Total Pageviews

Saturday 5 February 2011

నర్మద - కధ

నర్మద

రచన: మాధవ తురుమెళ్ల

[ఈ కధ పాశ్చాత్య దేశాలలో ఉంటూన్న ఇద్దరు వ్యక్తుల నేపధ్యం ఉన్నది.  అందుకని  వారు సహజంగా మాట్లాడే ఇంగ్లీషు తెలుగు కలిసిన భాష ఎక్కువగా  ఉంటుంది... తెలుగులో పదాలు తెలిసినా ఎందుకో మొదట్లో రాయాలనిపించలేదు... కానీ  తెలుగులో చదవడమే బాగుంటుంది అనుకున్న వారికోసం ఇలా తిరిగి రాయడం మొదలుపెట్టాను... అనుకోకుండా ఇంకొంచెం జమ చేసాను... అందుకని ఇందులో విషయం ఇంకొంచెం ఎక్కువ ఉంటుంది...]

నర్మద అంటే భారతదేశంలో పుట్టి తూర్పునుండి పడమరకు ప్రవహించే ఒక జీవనది



పాండిచ్చేరినుండి కారులో చెన్నై ఏర్‌పోర్టు చేరుకునేసరికి సాయంత్రం అయింది. నా ఫ్లైట్‌కు ఇంకా టైం ఉందని తెలియడంతో వెయిటింగ్‌ లాంజ్‌కువెళ్లి కూర్చున్నాను.

నేను భారతదేశం ఉద్యోగరీత్యా వదిలిపెట్టి దాదాపు ఇరవైఏళ్లవుతోంది. నేను పనిచేసే కంపెనీకి భారతదేశంలో బ్రాంచి ఉండటంతో కనీసం మూడునెలలకు ఒక్కసారయినా బాంబే వస్తూంటాను. వీకెండ్స్‌ వీలైనంతగా నాకు నచ్చిన ప్రదేశాలను చూడటానికి వెళ్తూంటాను. నాకు అరబిందో మహర్షి అంటే చాలా ఇష్టం. అందుకే భారతదేశం వెళ్లినప్పుడు వీలైతే వీకెండ్స్ పాండిచ్చేరి వెళ్లి ఆ మహర్షి సమాధివద్ద కూర్చుని కొంతసేపు ధ్యానంలో గడిపి వస్తుంటాను.

తీవ్రమైన ఆవేదన కలిగినవారెవరైనా అరబిందో రచన ఏదోఒకటి చదివితే మనశ్శాంతిని తప్పకుండా పొందుతారు అని నా నమ్మకం. నాకంటూ నేను ప్రత్యేకించి ఆయన వ్రాసిన "సావిత్రి' కవిత్వాన్ని చదివిప్పుడల్లా అనిర్వచనీయమైన ఒక అనుభూతిని పొందుతాను. సతీసావిత్రి కధ తెలియని వారుండరు! ఆవిడ ఒక మహాసాధ్వి. తన భర్త ప్రాణాలను తీసుకు వెళ్లటానికి వచ్చిన యమధర్మరాజును అదిరించి, బెరిదించి చివరకు అదమరిపించి మూడు వరాలు తీసుకొని చివరకు తన భర్తప్రాణాలను కూడా కాపాడుకోగలిగిన సాధ్వి!

అరవిందమహర్షిగారి సావిత్రిని చదివి లోకంలో ఇంతగా భర్తను ప్రేమించే అడవారుంటారా అని ఆశ్చర్యపోయాడట ఒక ఇంగ్లండుభాబాగారు .... (భాబా అంటే భార్యాబాధితుడు అని). భర్తను ప్రేమించేవారు ఉంటారు, ఎందుకు ఉండరు?! అన్ని చెడ్డపనులు చేసిన రావణాసురునికి మండోదరి లేదా! మండోదరి యొక్క పాతివ్రత్యాన్ని అనూచానంగా సీత సావిత్రిలతోటి సమానంగా పొగుడుతూంటారు. అంత గొప్పదనం ఆవిడది...

ప్రేమ మానసికం, అది శరీరంతో ముడిపడింది కాదు. శరీరంతో మొదలయిన ఆకర్షణ శరీరంతోటే అంతమవుతుంది కానీ మనసుతోటి ప్రేమ ఆత్మబంధంగా మారుతుంది. వివాహం ఒక ఆత్మబంధం హైందవ వివాహం అందుకే మనసా, వాచా, కర్మణా అని మనసే ప్రధానంగా మొదలవుతుంది.

