Total Pageviews

Thursday, 11 July 2013

నా ఆలోచన: జైనము బౌద్ధము క్షీణతకు హైందవమతం కారణం అనడం ‘అజ్ఞానం‘

బౌద్ధమతం భారతదేశంనుండి హిందువుల దురభిమానపూరిత దురాగతాలవల్లే కనుమరుగైందనే వాదం ‘శుద్ధ అజ్ఞానపూరితం‘ అలా వాదించేవారంత చరిత్రపట్ల అజ్ఞానం కలిగినవారు నాకు ఇంకెకరూ కనబడరు.  ఇటువంటి అజ్ఞానులు తమవద్ద విషయం తక్కువ విరేచనం ఎక్కువ అనే సంగతి తెలుసుకుని మౌనంగా కూర్చుని తమయొక్క జ్ఞానపరిధిని పెందుకుంటే వారికీ ప్రపంచానికీ మంచిదై ఉండేది.  కానీ దురదృష్టవశాత్తూ వీరు మాట్లాడే మాటలవల్ల మరింతమంది మతచరిత్రపట్ల అజ్ఞానులే పెరుగుతున్నారు.  బౌద్ధం అనేది ఒక వృక్షంలాగా ఎదిగింది. కొత్త ఎప్పుడూ వింతే!  పెరిగిన ప్రతి పెద్ద చెట్టూ ఏదో ఒకనాడు కూలకమానదు.  ఆ పెద్దచెట్టు తను పెరగాలనే ప్రబలమైన కాంక్షలో తన చుట్టుపక్కలే స్వేచ్చగా బ్రతుకుతున్న అనేక చిన్న మొక్కలను నిర్దాక్షిణ్యంగా అణగదొక్కుతుంది.  ఐతే హైందవమతం అనేది ‘అశ్వద్ధ వృక్షం‘ (ఊర్ధ్వమూలమధశ్శాఖం అశ్వద్ధం ప్రాహురవ్యయం - గీత).  అశ్వద్ధవృక్షానికి ఉన్న గొప్పలక్షణం మిగిలిన మహావృక్షానికి లేని లక్షణం ‘ఊడలు పాతుకోవడం‘  ఈ ఊడలు తమవైనబ్రతుకును బ్రతుకుతాయి.  అనేక శాఖలుగా మారతాయి ఒక మహారణ్యంగా భ్రమింపచేస్తాయి.  ఈనాటి హైందవమతం ఇలా ఒక గొప్ప అశ్వద్ధవృక్షంలాంటింది.  అనేకమైన స్వతంత్రమైన ఊడలు కలిగింది కానీ వీటన్నిటికీ మూలమైన ఒక అశ్వద్ధం ఉన్నది... అదే ‘వేదం‘....  ఈ వేదాలే హైందవానికి మూలం.  అందుకే వేదముని నమ్మిన హిందువులను మొదటినుండీ ‘వైదికులనీ - ఆస్తికులనీ‘ పిలిచారు.  వేదాన్ని నమ్మద్దు అని చెప్పిన ‘బౌద్ధ జైన‘ మతాలను నాస్తికమతాలు అని పిలిచారు.  జైనమతం అతి పురాతనమైనది.  అది ఒకప్పటి బ్రాహ్మణకులానికి (వర్ణానికి కాదు) చెందిన ‘అసలైన‘ మతం అని నా అభిప్రాయం. కానీ ఎప్పుడైతే బ్రాహ్మణులు తమ కులధర్మమైన శాకాహారాన్ని తమను అనుసరించి ‘వైదికులు‘గామారదలచుకున్న ఇతర కులాలవారిపై బలవంతంగా రుద్దలేదో అప్పుడే జైనులు చీలిపోయారు.  ఈ చీలిక ఋగ్వేదం ఆరవ అధ్యాయం తర్వాత జరిగిందనేది నా అభిప్రాయం.  ఎందుకంటే ఆ తర్వాతే ఋగ్వేదంలో జంతుబలుల ప్రసక్తి కనబడుతోంది.  ఇతరకులాలవారి మాంసాహారాన్ని ఒప్పుకున్న బ్రాహ్మణులు హిందువులుగా మారారు.  ఇతరకులాలవారి మాంసాహారాన్ని ఒప్పుకోకుండా తమదైన జీవనశైలిని అనుసరించినవారు జైనులుగా మిగిలిపోయారు.  జైనమతం ఎప్పుడూ వ్యాప్తి చెందలేదు క్షీణించిపోవడానికి.  కానీ బ్రాహ్మణులను దైవములుగా నమ్మిన క్షత్రియకుల రాజులు జైనులుగా మారి శాకాహారాన్ని స్వీకరించి జైనమతాన్ని అనుసరించారు. కానీ ఈ శాకాహారపు అలవాట్లవల్ల రజోగుణం తగ్గి యుద్దకాంక్ష క్షీణించింది.  దీనివల్ల సైనుకులు బలహీనులై రాజులు రాజ్యాలు పోగొట్టుకున్నారు అనే అపప్రధ ఉంది. అది వేరేచర్చ... కాబట్టి శాకాహారపు అలవాటువల్లే రాజులు జైనం వదిలిపెట్టారు.  కానీ జైనులు (బ్రాహ్మణులు) జైనులుగానే మిగిలిపోయారు. ఇకపోతే బౌద్దంయొక్క చరిత్రవేరు.  బౌద్ధం ఆదినుండీ మాంసాహారపూరితమైన మతం.  ఆహారాన్ని నిరాకరించడం మంచిదిగాదు అని ‘కొండన్న‘ హితబోధను తిరస్కరించి గయకు వెళ్లిపోయిన బుద్ధుడు శాకాహారి అని అనడం ఆయనను ఆయన బౌద్ధమేధాశక్తిని అవమానించడమే!  ఇలా బౌద్ధాన్ని అనేక అవమానాలకు గురిచేసినవారు హిందువులుగారు భారతదేశంలోనే పుట్టిన కుహనామేధావులు.   బుద్ధుడు మాంసాహారి.  కానీ బౌద్ధం పతనమవడానికి కారణం మాంసాహారమూగాదు.  భారతంలో బౌద్ధం కూలిపోవడానికి కారణం స్వయానా బౌద్ధమతమే!  శుద్ధమైన సూక్ష్మమైన వాదనలో బౌద్ధం నిలబడలేదు. వాదనాబలం పటిమ స్పష్టంగా తర్కానికి నిలబడగలిగిన హైందవవాదంలో బౌద్ధం ఓడిపోయిందనేది నిర్వివాదాంశం.    కానీ కాలం మారిపోయింది.  ఈ కలికాలంలో స్పష్టమైన వాదనకు అవకాశమే లేదు.  అందువల్ల బౌద్ధంలో వ్యక్తి గౌరవానికే ప్రాధాన్యత ఎక్కువ.  అందువల్లే వాదానికి ఆస్కారంలేని చోట్లలో బౌద్ధం పునఃప్రతిష్టగావించబడింది.  ఏది ఏమైనా మతచరిత్రగురించి తమదైన పరిశోధన చెయ్యకుండా అపోహలకు గురయేవారు జైనబౌద్ధమతాల క్షీణతకు హైందవమే కారణమని చెప్పడం శోచనీయం... అటువంటి వాదన అజ్ఞానం అమాయకం లోకకంటకం హేయచరితం.... స్వస్తి... - మాధవ తురుమెళ్ల

