Total Pageviews

Sunday 23 January 2011

సముద్రం - కధ

సముద్రం
Published in eemata magazine 1999
సముద్రం హోరుమంటూ శబ్దంచేస్తోంది. సంధ్యాకాలం అవడంతో పక్షులన్నీ హడావుడిగా గూటికి చేరుకోవడానికన్నట్లు బారులు తీరి ఆకాశంలో వెళ్లిపోతున్నాయి. రాత్రి అవడానికి సమయం దగ్గరపడటంతో నక్షత్రాలు మినుకుమినుకు మంటూ మింటిలో కనబడటం మొదలుపెట్టాయి. సాయంత్రం సముద్రంవడ్డుకు షికారుగా వచ్చినవాళ్లందరూ అక్కడక్కడా గుంపులు గుంపులుగానో, ఒంటరిగానో కూర్చోని వున్నారు. కొంతమంది సముద్రాన్ని పరికిస్తున్నారు. కొంతమంది వచ్చేపోయేవాళ్లని పరీక్షగా చూస్తున్నారు.

సముద్రం ఒడ్డున మనుషులందరికీ దూరంగా ఇసుక తిన్నెలమీద కూర్చునివుంది సరోజ. కాళ్లురెండూ మడిచిపెట్టుకుని ఒడిలో మొహంపెట్టుకుని దిగులుగా కూర్చునివుంది. ఏడ్చిఏడ్చి ఆమె అందమైన కళ్లురెండూ ఎర్రబడిపోయి వున్నాయి. చాలా మానసికమైన ఒత్తిడికి గురయినట్లు ఆమె మొహంఅంతా ఉబ్బిపోయివుంది. ఆమె అక్కడ ఒంటరిగా కూర్చోని వుండటంతో పలకరించడానికేమో అన్నట్లు, అప్పుడప్పుడూ నిశ్శబ్దాన్ని చీలుస్తూ సముద్రం హోరుమంటోంది. తేమగాలి అలలు అలలుగా ఆమె సున్నితమైన శరీరాన్ని తాకుతోంది.
సరోజ నిన్నట్నుంచీ ఒకటే విషయాన్నిగూర్చి ఆలోచిస్తోంది. ఉదయం కాలేజికి వెళ్లకుండా సరాసరి సముద్రం ఒడ్డుకు వచ్చి కూర్చుంది. ఉదయంనుంచీ అమె అర్ధంచేసు కోవడానికి ప్రయత్నిస్తున్న విషయం ఒక్కటే… ఎప్పటికి వీళ్లు మారతారు? వీళ్లందరిలోనూ మార్పు ఎప్పుడొస్తుంది? ఆడపిల్ల బైటికి వెళ్లడం తప్పు. సినిమాలు చూడటం తప్పు. తప్పు… తప్పు…. తప్పు…. అన్నిటికీ తప్పులు ఎన్నడమే తమ బాధ్యత అన్నట్లుగా ప్రవర్తిస్తున్నతన తల్లి, మామయ్యలు ఇద్దరితోటీ తను నలిగిపోతోంది. ఇక వీళ్లు మారరా… నన్నూ ఒక వ్యక్తిగా గుర్తించి విలువనిచ్చి ఎప్పటికి మాట్లాడతారు… ఎన్నటికి నాకు స్వతంత్రం వస్తుంది?
సముద్రం హోరుమంటూ అలలతో ఎగసి పడుతోంది. ఎంత ప్రయత్నించినా సముద్రం చెలియలికట్టను తెంచుకు పోలేకపోయిందే!ఎందుకు ఎప్పుడూ దానిని దాటి పోదామన్నట్లు ప్రవర్తిస్తుంది? ఎందుకు.. చెలియలికట్ట అంటే సముద్రానికి నచ్చదా?