శరీరంయెక్క అందాన్నిచూసి ప్రేమలో పడినవారు మర్చిపోవడం చాలాతేలిక, కానీ మనసిచ్చి ప్రేమించినవారు మర్చిపోలేరు చాలా ఆవేదన చెందుతారు. అది సహజం.

మనసిచ్చి ప్రేమించే భార్యదొరకడం సత్యవంతుడి అదృష్టం. అటువంటి ప్రేమపొందాడు కాబట్టే మృత్యువునుండి బైటపడ్డాడు. సావిత్రిది మనసున మనసైన ప్రేమ. అటువంటి అందమైన భావనకు చక్కటి రూపాన్ని ఇంగ్లీషుభాషలో ఇవ్వగలగడం అరవిందమహర్షికే చెల్లింది....

ఇలాఏదో ఆలోచిస్తూ పరధ్యానంగా ఉన్ననాకు ఎవరో నన్నే నిశితంగా గమనిస్తున్నారన్న భావనకలిగి తలతిప్పి చూసాను.... దూరంగా వెయిటింగ్‌ ఏరియాలో కూర్చుని ఉన్న ఒకమ్మాయి నన్నే గమనిస్తోంది. ఎవరో మనకెందుకులే అనుకొని నా చేతిలో ఉన్న పుస్తకంలో మునిగిపోయాను.


********

"ఎక్స్యూజ్‌మీప్లీజ్‌! సర్‌ హౌరాయూ డూయింగ్‌! నన్ను గుర్తు పట్టారా'
ఇందాక నన్నే గమనిస్తోందనుకున్న అమ్మాయి ఎదురుగా నుంచుని పలకరించడంలో పుస్తకంలోంచి తలతిప్పి తనని చూసాను.

"నర్మదా! నువ్వేనా' ఆశ్చర్యంగా అడిగాను. తనని అక్కడ ఊహించకపోవడంతో మొదట గుర్తుపట్టలేకపోయాను.

"ధేంక్‌గాడ్‌ మీకు నేను గుర్తున్నాను' సంతోషంగా మొహంపెట్టి "చెప్పండిసర్‌ ఎలావున్నారు' అన అడుగుతూ నా పక్కన కూర్చుంది.

నర్మద చూడటానికి చాలా బాగుంటుంది. నర్మద పేరు ఎంత బాగుంటుందో, అంతకు తగ్గ అందాన్ని తనకు భగవంతుడు ఇచ్చాడు. చాలా తెలివితేటలు కలిగిన అమ్మాయి. అంతకుమించి ఆధునికభావాలు కలిగిన అమ్మాయి.

అదేమి చిత్రమో భారతదేశంలోని మిగిలిన జీవనదులన్నీ పడమటినుండి తూర్పుకు ప్రవహిస్తే నర్మదానది మాత్రం  అనూచానంగా వస్తున్న సంప్రదాయాన్ని ధిక్కరిస్తున్నట్లు, తూర్పునుండి పడమరకు ప్రవహిస్తుంది.... నర్మదపేరు తన భావాలకు తగినట్లుగా సరిపోతుంది....

నర్మద నాకు ఒక పదేళ్ల క్రితం చాలా విచిత్రమైన పరిస్థితుల్లో పరిచయం అయింది. అవి నాకు గ్లోబల్ డైరెక్టర్‌గా ప్రమోషన్‌ వచ్చినరోజులు. నేను కంపెనీ పనిమీద జపాన్‌ వెళ్లాను. మా కంపెనీలో చాలామంది అవుట్‌సోర్సింగ్‌ కాంట్రాక్టులతో పనిచేస్తుంటారు. నర్మద అలాగే కాంట్రక్టు వర్కు చెయ్యడానికి అక్కడికి వచ్చింది. అలా అక్కడ టోక్యోలో పరిచయం అయింది నర్మద.

"నువ్వేమిటి ఆశ్చర్యంగా ఇండియాలో?' అడిగాను.

"ఏంచేస్తానుసర్‌! మీకు తెలియనిదేముంది.  భారతదేశంలో విదేశాలతోటి పోటీపడేటట్లుగా జీతాలు ఇస్తున్నారు. ఆ డబ్బుకి ఆశపడి తిరిగి రాక తప్పలేదు.'

