Total Pageviews

Thursday, 5 June 2014

జ్యోతిషం నిజమా అబద్ధమా! నా అభిప్రాయం... [వ్యాసం]

జ్యోతిషం నిజమా అబద్ధమా!  నా అభిప్రాయం... [వ్యాసం]

ఎప్పట్నించో జ్యోతిషంపై నా అభిప్రాయాన్ని అనేకులు మిత్రులు అడుగుతున్నారు... ఇవాళ ఎందుకో మిత్రులు విప్రవరేణ్యులు విభాతమిత్ర వారి ముఖపుస్తక లఘువ్యాసం చూసిన తర్వాత నా మనసులోని మాటలు రాయాలని ఆ పరమాత్మ ప్రేరేపణ… అస్తు!

జ్యోతిషం నిజమూ అబద్ధమూ రెండూనూ…. దీనిని కొంచెం లోతుగా అర్ధంచేసుకోవాలి. జ్యోతిషం మీ పూర్వజన్మను చూస్తుంది. అలాగే మీరు పుట్టినప్పటి గ్రహగతులనుబట్టి మీ భవిష్యత్తును సూచిస్తుంది. కానీ జ్యోతిషం నిజమవాలంటే మీకు పూర్వజన్మ ఉండి తీరాలి. అదిగూడా పూర్వజన్మ మనుష్యజన్మ అయి ఉండాలి. పూర్వజన్మలో పశుపక్ష్యాదులుగా పుట్టిన జీవులకు ఈ జన్మలో జ్యోతిషం వర్తించడం జరగదు. హైందవమతం పూర్వజన్మ ఖచ్చితంగా ఉన్నది అన్నవిషయాన్ని ఒప్పుకోదు. మీకు ’పూర్వజన్మ ఉండి ఉండచ్చు’ అంతేగానీ ఉండి తీరిందన్న విషయాన్ని ఒప్పుకోదు. ఇక్కడే బౌద్ధులకు, జైనులకు మరియు హిందువులకు తార్కికమైన భేదం ఉంది. బౌద్ధులు జైనులు మీకు పూర్వజన్మ ఖచ్చితంగా ఉన్నది అంటారు. బుద్ధుడు జాతకకధలు రాసాడు. అయితే హిందుమతం దీనిని ఒప్పుకోదు… కొంచెం లోతుగా చెబుతాను దయచేసి ఆలోచించండి…

సృష్టి ఎలా జరిగింది? మనం ఎలా పుట్టాము? :- “ఆత్మావా ఇదం ఏక అగ్ర ఏవ ఆశీత్ నాన్యత్ కించనమిషత్ స ఐక్ష్యత లోకాన్నుసృజ| ఇతి స ఇమాన్ లోకానసృజత [ఐతరేయ ఉపనిషత్తు 1-1]
ఇతః పూర్వం ఆత్మ ఒక్కటే ఉండేది. ఇంకొకటంటూ ఏదీ లేదు. అది (తత్ = ఆది/ఆయన/ఆవిడ) లోకాన్ని సృష్టించింది. కుమ్మరివాడు కుండని సృష్టించాడు అనుకుందాము… ఎలా సృష్టించాడు? కుండను మట్టినుండి సృష్టించాడు. మరి పరమాత్మ ఈ సృష్టిని సృష్టించాడంటే ఆయనకు ఏది ముడిపదార్ధం? అంటే ’తనకు తానే ముడిపదార్ధం’ అని ఋషులు సమాధానం చెప్పారు. ఊర్ణనాభి – సాలెపురుగు తన గర్భంలోనుండే పూర్తిగా తాడును తీసి గూడుని అల్లినట్లు పరమాత్మ తనలోనుండే ఈ మాయ ప్రపంచాన్ని అల్లాడు అని ఉదాహరణగా చెప్పారు. అందుకే బ్రహ్మసూత్రం “ప్రకృతిశ్చ ప్రతిజ్ఞాదృష్టాంతానుపరోధాత్” [బ్రహ్మసూత్రం 2-4-23] అని బోధిస్తుంది. కుండకు కుమ్మరి మ్మిత్త కారణము మట్టి ఉపాదాన కారణం అయుండచ్చు, గానీ జగత్తుకు బ్రహ్మమే నిమ్మిత్తము ఉపాదానకారణము రెండూనూ.

ఇకపోతే ఒక్కడిగా ఉన్న అట్టి అఖండ పరిపూర్ణ పరమాత్మలో ఒక కోరిక పుట్టిందట! “తదైక్ష్యత బహుశ్యాం ప్రజాయేయేతి” [ఛాందోగ్య ఉపనిషత్తు 6-2-3] ఒక్కడినే అనేకులుగా అవుతానని అనుకున్నాడట.
అనుకున్నవాడు ఊరుకుంటాడా అనేకులుగా అయాడు… ఒక బంగారంలోనుండి అనేకమైన నగలు తయారుచేసినా నగలన్నిటివెనుకనున్న బంగారం వలె నామరూపాలో స్వజాతీయ విజాతీయ స్వగత భేధాలతో వెలుగొందేసృష్టివెనుక సూత్రధారివలె ఆయనే ఉన్నాడు….

సరే! దీనివల్ల తార్కికంగా ఆలోచిస్తే మీరు నేను ఆ భగవత్స్వరూపులమనీ పరమాత్మస్వరూపులమనీ స్పష్టంగా తెలుస్తుంది….. ఇంతకీ జీవుడిగా మారిన పరమాత్మ ఏంచేస్తున్నాడు?! ఒక సముద్రంలో అల లేచిందనుకోండి ఆ అల ఏంచేస్తోంది? తీరంవైపు ఆబగా ప్రయాణంచేస్తోంది. కానీ లేచిన అలలన్నీ తీరాన్ని చేరవు. కొన్ని సముద్రంలోనే లేచి సముద్రంలోనే కలిసి సముద్రంగా మారిపోతాయి. పోనీ తీరాన్ని చేరిన అల అయినా దాటి ఎక్కడికో వెళ్లిపోతుందా అనుకుంటే అదీ జరగదు. తీరాన్ని చేరిన అల తిరిగి మళ్లీ అదేవేగంతో తిరోన్ముఖమై సముద్రంలోనే కలుస్తుంది. ఈ విధంగా చూస్తే – అన్వయిస్తే – జీవుడు ఈ చేస్తున్న జీవితప్రయాణంలో ఎక్కడో సముద్రంలోని అలవంటి ఒక నిజం దాగిఉంది…. పరమాత్మ అనే సముద్రంలో అలగా వ్యక్తమైన మనం పరమాత్మ అనే సముద్రంలో అలగానే కలిసి ముక్తిని పొందడం తధ్యం….

కానీ బౌద్ధం జీవజగత్తు నిర్ణయాన్ని ఈ విధంగా చెయ్యదు. అలాగే ద్వైత సిద్ధాంతమూ ఈ విధంగా చెయ్యదు. బౌద్ధులు జ్యోతిషానికి అతి ప్రాధాన్యతను ఇచ్చేవారు. అలాగే ద్వైతులుగూడా ప్రాధాన్యతను ఇస్తారు. సరే! అది వేరే చర్చ!

మనం వెసుకోవాల్సిన తార్కికమైన ప్రశ్న: జ్యోతిషం అనేది ఎవరి భవిష్యత్తును సూచిస్తోంది?
సమాధానం: జ్యోతిషం జీవుడిగా మారిన పరమాత్మ భవిష్యత్తును సూచిస్తోంది.

అయితే జ్యోతిషానికి పునర్జన్మతో సంబంధం ఉందని చెప్పానుగదా. కానీ పరమాత్మ పుట్టిఉంటే ఎప్పుడు పుట్టాడు? నాకు పూర్వజన్మ అనేది ఉంది అని అనుకుంటే, ఆ పూర్వజన్మకి ఏ పూర్వజన్మకారణం?! అలా ఆలోచిస్తూపోతే ఎప్పుడో ఒకప్పుడు *మొట్టమొదటి* జన్మ అనేది ఉండి తీరాలి…. అలా మొట్టమొదటి జన్మ ఉండి ఉంటే అది పశువుగా కాదు మనిషిగానే అయిఉండాలి. “బహుశ్యాం ప్రజాయేయేతి” అన్నప్పుడు ప్రజ అంటే “ప్రకర్షేణ జ” అంటే చక్కగా పుట్టినట్లేగదా! అంటే పరమాత్మ లక్షణాలతో మంచి బుద్ధులతో బుద్ధిజీవియైన మనిషిగానే పుట్టాలి.

సరే మనిషిగానే మొదటి జన్మ వచ్చింది అనుకుంటే ఈ జన్మే ఆ మొదటిజన్మ అయిండచ్చుగదా?! అందులో ఏమాత్రమూ సందేహంలేదు. మనమందరమూ “అమృతపుత్రులము” (శృణ్వంతు సర్వే అమృతస్య పుత్రాః) అనే వేదం చెబుతుంది….

మనం అమృతపుత్రులం కాబట్టి ఇతర మతస్తులు చెప్పి భయపెట్టినట్లుగా హిందువులు “పాపులు” కాదు. హిందువులు పాపక్షమాపణ అడగనక్కర్లేదు! ఈ విషయంలో నన్ను నమ్మండి… పాపము అన్న పదానికి మన హైందవ ఋషులు సూచించిన అర్ధం వేరు. కాబట్టి మొట్టమొదటి జన్మ అయిన అమృతపుత్రులకు (మహాత్ములకు, కారణ జన్ములకు) జ్యోతిషం వర్తించదు. కాబట్టి మహాత్ములైనటువంటి వారి జ్యోతిషం చూడడం వృధా!

ఇకపోతే జ్యోతిషం పునర్జన్మ తీసుకున్నవారికి వర్తిస్తుంది. కానీ ముందర అది మొదటిజన్మా పునర్జన్మా అన్న లెక్క తెలియాలి, పైగా ఆ పునర్జన్మగానీ ఏ జంతుజన్మో అయితే జంతువులకు పాపం అనేది వర్తించదు. అందువల్ల జ్యోతిషం అంతుబట్టదు… కాబట్టి తార్కికంగా చూస్తే జ్యోతిషం వర్తించేదల్లా మానవులుగా పుట్టి తిరిగి పునర్జన్మనందిన మానవులకు మాత్రమే అని నా అభిప్రాయం. కాబట్టి ఇటువంటి అయోమయపు జన్మలమధ్య జ్యోతిషాన్ని వెదకటం అంటే గడ్డివాములో సూదిని వెతికినంత శ్రమ. అందుకే జ్యోతిషం చూడడానికి లెక్కలు మాత్రమే దిట్టగా వస్తె సరిపోదు…దానికి “సిద్ధశక్తి” తోడవాలి. ఋషిత్వం ఉండాలి.. గాయత్రీ జపము, సంధ్యావందన, అగ్నిష్టోమాది అనుష్ఠానాలు ఈ దైవీశక్తిని అందజేసి జ్యోతిషాన్ని గోచరింపజేసుకోగల సిద్ధత్వాన్ని కలుగజేస్తాయి. అటువంటి సిద్ధుడే తన ఎదుటబడిన జీవుడి జ్యోతిషాన్ని స్పష్టంగా చూడగలుగుతాడు. మీరిచ్చే వందరూపాయలకు ఆశపడి జ్యోతిషంచెప్పేవారు సిద్ధులయి ఉండడం బహు అరుదు….

