సాయిబాబాని సమాధి చేసిన పద్ధతి సరియైనది కాదని వారిని యతుల పద్ధతిలో కూర్చోపెట్టి సమాధి చెయ్యలేదని అంటూ వచ్చిన ఒక వార్తని ఒక స్నేహితుడు పంపించారు. ఇది నిజంకాదు. సాయిబాబాగారి సమాధి జరగాల్సినవిధంగా శాశ్త్రోక్తంగానే జరిగింది.
వారిని కూర్చుండబెట్టి సమాధి చెయ్యరాదు శాస్త్రం తెలిసినవారు అలా చెయ్యరు. హైందవ ధర్మంలో నాలుగు ఆశ్రమాలు ఉన్నాయి. కౌమారమౌ, గార్హస్త్యము, వానప్రస్థము, సన్యాసము అని. ఈ నాలిగింటిలో కౌమారంలో మరణించినవారిని ఖననం చేయడం, గార్హస్త్యంలో వానప్రస్థాలలో మరణించినవారిని దహనం చెయ్యడం ఆచారం. ఇక ఒక్క సన్యాసం తీసుకున్నవారికి మాత్రమే యతి సాంప్రదాయంలో కూర్చుండబెట్టి ఖననం చేస్తారు. ఎందుకంటే సన్యాసం తీసుకునేముందర వీరు తమ శరీరాన్ని దానిలోనున్న ప్రతి అంగాన్ని పేరుపేరునా ’నేత్రాయ స్వాహా’ నా నేత్రములు అర్పిస్తున్నాను, నా చెవులను అర్పిస్తున్నాను అంటూ ఒక ప్రత్యేకించిన హోమం ’విరజా హోమం’ అని చేస్తారు. అంతేకాదు తమ పిండాన్ని తాము పెట్టుకుంటారు. అందుకనే సన్యాసులు మరణించిన వారితో సమానం, అందుకే వారు సన్యాస నామధేయం అని కొత్తపేరు పెట్టుకుంటారు. తమ పూర్వశరీరంతో ఉన్న భవబంధాలను పూర్తిగా తెంచుకుంటారు. అంతేకాదు ఇటువంటి సన్యాసం తీసుకున్నవారు గృహస్థులతో లావాదేవీలు పెట్టుకోకూడదు. గృహస్థుల ఇంట్లో ఎనిమిది గంటలకు మించి ఉండకూడదు... వారి ఇంట్లో నిద్రపోకూడదు.. ఇలా సంప్రదాయబద్ధంగా వేదవిహితంగా సన్యసించి అప్పటికి ఒకసారి తమ పిండాన్ని తామేపెట్టుకున్న మహనీయులు తమ శరీరాన్ని త్యజిస్తే వారిని భూమిలో కూర్చుండబెట్టి సమాధి చేస్తారు. ఈ లోకంలో ఆవృత్తి పధములు అని అనావృత్తి పధములు అని, శుక్ల కృష్ణ గతులని, తిరిగివచ్చేవి తిరిగిరానివి అని రెండుదార్లు ఉన్నట్లుగా భగవద్గీత ఎనిమిదవ అధ్యాయం చెబుతుంది. తిరిగిరాని పధాలకు మోక్షాలకు వెళ్లే వారిని యతులు అంటారు వారిని కూర్చోబెట్టి సమాధి చేస్తారు. ఇక తిరిగివచ్చే కృష్ణగతిని కావాలని ఎంచుకునేవారు అవధూతలు యోగులు ఈ లోకంలో వారు కష్టాలను నిందలను భయంకరమైన కర్మలను మొయ్యడానికి మరల మరల తిరిగి వస్తారు. అటువంటివారిని కూర్చోబెట్టి సమాధి చెయ్యగూడదు.. అందుకే పసిపిల్లలను కూర్చోబెట్టి సమాధి చెయ్యరు. ఎందుకంటే ఆ జీవి తిరిగి మరల ఆ ఆప్యాయతని పంచిన పంచాలనుకున్న ఇంటికే తిరిగి దేహిగా తిరిగి వస్తాడు.
అయితే బాబా అలా అనావృత్తి పధం కోరుకుంటూనో, శుక్లగతిని కోరుకుంటూనో సంప్రదాయబద్ధంగా సన్యసించలేదు. వారిది అవధూత అవతారం కాబట్టి, పైగా తను తిరిగి పుడతానని అభిప్రాయం వ్యక్తం చేసారుకాబట్టి, అలా భూమిలో పడుకుండబెట్టి సమాధి చెయ్యడమే వేదవిహితము. దీనికి నేను ఈ క్రింద ఇస్తున్న ఋగ్వేదశ్లోకములే ప్రమాణము:
"వెళ్లు నాయనా వెళ్లు నీ తల్లి భూమిలోనికి వెళ్లు, సువిశాలమైన శాంతిపూరితమైన భూమి, ఈ పుణ్యభూమి, తనను ప్రేమించువానికి అప్యాయతగా వెచ్చదనాన్నిచ్చే ఈ భూమితల్లి. నిన్ను ఈ భూమితల్లి నిన్ను నిఋఋతి నుండి రక్షించునుగాక. ఓ భూమాతా మరణించిన / శాశ్వతంగా శయనించిన ఇతనిని పైపైనుండి మెత్తగా కప్పుము; ఇతనిని గట్టిగా బంధించకుము; ఇతనిని కనిపెట్టుకుని ఉండుము, ఇతనికి ఆశ్రయం ఇమ్ము. ఒక తల్లి తన బిడ్డను ఎలా తన చీరచెరగుల్లో ఆప్యాయంగా (సూర్యరస్మినుండి, గాలి ధూళులనుండి) దాస్తుందో అలా ఇతనిని కాపాడుము. ఇతనిని కప్పిన మట్టి మెత్తగా ఉండుగాక; అనేకకోట్ల మట్టికణములు ఇతనిని కప్పుగాక; ఈ భూమిలోని ప్రతిదినము ఇతనికి ఒక ఆశ్రయమగుగాక. [ఓ మరణించిన వ్యక్తీ!] నీ చుట్టూ నేను ఈ మట్టి కప్పుతున్నాను, ఈ మట్టిని [వస్త్రంలాగా] చుట్టుతున్నాను. ఈ మట్టి ఇతనిని బాధించకుండుగాక; పితృడు ఈ సమాధిని నిలిపి ఉంచుదురుగాక [తిరిగి జన్మనందుటకు పితృదేవతల అధిపతి ’అర్యముడు’ (గీత) దేహిని నిలబడడంలో సహకరిస్తాడు] యముడు ఇక్కడ నీకొక ఆలయమును కల్పించుగాక." --- ఋగ్వేదము 10.13, 10-18 (యముడు క్రూరుడు అన్నది నిజంకాదు. అలా ఋగ్వేదంలో చెప్పబడలేదు -మాధవ)
కాబట్టి సత్యసాయి సమాధిచేసిన పండితులు సరిగా శాస్త్తోక్తంగా విధిని నిర్వర్తించారనడంలో నాకు ఎటువంటి సందేహమూ లేదు...
ఓం శాంతిః శాంతిః శాంతిః...
No comments:
Post a Comment