అయినా సినిమా చూడడం తప్పెందుకయింది? ఆరోజు తన స్నేహితుడు పుట్టినరోజని చెప్పి “అన్నమయ్య”" సినిమాకు వెళదాం రమ్మన్నాడు. అతను ఎన్నడూ తనపట్ల అమర్యాదగా ప్రవర్తించలేదు. సరేనని తను సినిమాకు వెళ్లింది. ఆ విషయం తెలిసి, అది తప్పన్నట్లుగా చెప్పడమేగాక నానారాద్ధాంతమూ చేసిన తల్లితోనూ మామయ్యతోనూ పోట్లాడలేక వాళ్లకు నచ్చజెప్పలేక మౌనంగా వచ్చి సముద్రం ఒడ్డున కూర్చుంది సరోజ. ఒక్క సినిమా విషయంలోనేగాదు. అనేక విషయాలలో వాళ్లుపెట్టే అర్ధంలేని ఆంక్షలు, ఆ కట్టుబాట్లు సరోజకు నచ్చవు. ఒకసారి చుడీదార్‌వేసుకుంటే ఆ బట్టలలో తనేదో క్లబ్‌ డాన్సర్లాగా కనిపిస్తోందని, విప్పదీసి పరికిణీ ఓణీ వేసుకోమని చెపితే, తను వినలేదు… తన మాట వినలేదని చెప్పి ఆ మర్సటిరోజు తన కళ్లముందరే ఆ బట్టలమీద కిరసనాయిలుపోసి తగలబెట్టాడు మామయ్య.
సరోజకు తన మామయ్య గురించి తలుచుకుంటేనే మనసంతా చిరాకుగా తయారయింది. ఆమె మనసు దీర్ఘమైన ఆలోచనల్లో మునిగిపోయి ఒక్కసారి తన కుటుంబం గురించీ తనను ఇవాళ సముద్రంముందర ఒంటరిగా కూర్చొనేటట్లు చేసిన పరిస్థితుల గురించీ ఆలోచించడం మొదలుపెట్టింది.
***
సరోజకు తండ్రి చిన్నప్పుడే పోవడంతో చిన్నతనంలోనే తల్లితో కలిసి మామయ్య పెంపకంలో పెరిగింది. మధ్యతరగతి కుటుంబం అవడంతో చాలా కట్టుబాట్లు, డబ్బు ఇబ్బందులు అనేకం వస్తూండేవి. చదువుకోవాలన్న తహతహ చాలా వుండటంతో ఇంట్లో వద్దన్నకొద్దీ ఎలాగోలా ఒప్పించి డిగ్రీ ఫైనలియర్‌దాకా చదువుకుంటూ రాగలిగింది.
సరోజవాళ్ల మామయ్యపేరు ఉగ్రనరసింహులు. ప్లీడరు గుమాస్తాగా ఉద్యోగం చేస్తూంటాడు. పేరుకు ఉగ్రనరసింహులేగానీ అతని ఉగ్రత్వమంతా ఇంట్లోనే చూపిస్తూంటాడు. ఒక మోస్తరుగా బైటపిల్లి ఇంట్లోపులి వ్యవహారం… పైగా లోకమంతా తనగురించే మాట్లాడుకుంటూంటుందని ఒక అపోహ! అందుకని ఎవరితోనూ పెద్దగా మాట్లాడడు. ఎవరైనా ఇద్దరు కలిసి అతనికి దూరంగా నుంచుని ఏ విషయం మాట్లాడుకున్నా తనగురించే మాట్లాడుకుంటున్నా రనుకుంటూంటాడు.
