Total Pageviews

Sunday, 20 March 2011

భరత మాత - కవిత

Photo by: Sri Srinivas Ganjivarapu

ఈ ఫొటోలో ఉన్న ఆవిడ పేరు ’భరతమాత’ అని వుంటే ఎలా వుంటుందా అని ఆలోచించాను... అలా ఆలోచిస్తూంటే నాలో కొన్ని పదాలు పుట్టాయి... ఈ క్రింద ఇస్తున్నాను..

నిజంగానే నా అయ్య గాందీగారి వెనక 
కర్రబట్టుకుని నమ్మకంగా దేశంకోసం
నడిచాడు
నాకు ‘భారతమాత‘ అని
ముద్దుగా పేరు పెట్టాడు ...

మాగురించి నిజాయితీగా ఆలోచించిన
గాంధీగారెళ్లిపోయి అరవైఏళ్లయిపోయాయి.
ముద్దుగా దగ్గరకి తీసి అన్నంపెట్టే
అయ్యగూడా పోయి బోల్డన్ని రోజులైపోయాయి...

ఇవాళ నేను -
బ్రతుకు భారమైన మూటకట్టుకుని
మెడనరాలు బిగదీసి
బాధపెట్టే నెత్తినెత్తుకుని
అంతంలేని బాటపై నిలబడ్డాను...

జీవితం ఎర్రగా ఎండగట్టి
నేను నిలబడిన
కాళ్లక్రింద అగ్నిపర్వతాలని సృష్టిస్తోంది
లావాలా మారిన ఇసుక మీద
చెప్పుల్లేకుండా అలాగే నడవమని శాసిస్తోంది.

నాలో
‘నడిపించే సర్కారు నన్ను ఆదుకోకపోతుందా‘
అని బలికి నడుస్తున్న మేకపోతు లాంటి నమ్మకం...
ఏరోజు కారోజు ఏ చేలోనో వాలిన
దిక్కులేని పిచికలాగా నాలుగు గింజలు తినాలనిపించేంత ఆబగా ఆకలి...

ఏ నల్లదొరో ఆదుకోకపోతాడే అనే ఆశతో
మనసు ఎండమావులని సృష్టిస్తుంటే
కన్నీళ్లతో నదీ ప్రవాహాలు చేసి
అర్జీల కాగితపు పడవలు చేసి వదులుతున్నాను....

రచన: మాధవ తురుమెళ్ల
-------- ***** -----------

No comments:

Post a Comment