గౌతమబుద్ధుడు ఖచ్చితంగా దశావతారాలలో ఒకడుకాడు.  అలా అయే పరిస్థితులు తొమ్మిదవశతాబ్దంవరకు భారతదేశంలో లేవు.  బౌద్దుల విచ్చలవిడి తాంత్రికలైంగిక విహారాలకు, వారి వేదనిందలకు అప్పటికే అనేకులు విసిగి ఉన్నారు. జైనులు బౌద్ధులు ఇద్దరూ పూర్తి అహింసావాదులు అనేది నిజం. జైనులు అన్ని జీవులపట్ల అహింసపాటించేవారు.  ఇకపోతే బౌద్ధులు ఒక్క ఆహారం విషయంలో మాత్రం అహింస పాటించేవారుగాదు.  శరీరం అన్నమయం గాబట్టి ఎటువంటి ఆహారాన్నిగూడా త్యజించరాదు.  ఆహారాన్ని నిరశించి అనశనవ్రతాలను చెయ్యరాదు అన్న గౌతమబుద్ధుని స్వయం బోధవల్ల బౌద్ధులు ఆహారం విషయంలో అహింసపాటించరు.  ఇందువల్లే బౌద్ధంమతం ప్రబలంగా ఉన్న చైనా జపాన్ తదితరదేశాలలో వారు తొంబైతొమ్మిదిశాతం ఏదిపడితే దానిని తింటారు. ఇకపోతే  హైందవమతం విషయంలో అహింస అనేది కొన్ని ‘షరతులపై‘ ఆధారపడినది.  ధర్మయుద్ధం, ధర్మహింస అనేవి హైందవమతానికి చెందిన విషయాలు.  హిందువుల దేవతలు దేవుళ్లందరూ గూడా శస్త్ర ధారులే!  కానీ తొమ్మిదవశతాబ్దపు కాలానికి ముందర బౌద్ధజైనమతాలు చేసిన అహింసాసిద్ధాంతప్రచారాలవల్ల అనేకులు ఆ మతాలలోకిమారి ‘యుద్ధం‘ అంటే ఏంటో మర్చిపోయారు.  జీవహింస మహాపాపం అనేది హైందవ సిద్ధాంతం.  కానీ ధర్మనష్టం జరిగే పరిస్థితుల్లో జీవహింస తప్పదని ‘పరిత్రాణాయ సాధూనాం వినాశాయచ దుష్కృతాం‘ అని గీతలోనే చెప్పబడింది.  తొమ్మిదవశతాబ్దం తర్వాత మెల్లమెల్లగా  మతాన్ని గురించి వాదనగాకాకుండా యుద్ధంగా మతప్రచారాన్ని చేసే ఇస్లాం వల్ల దేశపు పరిస్థితులే మారిపోయాయి.  జైనులు బౌద్ధులు ఊచకోతకోయబడ్డారు.  హిందూరాజుల వద్ద సైన్యాలలో అధికశాతం బౌద్ధప్రభావానికి గురై అహింసాసిద్ధాంత ప్రభావితమైనవారున్నారు.  అందువల్ల మూకుమ్మడిగా హిందువులు, బౌద్ధులు జైనులు అందరూ వధకు గురయారు. ప్రతి విపత్తుకూ ఒక కారణం ఉండి తీరాలి!  మరి హిందువులపై అంత విపత్తు ఎలా వచ్చింది?  అరివీరభయంకరులని పేరుపొందిన హిందువులు అంత తేలికగా యుద్ధం ఎలా ఓడిపోతున్నారు?!  అటువంటి ఆలోచనల్లో ఉన్న హిందువులకు బుద్ధుల నడతపై అనుమానం వచ్చింది.    అప్పటి రాజకీయపరిస్థితుల్లో "దేశాన్ని ధర్మభ్రష్టం చేసింది బౌద్ధులేననీ వారివల్లే వారు చేసిన విచ్చలవిడితనాలవల్లే దేశానికి ఈ నష్టం వచ్చిందనీ, వారు చేసిన వేదనిందలవల్ల దేవతలందరూ అలిగి తొలిగిపోయారనీ అందువల్లే బుద్ధులను జైనులను ఉపేక్షచేసినందుల్లే హిందువులు ఊచకోతకోయబడుతున్నారని" బౌద్ధులని హిందువులు ఆడిపోసుకోవడం మొదలుపెట్టారు.  ‘మీరు చేసిన వేదబాహ్యమైన పనులవల్లే మాకు ఈ కష్టం కలిగింది‘ అని ప్రతి గ్రామంలోనూ బౌద్ధులను జైనులను నిలువకుండా అస్పృస్యులుగా, బుద్ధుల మొహంచూడడమే మహాపాపంగా ప్రజలు పరిగణించడం మొదలుపెట్టారు. ఇందువల్లనే ఇప్పుడు మనం చెప్పుకుంటున్న బుద్ధగయ ఒక నూటయేబైసంవత్సరాలక్రితం దాదాపు ఇరవై ఐదు అడుగుల ఎత్తున మట్టితో పూర్తిగా కప్పివేయబడింది... బుద్ధగయచుట్టుపక్కల అన్నీ అరణ్యాలే మొలిచాయి.  బౌద్ధులపై బౌద్ధంపై వచ్చిన ఈ ఆపత్తును గుర్తించిన హైందవధర్మవేత్తలు ఏదోవిధంగా బౌద్ధులను కాపాడాలని వారినిగూడా కలుపుకుని యుద్ధాలను చేసి  దేశాన్ని ఒక త్రాటిపైకి తెచ్చి యుద్ధాన్ని కొనసాగించి దేశాన్ని రక్షించాలన్న తలంపుతో బుద్ధుడిని ఒక అవతారంగా ప్రకటించారు. ఇది పదకొండవశతాబ్దపు చివరలో జరిగింది.  ఎందుకంటే బుద్ధుడిని దశావతారాలలో ఒకడు అని చెప్పిన  పదకొండవశతాబ్దానికి ముందటి ఏ గ్రంధమూ మనకు లభ్యంకాదు!  హయగ్రీవ అవతారాన్ని తప్పించి దశావతారాల్లో బుద్ధుడిని చేర్చి, బుద్ధులపట్ల హిందువులకు కలిగిన ద్వేషభావాన్ని పోగొట్టడానికి ఆ విధంగా ప్రయత్నించారు.  కానీ బుద్ధుడు ఖచ్చితంగా దశావతారాలలో ఒకడుకాడు.  అది ఒక రాజకీయపు అవసరం ఆవిధంగా చేసింది...   స్వస్తి... - మాధవ తురుమెళ్ల

