Total Pageviews

Wednesday 9 March 2011

అయినా నాకు అర్ధంకాదు - కవిత



అయినా నాకు అర్ధం కాదు...

వేలకోట్లు ఖర్చుపెట్టి
చంద్రమండలం మీద నీళ్లు వెదికే భారతీయ సోదరుడా,

నీవు -
కాలే కడుపు పట్టుకుని
నెలైనా నిండని పసికందుని చంకన బెట్టుకుని
నీ ఇంటి ముంగిట - అయ్యా ఆకలి అంటూ
అయ్యా రక్షించండంటూ దీనంగా అర్థించే
ఆ అభాగ్యురాలి కళ్లలో కన్నీళ్లను ఎప్పటికి వెదకాలనుకుంటున్నావు!?

అయినా నాకు అర్ధం కాదు...

నిలువెల్లా నీరసం వస్తున్నా,
మండుటెండ శరీరాన్ని మాడ్చేస్తున్నా,
ఇంట్లో పెళ్లాం పిల్లల మీద మమతతో
తన శరీరాన్నే పణంగా పెట్టి
నీవెక్కిన రిక్షా తొక్కుతున్న
నీ తొటి సోదరుడు నీవుపుట్టిన భూమికి సమాన హక్కుదారు
వాడి కళ్లలో నీరు ఎప్పుడు వెదకాలనుకుంటున్నావు!?

వేలకోట్లు ఖర్చుపెట్టి చంద్రమండలం మీద నీరు వెదుకుతున్న నీవు -

తన కాళ్లను ఓర్పుగా భూమిపై పెట్టి,
తన బిడ్డల చదువులకు మిగలకపోయినా
ఓపికగా భరిస్తూ,
నీవు పెట్టే ఖర్చునంతా -
తన పన్నుల రూపంలో చెల్లిస్తూ
నిన్ను భుజాలపై అలుపెరుగకుండా మోస్తున్న
ఆ మధ్యతరగతి కుటుంబీకుడి కళ్లలో నీటిని ఎప్పుడు వెదకాలనుకుంటున్నావు!?

అయినా నాకు అర్ధం కాదు...

                                              రచన: మాధవ తురుమెళ్ల

1 comment: