సత్యమేవ జయతే నానృతం - ముండక ఉపనిషత్తు 3.1.6
-మాధవ తురుమెళ్ల
ఎవరో నిన్న అడిగారు ’అమీర్‍ఖాన్ సత్యమేవజయతే చూస్తున్నారా? ఎక్కడ్నించి తీసుకొచ్చాడోగానీ కాన్సెప్ట్’' అని. ఆ పక్కనే నుంచుని ఈ సంభాషణ వింటున్న ఇంకొకరెవరో అన్నారు 'ఎక్కడ్నించో తేవడమేమిటి మన భారత రాజముద్ర కింద ఉందిగదా! స్పష్టంగా!" అని.. ఈ సంభాషణ విన్న తర్వాత నేను చెప్పాను. "అయ్యా ఈ ’సత్యమేవ జయతే’ అన్న మాట ముండక ఉపనిషత్తులో ఉంది. అది మూడవ అనువాకం ఒకటవ కాండంలో ఆరవ శ్లోకంలో ఉంది" అని.
బానేఉంది కానీ మూడవ అనువాకం మొదట్లో ఒక చిన్న పిట్టకధ ఉంది. ఆ కధకు ఆ తర్వాత ఐదుశ్లోకాల తర్వాత వచ్చే ’సత్యమేమ జయతే’కు సంబంధం ఉంది అని చెప్పాను. ఆ విషయం మీతోకూడా పంచుకోదలచుకున్నాను.
ముండక ఉపనిషత్తు మూడవ అనువాకంలో "ద్వా సుపర్ణా సయుజా సఖాయా సమానం వృక్షం పరిషస్వజాతో తయో రన్యః పిప్పలం స్వాదత్తయన్నసన్నన్యోభిచక్షతి" "ఒక చెట్టుపైన రెండు పిట్టలు కలిసి జీవిస్తున్నాయి, అవి రెండూ ఒకదానితో ఒకతి స్నేహంగా సఖ్యతతో ఉంటాయి. ఒకపిట్ట ఆ చెట్టుకుకాసిన తియ్యటి ఫలాలను తింటూ ఉంటే మరొకపిట్ట ఫలాలను తినకుంటా తింటున్న పిట్టను చూస్తూ ఉంటుంది" అని ఒక రెండుపిట్టల కధ చెప్పారు. ఇంతకీ ఈ కధకీ సత్యమేవ జయతేకు సంబంధం ఏంటి?
ఆ పిట్టలలో ఒకటి ఈశ్వరుడు రెండోది జీవభావం. ఈ రెండుపిట్టలూ ఉన్న చెట్టే మనిషి... అందుకే తెలుగులో ’చెట్టంత మనిషి’ అని ఒక నానుడి ఉంది. ప్రతి మనిషిలోనూ ఈశ్వరుడున్నాడు. ఇతడు సర్వ స్వతంతృడు. కానీ ప్రతి మనిషిలోనూ జీవభావమూ ఉంది. ఈ జీవభావం చాలా అస్వతంత్రతతొ అభద్రతతో కూడుకున్నది. ఇది ప్రతిక్షణం భయంతో పిరికిగా బ్రతుకుతుంటుంది. బ్రతుకుభయం, చీకటిభయం, నీటిభయం, చావుభయం, డబ్బు సంపాదించాలంటే భయం, సంపాదించుకుంది పోగొట్టుకుంటామనే భయం... ఇలా అనేకభయాలతో పిరికిగా బ్రతికే జీవుడు తనకి ప్రపంచంలో దొరికిన ప్రతి అవకాశాన్ని ఆబగా అనుభవించుదామని చూస్తుంటాడు. ఉదాహరణకు ఒక నలుగురు మంచివారు కలిసి ఒక సదస్సు పెట్టారనుకుందాం ఒకరాజకీయనాయకుడు ఆ సదస్సును అవకాశంగా తీసుకుని ఆ వేదికపైకి వచ్చి మాట్లాడదామని ప్రయత్నం చేస్తాడు, ఒక వ్యాపారవేత్త ఆ సదస్సులో పాల్గొనే నృత్యగీతకారులతో సఖ్యతచూపుతాడు... ఇక్కడిదాకా బాగానే ఉంది. కానీ ఆ రాజకీయనాయకుడుగానీ ఆ వ్యాపారవేత్తగానీ ఇంకొకరిని ఆ వేదిక ఎక్కనివ్వరు, ఆ నృత్యకారులతో మాట్లాడనివ్వరు. అంతర్లీనంగా ఇక్కడ ఆ జీవులలో ఒక అభద్రతాభావం