Total Pageviews

Friday 4 March 2011

కీర్తి ఒక ఎండమావి - (Fame is a Mirage) - కవిత

అన్నా - నన్ను నమ్ము
కీర్తి అనేది ఒక లోక భ్రాంతి...

కీర్తి -
ఒక ఎండమావి.
సత్యంమంటూ నమ్మిస్తుంది,
తన దగ్గరికి  రారమ్మంటూ -
ఇంకొంచెం శ్రమపడమంటూ -
అనేకానేక మాయాజాలాల ఇసుకరేణువుల ఎడారిలో -
నిరంతరం నిన్ను కవ్విస్తుంది...
తనను పొందమంటూ
నీ కీర్తి తృష్ణను తీర్చుకోమంటూ ఆహ్వానిస్తుంది....

అన్నా... జాగ్రత్త
దానిని నమ్మకు... నీ మనసును నీవు కోల్పోకు..
కీర్తి నిన్ను నిలువునా దగా చేస్తుంది.
కీర్తి దాహం తీరనిది... దానిని తాగలని ఆశించకు...
అది ఏసిడ్ లాంటిది. భగ్గున మండుతుంది..

కీర్తి
ఒక భయంకర విషపు సాలెగూడు..
నీ మనసుకు అమాయకపు రెక్కలు తొడుక్కుని ఎగరకు,
ఆ సాలెగూటిలో చిక్కకు, ఆత్మహత్యకు గురవకు..

అన్నా
నీ మంచికోరి చెబుతున్నాను
నన్ను నమ్ము - కీర్తి లోక భ్రాంతి..

కీర్తి కులకాంత కాదు అది వలపుకాంత...
అది చంచల...
నిజంగానే ఒకడి  దగ్గర ఉందనిపిస్తుంది.
నీదగ్గర లేక నీవేదో పోగొట్టుకున్నావని
నీలో ఏదో వెలితి వున్నదని
నిన్ను ఆత్మన్యూనతకు గురిచేస్తుంది.

ఎవడి దగ్గర వుందో వాడినిగూడా -
ఉంపుడుగత్తెకు మల్లే
ఏదో ఒకనాడు దగా చేస్తుంది..

కీర్తిని పొందలేకపోయినవాడూ,
పొందినవాడూ, పొంది పోగొట్టుకున్నవాడూ అందరూ వంచితులే...

అన్నా - నన్ను నమ్ము
కీర్తి అనేది లోకభ్రాంతి...

No comments:

Post a Comment