తాము ఏ జన్మలోనో ఏదో పాపం చేసామని, అందుకే అనుభవిస్తున్నామనీ‘ అనుకుని కుమిలిపోతూ చేసే జపతపాలు పూజలు జాతకాలవల్ల, తీర్థయాత్రలవల్ల, మానససరోవరంలో మునకలవల్ల, మతాన్ని నమ్మి పాటించే మానవులలోని “సగం జబ్బులు, ఆత్మన్యూనత” ఇటువంటి పూర్వజన్మకృతపాపపు నమ్మకం వల్ల పుడుతుంటాయి. –! ‘జాతస్యహి దృవోమృత్యుః – జన్మించినది మరణించకమానదు‘ అని భగవద్గీత చెబుతోంది. తర్వాత అదే శ్లోకంలో ‘దృవం జన్మ మృతస్యచ‘ మరణించినది జన్మించకమానదు…… అని… ఇది అపరిహార్యమైన చక్రం. మంచిది…. కానీ మొదటి జన్మ ఎప్పుడు మొదలైంది?! అనే ప్రశ్న వేసుకుంటే ‘ఎప్పుడో ఒకప్పుడు మొదటి జన్మ కలిగింది‘ అని మనసు సమాధానం చెబుతుందేగానీ ‘ఇదే నీ మొదటిజన్మ‘ అని తమ ఆత్మ చెప్పే ఆత్మీయసమాధానం ఆత్మఘోష మనిషికి బోధపడదు!!! ఇదే గొప్ప మాయ! ఏ జన్మలో ఏది జరిగిందో తెలుసుకునే జ్యోతిషపు కుతూహలంకంటే ఈ జన్మలో మనం ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నాము అనే ప్రశ్నకే మనకు సమాధానం గోచరమవదు. అన్నీ తెలిసిన అనుభవాలు కలిగిన ఈ జన్మే అర్ధంకాక సతమతమవుతున్న మానవుడు వేరే వెనుకటి జన్మలో చేసిన ఏదో పాపానికి ఫలం అనుభవిస్తున్నాడు అనుకోవడం ‘హాస్యాస్పదం‘. ‘ఈ జన్మ సత్యం, వెనుకటి జన్మ మిధ్య‘ అనేది తెలుసుకుని నడుచుకున్నప్పుడు అనివార్యమైన చక్రాన్నుండి బయటపడచ్చు. కాబట్టి ‘శృణ్వంతు సర్వే అమృతస్యపుత్రాః — ఓ అమృతపుత్రులాలా వినండి…. మీకు ఇదే మొదటి జన్మ, వెనుకటి జన్మలగురుంచిన చింతన పాపభీతి భయాలనుండి బయటపడండి. సత్యశీలురుగా మారండి… భక్తితో మీ ఆరాధ్యదైవాన్ని నమ్మంది. ఈ జన్మప్రాయశ్చిత్తాలను చేసుకోండి గానీ వెనుకటి జన్మ ప్రాయశ్చిత్తాలు మానండి…. మీరు ఏ పాపమూ చేయలేదు గాబట్టి కుమిలిపోకండి. ఎప్పుడో ఏదో చేసినదానికి మీరు అనుభవించడంలేదు. ఈ జన్మలో చేసిన దానికే మీరు అనుభవిస్తున్నారు. మీరు అనుభవించే అనుభవాలపై మీరు చేసే చేయబోయే ప్రతీకారచర్యలే మీ రాబోయే జన్మలను, అలాగే ఈ జన్మలో మీరు అనుభవించేదానినీ నిర్దేశిస్తాయి. అందువల్ల మీరు చేయగలిగింది కర్తవ్యం ఇప్పుడు మీ కళ్లముందే ఉంది… తెలుసుకోండి… మేల్కొనండి….

పోవాల్సిన రోజువస్తే దోసిటినీళ్లలోగూడా మునిగి చనిపోయినవారున్నారు! జ్యోతిషాన్ని
 నమ్ముతానంటారా.... నమ్మండి... కానీ నేను చెప్పేదల్లా ***అనవసరంగా భయపడకండి**** జరిగి తీరుతుంది అని చెప్పేవాడు సిద్ధుడుగానపుడు ఆ లెక్కలు ఇరవైశాతం మాత్రమే ఫలించే అవకాశాలు ఉన్నాయి...

జ్యోతిషానికి మరీ ఎక్కువ ప్రాధాన్యతనివ్వకండి… అనవసరపు భయాన్ని వీడండి… మీ మీ బ్రతుకులు మీరు బ్రతకండి… మీరు పాపులుగాదు… మీరు అమృతపుత్రులు… హాయిగా జీవించండి… తరించండి… ఓం తత్సత్!

-తురుమెళ్ల మాధవకుమార శర్మ, లండన్, 05/06/2014

మరింతవివరణ: నేను జ్యోతిషాన్ని ఖండించడంలేదు. కానీ ఇప్పటి జ్యోతిషం వెనుక హిందువుల ఊహకంటే బౌద్ధుల ఊహే ఎక్కువ అని మనవి జెయ్యదలచుకున్నాను. మీరు జ్యోతిషాన్ని ఎవరిగూర్చి చెబుతున్నారు, ఎవరిగూర్చి అడుగుతున్నారు అన్న ప్రశ్నవేసుకోవాలి. జీవుడిగురించే అడుగుతున్నారుగదా?! మరి ఈ జీవుడి గతిగురించి చర్చించకుండా జ్యోతిషం అనేస్తే సరిపోదుగదా!

వజ్రయాన బౌద్ధులు నమ్మిన పునర్జన్మ సిద్ధాంతానికి ఇప్పటి జ్యోతిషులు చెప్పే జ్యోతిషం అనుపానం మాత్రమే అని నా అభిప్రాయం.

