Total Pageviews

Thursday 24 April 2014

భారతదేశంలో రోడ్డుప్రమాదాలు - జాగ్రత్తలు

మీరెంత మెలికలు తిరిగిన డ్రైవర్ అవచ్చుగాక, మీ కారులో గొప్ప గొప్ప సౌకర్యాలుండచ్చుగాక, మీ ఇంజనులో రాకెట్ శక్తి ఉండచ్చుగాక - కానీ మీ కారు రోడ్డుపై ఆధారపడే చోట మీరు అతి బలహీనులై ఉంటారు. అంటే మీ కారు టైర్లు రోడ్డుపై ఆధారపడి ఉంటాయి. సరైన రోడ్డుపై టైర్లు సరిగా ఆనుకుని కారు సరిగా వెళ్తుంది. కానీ అదేరోడ్డుపై ఆయిల్ పడినా, మంచు పట్టినా, లేక గడ్డివాములు వేసినా మీ పని గోవిందా! ఎంతమంచి కారైనా సరే టైర్ల అదుపుతప్పి జారిపోతుంది. అందుకే రోడ్లపై మూర్ఖులు చేరకుండా చూడాల్సిన బాధ్యత అందరిమీదా ఉంది.

బ్రేక్ వేస్తేనే కారు ఆగదు.. రోడ్డు పరిస్థితిని బట్టి ఆగుతుంది. పైగా బ్రేకింగ్ డిస్టెన్స్, స్టాపింగ్ డిస్టెన్స్ అని లెక్క ఉంటుంది... ఆ లెక్కతెలీనివాడు రోడ్డెక్కి కారు పోనిస్తే జరిగేది పూర్తి అనర్ధమే! పల్టీలు కొట్టిందంటే ఎక్కడో లెక్కలో తేడా వచ్చింది... టైం బాగోక కాదు...

Starting at 20mph x 2 - for the total stopping distance (i.e. thinking + braking)... increase the multiplication by 0.5 increments

20mph x 2 = 40ft
30mph x 2.5 = 75ft
40mph x 3 = 120ft
50mph x 3.5 = 175ft
60mph x 4 = 240ft
70mph x 4.5 = 315ft

అంటే మీరు గంటకు ముప్పైమైళ్ల వేగంతో వెళుతున్నప్పుడు మీ ముందర ఉన్న వాహనానికీ మీ వాహనానికీ మధ్య కనీసం డెబ్భైఐదు అడుగుల దూరం ఉండాలి. లేకపోతే ఆ వాహనం డ్రైవర్ సడన్ బ్రేక్ కొడితే మీరు వెళ్లి వెనకనుండి కొట్టేయ్యడం ఖాయం. మీరు ఖంగారులో గట్టిగా మీ బ్రేక్ కొట్టేస్తే పైగా తప్పుకుందామని స్టీరింగ్ తిప్పితే పల్టీలుగొట్టటమూ ఖాయమే!  పైగా రోడ్డుపై మంచుపట్టినా, భారీ వర్షం పడుతున్నా ఈ లెక్కలు మారతాయి.  అనుమానం ఉన్నప్పుడు వీలైనంత దూరం పెంచి డ్రైవ్ చెయ్యండి.   కారుటైర్లు గూడా అనేక రకాలు ఉంటాయి వాటి శక్తిని బట్టి గూడా మీ గమనం ఆధారపడి ఉంటుంది.

అందుకే లా ఆఫ్ ఫిజిక్స్ తెలుసుకోవాలి. దేవుడిలెక్క బానే ఉంది... మనమే మందమతుల్లా ప్రవర్తించి ప్రమాదాలకు గురి అవుతాము.

ఇండియాలో ముఖ్యంగా ఆంధ్రలో రోడ్లమీద వరివాములు మినపవాములు గింజలు రాలేందుకు రోడ్లమీద వేస్తారు. భారీవాహనాలు వీటిని తొక్కితే గింజలు రాలతాయి. కానీ ఈ కాలంలోని ఆధునిక కార్ల బాడీ చాలా కిందకి ఉంటుంది. డ్రైవర్లు ఖంగారుపడితే చాలా ప్రమాదానికి గురిచేసే అవకాశం ఉంది. ఒకసారి శ్రీశైలం నుండి నేను సెల్ఫ్‌డ్రైవింగ్ లో వస్తున్నాను. ఇండియాలో వీలైనంతవరకు నా కారు నేనే నడుపుకుంటాను. సరే నా కార్లో మా అమ్మనాన్న అలాగే నా మేనత్త డాక్టర్ అన్నాప్రగడ సీతాకృష్ణ అలాగే మా మామయ్య శ్రీ కృష్ణమూర్తిగారు ఉన్నారు. నా హోండా కారు ఈ రోడ్డుమీద వేసిన ఒక మినుములవాము మీదకు ఎక్కబోయింది. నేను కారును పక్కనుండి పోనిద్దామని చూసాను. కానీ అలా చెయ్యకుండా అంటే కారు పక్కకు తప్పుకుని వెళ్లడానికి వీల్లేకుండా పెద్ద బండరాళ్లు పెట్టారు. నేను కారు ఆపి కిందకి దిగి బండరాయి తీసి అవతలికి విసిరి వెళ్లడానికి చూస్తే నా మీదకు అక్కడే టీస్టాల్ లో కూర్చున్న రైతులు అనుకుంటాను తగాదాకి వచ్చారు. నా కారును తప్పుకు పోనిస్తున్నందుకు. కానీ నేను తక్కువ తినలేదు. హోరాహోరీగా పోట్లాడాను. "మీకు బుద్ధుందా ఇలా రోడ్లమీద వాములు వేస్తారా?! కార్లు వేగంగా వచ్చి తప్పితే ప్రమాదం జరగదా!" అని అడిగి నాలుగు కడిగేసాను. వాళ్లు మర్డర్ చేస్తామని మశానం చేస్తామని బెదిరింపులకు దిగారు. చివరకు మా మేనత్తగూడా కారు దిగి వాళ్లతో పోట్లాడే సరికి వాళ్లు తగ్గి నన్ను వెళ్లనిచ్చారు. కానీ ఆరోజు అనిపించింది ఎప్పుడో ఇది రోడ్డుప్రమాదానికి దారితీస్తుంది అని. నాకు తెలిసి ఇప్పటికి ఇరవైమంది ఇలాంటి రోడ్డుపైన వేసిన వాముల ప్రమాదాల్లో మరణించారు. ఇవాళ శోభానాగిరెడ్డిగారట ఆవిడగూడా ఇలాంటి ప్రమాదంలో మరణించిందని విని బాధ అనిపించింది. రోడ్డు ఉన్నది కార్లు నడుపుకోవడానికి కానీ శిలావిగ్రహాలు కట్టుకోవడానికి, వాములు పరుచుకోవడానికి, భారీవాహనాలు నిలుపుకోవడానికి కాదు... వీళ్లకు ఎప్పుడు బుద్ధి వస్తుందో!!!
 --మాధవ తురుమెళ్ల

No comments:

Post a Comment