Total Pageviews

Tuesday 18 January 2011

చెట్టుతల్లి - కవిత

చెట్టుతల్లి




అమ్మా!
ఆవేదన నిండిన కళ్లతో,
అసహాయంగా రాలిపడే కన్నీళ్లతో,
మూగగా రోదించగల శక్తిమాత్రమేగల వాడిని....

పచ్చగా
నూరేళ్లూ బ్రతకమంటూ మాత్రం
ప్రార్థించగలవాడిని..

మరణానికి  విలువిచ్చేవారికి
బ్రతుకు సుఖాన్ని తెలియజెప్పలేని వాడిని,
ఖచ్చితంగా అశక్తుడిని
కానీ ఆవేశగ్రస్తుడిని...

చిన్నమైన మానులతో
ఛేత్త ఎవరో తెలియని అమాయకత్వంతో -
మోడై నేల రాలిన నిన్ను
కనుమరుగైన నీ పచ్చదన్నాన్ని చూసి
ఈ వేళ నా హృదయం
ప్రచండ శరాఘాతానికి గురైన
లేడిలాగా మూలుగుతోంది...

పచ్చటి ఆకులతో
సంతోషంగా గలగలలాడుతూ
ప్రచండ సూర్యాగ్నినుండి సేదదీరేందుకు ఛాయలనూ
అందాన్నీ ఆనందాన్నీ,
ఆహ్లాదభరిత సంధ్యలనూ,
పక్షుల కిలకిలారావాల సంగీతాన్నీ-
ఎంతెంత ఆప్యాయతని పంచి ఇచ్చేదానివీ...
ఎంతెంత సంబరాన్ని అందించేదానివీ....
పెద్దతనం ఆవహించిన ఒడలిన బెరడులతో -
ఎంతెంత గంభీరంగా నిలబడి ఉండేదానివీ....

ఎంత పెద్దదానివో ఎన్నేళ్లు బ్రతికినదానివో
ఊహించుకుంటే -
నాగుండె లయ తప్పుతుంది....

తెల్లవాళ్ల పాలనను ఎరిగిన దానివి,
రోడ్డుపై నడిచి వెళ్లిన గాంధీతాతని చూసిన దానివి,
స్వాతంత్ర్య సంగ్రామంలో -
తుపాకీ పట్టుకుని నీ కొమ్మల్లో దాక్కున్న
దేశభక్తుడి గుండె స్థైర్యానికి -
మూగ సాక్ష్యంగా నిలచిన దానివి....

అమ్మా, వీళ్లంతా కలిసి నిన్నేదో
శిక్షించారని భావించకు....
నన్ను దయచేసి వివరించనియ్యి....

మనిషి మనిషిపై పగబట్టాడు
బాంబులతో ప్రతీకారం తీర్చుకునే తొందరలో
నిన్ను బలిగొన్నాడు....

అమ్మా! అనేక మంది మరణించారంటూ
వార్తాపత్రికలు అదేపనిగా రాశాయి....
పేపర్లన్నీ పేర్లతో నిండిపోయాయి
అమ్మా! అందులో నీ పేరు లేదు....
వెదకటం వృధా, వీళ్లు గుర్తించలేరు
నిన్ను చంపేశారని ఎంత మొత్తుకున్నా
వీళ్లు పట్టించుకోరు.....

అమ్మా, దయచేసి వీళ్లపై ఆగ్రహించకు
నిన్ను అన్యాయంగా బలిచేశారని వీళ్లను శపించకు...

అమ్మా, నీ విలువ తెలియని
వారి మధ్య బ్రతుకుతున్నవాడిని
నేనూ వారిలో ఒకడిని....

రాలిపోయిన నీ పచ్చదనానికి
ప్రాయశ్చిత్తం చేసుకోగల శక్తి లేనివాడిని
నిన్ను బలిగొన్నవారిని ఊరికే వదిలేసిన
ప్రభుత్వాన్ని హెచ్చరించలేని వాడిని...
ఏడవడానికి కళ్లనిండా నీరు మాత్రం
నింపుకోగలిగిన వాడిని...

చెప్పాగదా,
అశక్తుడిని కానీ ఆవేశగ్రస్తుడిని....
అమ్మా, నిన్ను కాపాడుకోలేకపోయి కుమిలిపోతున్నవాడిని
అమ్మా..... నేను .... మానవుడిని...

                                                                                              -మాధవ్ (మార్చి 1993)

----- *** ------
(మార్చి 1993 బొంబాయి బాంబు ప్రేళుల్ల తర్వాత అలా రోడ్డుమీద వెళుతూ ఛిద్రమై పడిన చెట్టుని చూసినపుడు కలిగిన ఆవేదన ఈ కవిత)









No comments:

Post a Comment