"హా కానీ నీక ఇక్కడి ఆచార వ్యవహారాలు నచ్చవుగదా...' అడిగాను. నాగురించి తనకు బాగా తెలిసిఉండటంతో నాప్రశ్నను తను తప్పుగా అర్ధంచేసుకోలేదు.

"ఊహించుకోండి ఏంటో! నేనిప్పుడు నా నాలుగో భర్తతో ఉన్నాను ' తేలికగా తీసుకుని నవ్వుతూ చెప్పింది.

"హాస్యానికి అంటున్నావా!" అలా అంతపెద్ద విషయం అంత తేలిగ్గా ఎలా చెప్పిందా అనుకుని ఖంగుతిని  అడిగాను.

"లేదు సర్‌ మీతో ఎందుకు అబద్ధం చెబుతాను. నిజంగానే నేను ఇప్పుడు నాలుగో పెళ్లిచేసుకుని  వున్నాను.'.

"అదేంటి ఎందుకలా' ఆశ్చర్యంగా అడిగాను.

*****
 
నర్మద టోక్యోలో మా ఆఫీసు పనిమీద ఒక ఆరునెలలు వుంది. తనవి చాలా చక్కటి తెలివితేటలు. ఆ అమ్మాయి చేసే పని నచ్చి నేను నేను మా షికాగో ఆఫీసులో పర్మనెంటు ఉద్యోగం చెయ్యమంటూ సిఫార్సు చేసాను. దాంతోటి తను చాలా సంతోషించింది. అలా మా షికాగో ఆఫీసులో ఉద్యోగానికి కుదిరింది.  మాకు పరిచయం అయింది జపాన్‌లోనైనా నాకు నర్మదగురించి పూర్తిగా తెలిసింది షికాగోలోనే. అదిగూడా తన తోటి ఇండియన్‌ వర్కర్సు గాసిప్‌ ఎక్కువవడంతో.

తనతోటిపనిచేసే ఒకమ్మాయి వచ్చి నాతో కంప్లయింట్‌ చేసింది. "సర్‌! ప్లీజ్‌ నేను నర్మదతో పని చెయ్యలేను' అని.

"ఎందుకని?'

"సర్‌ మూడురోజులకు ఒక వ్యక్తితో గడుపుతుంది. తనవి చాలా విచిత్రమైన భావాలు. నేను సాంప్రదాయ కుటుంబంలో పెరిగినదాన్ని. నాభావాలకు తన భావాలకు పడదు'

"సరే నేను కనుక్కుంటాను' అని ఆ అమ్మాయిని పంపించేసాను.

నిజానికి వ్యక్తిగతజీవతాలు వారివారి సొంతం అని నేను చాలా గట్టిగా నమ్ముతాను. నర్మద నిస్సందేహంగా చాలా బాగా పనిచేస్తుంది. తనవల్ల మా కంపెనీకి చాలా మంచి జరుగుతుందని నాకు తెలుసు అందుకే నాకు నర్మదను తన వ్యక్తిగత జీవితంపై వచ్చిన కంప్లెయింట్స్‌తోటి వదులుకోవడం నాకు ఇష్టంలేదు. కానీ తన వ్యక్తిగత జీవితం తన తోటి ఉద్యోగస్థులను ఇబ్బందికి గురిచేస్తోందని తెలియడంతో ఒక అధికారిగా దీనిని గూర్చి అవగతం చేసుకోవల్సిన బాధ్యత నాపైన పడింది. సరే నర్మదతోటి మాట్లాడి చూడాలని నిశ్చయించుకుని తనను నా ఛేంబర్‌ లోకి రమ్మని కబురుచేసాను.

"సర్‌ పిలిచారట!'

"ఆ రామ్మా! నీతో కొంచెం మాట్లాడాలి. రా కూర్చో' నర్మద వచ్చి నా ఎదురుగా కూర్చుంది.

"ఏంలేదు.. నువ్వు చాలా బాగా వర్క్‌ చేస్తున్నావన నీ మేనేజర్స్‌ అందరూ చెబుతున్నారు. ప్లీజ్‌ కీపప్‌ ద గుడ్‌వర్క్‌' 

"ధాంక్యూ సర్‌...' నర్మద పసిగట్టినట్లుంది నేను ఏదో తనగురించిన గంభీరమైన విషయాన్ని డిస్కస్‌ చెయ్యడానికే పిలిచానని. "చెప్పండి సర్‌' అడిగింది.