నాకు బోధపడినంతవరకు వజ్రయాన బౌద్ధమతం జ్యోతిషానికి అత్యంత ప్రాధాన్యతను ఇస్తుంది. ఆచార్య నాగార్జునుడు మనందరికీ చిరపరిచితుడు. ఈయన ఒకటో శతాబ్దములో శ్రీపర్వతం (ఇప్పటి నాగార్జున కొండ, ఆంధ్రప్రదేశ్) మీద ఉండేవాడు. ఈయన బ్రాహ్మణవంశంలో జన్మించాడు కాత్యాయన (కాట్యాయన) సాంప్రదాయానికి చెందినవాడు. అప్పట్లో ఆంధ్రప్రాంతంలోని బౌద్ధభిక్కులను అంధకులు లేదా చైతికులు అని పిలుస్తారు. ఈయనపై అప్పటి బ్రాహ్మణ వైదిక ప్రభావం ఉండితీరడం సహజం.

ఆస్తికులు అంటే ఆత్మవాదులు. ఆత్మయొక్క సత్యత్వాన్ని నిత్యత్వాన్ని నమ్మేవారు. ఆస్తికులు ఆత్మయొక్క పునర్జన్మను నమ్ముతారు. అంగుష్ఠమాత్రం పురుషః ప్రమాణం - బొటనవేలు పరిణామంలో ఉండే అంతఃపురుషుడు ఆత్మ పురుషుడు లోనుండి అన్నీ నడుపుతాడు. ఇతడే ఒక జన్మనుండి నుండి ఇంకొక జన్మవైపునకు వెళతాడు పునర్జన్మను పొందుతాడు అనే నమ్మకం... మనం రోజూ దేవాలయాల్లో మంతపుష్పం చదువుతాముగదా?! అందులో "తస్య మధ్యే వహ్నిశిఖా అణీయోర్ధ్వా వ్యవస్థితః, నీలతోయదమధ్యస్థా ద్విద్యుల్లేఖేవ భాస్వరా, నీవారశూకవ త్తన్వీ పీతా భాస్వత్యణూపమా, తస్య శ్శిఖాయా మధ్యే పరమాత్మా వ్యవస్థితః" ఇక్కడ తన్వీ అంటే దేహాన్ని ధరించినవాడు ఆత్మపురుషుడు.

బుద్దుడు ఈ ‘నీవారశూకవత్ + తన్వీ‘ వడ్లగింజ పైన ఉండే కొన వంటి ప్రమాణంలో ఉన్న ‘దేహి‘ (ఆత్మ) ను పూర్తిగా తిరస్కరించి తన మహాపరినిబ్బాణసూత్తంలో ‘నాస్తి‘ ---- లేదు పొమ్మని తిరస్కరించాడు. అందువల్లే బౌద్ధులు నాస్తికులు. . అయితే బుద్ధుడు తన మహాపరినిర్వాణసూత్రము (మహాపరినిబ్బానసుత్త)లో హిందువులయొక్క (అప్పట్లో వైదికులు - వేదమును నమ్మి ఆచరించేవారు) ఈ ఆస్తికత్వాన్ని సంపూర్తిగా తిరస్కరిస్తూ ఈ విధంగా రాసాడు "వైదికులు (హిందువులు) హృదయంలో వడ్లగింజప్రమాణంలోనూ బియ్యపుగింజ ప్రమాణంలోనూ లేదా బొటనవేలి ప్రమాణంలోనూ ఒక ఆత్మ ఉన్నట్లుగా భ్రమిస్తారు - ఊహిస్తారు." [చదువుడు: "మహాయాన మహాపరినిర్వాణ సూత్రము" ఇవి మొత్తం పన్నెండు సంపుటిలు. వీటిలో మూడవ సంపుటి నాలుగవ పేజి ఐదవ పేరాలో స్పష్టంగా ఉంది]

"జీవులు ఆత్మశూన్యులు (అనాత్మన్) వీరు ఆత్మవల్లగాదు శూన్యతవల్ల అవర్తించబడతారు. బయటిస్థితిగతులే జీవియొక్క గమనగతులను నిర్దేశిస్తాయి" అని బుద్ధుడి ఉపదేశం. సరే మరయితే బౌద్ధులు పునర్జన్మను ఎలా సమర్ధిస్తారు అంటే దానికి ‘ఆలయవిజ్ఞానము‘, ‘మూలవిజ్ఞానము‘ అని విడదీసి వివరించారు.

