Total Pageviews

Thursday 3 March 2011

భార్య భగవంతుడిచ్చిన వరం - కవిత

ఎక్కడో పుట్టి ఎక్కడొ పెరిగి
ఇరవైరెండేళ్ల  అనుబంధాన్ని - 
పెంచుకున్న నమ్మకాన్ని వదిలి -
కళ్లవెంటె నీటితోనైనా సరే
నిన్ను మాత్రం మనసారా నమ్మి నీవెంట నడుస్తుంది.


ప్రేమ విశ్వాసాల మేలు కలయికతో
నిన్ను మమేకం చేసుకుని
నీ జీవనానికి ఒక కొత్త వెలుగు తెస్తుంది....


ప్రతిరోజూ ఉదయం, 
నుదుటిన సూర్యోదయానికి మల్లే ఎర్రటి తిలకం దిద్ది,
నీవంటే తనకెంత ఇష్టమో తెలిపే -
ఆనందంతో తళతళలాడే కళ్లతో,
చక్కటి చిరునవ్వుతో,
నిన్ను మేల్కొలిపి -
నీ జీవనానికి ఒక అర్థాన్నిస్తుంది....


తన ప్రాణాన్ని పణంగా బెట్టి
నీకు పండంటి బిడ్డలనిచ్చి నీ జీవితంలో -
కుటుంబమనే ఒక కమ్మటి అప్యాయతను పండిస్తుంది....


నీ ప్రేమపూరితమైన మాటలకు మురిసిపోతూ,
నీ కళ్లు తను కట్టుకున్న కొత్తపట్టుచీరని గమనిస్తే -
అదే పదివేలని మెరిసిపోతూ,
నీవు ఆఫీసులో సరిగా అన్నం తిన్నావాలేదా అని ఆరాటపడిపోతూ,
నీ అస్థిత్వంలో తన అస్థిత్వాన్ని వెదుక్కుంటూ -
నీతో తన సర్వస్వం పంచుకుంటూ -
ఆమె,
నీకు ఒక అందమైన తోడవుతుంది... 
నీకు భగవంతుడిచ్చిన వరమవుతుంది...


                                     ---- మాధవ్ తురుమెళ్ల

1 comment:

  1. చాలా బాగున్నది అండి కవిత

    ReplyDelete