‘ఉగాది‘ అని కాబోలు -
ఈరోజు ఆకాశం
సూర్యుడినుంచి తెల్ల రంగుని కొంచెంగా తెచ్చుకుని
అంచుల్లోనుంచి మరింత నీలంరంగుని పుచ్చుకుని
సాంప్రదాయాన్ని గౌరవిస్తూ అహ్లాదాన్ని పంచే
అందమైన సొగసుల గృహిణివలె ఎంతో చక్కగా ముస్తాబయింది.
మామిడి కొమ్మల్లో దాక్కుని కోకిలలు
అందంగా ప్రకృతి కవి రాసిన
ఉగాది పాటలు పాడుతున్నాయి...
చుట్టూతా నేలంతా పరచుకొని ఉన్న పచ్చిక బయళ్లు
అప్పుడే కురిసిన మంచులో తడిసి సిగ్గుపడుతున్నాయి.
చిరుగాలులు మెల్లమెల్లగా శరీరాన్ని తాకుతూ
చెవుల్లో సృష్టి రహస్యాల గుసగుసలు వినిపించే ప్రయత్నం చేస్తున్నాయి.
దారిపక్కనే పూదోటలో పూలబాలలు ఆహ్లాదాన్ని విరబూస్తున్నాయి...
అవునుగదూ,
ఈ సృష్టిలో నేను చూడనిది ఎంతెంతవుందీ!
అని తలచుకోగానే -
గుండెలు గాభరాల భేరీలు మోగించాయి..
అయినాగూడా
ఉగాది గదా అని ధైర్యం తెచ్చుకుని
కొత్త సంవత్సరంలోకి అడుగు వేస్తున్నాను,
శక్తిని అందించమంటూ భగవంతుని ప్రార్థిస్తున్నాను.
రచన: మాధవ తురుమెళ్ల
No comments:
Post a Comment