ఇప్పుడే ఎవరో నన్ను అడిగారు జైన హిందుమతాల ప్రారంభంగురించి కొంచెం వివరంగా చెప్పండి అని...

Ekam Sat Vipra Bahudha Vadanti, "Existential Truth is One, Sages call it by different Names" Rig Veda, 1-164-146.
‘ఏకం సత్ విప్రాః బహుధావదంతి‘ (ఋగ్వేదం 1-164-146) - సత్యం ఒక్కటే కానీ బ్రాహ్మణులు (విప్రులు) అనేకవిధాలుగా దానిని చెబుతారు.  ఇది ఋగ్వేదంలోని మొదటి అధ్యాయంలోనే వస్తుంది.  హైందవధర్మాన్ని నమ్మినవారందరూ దీనిని నమ్ముతారు.  అందువల్లనే ఇతరమతాలపట్ల హిందువులకు ఏనాడూ విముఖత లేదు.

ఇదే పరమతసహన లక్షణం జైనమతంలోగూడా ఉంది. నిజానికి జైనమత మూలసిద్ధాంతమే ’అనేకాంతవాదం’!  అంటే పైన ఋగ్వేదంలో చెప్పినట్లుగానే  ’సత్యం ఒక్కటే అయినాగూడా అనేకులు అనేకవిధాలుగా దానినిగూర్చి చెప్పచ్చు.  కానీ ఎవరూ పూర్తిసత్యాన్ని చెప్పలేరు.  అందువల్ల అనేకులు అనేకవిధాలుగా సూచించే ప్రతి సత్యం వెనుకా కొంత నిజం ఉంది’ [కాబట్టి నా దేవుడొక్కడే సత్యం అని చెప్పి ఇతరులతో తగాదాపడే ప్రతిఒక్కడూ జైనమతంప్రకారం మూర్ఖుడు అజ్ఞానితో సమానం]  జైనమతానికి అస్తిత్వాన్ని కల్పించే అతిముఖ్యమైన ఈ ’అనేకాంతవాద] మూలసిద్ధాంతానికి అలాగే ఋగ్వేదంలోని మొదటి ఐదు అధ్యాయాలలో అనేక సత్యాలకు అత్యంత స్పష్టమైన సారూప్యం ఉంది.  ఇందువల్లే జైనులు ఒకప్పటి కులబ్రాహ్మణులు (వర్ణ బ్రాహ్మణులుకాదు) అని నేను అభిప్రాయపడతాను.  మొట్టమొదట కులాలే ఉండేవి తర్వాత హిందూమతం పుట్టి కులాలను దూరంగానెట్టి ’వర్ణాలను’ ప్రవేశపెట్టింది. కానీ ఆ పని సమర్ధవంతంగా నెరవేర్చలేక హిందూమతం చతికిలబడింది.  ఇంగువని దూరంగా పెడదామని ఎవడో తన భుజాలపై ఇంగువమూటమోసాడట, దాంతో ఇంగువ వాసన అతని వంటినిండా అలుముకుని, ఇంగువ అంటే అసహ్యించుకునే వ్యక్తులందరూ అతడిని దూరంగా పెట్టారట!  అలాగే కులాలను దూరంగబెడదామని వర్ణాలను సృష్టించితే ఇంగువమూట మోసినపాపానికి అన్నట్లు కులాలసృష్టికి కారణం హిందువులే అని మార్క్సిష్టు కుహనామేధావులు హిందుమతాన్ని నానామాటలూ అన్నారు.   వర్ణాలనుండి కులాలు పుట్టాయనిచెప్పే వారిది అజ్ఞానమే!  ఆదిమానవ సమూహాలు కులాలుగానే విభజింపబడి ఉండేవి.  

