’కొండన్న’ అంటే ఎవరు అని నన్ను పిల్లలపేర్లగురించి అడిగారు. ’కొండన్న’ అనే పదాన్ని మనం బహుశా ఏడుకొండలవాడిపైగల భక్తిభావంతో పెట్టుకుంటున్నాము అని అనుకోవచ్చు. అదిగూడా ఉంది. కానీ నిజానికి ’కొండన్న’ అనే పదం బౌద్ధులకు చెందింది. గౌతమబుద్ధుని జననం సమయంలో శాక్యవంశసుధాంబుది చంద్రుడు, కపిలవస్తు పురాధీశుడు, శుద్ధోదన చక్రవర్తిని ఆశ్రయించుకుని ఉన్న ఆశ్రితబ్రాహ్మణుడు ’కౌండిన్యుడు’. ఆయన శాకాహారి. ఈయనకు వైశ్వదేవవ్రతం అహింస నిరాహారవ్రతాలు ఉండేవి. అంటే తన శరీరాన్ని చెట్లనుండి రాలిన ఆకులను మాత్రమే తిని బ్రతికించుకునే వ్రతం. ఈ కౌండిన్యుడిని శుద్ధోదన మహారాజు పాలీభాషలో ఆప్యాయంగా ’కొండన్నా’ అని పిలుచుకునేవాడు. ఈ కౌండిన్యబ్రాహ్మణుడు చిన్నతనంలోనే మూడువేదములూ అభ్యసించి అనేక మంత్రశాస్త్రగ్రంధాలను కరతలామలకం చేసుకున్నాడు. ఈయన మేధస్సును మెచ్చి అనేకులు సహబ్రాహ్మణులు తమ కుమారులను ఈయన వద్దకు విద్యనభ్యసించేటందుకు పంపేవారు. సిద్ధార్థుడు (గౌతమబుద్ధుడు) పుట్టునపుడు ఈ కొండన్న జాతకంచూసి గౌతముడు బుద్ధుడౌతాడని, ఆ విధంగా బుద్ధుడైనపుడు తాను స్వయంగా బుద్ధుని శిష్యునిగా మారతానని ఆయన ప్రకటించుకున్నాడు. ఈయన జాతకం చెప్పినట్లుగానే సిద్ధార్థుడు ఇల్లువిడిచి వెళ్లినపుడు శుద్ధోదనమహారాజుకు ’ఏమీ కాదు’ అని అభయం ఇచ్చి గౌతముని వెంట తాను మరియు తన నలుగురు శిష్యులు వెళ్లారు. గౌతముడిని అహింస నిరాహార వ్రతాదులలో ఆకులు అలములు తింటూ శరీరాన్ని కృశింపచేస్తూ ఆరుసంవత్సరాలు గడిపారు. కానీ సిద్ధార్థుడు ’శరీరాన్ని కృశింపజేస్తూ చేసే తపస్సువల్ల జీవన్ముక్తి సిద్ధించదు’ అని కొండన్న బోధను నిరాకరించి వారిని వదిలి బుద్ధగయవైపు ఒంటరిగా వెళ్లిపోయాడు. ఆ తర్వాత ఈ ఐదుగురు బ్రాహ్మణులు తమ వ్రతాలను కొనసాగిస్తూ ’సారనాధ్’ చేరుకుని అక్కడ నివాసితులయారు. తాను బుద్ధునిగా మారిన తర్వాత గౌతమబుద్ధుడు ఈ కొండన్నను వెదుక్కుంటూ సారనాధ్ వచ్చాడు. అక్కడ కొండన్నకు అతని నలుగురు శిష్యులకు తన బోధను వినిపించి వారిని అర్హతులుగా బౌద్ధులుగా మార్చాడు. ఆ విధంగా గౌతమబుద్ధుని తర్వాత బుద్ధమతంలో మొట్టమొదటి ’అర్హతుడు’ కొండన్న. [కౌండిన్య]. ఈ కొండన్నమరియు అతని మేనల్లుని వల్లనే బౌద్ధంలో శాకాహారం ప్రవేశించింది. బుద్ధుడు స్వయంగా మాంసాహారి అయినా కొండన్నపై గల ప్రీతితో అతనిని శాకాహారిగా ఉండడానికి అతని అహరపు అలవాట్లను మార్చుకోనవసరంలేకుండా అనుమతి ఇవ్వబడింది. ఆ తర్వాత కొంతకాలానికి కొండన్న పూర్తిగా ఈ ప్రపంచంనుండి, బౌద్ధప్రచారాన్నుండీ తప్పుకుని అడవులలో తపస్సు చేసుకుంటూ తనువు తాలించారు. ఇతనిపై గౌరవంగా పూర్వీకులు తమ పిల్లలకు కొండన్న అని పేరు పెట్టుకునేవారు. ఇదీ ’కొండన్న’ అనే పేరు వెనుక అసలుకధ.... -మాధవ తురుమెళ్ల
No comments:
Post a Comment