Total Pageviews

Wednesday, 17 July 2013

శాకాహారము మాంసాహారము - ఒక వివరణ

శాకాహారము మాంసాహారము - ఒక వివరణ

ఈశ్వరుని చైతన్యం వ్యక్తీకరణ (పుట్టుక) అనేది నాలుగురకాలుగా విభజించి అర్ధంచేసుకోబడింది. వీటిని జరాయుజములు, అండజములు, స్వేదజములు, ఉద్భిజములు అని పిలుస్తారు.
1. జరాయుజములు:- గర్భంలోని పిండమునావరించియుడు మాయవలన పుట్టునవి.  మనుష్యులు పశువులు.
2. అండజములు:- గ్రుడ్డు నుండి పుట్టు పక్షులు, పాములు మొదలగునవి.
3. స్వేదజములు:- చెమటవలన పుట్టు దోమలు, నల్లులు మొదలగునవి.
4. ఉద్భిజ్జములు:- విత్తనము పగలదీసి జన్మించు వృక్షలతాదులు

ఇక ఇందులో రెండురకాలు ’చర సృష్టి’, ’అచర సృష్టి’....   జరాయుజములు, అండజములు, స్వేదజములను ’చర సృష్టి’ అనియు, ఉద్భిజములనుమాత్రం ’అచర’ సృష్టి అనియు చర అంటే కదిలేవి.   మనుషులు, పశువులు, పక్షులు, పాములు, దోమలు, నల్లులు ఇటువంటివి కదలిక కలిగి ఉంటాయి. ఇవి ముఖ్యంగా తమ కదలికను తమను తాము కాపాడుకునే పనిలోనూ తమ ఆహారప్రయత్నంలోనూ వాడతాయి.  ఇవి రజోగుణ తమోగుణ స్వభావులు అందువల్ల ఇవిధరించే శరీరాలను దోషభూయిష్టమైనవిగా, అంతర్గతంగా దుర్గంధాన్ని ఆవరించి యుండేవిగా భావించి వీటిని ’నీచమనీ’, ’మాంసమనీ’, మాంసాహారమనీ పూర్వీకులు చెప్పారు.  ఈ నీచము అనేమాటనుండే నీచు అనే అర్థం మాంసానికి వచ్చింది.   ఈ చరసృష్టి అంతా తల కిందకు దించి తమ ఆహారాన్ని స్వీకరించ ప్రయత్నంచేస్తాయి.  పశువులు మేతమేసినా, మానవులు ఆహారంతింటున్నా తలను నీచానికి చూస్తారు కాబట్టి నీచం అనే పదం వాడారు కాబట్టి వేరేవిధంగా అర్ధం చేసుకోగూడదు.

ఇకపోతే ఉద్భిజములు - విత్తనమునుండి వచ్చేవి.  వీటిని ఉచ్చములు అని పిలిచారు.  ఇవి వీలైనంతవరకూ సూర్యుడిని అందుకోవడానికి ఆకాశంవైపు సాగుతాయి.  ఇవి అత్యధికశాతం సత్వగుణపూరితములు.  అందువల్ల వీటిని ’శాకాహారమని’ పిలిచారు.

చరసృష్టిని ఆహారముకొరకు వాడగూడదు అని యాజ్ఞవల్క్యస్మృతి చెబుతోంది.  ఒక లేడి యొక్క ఒక కాలు మనం కత్తిరిస్తే అది జీవితాంతం కుంటుతుంది.  అంతేగానీ వేరొకకాలు మొలిపించుకోలేదు.  అలాగే తనకు ఒకచోట బృతిదొరకలేదుగదా అని వేరొకచోటకు వెళ్లగలిగిన రజోగుణం లేడి, మానవుడు, పాము, నల్లి వంటి చరసృష్టికలిగిన జంతువులలో ఉంటుంది.

కానీ అచరసృష్టి దీనికి భిన్నం.  ఒక చెట్టుయొక్క ఒక కొమ్మని నరికితే అది వేరొక కొమ్మను మళ్లీ మొలిపించుకుంటుంది.  చెట్టు తన ఆకులను సమృద్ధిగా రాల్చేస్తుంది.  చెట్టు తన పండ్లను రాల్చేస్తుంది.  అలాగే వరి వంటి మొక్కల ధాన్యాన్ని మనం ఆ మొక్క ప్రకృతిసిద్ధంగా చనిపోయిన తర్వాతే పంటను కోసి విత్తనాలను ఇంటికి తెచ్చుకుంటాము.  ఈ అచరసృష్టి తమకు ఒకచోట ఆహారం దొరకలేదుగదా అని వేరొకచోటికి కదలవు వీటిలో సత్వగుణం (సత్వం సుఖే సంజయతి).  అందువల్ల అరటి, మామిడి,  గోధుమలు, యవలు, తిలలు, మాషలు, శ్యామకములు, నీవారములు వంటి వాటిని భుజిస్తే సత్వగుణవృద్ధి జరిగి ఆలోచనలో క్రూరత్వం నశించి మనిషి ఆరోగ్యపూరితమైన జీవనాన్ని సాగిస్తాడు కాబట్టి శాకాహారము (అచర చేతనా సృష్టి) ని భుజించి మానవుడు సుఖించి కైవల్యాన్ని పొందవచ్చని సాధనాగ్రంధములలో ఋషులు బోధించారు.

