Total Pageviews

Wednesday 2 March 2011

రేపటికి కరిగే కల - కవిత

రేపటికి కరిగే కల

భోరున ఏడుస్తాడతడు.... భగవంతుని తిడతాడతడు .... వెర్రివాడు...

వియోగం సముద్రమైతే అందులోనుండి
విషాదం హఠాత్తుగా విరుచుకుపడె ఒక పెద్ద ఉప్పెన అల -
మనిషిని దిగులనే ఉప్పటి కన్నీళ్లలో ముంచి చంపినంత పని చేస్తుంది...

అతనొక పిచ్చివాడు...
నీవెవక్కడున్నావో తెలియక తహతహలాడే వెర్రివాడు...

ప్రతిపగలూ --- నీ జ్ఞాపకం -
అది అతనిని నిలువునా ముంచెత్తే ఒక గొప్ప విషాదం.

ప్రతిరాత్రీ  అతను నిద్రపోవాలని తహతహలాడతాడు...
ఎందుకంటే -
 "ఒక అందమైన తెల్లటి పావురంలా -
అతని కలల పొదరింటిలో నీ జ్ఞాపకం దూరుతుందేమోనని అతనికి ఒక పిచ్చి ఆశ....."

ప్రతిరాత్రీ,
తన మనసుకు మాయల మాటలు చెబుతూ,
’కలలోనైనా’ కనీసం నిను కలవచ్చని ఊహించే
అతడు నిజంగా ఒక పిచ్చివాడు....

ఊహించుకో అతడిని...
ప్రతిరాత్రీ -
నిదురపోలేమంటూ ఎర్రగా మారి ఎదిరించే
తన కళ్లకు -
రెప్పల దుప్పట్లు కప్పి వెర్రి జోలపాడుతూంటాడు....

పాపం... అప్పుడప్పుడూ -
భగవంతుడు విధించిన శిక్షకుమల్లే -
అతనిలోని వివేకం నిద్రలేస్తుంది!
రేపటికి ఇది కరిగే కలేకదా అని గుర్తుచేసి అతడిని ఏడిపిస్తుంది.

భోరున ఏడుస్తాడతడు.... భగవంతుని తిడతాడతడు .... వెర్రివాడు...


-మాధవ తురుమెళ్ల
--------- ***** ------------

No comments:

Post a Comment