Total Pageviews

Friday, 1 April 2011

హైందవ మతము - కులములు వర్ణములు - నా మనసులోని మాట

 హిందూమతంలోని వర్ణములు వివక్షాపూరితమైనవి అనేది ఒక గొప్ప అపోహ! ఈ విషయం అర్ధం చేసుకోవడానికి భవవద్గీత చదివితే చాలు...


హిందూ మతంలో మతానుయాయులు చాలా తొందరగా, చాలా తప్పుగా అర్ధం చేసుకునేదేమంటే ’వర్ణము’ మరియు ’కులము’ అనే పదాలు సమానార్ధకాలని! అంటే ఒకే అర్త్ధాన్ని ఇచ్చే పదాలు అని... కానీ అవి సమానార్ధకాలు కావు... ఆ రెంటికీ దోమకు ఏనుగుకు ఉన్నంత తేడా వుంది. కులము వర్ణము అనే రెండు పదాలు భగవద్గీతలో విడివిడిగా రెండు స్పష్టమైన అర్థాలలో వాడారు.

మొదటి అధ్యాయంలో అర్జునుడు కులం అనే పదం స్పష్టంగా వాడాడు. "కులధర్మాశ్చ శాశ్వతాః..." అంటూ.. ’కృష్ణా, మనం ఈ యుద్ధం చేస్తే అనేకమంది మగవారు చనిపోతారు. ఆడవాళ్లు ఒంటరి అయిపోతారు. అలాంటి ఒంటరి ఆడవాళ్లను వేరే కులాలకు చెందిన మగవారు చెరబట్టచ్చు. దాంతో కులనష్ట్రం జరుగుతుంది.  అలా కుల భ్రష్టం అయిపోతే పుట్టే పిల్లలు తక్కువ కులాలకు చెందిన వారిగా పుడతారు..’ అంటూ ఇంకా ఏదేదో కులాన్ని సమర్థిస్తూ మాట్లాడతాడు. (భగవద్గీత 1వ అధ్యాయం 37వ శ్లోకం నుండి 43వ శ్లోకందాకా చదవండి)


అయితే దీనికి సమాధానంగా కృష్టుడు:

"కుతస్త్వా కశ్మలమిదం విషమే సముపస్థితం
అనార్యజుష్టం అస్వర్గ్యం అకీర్తికరం అర్జునా|" (భగవద్గీత 2వ అధ్యాయం రెండవ శ్లోకం) 

’అర్జునా, ఇటువంటి నీచమైన మురికి (కశ్మలం) ఆలోచనలు నీకు ఎక్కడినుండి వచ్చాయి. నిజమైన హిందువులు (ఆర్యులు) ఈ విదంగా ఆలోచించరు. ఈ రకమైన ఆలోచనలవల్ల నీకు స్వర్గం కానీ, ఈ లోకంలో సుఖంగానీ లభించవు’ అంటారు. 

పైన చెప్పిన దానిని బట్టి మనకు కులం అనే పదం ఆచారపరంగా, ఒక తెగను ఇంకొక తెగ ఒప్పుకోక పోవడంలాగా వివక్షాపరంగా, ఎక్కడో ఉందనీ దానిని హిందూ మతం ఒప్పుకోదనీ స్పష్టంగా తెలుస్తుంది.