బయటి స్థితిగతులు జీవుడి గమనాన్ని నిర్దేశిస్తాయిగాబట్టి జీవుడు పునర్జన్మను ఎక్కడ అందుకొబోతున్నాడో అనేది వజ్రయానబుద్ధులు ముందుగానే ఊహించేస్తారు. దలైలామా ఎక్కడపుట్టాడో అనేది వీరు ఇలాగే ఊహిస్తారు. ఇకపోతే మనం ఇప్పుడు జ్యోతిషం అని దేనిని అనుకుంటున్నామో వాటిలోని లెక్కలు హిందువులవే అయినా వాటివెనుక ఉన్న ఊహ మాత్రం బౌద్ధానికి చెందినది.... అందువలన సంకరంగా మారింది...

ఆత్మయొక్క నిత్యత్వాన్ని ఒప్పుకుంటే ఆత్మ ఈ జన్మలో ఇప్పుడే పుట్టింది అనేది తెలుస్తుంది... ఈ ఆత్మకు గమనగతి ఆత్మమాత్రమే నిర్దేశిస్తుంది. నీ భవిష్యత్తు నీ చేతిలో ఉంది అని చెబుతుంది శుద్ధహైందవం. అందుకే జ్యోతిషం లెక్కలు ఆత్మ మార్గాన్ని నిర్దేశిస్తాయి.

ఆత్మ అనేది లేనేలేదు అనాత్మ గ్రహస్థితులవల్ల పుట్టి గిట్టుతూంటుంది చివరకు బుద్ధత్వాన్ని పొందిన అనాత్మ శూన్యంగా మారి మిగులుతుంది అనేది బౌద్ధం. ఈ సిద్ధాంతంలో వజ్రయానం మన ఇప్పటి జ్యోతిషంయొక్క ఊహలను అందించింది....

ఇకపై నమ్ముతాను నమ్మను అనేది మీ ఇష్టం... స్వస్తి... మీ శ్రేయోభిలాషి - తురుమెళ్ల మాధవ

2 comments:

  1. “జ్యోతిషం మీ పూర్వజన్మను చూస్తుంది. అలాగే మీరు పుట్టినప్పటి గ్రహగతులనుబట్టి మీ భవిష్యత్తును సూచిస్తుంది. కానీ జ్యోతిషం నిజమవాలంటే మీకు పూర్వజన్మ ఉండి తీరాలి. అదిగూడా పూర్వజన్మ మనుష్యజన్మ అయి ఉండాలి. పూర్వజన్మలో పశుపక్ష్యాదులుగా పుట్టిన జీవులకు ఈ జన్మలో జ్యోతిషం వర్తించడం జరగదు.”

    Heading చాలా catchy గా ఉండి మీ blog లోకి తొంగి చూసాను. ఐతే , మీ వ్యాసం పూర్తిగా చదవలేదు. పైన quote చేసిన paragraph దగ్గిరే ఆగిపొయాను. ఎందుకంటే, ఈ టాపిక్ ని మీరు objective గా analyze చేసి ఒక సహేతుకమైన ముగింపు కి రాగాలరన్న నమ్మకం అది కలిగించలేక పోయింది.

    ఈ paragraph లో మీరు చెప్పిన ప్రతి వ్యాక్యము ఒక positive statement or a declaration, without really bothering to provide any support or reason. సూర్యుడు తూర్పున ఉదయిస్తాడు, భూమి గుండ్రంగా ఉంది, బంతి పైకేస్తే తిరిగి కింద పడుతుంది అన్నంత నిక్కచ్చిగా, బల్లగుద్ది చెప్పినా, each of these sentences remain a mere assertion and not an irrefutable fact.

    మరి ఇలాంటి assumptions మీద ఆధారపడి ఎవరు ఎన్ని పేజీల thesis రాసినా, దానికి విలువేముంటుంది?

    ReplyDelete
  2. ఇంకో మాట:
    మీరు ఒక్క క్షణం logical గా ఆలోచిస్తే, you set out to find an answer to a genuine question: జ్యోతిషం నిజమా అబద్ధమా?

    “జ్యోతిషం మీ పూర్వజన్మను చూస్తుంది, పుట్టినప్పటి గ్రహగతులనుబట్టి మీ భవిష్యత్తును సూచిస్తుంది” వగైరా వంటి మీ statements జ్యోతిషం నిజము అనే ప్రతిపాదనని already సమర్ధించేస్తున్నపుడు, ఈ విధమైన assertions తో మీ పరిశీలన, పరిశోధన మొదలు పెడుతున్నపుడు, నికరమైన సమాధానం తెలుసుకోవాలనే మీ అన్వేషణ ఎలా ఫలిస్తుంది?

    ReplyDelete