలా చెప్పగలను?!  ఏ ఋజువులతో తనని ఒప్పించగలను! నేను ఆమె అసహ్యించుకున్న ఆమెని ఇలా మారేటట్లు పురికొల్పిన  ఆ సమాజంలో భాగాన్నే కదా!... ఒకవేళ నర్మద ’ఏవండీ నేనిలా వరస పెళ్లిళ్లు చేసుకోవచ్చా... లేదా పెళ్లిచేసుకోకుండా శారీరక వాంఛలు తీర్చుకోవడానికోసమ్ పెళ్లిలేని కాపురాలు చెయ్యచ్చా" అని నన్ను అడిగిందే అనుకుంటే బహుశా ఆమె జీవితాన్ని జీవించడానికి నేను ’అనుమతి’ ఇచ్చినవాడినవుతాను... అప్పుడు తను ఎలా జీవిస్తుందో అది నేను ఆశించిన జీవితమేకానీ తను ఆశించిన జీవనం అవకపోవచ్చు".... కొన్నికొన్నిసార్లు ఆలోచనలు ఏమీ తేల్చనివ్వకుండా అంతులేని అగాధాలలోకి నెట్టేస్తాయి కదా....
   
"ఏమైతేనేం సర్! జీవితంలో అలిసిపోయాను...  నాకెందుకో భారతదేశం అంటే విసుగు వచ్చింది.  నేను మళ్లీ తిరిగి అమెరికా వెళ్లిపోతున్నాను.  ఇవాళే చెన్నై కాన్సులేట్‍లో గ్రీన్‍కార్డ్ వీసా ఇంటర్గ్యూకి హాజరై వచ్చాను.  నాకు గ్రీన్‍కార్డు ఇచ్చేసారు.  దేవుడు దయతలిస్తే ఇక అక్కడే అమెరికాలోనే శాశ్వతంగా జీవిస్తూ ఎప్పుడో రాలిపోతాను... ఇక తిరిగి రాను." శూన్యంలోకి చూస్తూ స్వగతంలా పలికింది....

అలా చెప్తున్న ఆమె కన్నుల్లో ఎందుకో నాకు ఆత్మహత్య చెసుకునేవారిలో ఉండే నిర్వేదం కనిపించింది...కానీ నాకు తెలుసు తను ఆత్మహత్య చేసుకునేంత పిరికిది కాదు.   ఆమె మాట్లల్లో వెల్లువెత్తిన విషాదం ధ్వనించింది... కానీ నాకు తెలుసు తను జీవితాన్ని చాలా హాస్యంగా తీసుకుంటుంది... బహుశా నర్మద నాకు తెలియని మార్పేదైనా  వస్తోందేమో... ఆ ఊహ నాకు ఉత్సుకతని ఇచ్చింది... ఆమెతో ఇంకా సంభాషణ పొడిగించాలనుకున్నాను.

నాకు తనతో  ఎంతో మాట్లాడాలి అని అనిపించింది. ఏదో ఒకవిధంగా తనకు నచ్చచెప్పాలని అనిపించింది. కానీ ఎందుకో ఆ సందర్భంలో ఏది చెప్పినా అసమంజసంగా వుంటుందేమోనని అనిపించింది. కొంచెం ఆగి నిదానంగా ఉత్త్రరాలు రాయడం సాగిస్తే మంచిది... ఈ మొక్కకు ఇక సూర్యరశ్మి అడ్డులేదు... తను పెరగాల్సినట్లు పెరిగింది... సూర్యరశ్మి కావల్సినంత దొరికింది... ఇక సరాసరి పెరగడమే తనకి భగవంతుడు ఇచ్చే వరం.... అనుకున్నాను. 

 "ఓకేసర్‌ నా ఫ్లైట్‌ టైమ్‌ అయింది... వెళ్లొస్తాను... ఇది నా అడ్రస్ ఈ సారి తప్పనిసరిగా మీకు ఉత్తరాలు రాస్తాను ' చెప్పి లేచి నిలబడ్డ నర్మదకు అనాలోచితంగానే బైబై చెప్పాను... కానీ వెళుతున్న తననే చూస్తూ ఉండిపోయాను...

నాకు అరబిందో చెప్పిన గొప్ప మాట గుర్తువచ్చింది... "మానవుల మనసులు, ఆవేశాలు, బౌద్ధికమైన బావనలు అనేకమైనవి మరియు అంతులేనివి, అందుకే  భారతదేశపు మతము --- మనిషి ఈ అనంత విశ్వంలో తనదైన గమ్యాన్ని చేరడానికి --- మనిషిచేసే ఆలోచనలపట్లా, మనిషి పూజించే దేవునిపట్లా  సంపూర్ణమైన వ్యక్తిగతమైన  స్వాతంత్ర్యాన్ని కల్పించింది"  --- నర్మదా!  భగవంతుడు నిన్ను అనుగ్రహించునుగాక... నా పెదవులు మెట్లమీదుగా విమానంలోకి వెళ్లిపోతున్న ఆమెనే చూస్తూ పలికాయి...


-------- &&& -------