ఇకపోతే ఈ శాకాహార మాంసాహారచర్చ అనేది ’జరాయుజములలో’నే సాధ్యం! మానవులు మావినుండి పుడతారు.  తల్లి పాలు తాగి పెరుగుతారు.  అలాగే తోటి జరాయుజములైన ఆవులు, లేడులు, గుర్రముల వంటి వాటి పాలు వీరు తాగవచ్చు అని చెప్పారు.  ఈ పాలు అనేవి తమ బిడ్డతాగేదానికంటే రెండింతల ఎక్కువగానే జరాయుజములు ఉత్పత్తిచేస్తాయి.  కాబట్టి దూడ తాగిన తర్వాత మిగిలిన పాలను ఈ జరాయుజములు సహజంగానే విసర్జించేస్తాయి.  అంటే మీరు పితకకపోతే ఎక్కువైనపాలను ఏ చెట్టుకో పొదుగును అదిమిపెట్టి కార్చేస్తాయి.  కాబట్టి ఇలాంటి పాలు సేకరించడంవల్ల జరాయుజముల ప్రాణనష్టాన్ని కలిగించడం జరగడంలేదు!  కాబట్టి పాలు ఖచ్చితంగా శాకాహారమే! అయితే  దీనికి ఒక నియమం చెప్పారు.  ఉద్భిజములను’ తిని బ్రతికే ’జరాయుజముల’ పాలుమాత్రమే శాకాహారం - అంటే గడ్డితిని పాలిచ్చే ఆవుపాలు శాకాహారం.  కానీ మిగిలినవాటిని తిని పాలిచ్చే జరాయుజముల పాలు ’మాంసాహారం - అంటే ఆవును తిని పాలిచ్చే పులిపాలు మాంసాహారమే! మానవులు స్వతస్సిద్ధంగా ఉద్భిజములను’ తిని బ్రతికే ’జరాయుజములు’

గుడ్డు అనేది ఖచ్చితంగా మాంసాహారమే! Sterile Egg  అనేదాన్ని కొన్ని రసాయనాలనుపయోగించి పెరగకుండా దానిలోని జీవాన్ని మాతృగర్భంలో ఉండగానే చంపేస్తారు. అందుకే అది పుట్టిన తర్వాతగూడా పెరగకుండా గుడ్డులాగా మిగిలిపోతుంది.  ఆ గుడ్డులోనుండి పిల్ల బైటికిరాకుండా రసాయనాలువాడి, పైగా పిల్లరాదుగదా అది శాకాహారమే అని చెప్పడం అర్ధంలేని వాదం.

కాబట్టి సూక్షంగా ఏది కదులుతుందో, ఏది కదిలి తన ప్రాణాలను కాపాడుకో ప్రయత్నిస్తుందో, ఏది కదలిక కలిగే తనవంటి ప్రతిరూపానికి జన్మనిస్తుందో - దానిని తినడం మాంసాహారం.  గుడ్డు ఖచ్చితంగా మాంసమే! కానీ పాలు శాకాహారం.

ఏది కదలదో, ఏది తన కొమ్మలను మరింతగా, ఆకులను మరింతగా మొలిపించుకోగలుగుతుందో అది శాకాహారం.