అతనికి పెళ్లయింది కానీ అతను పెట్టే బాధలు భరించలేక అతని భార్య అతన్ని విడిచి వెళ్లిపోయి చాలాకాలం అయింది. ఆవిడ పక్కింటి లాయరుగారి అబ్బాయితో లేచిపోయిందని ఊరంతా చాలాకాలం అనుకున్నారు. కానీ మొన్నీమధ్యే ఆ లాయరుగారు తన కొడుకు పెళ్లి ఘనంగా చేసేదాకా,ఊరంతా అదే విషయం అనుకుని నమ్మారుగూడా…
లాయరుగారి అబ్బాయి పెళ్లనగానే “ఆ పిల్లని ఏంచేసాడో!”" అని ఊరంతా అనుకుంది. కానీ, “తాడు తెగిన గాలిపటం ఎవడి చేతిలో పడిందో ఆ చేతిలోనుంచి ఎక్కడి గోతిలో పడిందో ఎవరు చూడొచ్చారు!?”", అనుకుంది మళ్లీ అదేఊరు…
కానీ ఉగ్రనరసింహులుకు అది అర్ధంకాదు. తన భార్య తను బాధలు పెడితే వెళ్లిపోయిందని ఊరంతా అనుకుంటూందని కుమిలిపోతూంటాడు. నిజానికి తన భార్య ఎందుకు వెళ్లిపోయిందో అతనికి ఇంకా అర్ధమే కాలేదు. అతడు ప్లీడరు గుమాస్తా మాత్రమే; సైకోఎనాలిసిస్‌ఏమాత్రమూ చదువుకున్నవాడు కాదు. డబ్బువున్న చోట ఆకర్షణ వుంటుందనీ డబ్బుసంపాదించలేనితనం తన మొగుడి అసమర్ధతనీ అనుకునే స్త్రీలుగూడా ఉన్నారనీ అర్థంచేసుకోలేకపోయాడు.
“ఆడవాళ్లందరూ అలాగే ప్రవర్తిస్తారా!”" అనే ప్రశ్న కొంతకాలం వేసుకున్నాడు కానీ “అందరూ అలా కనిపిస్తారా మన కంటికి”" అని సమాధానం చెప్పుకున్నాడు. అసలు తన భార్యకీ ఆ ప్లీడరుగారి అబ్బాయికీ పరిచయం ఉందన్న సంగతిగూడా అతనికి తెలియదాయె!
రోజూ పెరట్లో బట్టలారేయడానికని వెళ్లే తన భార్య, పక్కింటి ప్లీడరుగారి అబ్బాయి కెమేరాకు ఫోజులిస్తోంటుందనీ, సాయంత్రంపూట  అతన్ని రహస్యంగా కలుసుకుని ఆఫోటోలలో తనని తాను చూసుకుని మురిసిపోతూంటుందనీ అతనికి ఏమాత్రమూ తెలియదు. అయినా ఆ అమ్మాయి తప్పేముంది? ఫోటో తీయించుకోవాలనుకుంది; పక్కింటబ్బాయి ఫ్రీగా ఫోటోలు తీస్తున్నాడు. ఫోజులిస్తే తప్పేముంది? ఉగ్రనరసింహులుకు మాత్రం ఇక్కడ ఎక్కడో ఒక విషయం అర్ధంగాకుండా పోయింది… ఇంతకీ ఫోటోలు తీయడమే లేచిపోవడానికి కారణమా! అంటే అనేకమైన కారణాలు న్నాయని తర్వాత తెలిసింది. కానీ ఉగ్రనరసింహులుకు మాత్రం ఆడజాతిమీదే అసహ్యం వేసింది.
నిజానికి ఉగ్రనరసింహులుకు భర్తపోయిన అక్క తన కూతురితోపాటు తన ఇంట్లో ఉండటం ఏమాత్రమూ నచ్చలేదు. కానీ అతనికి తన అక్క అంటే ఒకవిధమైన సానుభూతి. ఆవిడ భర్త, అంటే సరోజవాళ్ల నాన్న, లాయరుగా చేసేవాడు. తోటి లాయర్లలో చాలా గౌరవం సంపాదించినవాడు. ఆయన బ్రతికి ఉండగా నిజాయితీపరుడని గౌరవం మాత్రం సంపాదించగలిగాడుగానీ డబ్బుమాత్రం సంపాదించలేకపోయాడు. ఉగ్రనరసింహులుకు ఆయన చలవ వల్లనే ప్లీడరుగుమాస్తా ఉద్యోగం దొరికింది. అయినా ఇంట్లో వంటచేసే ఆడదిక్కు లేకుండా పోవడంతో అక్కగారిని పోనీలెమ్మని తనతో ఉండనిచ్చాడు ఉగ్రనరసింహులు.
రాను రానూ ఉగ్రనరసింహులుకు సరోజ ప్రవర్తన నచ్చకుండా పోతోంది. ఈ మధ్య మరీ సరోజ బరితెగించి పోతోంది. క్లబ్‌డాన్సర్లలాగా బట్టలు వేసుకోవడం, ఇష్టం వచ్చినట్లు సినిమాలు షికార్లు తిరగడం… ఇవాళ కోర్టుపనిమీద కాగితాల మీద సంతకాలు పెట్టించుకుందామని సినిమాహాలు మేనేజరువద్దకు వెళితే సరోజ పకపకా నవ్వుతూ ఎవడో మొగవెధవతో దర్జాగా కూర్చుని కూల్‌డ్రింకు తాగుతూ హాలులో కనబడింది.ఉగ్రనరసింహులుకు ఆ దృశ్యం తలుచుకుంటేనే ఒళ్లంతా కారం రాచుకున్నట్లుగా అయిపోతోంది. సరోజ ఇంతగా బరితెగిస్తుందనుకోలేదు. అందుకే విషయం ఇంటికివెళ్లగానే తేల్చెయ్యాలనుకున్నాడు.
“సరోజా! సరోజా!”" ఇంట్లోకి అడుగుపెడుతూనే చాలా కోపంగా పిలిచాడు ఉగ్రనరసింహులు.
“ఏం మామయ్యా!”" అంటూ వచ్చింది సరోజ.
“మధ్యాహ్నం ఎక్కడున్నావు?”"
“నా స్నేహితుడితో కలిసి సినిమాకి వెళ్లాను” నిష్కల్మషంగా చెప్పింది సరోజ. సైకాలజీలో బియె చదువుతోంది. సత్యం చెప్పడంలో ఎటువంటి గొడవా లేదని నమ్మినపిల్ల.
ఉగ్రనరసింహులుకు విషయం అర్ధంకాలేదు. అతని మెదడు అనూచానంగా వస్తూన్న ఒక సమాధానంకోసం ఆత్రంగా ఎదురుచూస్తోంది. “అబద్ధం… అబద్ధం… అబద్ధం ఏదీ? సరోజ చెప్పిన విషయంలో అబద్ధం ఏదీ?” అతని ప్లీడరుగుమాస్తా బుర్ర ఆత్రంగా ఆలోచించడం మొదలుపెట్టింది.
ఆడపిల్ల తోటి స్నేహితునితో కలిసి సినిమాకు వెళ్లడం తప్పు. ఆడపిల్ల పదిమందిలోనూ హాయిగా నవ్వడం తప్పు అంటూ “న స్త్రీ స్వాతంత్య్ర మర్హతి”" మనువు చెప్పిన సత్యానికి వక్రభాష్యాన్ని రాసుకున్న సమాజానికి చెందినవాడు ఉగ్రనరసింహులు. కానీ అదే సమాజంలో పెరిగిన సరోజ ఈ రోజు నిస్సంకోచంగా నిజం చెప్పేసింది.
అదేగనక సరోజ అబద్ధం చెప్పివుంటే మిగిలిన వ్యవహారమంతా లోకరీతిలోనే ఏడుపులూ పెడబొబ్బలూ గందరగోళాలూ, ఇల్లుకదలద్దు, అనే హెచ్చరికలతోటి నడిచిపోయేది. కానీ సరోజ అబద్ధం చెప్పలేదే! అనేక మైళ్లదూరం నడవాల్సిన రైలుబండి హఠాత్తుగా గమ్యంచేరినట్లుగా… సత్యం చెప్పటంలో తప్పులేదని నమ్మిన సరోజ జరగాల్సిన నాటకానికి తెరలేవకుండానే, జయమంగళగీతం పాడి తెరదించేసినట్లుగా చేసింది.
“పెరట్లో బట్టలు ఆరేయడానికి ఇంతసేపు ఎందుకు పట్టిందే?”" అని భార్యను గదమాయిస్తే, “పాడుగాలండీ, బట్టలన్నీ ఎగరగొట్టేసింది బట్టలకు మైలయితే బావిదగ్గర ఉతికి మళ్లీ ఆరేసి వస్తూన్నా”", అని పరమ పతివ్రతనని భ్రమింపజేసేట్లుగా అబద్ధం చెప్పిన భార్యనే ఎరిగిన ఉగ్రనరసింహులుకు, సరోజ చెప్పిన నిజం అర్ధంకాలేదు. అయినా అదంతా అనవసరం. సరోజ సినిమాకి వెళ్లింది. అదీనూ ఒక మొగవెధవతో…. ఉగ్రనరసింహులుకు పట్టలేని కోపం వచ్చింది.
“బుద్ధుండాలి… దరిద్రురాలా… ఇష్టంవచ్చినట్లు బైట తిరగడమేగాక అదేదో ఘనకార్యం చేసినట్లు పైగా చెబుతున్నావా?”"
“మామయ్యా, మీకు చెప్పే వెళ్దామనుకున్నాను కానీ మీరేమో ఇంట్లోలేరు, అమ్మేమో పక్కింటివాళ్లింటికెక్కడికో వెళ్లింది… పైగా  ఇవాల్టితో అన్నమయ్య సినిమా ఆఖరట అందుకనే…”" మామయ్య కోపానికి కొంచెంగా బెదిరిన సరోజ మెల్లగా చెప్పింది.
“అన్నమయ్యో, పిన్నమయ్యో… ఏం కాలం ముంచుకొచ్చిందే. అయినా నిన్నా కాలేజి మాని ఇంటి పట్టున ఉండమంటే వింటావా? పైగా చదువుకొని ఎవరిని ఉద్ధరిద్దామని?”"
“ఏమైంది?”" ఉగ్రనరసింహులు అరుపులు విని వంటింట్లోంచి బైటికి వచ్చిన సరోజవాళ్ల అమ్మ ఆతృతగా ప్రశ్నించింది.
“ఎవడితోనో సినిమాకు వెళ్లింది. పైగా సినిమాకు వెళ్లానని అదేదో చంద్రమండలానికి వెళ్లొచ్చానన్నంత సంబరంగా చెబుతోంది. అక్కా! నేనిదే ఆఖరుగా చెబుతున్నాను. దీనికి పెళ్లిచేసెయ్యడం మంచిది. చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకొని లాభంలేదు. నేనిదే చెబుతున్నాను రేపట్నుంచీ అది కాలేజికి వెళ్లడానికి వీలులేదు. అంతే…”" చెప్పాడు ఉగ్రనరసింహులు.
“ఏంటి మామయ్యా! అలా మాట్లాడతారు. నేను ఏం తప్పుచేసానని? ప్రతిదానికీ నన్నలా ఆడిపోసుకుంటారు?”" సరోజ ఉక్రోషంగా ప్రశ్నించింది.
” నోర్ముయ్‌..ఎవడా వెధవ. సిగ్గుండక్కర్లా? ఆడపిల్లవి అందులోనూ వయసులోవున్నపిల్లవి. అలా బజార్లుపట్టి తిరగడానికి అర్ధం ఉండక్కర్లా?” అప్పటిదాకా ఆ సంభాషణని వింటున్న సరోజవాళ్ల అమ్మ పట్టరాని కోపంతో ప్రశ్నించడం మొదలుపెట్టింది.
పెళ్లికాని ఆడపిల్లని సినిమాకి తీసుకువెళ్లేవాడు వెధవ అనీ, వయసులో వున్న పిల్లలు బజార్లు పట్టి తిరగగూడదనీ అది సాంప్రదాయం కాదనీ ఆవిడ ఇలాంటి విషయాలన్నీ చాలానే చదువుకుంది. అసలు సరోజ అలా ఎవరితోనో సినిమా చూడడానికి వెళ్లిందన్న మాటే ఆవిడకు గుండెల్లో గాభరా పుట్టించింది.
హమ్మో! ఇంకేమైనా వుందా! పిల్ల ఈ రకంగా బరితెగించి తిరుగుతుందని తెలిస్తే అసలు ఆ కాలేజీ చదువులకు పంపించకే పోదును. ఇలాంటి పిల్ల అని తెలిస్తే అసలు రేపు దీనికి పెళ్లయేనా!
సరోజకు పెళ్లి కాదేమో అన్న ఆలోచనే ఆవిడకు ఆక్రోశం తెప్పించేసింది. “అయ్యో భగవంతుడా! నన్నెందుకు తీసుకుపోలేదు, ఇటువంటి రాక్షసిని నా కడుపులోనే పుట్టేటట్లు చేసావా, నన్నెందుకు ఇన్ని కష్టాలు పెడుతున్నావు.” అంటూ తల గోడకు వేసి కొట్టుకోవడం మొదలుపెట్టింది.
సరోజ ఇంకేమీ మాట్లాడకుండా తన గదిలోకి పోయి తలుపువేసుకుని పడుకుంది. సరోజ ఆ రాత్రి భోజనం చెయ్యలేదు. పైగా వచ్చి భోజనం చెయ్యమని ఎవరూ బతిమిలాడలేదుగూడా…
****
పెద్ద అల ఏదో విరిగిపడడంతో సముద్రం ఒక్కసారి హోరుమంది. ఆ శబ్దానికి ఉలిక్కిపడి ఈ లోకంలోకి వచ్చింది సరోజ. రాత్రి అయిపోవడానికి ఇంకా ఎంతో సేపుపట్టదు. సరోజకు ఇంటికి వెళ్లడానికి మనస్కరించడంలేదు. ఆమె ప్రశ్నకు ఇంకా సమాధానం దొరకలేదు…
“అయినా అది తప్పెందుకయింది?”" ఈ ప్రశ్న ఆమె అనేకసార్లు వేసుకుంది. కానీ ఆమెకు సమాధానం తెలియలేదు. రేపట్నుంచీ ఖచ్చితంగా మామయ్య కాలేజికి వెళ్లనివ్వడు. ఎంత నచ్చజెప్పినా ఈ సారి అమ్మా మామయ్యా ఇద్దరూ వినేటట్లులేరు. ఇవాళ గూడా కాలేజికి వెళ్లద్దంటే స్నేహితురాలివద్ద తీసుకున్న నోట్సులు తిరిగి ఇచ్యెయ్యాలని సాకు చెప్పి ఇంట్లోంచి బైటపడింది. ఎంత ఆలోచించినా సరోజకు పరిష్కారమార్గం అంతుబట్టడంలేదు.
“ముల్లుమీద అరిటాకుపడ్డా అరిటాకుమీద ముల్లుపడ్డా ప్రమాదం అరిటాకుకే”" అని తన తల్లి చెబితే “కలుసుకున్న మొగవాడల్లా ముల్లులాగా ప్రవర్తిస్తాడా? ప్రపంచంలోని ప్రతి ఆడపిల్లా అరిటాకులాగా ప్రవర్తిస్తుందా?”" అని అడగాలనుకుంది కానీ అడగలేక పోయింది.
సరోజకి కోపం వస్తోంది. ఈ ప్రపంచంమీదే కోపం వస్తోంది. షోకులకోసం తన మామయ్యని వదిలేసిన అత్తమీద కోపం వస్తోంది.భర్త వయసులో వుండగా చనిపోతే మరోపెళ్లిచేసుకోని తన తల్లిమీద కోపం వస్తోంది. తన స్నేహితుడితోకలిసి సినిమాకి వెళ్లడం తప్పుకాదు అని వాళ్లకు అర్ధమయ్యేట్లు వివరంగా చెప్పలేక మౌనంగా నడిచివచ్చి సముద్రం ఎదురుగా కూర్చుని వున్న తన అసహాయతని చూసి తనకే కోపం వస్తోంది.
తప్పు ఒప్పు అనే పదాలకు మధ్య చాలా సూక్ష్మమైన రేఖవుంది. ఏది తప్పు ఏది ఒప్పు అని ఎలా చెప్పగలం? బహుశా తప్పు ఒప్పులను ఎత్తి చూపించేది సామాజికమైన కట్టుబాట్లేనేమో! అదే నిజమయితే సమాజం ఏ కారణంచేతగానో ఒక విషయాన్ని తప్పనీ, ఇంకొక విషయాన్ని ఒప్పనీ… ఎప్పుడో విడదీసి వుండాలి. కానీ అలాంటి నిర్ణయాలు చేసిన, ఆ సమాజానికి చెందిన మనుషులు, ఇప్పుడు లేరుగదా! కాలం మారిందిగదా! మారిన కాలంతోబాటు సమాజంలోనూ మార్పులు రావాలిగదా! మరి సమాజంలో మార్పు కనబడదేం… ఇంకా ఆడపిల్లల పట్ల ఇంత కట్టుబాట్లతో పెద్దలు ఎందుకు ప్రవర్తిస్తారు?
అయినా ఆడపిల్లలు మరీ అంత రక్షణలేకుండా పోతున్నారా? ఏం పెళ్లికాకపోతే ఆడపిల్ల బ్రతకలేదా? ఆడపిల్ల అనగానే అదేదో బాధ్యతంతా తమమీదే పడ్డట్లు ఎందుకు ప్రవర్తిస్తారు కొన్ని కుటుంబాల్లో… ఆడపిల్లలకు స్వతంత్రంగా నిర్ణయం తీసుకొనే అవకాశం ఎన్నడిస్తుందీ సమాజం?
సముద్రం హోరుమంటూ అలలతో ఎగసి పడుతోంది. ఎప్పుడు సముద్రంవంక చూసినా సరోజకి ఆశ్చర్యమే వేస్తోంటుంది.. ఎంత ప్రయత్నించినా సముద్రం చెలియలికట్టను తెంచుకు పోలేకపోయిందే! ఎందుకు.. ఎందుకు ఎప్పుడూ దానిని దాటి పోదామన్నట్లు ప్రవర్తిస్తుంది? చెలియలికట్ట అంటే సముద్రానికి నచ్చదా?
సరోజ ఒక నిర్ణయానికి వచ్చింది. లేచి సముద్రం వైపు నడిచింది. లోకమంతా ఎర్రగామారిపోతోంది. నల్లటి చీకటేదో సముద్రంలోంచి ఆతృతగా ఈ లోకాన్నే మింగెయ్యాలన్నట్లు పైకి ఎగబ్రాకుతోంది. సముద్రంలో అలలన్నీ హడావుడిగా బైటపడదామన్నట్లు చూస్తూంటే ఎప్పట్లాగానే ఆ చెలియలికట్ట సముద్రానికి హద్దులు చూపించి శాసిస్తూనేవుంది. కొంగలు హడావుడిగా తమ గూటిలోకి చేరుకుంటున్నాయి. సరోజకి సముద్రమంటే ప్రాణం. సాయంత్రం సూర్యుడు వెళ్లిపోతోన్నాడు, రేపు సూర్యుడు సముద్రంలోంచి తేలి బైటికివస్తాడు, లోకమంతా చూడచ్చు, కానీ రేపు ఊరంతా ఏ మనుకుంటుందో తెలియడానికి సముద్రానికి నిన్నారేపూ అనేవి వున్నాయా!
 

No comments:

Post a Comment