Total Pageviews

Tuesday 3 September 2013

కవిత - సముద్రంలాంటి ఆమె

కవిత - సముద్రంలాంటి ఆమె

File:Ahalya.jpg

ఆమె సముద్రం లాంటిది...
నిండుగా అందంగా చూసేవారికి ఆహ్లాదాన్నిస్తుంటుంది.

కానీ అతడేమో తనని తాను ఆమెకు తీరంగా భావిస్తాడు.
చెలియలికట్టలాగా మారి ఆమెను నిరంతరం శాసిస్తాడు.

ఆమె -
గంభీర నిశ్వనాలతో
అవనత వదనాలతో
తనలో దాగిన ఆతృతతో
అతడనే చెలియలికట్టకు స్వచ్ఛందంగా దగ్గరైంది..!
అనూచానంగా వచ్చే -
సాంప్రదాయపు చీరకట్టుకుని
’కాపురం’ అనే పేరుకి సిగ్గుగా తలొగ్గింది...

కానీ -
అతడిని చేరక మునుపు -
ఆవిడ ఉరకలెత్తుతూ లోకాన్ని ఉవ్విళ్లూరుస్తూ పరిగిడిన ఒక గంగ..!
వయ్యారాలొలకబోసి తన హొయలతో
చూపరుల హృదయాలను కొల్లగొట్టిన ఒక యమున..!
చదువుల్లో రాణించిన సరస్వతి..!
పుణ్యనదుల వయ్యారాలన్నీ ఆవిడ సొంతం..
తల్లిదండృలనే రెండు ఒడ్లమధ్య పొందికగా సాగుతూ
ఆవిడ వయస్వినై సముద్రంలా మారింది...
గంభీరత్వాన్ని తన ఉనికిగా చేసుకుంది...

కానీ,
సముద్రంగా మారినంత మాత్రాన
ఆమె అంతర్లీన అస్తిత్వం -
ఆమెనుండి దూరమవదు..!
ఆమె ప్రకృతి ఆమెనుండి సడలదు.
ఇప్పుడు సముద్రంగా పిలవబడుతున్న
ఆమె - "ఒకప్పటి గంగ, యమున
సాటిలేని సరస్వతి" అనే విషయం
లోకం మెల్లగా మర్చిపోవచ్చుగాక!
కానీ ఆవిడని ఆ విషయం సుతారమూ బాధించదు...
ఎందుకంటే, ఆవిడ లక్ష్యం ఇపుడు లోకం కాదు...!
ఆవిడకు అతడే లక్ష్యం...
అతడే త్వమేవాహం....
 అతడే నాతిచరామి...
నిజానికి -
అతడు ఆమెకు ’ఏదో ఒక తీరం’ కాదు...
తాను కావాలని కోరి చేరిన సాగర తీరం...!
అందుకే ఆమెకు అతడిపట్ల ఉన్నది పవిత్రబంధం...

అనుక్షణం అద్వైతభావనకై ఆతృతపడుతూ
అమె ప్రేమ ఆలోచనలు
అలల్లాగా అతడిని సృజిస్తుంటాయి,
పాతివ్ర్యత్యంగాఅతడికి లొంగుతూంటాయి....
ఆమె ఆలోచనల అలల
సున్నితపు తాకిడులన్నీ -
’అతడిని పలకరించాలని
ప్రేమగా దగ్గరకు చేరి
అతడి ఒడిలో ఒదగాలని’
చేసే నిరంతర  ప్రయత్నాలు....

అమె ఆలోచనల్లోని
గంగా యమున సరస్వతుల తియ్యదనం
ఆమె అస్తిత్వంలో ఇప్పటికీ
అంతర్లీనవాహినులై  ఉన్న విషయం
అతడెరిగిననాడు  -
అతడి చెలియలికట్టలాంటి శాసనం తప్పనిసరిగా మారుతుంది
ఒక కొత్త ఉదయం ఆవిడ నుదుటిన సూర్యుడి సింధూరంగా మారుతుంది.
ఆమె కురుల్లో అతడి ప్రణయనిశ్వాసాలు మేఘాల మమతల పొగలల్లుతాయి..

సముద్రానికీ తీరానికి మధ్య -
అనూచానంగా వస్తున్న బంధమే,
కానీ
ఒక నూతనత్వాన్ని పోదుచేసుకుని
ప్రతిపొద్దు బుగ్గకీ సిగ్గుల కెంజాయరంగులల్లి
సంసారానికి ఒక సరికొత్త వ్యాఖ్యానాన్నిస్తుంది.
వారిద్దరిమద్య ఆనంద నృత్యం జరుగుతుంది.
ప్రపంచానికి మరొక ఆదర్శపుజంట దొరుకుతుంది...

-మాధవ తురుమెళ్ల 01-08-2013


No comments:

Post a Comment