"ఏం లేదమ్మా, నీగురించి నాకు ఎక్కువగా తెలియదు... తోటి తెలుగు అమ్మాయివిగదా సరే ఈ దేశంకాని దేశంలో ఎలా వుంటున్నావు ఎలా తిరుగుతున్నావు అని తెలుసుకుందామనుకున్నాను. అన్యధా భావించకు" అన్నాను.

"ప్రస్తుతం నేను జార్జ్‌ తోటి ’పెళ్లిచేసుకోకుండా కలిసి కాపురం చేసున్నాను  సర్‌, అంతకు ముందర ప్రదీప్‌తోటి పెళ్లిచేసుకోకుండా కలిసి కాపురం చేస్తూ ఉన్నాను... బహుశా దానిగురించి మీకు  ఫిర్యాదులు వచ్చి వుంటాయి, అందుకే పిలిచారనుకుంటున్నాను' ఆ అమ్మాయి చాలా ఋజువుగా సుజావుగా నిజం చెప్పింది. నాకు అనుకోకుండానే విన్‌ష్టన్‌చర్చిల్‌ చెప్పిన ఒక గొప్ప విషయం  గుర్తువచ్చింది.  " ’సత్యం’ అనేది తిరుగులేనిది.  అవకాశవాదులు దానిని వాడుకుని తప్పుడర్ధాలు తీయవచ్చు,  అజ్ఞానం దానిని తక్కువచేసి చూడవచ్చు, కానీ చివరకు మిగిలేది ఒక్కటే ... అది సత్యమే"  

నర్మద నిర్భయంగా చెప్పిన ఆ నిజాన్ని విన్నతర్వాత ఇక తనగురించి ఎక్కువ అడగాల్సిన అవసరం నాకు లేదనిపించింది. కానీ తనే చెప్పడం మెదలుపెట్టింది...

"సర్‌ మీగురించి చాలామంది చాలా గొప్పగా చెబుతారు. భారతసాంప్రదాయాలపట్ల మీకున్న గౌరవం నాకు తెలుసు. కానీ ఆ సాంప్రదాయాలే నా ఇద్దరు అక్కలను నానుంచి దూరం చేసిందని నేననుకుంటాను.'

"ఏమైంది?' అడగకుండా వుండలేకపోయాను.

"మా నాన్నగారు శ్రోత్రియ బ్రాహ్మణుడు, మేము మొత్తం ముగ్గురం ఆడపిల్లలం. నర్మదానది పుష్కరాల సమయంలో పుట్టానని నాకు నర్మద అని పేరుపెట్టారు. అక్కలిద్దరికీ పెళ్లయింది పెద్దక్క భర్త బైట బోల్డంతమంది ఆడవాళ్లతోటి తిరుగుతూంటాడు, కానీ మా అక్క మాత్రం ఇంట్లో పేరుకు భార్య అనబడే పనిమనిషి. మా నాన్నగారు మా అక్కకు సీత సావిత్రిల పోలిక చెప్పి భర్తను భరించడమే పాతవ్రత్యమంటూంటారు. మా అమ్మ ఏమీ చెప్పలేక వ్యర్ధమైన అక్క జీవితాన్నిచూసి గుడ్లమ్మట నీళ్లుకుక్కుకుంటూంటే చూస్తూ పెరిగినదాన్ని...

ఇక మా చిన్నక్క భర్త తనని ప్రతిక్షణం అనుమానిస్తుంటాడు... బైట పాలవాడు పాలు పోస్తూ ఒక్కక్షణం ఎక్కువ నిలబడ్డా వాడితో ఏ శృంగారం వెలగబెడుతున్నావే లం**** అంటూ ఇష్టంవచ్చిన బూతులు మాట్లాడుతూ ఇల్లు నరకం చేస్తూంటాడు. అదిగో అటువంటి అక్కల కుటుంబాలు చూసి, సాంప్రదాయం కొంగు పట్టుకు వేళ్లాడే మా నాన్నని చూసి, చేతకానితనాన్ని కంటినీటితో తుడిచే వ్యర్ధప్రయత్నంచేసే నా తల్లిని చూసీ నాకు భారతదేశం అంటేనే రోతపుట్టింది... సీత, సావిత్రి అంటేనే అసహ్యం పుట్టింది.... అందుకే వీలయినంత ప్రయత్నం చేసి భారతదేశంనుండి బైటపడ్డాను. శరీరం ఉంది కాబట్టి దాని అవసరాలను తీర్చుకోవడం తప్పులేదనుకున్నాను. శరీరపు అవసరాన్ని తీర్చుకోవడానికి వివాహం అనే అబద్ధాన్ని ఆడాలని నాకెందుకో అనిపించలేదు. నమ్మండి నమ్మకపోండి ... ఇదీ సర్‌ నా జీవితం...' చెప్పింది నర్మద.