జాలరి, కసాయి, కంసారి, కర్మారి వంటివి పనులు మాత్రమే అవి కులములు కాదు. అవి కులాలు అనేది నిజం కాదు... అది అపోహ! ఒకప్పుడు అవి పనులే! అంటే పూర్వంలో ఆ పనులకు ఆ పేర్లు ఉండేవి. ఆ పని చేసే మానవ సమూహం గుంపు అనుకోకుండా ఆ పనిపేరుతో గుర్తింపు పొందారు. అంటే పనివేరు ఆ పనిచేసే మనుషులు వేరు. మీరు ఆ పనిచేసే మనుషుల్నందర్నీ ఒక గాటిన కట్టేసి దానికి ’కులం’ అనే పేరు పెట్టుకున్నారు. కసాయి అనేది ఒక పని. ఆ పనిచేసే మానవులు ఎవరైనా కావచ్చు వాళ్లందర్నీ కలిపేసి కులం అనెయ్యడం దానికి కులభావాలను ఆపాదించడం అనేది సరైన ఆలోచనకాదు అని నా అభిప్రాయం. ఒక ఉదాహరణకు ఈ కాలంలో సృష్టించబడ్డకొన్ని పనుల్లో ఒకటి ’సాప్ట్వేర్ ఇంజనీర్’ మనం ఆ పనిచేసే మానవసమూహాలనన్నింటినీ కలిపి ’సావ్ట్‌వేర్ ఇంజనీర్ల కులం’ అని అనేస్తాము. అలాగే ఆ కులపు సమావేశాలు కులసంఘాలుగూడా అనేకం ఉన్నాయి. ఖర్మగాలి ఎవరో ఒక సాఫ్ట్‌వేర్‍ఇంజనీరు పనిలో ’న్యూక్లియర్‍బాంబును’ విస్పోటనంచేసే కొన్ని కోట్ల మందిని చంపేస్తే అప్పట్నించీ ఈ ప్రపంచంలో ఒక కొత్త పదం పుట్టచ్చు - భయంకరమైన విస్ఫోటనాలను సృష్టించాలని అనేకకోట్లమందిని ఒకేసారి చంపెయ్యాలని ఆలోచించేవ్యక్తుల్ని గర్హిస్తూ "ఒరేయ్ ఏంటా సాప్ట్‌వేర్ఇంజనీరు పని?" అంటూ తోటి మనుషులు ఆక్షేపించచ్చు. అంతమాత్రంచేత "సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ల‍" కులంవాళ్లు బాధపడిపోతారా? సాఫ్ట్‌వేర్‍లోని తప్పు సాప్ట్‌వేర్‍ఇంజనీర్లందరికీ చెందుతుందా?! బహుశా ఒక రెండువేల సంవత్సరాల తర్వాత ఇలాంటి పరిస్థితే రావచ్చు. నానుడిలో ఉన్న పదాల వెనుక ఏదో కులంపట్ల ఉన్న న్యూనతకంటే ఆ పనిపట్ల ఉన్న ఒక అయిష్టత అని అర్ధంచేసుకుంటే సగం కులంపట్ల ఉన్న పిచ్చి తగ్గుతుంది అని నా ఆలోచన
ఇక పోతే వర్ణములు అని వాడినది మాత్రం నిజం. కానీ వర్ణములు జన్మని బట్టి కావు చేసే కర్మలబట్టే అని భగవద్గీతలోనే నాలుగో అధ్యాయం 13వ శ్లోకంలో స్పష్టంగా వుంది. ఇంకా 18వ అధ్యాయంలో 40, 41 మరియు ఇతర శ్లోకాలలో వివరంగా ఉదాహరణ పూర్వకంగా ఏ పని చేసేవారు ఏమని పిలవబడతారో వుంది. రాజకీయ నాయకులని -- రాజకీయనాయకులు అనే పిలుస్తాము కానీ ’ఇంజనీరు’ అనో ’డాక్టరు’ అనో పిలవము గదా! ఎవరి పని బట్టి వారి వర్ణము. కానీ కులానికి వర్ణానికి ఎటువంటి సంబంధం లేదు... అంతే కాదు అలా కులాలబట్టి ఆలోచించేవాడు హిందువు కాదని చెప్పబడింది కాబట్టి వివక్ష హిందూ మతానికి చెందినది కాదు. అది శ్రీకృష్ణుడు స్పష్టంగా చెప్పినట్లుగా మానవుల హృదయాలలో మురికికి చెందినదే!... హైందవ మతానికి కులానికి ఈ సంబంధమూ లేదు... కులాన్ని పాటించేవాళ్లు (అర్జునుడిలా) హిందూ మతానికి చెంది వుండచ్చు. కానీ అది హిందూ మతానికి చెందిన వివక్షమాత్రం కాదు. స్వస్తి...

No comments:

Post a Comment