ఇకపోతే  ’చ’,’జ’ లకు అబేధం బ్రాహ్మణులలో ’చయనం’ అని ఒక క్రియ ఉన్నది.  దీనిని చేసినవారిని ’చైనులు’ అని పిలుస్తారు. ’జయనులు’ (జయించినవారు) జినులు.  వీరిలో ఋషభదేవుడు ఆదిపురుషుడు.  ఈయన హిందువులు నమ్మే ’కైలాస మానససరోవర పర్వత’ ప్రాంతానికి చెందినవాడిగా మనకు జైనపురాణాలు చెబుతాయి.  అందువల్లనే కైలాసపర్వతం హిందువులకు ఎంతముఖ్యమో, జైనులకు అలాగే బౌద్ధులకుగూడా అంతే ముఖ్యం.

"ఒకవేళ ఒకప్పటి కులబ్రాహ్మణులే (వర్ణ బ్రాహ్మణం కాదు) జైనులైతే వేదాన్ని వారూ నమ్మి ఉండాలిగదా!? మరయితే హిందువుల ఋగ్వేదాంతర్గతమైన పునర్జన్మ సిద్ధాంతాన్ని నమ్మిన జైనులు వేదాన్ని ఎందుకు దూరంపెట్టారు?"  అని మీరు ప్రశ్నించవచ్చు.  జైనులకు ’అనేకాంతవాదం’ ఎంతముఖ్యమో ఆచరణలో ’అహింస’గూడా అంతే ముఖ్యం.  ఇతరకులాలవారి మాంసాహారపు అలవాట్లను వారు గర్హించారు.  అందువల్ల ఇతరకులాలవారిని దగ్గరకుచేర్చనీయకుండా దూరంగా ఉంచేవారు.  కానీ పెరుగుతున్నమానవసమూహాలవల్ల రాకపోకలు ఇచ్చిపుచ్చుకోవడాలు ఒకరి కులంపై ఇంకొకరు ఆధారపడటం తప్పనిసరైంది.  ఇదుగో ఈ పరిస్థ్తితుల్లోనే ఇతరకులాలవారి మాంసాహారపు అలవాట్లను ఒప్పుకుని యజ్ఞశిష్టము బలిపశువు అనే మాటలను వేదంలో ఏడవ అధ్యాయంనుండీ తీసుకురావడంతో బ్రాహ్మణకులం ’జైనులు’ (శాకాహార అనేకాంతవాదులు), ’హిందువులు’ (శాకాహార మాంసాహార సమ్మిళిత అనేకాంతవాదులు) గా నిలువునా చీలింది. ఆహారం విషయంలో అహింస అనే పదాన్ని పక్కనబెట్టి బలిపశువధను ఒప్పుకున్న వేదాన్ని జైనులు (అప్పటి శాకాహార సాంప్రదాయ బ్రాహ్మణులు) పూర్తిగా ఖండించారు.  సంపూర్తిగా వేదాన్ని దూరంగపెట్టేశారు.  అలా జైనులు హైందవ వేదాలకు దూరంగా జరిగారు.  హిందువులగామారిన బ్రాహ్మణులు మాత్ర్రం తమ శాకాహారపు అలవాట్లను అహింసావ్రతాన్ని అనశన వ్రతాన్ని (చెట్లనుండి రాలే ఆకులు తిని బ్రతికే వ్రతం) సందారవ్రతాన్ని (మెల్లమెల్లగా భోజనాన్ని తగ్గించేస్తూ పన్నెండు సంవత్సరాల్లో పూర్తిగా ఆహారాన్ని విసర్జించి శరీరాన్ని త్యాగంచేసే వ్రతం) వదిలిపెట్టలేదు.  ఇతరకులాలపట్ల సహనాన్ని పాటించి వారి ఆహారపు అలవాట్లను ఒప్పుకున్న హైందవమతం అపార్ధాలకు గురై అనేకమైన దుష్ప్రచారాలకు లోనైంది.  ఇంగువమూటలు మోసినపాపానికి అన్నట్లు హైందవధర్మపరిరక్షణకు రాష్ట్రసంఘటితానికి నిరంతరం శ్రమపడ్డ బ్రాహ్మణకులాన్ని అనేక మాటలు అని అనేక తాపాలకు గురిచెయ్యడంగూడా హైందవమతానుయాయులకే చెల్లింది.

ఈ కులముల ప్రసక్తి నేను ఇంతకుముందరే నా బ్లాగులో వివరించి ఉన్నాను.  -మాధవ తురుమెళ్ల




No comments:

Post a Comment