ఒక భయం అంతర్లీనంగా ఉండి వారిని ఆ అనుభవాలు వారొక్కరే అనుభవించేలా ప్రోత్సహిస్తుంది. అంటే ఇదంతా భయంవల్ల వచ్చిన ప్రతీకార చర్యలన్నమాట! ఇంకొక ఉదాహరణ ఒక వ్యాపారవేత్త ఒక వ్యాపారం మొదలుపెడితే ఇంకొకవ్యాపారవేత్త దానికి ఆటంకం కలిగించాలని ప్రయత్నించడంగూడా అతనిలోని భయానికి చిహ్నమే. అంటే అతడు వ్యాపారం చేసి సంపాదించాల్సిన సొమ్మును ఇంకొకడు అదే వ్యాపారం చేసి సంపాదిస్తే అతనికి రావల్సిన "ఆహారం, కీర్తి, పలుకుబడి, అధికారం" అనే ఫలాలు తినేస్తాడానే భయం. ఇలా చెప్పుకుంటూపోతే అనేక సందర్భాలలో మనం మనలోని భయాలవల్లే ప్రవర్తిస్తుంటాము. ఇంకొకరిని మనం తినే ఫలాలవద్దకు రాకుండా చూసుకుంటాము. ఇది జంతులక్షణం.... ఇది పక్షిలక్షణం.
మనం కొన్నికొన్నిసార్లు అబద్దాలు చెబుతాము. అబద్ధాన్నే సంస్కృతంలో అనృతం అంటారు. ఆ రెండుపిట్టల్లో ఒక పిట్ట్ జీవుడనిచెప్పుకున్నముగదా. ఆ తినేపిట్ట జీవుడు అనుభవించే ఫలాలన్నీ ఈ ప్రపంచంలో అనుభవాలే. ఇక ఆ రెండవపిట్ట ఈశ్వరుడు. అతడికి ఈ ఫలాలపై ఆసక్తిలేదు. తినాలన్నకోరికాలేదు. కోరిక లేనందువల్ల అతడు హాయిగా ఉన్నాడు. కానీ భయంవల్ల మనంచేసే ప్రయత్నాలన్నీ మనకు ప్రపంచంలో జయాన్ని సంపాదించిపెడతాయేమోగానీ మననుంచి అతి ముఖ్యమైన ’ఆత్మశాంతి’ని కోల్పోతాము.
సత్యం చెప్పడంవల్ల మనలోని తినేపిట్ట (జీవభావం) నుండి మనం విముక్తిపొంది... తిననిపిట్ట (ఈశ్వరభావం) గా మారుతాము. జరిగింది జరిగినట్టుగా చెప్పడం, ఎటువంటి అరమరికలు లేకుండా (సమయాసమయాలు ఎరుగకుండాకాదు) , నిస్సంకోచంగా (దోపిడీగా కాదు) , నిర్మొహమాటంగా (కర్కశంగా కాదు) ప్రవర్తించడం వల్ల మనలోని భయాలకు దూరమై, మనం మనంగా ప్రవర్తిస్తాము. అనృతంవల్ల మనకి తాత్కాలికంగా జయం కలిగినా తర్వాత వచ్చే దుష్పలితాలు అనేకం... కొన్నికొన్నిసార్లు మనం చెప్పే అబద్ధం ఆడే రాజకీయాలు మన జీవితానికే ముప్పుతెచ్చిపెట్టి మన కుటుంబాన్ని అల్లకల్లోలం చేసి వదిలిపెడుతుంది. అందుకే సత్యానికి దగ్గరగా బ్రతకడమంత హాయిఐనది ఇంకొకటిలేదు. ఈ ప్రపంచంలోకి వచ్చేటప్పుడు మనం దేన్నీ తెచ్చుకోలేదు, ఇక్కడ్నించి పోయేటప్పుడు దేన్నీ తీసుకోని పోము... ఇక మధ్యలో ఎందుకీ తాపత్రయం! ఏది జరగాలో అది జరుగుతుంది... ఎందుకు భయం! ’సత్యమేవ జయతే నానృతం’.... ఓం తత్సత్....
------------xxxxxx--------------xxxxxx---------------xxxxxxx------------
Superb explanation! Def. will try to follow practically!
ReplyDelete