ఎందుకో నాకు నర్మదపట్ల జాలి కలిగింది. అవును అందులో తప్పేంవుంది? తన బ్రతుకు తను బ్రతకడంలో తప్పేంవుంది. ఈ ప్రపంచంలో స్వేచ్ఛగా బ్రతికే హక్కు ప్రతిజీవికీ ఉంది. అడవిలో పెరిగే ప్రతి చెట్టు చేమ, ప్రతి పూలమొక్కా ఎంత నిర్భయంగా తమదైన ఒంటరి జీవితాన్ని నింగినీ, నేలనూ, నీటినీ భగవంతుడినించి ఆశిస్తాయో అటువంటి స్వేచ్ఛకు మనిషిగూడా అర్హుడే...

నర్మద వ్యక్తిగతజీవితం ఆ అమ్మాయి స్వంతంత్రతకు స్వేచ్ఛకు నిదర్శనం. సంప్రదాయపు అద్దాలలోంచి చూస్తే చాలా చిరాకు అనిపించచ్చు కానీ, ఏది సంప్రదాయం?! ఎప్పుడు మొదలయింది? ఎందుకు మొదలయింది, అది ఎవరి అవసరాలను తీరుస్తోంది? ఇటువంటి ప్రశ్నలు మొదలవుతాయి. బహుశా నర్మదను తన మానానికి తనని వదలడమే మంచిదనే నిర్ణయానికి వచ్చాను. అటుతర్వాత నాకు నర్మదతోటి చాలా మంచి పరిచయం ఏర్పడింది. దాదాపు సంవత్సరం పాటు నాకు తిరిగి లండన్‌ హెడాఫీసు ట్రాన్స్‌ఫర్‌ అయిందాకా మేము దాదాపు ప్రతిరోజూ మాట్లాడుకునేవాళ్లం. నర్మదకు చలంగారి రచనలన్నా, తిలక్‌గారి వెన్నెల్లో ఆడపిల్ల కవితలన్నా చాలా ఇష్టం... నాకుగూడానూ... అలా మేము అనేకమైన విషయాలనుగూర్చి మాట్లాడుకునేవాళ్లం... నర్మద ఎట్టిపరిస్థితులలోనూ భారతదేశానికి వెళ్లనని చెబుతూండేది. నేనేమో భారతదేశంలో ఎప్పుడో ఒకప్పుడు తనని మనసిచ్చి ప్రేమించి పెళ్లిచేసుకునేవాడు దొరుకుతాడని చెబుతూండేవాడిని.

నేను లండన్‌ వచ్చేసి దాదాపు ఐదు సంవత్సరాలయింది. మొదట్లో నర్మద ఈమెయిల్స్‌ వ్రాసేది తర్వాది అదీలేదు... ఎవరో తర్వాత చెప్పారు తను రిజైన్‌ చేసి వెళ్లిపోయింది అని. నాకు ఆశ్చర్యం అనిపించలేదు.

అటువంటి నర్మద ఇప్పుడు ఇలా భారతదేశంలో, చెన్నై ఏర్‌పోర్టులో హటాత్తుగా కలవడం నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది. ఇప్పుడు అంతకంటే ఆశ్చర్యం తన నాలుగో పెళ్లిగురించి తెలుసుకోవడం... అందుకే అడిగాను..

*******

"అదేంటి ఎందుకలా' ఆశ్చర్యంగా అడిగాను...

"ఇక్కడికి వచ్చిన తర్వాత తెలిసింది భారతదేశం ఏమీ మారలేదని. ఇంటిగురించి వెదుకుతూంటే పెళ్లయినవాళ్లకే ఇల్లు ఇస్తామని చెబుతారు... అదేదే పెళ్లంటే చాలా మంచిదన్నట్లుగా...' నర్మద చిరాకుగా చెప్పింది...

"హూ...' నేను వింటున్నాను.

"ఇక చెప్పగలిగింది ఏముందిసర్‌! భారతదేశపు చట్టం పెళ్లిచేసుకోకుండా కలిసి కాపురాలు చేస్తున్నవారి  గురించి ఏమీ చెప్పదు... కానీ సమాజం మాత్రం సరేమిరా కాదు కుదరదు  అంటుంది... అందుకని ఒక సులభమైన పద్దతి  ఆలోచించాను.'

"ఏమిటది?' కుతూహలంగా అడిగాను...

"ఏముంది... రిజిష్ట్రార్‌ ఆఫీసులో పెళ్లిచేసుకోవడం... కుదిరినన్నిరోజులూ కలిసివుండటం... లేదంటే ఎమికబుల్‌ డైవోర్స్‌ తీసుకోవడం... నాకు ఈ పద్ధతి చాలా  సుజావుగా అనిపించింది.  సమాజం చూసేది నా మెడలో మంగలసూత్రం ఉందా లేదా నా నుదుటున సింధూరం ఉన్నదా లేదా అని మాత్రమే... అవి కనబడితే చాలు పతివ్రతననే అనుకుంటారు... చిలకా గోరింకలమనే చెప్పుకుంటారు.  వాళ్లకు ఆ అజ్ఞానం మాకు ఆ అవకాశం ఉండటం మంచిదే. ' చాలా తేలికగా చెప్పేసింది.

అదివిన్న నాకు నోట మాట రాలేదు. కానీ నా మనసులో ఒక భావన....  ’ఎంత అమాయకురాలు! సరాసరి పెరుగుతున్న ఒక చిన్న మొక్కకు సూర్యకాంతి తగులకుండా అడ్డుపెడితే అది అనేక వంకరలతో అడ్డదిడ్డంగా పెరుగుతుంది.  ఆ మొక్క పొందాలనుకున్నది సూర్యకాంతినే అయినా దాని వంకర టింకరలు మనకు అసహ్యన్ని కొలిపిస్తాయి... ఎదుటివ్యక్తుల సంసారాలని చూసి నచ్చక తనదైన రీతిలో సంసారాలను సృష్టించుకున్న ఈ అమాయకురాలికి నేను ఏం హితబోధ చెయ్యగలను!’ అనుకున్నాను.

మాట్లాడకుండా తననే చూస్తూ నాలో లేస్తున్న భావనలనే అలలు మాటలరూపంలో ఆ అమ్మాయిని ముంచెత్తకుండా పెదవుల అడ్డుకట్టలు వేస్తూ కూర్చున్న నన్ను గమనిస్తూ ఇంకా చెప్పింది... " నీ జీవితంపై నీవు అధికారం సంపాదించడం ముఖ్యం.  ఒక్కసారి నీ జీవితాన్ని నీ చేతుల్లోకి తీసుకున్న తర్వాత ఇక ఇతరులనుండిగానీ సమాజాన్నుండిగానీ అనుమతి తీసుకోవాల్సిన అవసరం లేదు... కానీ ఎప్పుడైతే నీ జీవితాన్ని జీవించడంలో సమాజం అనుమతికోసం ఎదురుచూస్తూ కూర్చుంటావో అప్పుడే నీజీవితాన్ని కోల్పోతావు... అప్పట్నించి అది నీజీవితం కాదు... వారు అడిగిన... వారు కోరుకున్న జీవితం..."  నా కళ్లలోకే పరిశీలనగా చూస్తూ చెప్పింది....

నేను ఇంకా మాట్లాడలేదు... ఏం చెప్పగలను... నీవు చేస్తోంది ఖచ్చితంగా ’తప్పు’ అని ఎలా చెప్పగలను?!  ఏ ఋజువులతో తనని ఒప్పించగలను! నేను ఆమె అసహ్యించుకున్న ఆమెని ఇలా మారేటట్లు పురికొల్పిన  ఆ సమాజంలో భాగాన్నే కదా!... ఒకవేళ నర్మద ’ఏవండీ నేనిలా వరస పెళ్లిళ్లు చేసుకోవచ్చా... లేదా పెళ్లిచేసుకోకుండా శారీరక వాంఛలు తీర్చుకోవడానికోసమ్ పెళ్లిలేని కాపురాలు చెయ్యచ్చా" అని నన్ను అడిగిందే అనుకుంటే బహుశా ఆమె జీవితాన్ని జీవించడానికి నేను ’అనుమతి’ ఇచ్చినవాడినవుతాను... అప్పుడు తను ఎలా జీవిస్తుందో అది నేను ఆశించిన జీవితమేకానీ తను ఆశించిన జీవనం అవకపోవచ్చు".... కొన్నికొన్నిసార్లు ఆలోచనలు ఏమీ తేల్చనివ్వకుండా అంతులేని అగాధాలలోకి నెట్టేస్తాయి కదా....
   
"ఏమైతేనేం సర్! జీవితంలో అలిసిపోయాను...  నాకెందుకో భారతదేశం అంటే విసుగు వచ్చింది.  నేను మళ్లీ తిరిగి అమెరికా వెళ్లిపోతున్నాను.  ఇవాళే చెన్నై కాన్సులేట్‍లో గ్రీన్‍కార్డ్ వీసా ఇంటర్గ్యూకి హాజరై వచ్చాను.  నాకు గ్రీన్‍కార్డు ఇచ్చేసారు.  దేవుడు దయతలిస్తే ఇక అక్కడే అమెరికాలోనే శాశ్వతంగా జీవిస్తూ ఎప్పుడో రాలిపోతాను... ఇక తిరిగి రాను." శూన్యంలోకి చూస్తూ స్వగతంలా పలికింది....

అలా చెప్తున్న ఆమె కన్నుల్లో ఎందుకో నాకు ఆత్మహత్య చెసుకునేవారిలో ఉండే నిర్వేదం కనిపించింది...కానీ నాకు తెలుసు తను ఆత్మహత్య చేసుకునేంత పిరికిది కాదు.   ఆమె మాట్లల్లో వెల్లువెత్తిన విషాదం ధ్వనించింది... కానీ నాకు తెలుసు తను జీవితాన్ని చాలా హాస్యంగా తీసుకుంటుంది... బహుశా నర్మద నాకు తెలియని మార్పేదైనా  వస్తోందేమో... ఆ ఊహ నాకు ఉత్సుకతని ఇచ్చింది... ఆమెతో ఇంకా సంభాషణ పొడిగించాలనుకున్నాను.

నాకు తనతో  ఎంతో మాట్లాడాలి అని అనిపించింది. ఏదో ఒకవిధంగా తనకు నచ్చచెప్పాలని అనిపించింది. కానీ ఎందుకో ఆ సందర్భంలో ఏది చెప్పినా అసమంజసంగా వుంటుందేమోనని అనిపించింది. కొంచెం ఆగి నిదానంగా ఉత్త్రరాలు రాయడం సాగిస్తే మంచిది... ఈ మొక్కకు ఇక సూర్యరశ్మి అడ్డులేదు... తను పెరగాల్సినట్లు పెరిగింది... సూర్యరశ్మి కావల్సినంత దొరికింది... ఇక సరాసరి పెరగడమే తనకి భగవంతుడు ఇచ్చే వరం.... అనుకున్నాను. 

 "ఓకేసర్‌ నా ఫ్లైట్‌ టైమ్‌ అయింది... వెళ్లొస్తాను... ఇది నా అడ్రస్ ఈ సారి తప్పనిసరిగా మీకు ఉత్తరాలు రాస్తాను ' చెప్పి లేచి నిలబడ్డ నర్మదకు అనాలోచితంగానే బైబై చెప్పాను... కానీ వెళుతున్న తననే చూస్తూ ఉండిపోయాను...

నాకు అరబిందో చెప్పిన గొప్ప మాట గుర్తువచ్చింది... "మానవుల మనసులు, ఆవేశాలు, బౌద్ధికమైన బావనలు అనేకమైనవి మరియు అంతులేనివి, అందుకే  భారతదేశపు మతము --- మనిషి ఈ అనంత విశ్వంలో తనదైన గమ్యాన్ని చేరడానికి --- మనిషిచేసే ఆలోచనలపట్లా, మనిషి పూజించే దేవునిపట్లా  సంపూర్ణమైన వ్యక్తిగతమైన  స్వాతంత్ర్యాన్ని కల్పించింది"  --- నర్మదా!  భగవంతుడు నిన్ను అనుగ్రహించునుగాక... నా పెదవులు మెట్లమీదుగా విమానంలోకి వెళ్లిపోతున్న ఆమెనే చూస్తూ పలికాయి...


-------- &&& -------

1 comment:

  1. Thanks andi, chala bagundi mee kadha, me narration chala bagundi.

    ReplyDelete