చేపలు ‘అండజముల‘ క్రిందకే వస్తాయి. అంటే గుడ్లనుండి పుట్టేవి. కదలిక కలిగినటువంటివి. కాబట్టి చేపలవంటివిగూడా మాంసాహారంక్రిందకే పరిగణించబడుతుంది. ప్రతి జీవికి తన స్వతస్సిద్ధమైన తిండి ఉంటుంది. లేడులు, ఆవులు, గుర్రములు స్వతస్సిద్ధంగా పచ్చికమేస్తాయి. పులులు, సింహములు, దుమ్ములగొండులు, గద్దలు స్వతస్సిద్ధంగ మాంసమును తింటాయి. మానవులు స్వతస్సిద్ధంగా పండ్లు, కూరగాయలు, కొన్నిరకముల గడ్డి (లేతవెదురు) మరియు గడ్డిగింజలు (వరి, గోధుమ ఆది) తింటారు. మనుషుల శరీర నిర్మాణాకృతి అంతర్గతమైన జీర్ణావయవములు ఈ విషయాన్నే నిర్ధారిస్తాయి. మానవుల ప్రేగులు దాదాపు ఏడు మీటర్ల పొడవుంటాయి. ఇవి మిగిలిన శాకాహార జరాయుజములైన దుప్పి,లేడి, ఆవులను పోలిన నిర్మాణం. కానీ పులి, దుమ్ములగొండి, సింహము వంటి సహజసిద్ధమైన మాంసాహార జరాయుజముల పొట్టలోని ప్రేగులు మీటరు పొడవుగూడా ఉండవు. ఎందుకంటే ఇవి మాంసం తింటాయి, మాంసము అంటే అప్పటికే ఒక జంతువు తిని అరిగించుకుని బలంగా మార్చుకున్న పదార్థం. అందువల్ల తిరిగి మాంసాన్ని అరిగించుకోవాల్సిన అవసరం వీటి ప్రేగులకు ఉండదు, వీటి ప్రేగులపై అంత భారమూ పడదు. అందుకని స్వతస్సిద్ధంగా మాంసం తినే జంతువుల ప్రేగులు చాలా చిన్నవిగా ఉంటాయి. కాబట్టి మానవులు స్వతస్సిద్ధంగా శాకాహరజీవులు.


నేను శాకాహారం తినే అలవాటుకు తెలివితేటలను ముడిపెట్టడంలేదు. కానీ శాకాహారం తినడం వల్ల మనిషి ప్రశాంతచిత్తుడై ఉంటాడు అని చెబుతున్నాను. కానీ కొందరు మాత్రం శాకాహారం తినడంవల్ల ప్రతిభ పెరుగుతుంది అనే చెబుతారు.

Noble Prize winners అందరూ మాంసాహారులు కాదు. వారు ఎక్కువ శాకాహారం కొంత మాంసాహారం తీసుకునేవారని తెలుస్తోంది. ఐన్‍స్టైన్ ఎక్కువగా శాకాహారాన్నే ఇష్టపడేవాడని చెబుతారు. కొందరేమో ఆయన పూర్తి శాకాహారి అని చెబుతారు. హిట్లర్ మాత్రం శాకాహారి కాదు.

తెలివితేటలు అనేవి దైవానుగ్రహము అదృష్టము అనేవాటిమీద ఆధారపడి ఉంటాయి.  భజగోవిందంలో ’సంప్రాప్తే సన్నిహితే కాలే నహి నహి రక్షతి డుకృణ్‍కరణే’ -- ఇక్కడ డుకృణ్ కరణే అంటే నోబుల్‍ప్రైజ్ తెప్పించగలిగిన శాస్త్రాలు తెలివితేటలు కానీ అవి మరణకాలంలో జన్మరాహిత్యానికి ఏవిధంగానూ దోహదపడవు అని.... అలాగని తెలివితేటలను గర్హించడంలేదు లోకకల్యాణకారకాలైన విషయాలలో తెలివితేటలు ఉపయోగించడం మంచిదే! కానీ తెలివితేటలు ఉన్నవారందరూ వాటిని లోకకళ్యాణానికి ఉపయోగించరు. తమ తెలివితేటలను లోకవినాశనానికి ఉపయోగించినవారు చరిత్రలో కోకొల్లలు. ఉదాహరణకు బిన్‍లాడెన్ అమెరికాలోని భవంతులు కూలగొట్టాడు... అటువంటి పని అంత పకడ్బందీగా చెయ్యడానిక్ చాలా గొప్పతెలివితేటలు అవసరం. కానీ గీతలో చెప్పినట్లు ’మోఘాశా మోఘ కర్మాణః మోఘజ్హ్జానా విచేతసః’ మోహపూరితమైన అయోమయపు కర్మలలో తమ తెలివితేటలను వినియోగించేవారు.

తెలివితేటలు అనేవి శారీరకమైనవి, ఇవి అదృష్టం ఆధారంగా కలుగుతాయి. కానీ ఈ తెలివితేటలు అనేవి ’గుణముల’ ప్రేరేపితమై చెలరేగుతుంటాయి. తమోగుణం+తెలివితేటలు= లోకనాశనం, రజోగుణం+తెలివితేటలు కలిస్తే లోకకల్యాణం, సత్వగుణం+తెలివితేటలు = సుఖవంతమైన జీవితము, భగవంతుని పట్లభక్తి, జన్మరాహిత్యపు కోరిక...

ఈ పైదంతా ఆహార వివరణకొరకే రాసాను. ఎవరి ఆహారపు అలవాట్లువారివి.  ఎవరి గుణప్రవృత్తిని బట్టి వారికి శాకాహార మాంసాహారములపై ప్రీతి ఉంటుంది.  కాబట్టి ఈ వ్యాసం ఎవరినైనా కించపరిచేదిగా అనిపిస్తే క్షంతవ్యుడిని.

మీ - మాధవ తురుమెళ్ల




2 comments: