Total Pageviews

Tuesday, 12 March 2013

నా ఆలోచన: ప్రవక్ష్యామి అనసూయవే



అసూయ అనేదానికి దగ్గరదూరాలు లేవు.  అది ప్రతిమానవునిలోనూ పుట్టుకతోటే సహజంగా వస్తుంది.  అసూయ అంటే తను చేరుకోవాల్సిన స్థితిని ఆనందాన్ని అందుకొవాల్సిన స్థితిని ఇంకొకరు అందుకున్నారు అనే ఊహ మాత్రమే! కానీ ఆ ఊహ నిజం కాకపోవచ్చు ‘దూరపుకొండలు నునుపు‘ అనే సామెత అందుకే పుట్టింది.  ఉదాహరణకు ఒకడు ఇల్లు కట్టుకోవాలనుకున్నాడు, వాడికి రాజభవనంలో నివసించే వాడొకడు కనబడ్డాడనుకోండి...  ఆ రాజభవనంలో ఉన్నవాడిని చూసి ఇల్లు కట్టుకోవాలనుకున్నవాడికి తన కోరికకితోడు అసూయగూడా వస్తుంది.  ఎందుకు?!  ఎందుకంటే ఇల్లుకట్టిన తర్వాత వస్తుంది అనే ఊహాజనితమైన  ‘ఆనందం‘ ఏదైతే ఉందో పరిపూర్ణత ఏదైతే ఉందో దానిని ఆ రాజభవనంలో నివసించేవాడు ఇప్పటికే ఆస్వాదించేస్తున్నాడు అని ‘ఇల్లుకట్టుకోవాలనుకునేవాడి‘లో ‘రాజభవనంలో ఉంటున్నవాడిని‘ చూసి కలిగే గ్లానే అసూయ!  అయితే ఆ రాజభవనంలో ఉన్నవాడికి తను ఉన్న రాజభవనమే తన ఉనికికి ప్రతిబంధకంగా మారచ్చు.  వాడు ఏ ఇల్లూలేనివాడిని చూసి ‘అసూయ‘ పడచ్చు అది సహజం... అన్నీ ఉండి దర్జాగా ఉండాల్సిన ’మార్లిన్ మన్రో’ వంటి ప్రముఖ వ్యక్తులు కొంతమంది అకారణంగా ఆత్మహత్యలు చేసుకోవడానికి ఈ ఆనందగ్లాని కారణం. కాబట్టి దీనివల్ల మనకు అర్థమయేదేంటంటే అసూయ అనేది ‘ఆనందమీమాంసకు‘ చెందిన ఒక మానసికమైన స్థితియేగానీ దానికి భౌతికమైన వస్తువులతో సంబంధంలేదు. కానీ దురదృష్టవశాత్తూ మనకు మనలోదాగిఉన్న అసూయ మనం భౌతికమైన వస్తువులను పొందడంద్వారానో పోగొట్టుకోవడం ద్వారానో మాత్రమే తెలిసివస్తుంది!  మహాభారతగ్రంధం దుర్యోధనునిలోని అసూయకు రాయబడ్డ చిట్టాపద్దు.  నిజానికి అసూయ అనేది తప్పుగాదు. అసూయలేకపోతే నీవు దేన్ని పొందాలనుకున్నావో దానిగురించి నీకు ఆలోచనగూడా రాదు.  అసూయ ఉండటం మృగాలకు సహజం.  కానీ యోగులు కావాలనుకున్న మానవులలో అసూయ అనేది ఆత్మసాక్షాత్కారానికి ప్రతిబంధకం!  మీరు మానవునిగా బ్రతికేటప్పుడు అసూయ మీకు ఉపయోగపడుతుంది కానీ మహనీయునిగా మారాలనుకున్నప్పుడు మీలోని అసూయే మీకు ప్రతిబంధకమవుతుంది.  మానవులు   ‘మత్వా కర్మాణి కుర్వంతే‘ -- ఆలోచించి పనిచేస్తుంటారు.  నిజంగా ఆలోచించగలిగినవానికి ఆత్మానుసంధానం కలిగినవానికి ‘అసూయ‘ ఉండగూడదు.  అందుకే భగవద్గీతలో ‘ప్రవక్ష్యామి అనసూయవే‘ - ‘నీవు ఏవిధమైన అసూయ లేనివాడివిగాబట్టే నీకు అతి రహస్యమైన ఈ జ్ఞానాన్ని ఉపదేశిస్తున్నాను అర్జునా‘ అంటూ శ్రీకృష్ణపరమాత్మ జ్ఞానాన్ని పొందడానికి అర్జునునిగల అర్హతను సూచించారు.

అయితే ఇక్కడ  ‘అసూయ ఆత్మప్రబోధానికి ఎలా వ్యతిరేకం ?‘ అనే ప్రశ్నరావచ్చు.  ఒక ఉదాహరణ చూద్దాము.  ఒక వ్యక్తి వద్ద ఒక ఖరీదైన వజ్రం ఉండేది. అదంటే అతనికి ప్రాణం.  ఆ వజ్రాన్ని మెరుగుపెట్టి తుడిచి కడిగి దాని విలువని తెలుసుకుంటూ అతడు ఆనందాన్ని పొందేవాడు. కానీ ఒకనాడు అతడు ఆ వజ్రాన్ని  పోగొట్టుకున్నాడు.  భోరుమని ఏడుస్తున్నాడు. తన ఇల్లంతా ఆ వజ్రంకోసం వెదుకుతూ అతలాకుతలం చేస్తున్నాడు.   ‘అతడు ఎందుకు ఏడుస్తున్నాడు?‘ అని మనం ప్రశ్నించుకుంటే ‘వజ్రం పోగొట్టుకుని‘ అని సమాధానం.  అంటే ఒకప్పుడు అతనివద్ద ఉన్న వజ్రం అతనికి ‘ఆనందాన్ని‘ ఇచ్చింది.  ఆ ‘ఆనందం‘ పోయినందువల్ల ఇప్పుడతడు దుఃఖపడుతున్నాడు... ఇంకొంచెం లోతుకు వెళ్లి చూద్దాము.  అసలు అతనివద్ద వజ్రం అనేదే లేదు అనుకుందాము.  అతడు పొందిందీ లేదు పోగొట్టుకున్నదీ లేదు కాబట్టి అతడికి దుఃఖం ఉండేదికాదు.  కానీ నిజానికి అతనివద్ద ఒక వజ్రం ఉండేది.... అందుకే దానిని పోగొట్టుకుని అతడు ఏడుస్తున్నాడు.  ఆ పోగొట్టుకున్న వజ్రాన్ని తిరిగి పొందుదామని ఇల్లంతా వెదుకుతున్నాడు.  ఇప్పుడు అతడి వద్ద వజ్రం ఉందా?!  ‘లేదు‘ కానీ ‘ఒకప్పుడు ఉండేది‘  ఆ ఒకప్పుడు ఉన్న ఆనందపు ‘ఎరుక‘ జ్ఞాపకం అతడిని ఆ వజ్రాన్ని వెదకడానికి ప్రేరేపిస్తున్నాయి....

ఈ వజ్రం పోగొట్టుకున్నవాని ఉదాహరణ మన దైనందిన జీవనానికి అనువయిస్తే... మనం అందరమూ ఎందుకు అసూయపడుతున్నాము అంటే ‘వస్తువుని పొందినందువల్ల వచ్చే ఊహాజనితమైన ఆనందం‘ ఎదుటివానికి అప్పటికే లభించింది అనే భావనవల్ల.

"పొందాలనుకున్నది ఆనందాన్ని కానీ అనుభవిస్తున్నదిమాత్రం అసూయను!"  చూసారామాయ!

కాబట్టి ఉపాయంతో ఆ ఆనందాన్ని అనుభవిస్తే దాన్ని గురించిన కిటుకు అర్ధమైతే అసూయ అనేమాటకు తావే లేదు.   ఇది ఒక్క మానవులకే సాధ్యం (మత్వాకర్మాణి కుర్వంతే).  వజ్రాన్ని పోగొట్టుకున్నవాడే వజ్రాన్ని గుర్తుపెట్టుకోగలడు, దానిగురించి ఏడ్వగలడు.  అలాగే ఒకప్పుడు వజ్రంలాంటి ‘ఆనందాన్ని‘ కలిగి ఉన్నవాడే దానిని పోగొట్టుకోగలడు ‘ఏడ్వగలడు‘ - దానిగురించి వెదకగలడు.  అసలు తనజీవనంలో ఏనాడూ వజ్రం అనేది తెలియనివాడు దాన్ని ఎలా పోగొట్టుకోలేడో, పోగొట్టుకుని ఏడవలేడో, అలాగే ఆనందాన్ని గురించి తెలియనివాడు దాన్ని పోగొట్టుకోలేడు దాన్నిగూర్చి వెదకలేడు.... దీనిని బట్టి మనకు అర్ధమయేదేంటంటే ‘మనవద్ద ఒకప్పుడు పూర్ణమైన ఆనందం ఉండేది‘ కాబట్టి దాన్ని పోగొట్టుకుని ఇప్పుడు మనం దుఃఖపడుతున్నాము అసూయపడుతున్నాము.   అందుకే మనం ‘ఒకానొకప్పుడు మనహక్కు అయిన వజ్రంలాంటి ఆనందాన్ని పొంది పోగొట్టుకుని ఈ ప్రపంచంలో ఆ ఆనందంకోసం వెదుకుతున్నాము ఏడుస్తున్నాము.‘  మూలంగా చూస్తే ఒకప్పుడు మనం ఆనందస్వరూపాలం అయి ఉండాలి.  లేకపోతే మనం ప్రపంచంలో ఆనందంకోసం ఎందుకు ఎప్పుడూ ‘వజ్రాన్ని పోగొట్టుకున్నవాడిలాగా‘ వెదుకుతున్నాము?!

సరే!  ఇప్పుడు ఇంకొక ప్రశ్న:  వజ్రం పోగొట్టుకున్నది ఎప్పుడో తెలుసు.... ఆనందం పోగొట్టుకున్నదెప్పుడో మనకు తెలుసా?!  వేదాంతం ఏం చెబుతుందంటే నీవు ఏనాడూ ఆనందాన్ని పోగొట్టుకోలేదు కానీ అవిద్యవల్ల మాయవల్ల ‘పోగొట్టుకున్నాను‘ అనే భ్రమ కలుగుతూంటుంది ‘స్వకంఠాభరణం యధా‘ మెడలో హారం తగిలించుకుని ఆ విషయం మర్చిపోయి ఇల్లంతా హారంకోసం వెదికే ఇంటావిడ ఉదాహరణ ఇచ్చారు.  ఆవిడ ఎంతవెదికినా హారం కనబడదు ఎందుకంటే ఆవిడ దాన్ని పోగొట్టుకున్నదేలేదు... తనమెడలో ఉన్నహారం తాను మర్చిపోవడమే అవిద్య.... అంటే (మెడలో హారం ఉండడం వల్ల) కలిగిఉన్న ఆనందాన్ని ఆవిడ పోగొట్టుకున్నదే లేదు.... కానీ తాత్కాలికంగా పోగొట్టుకున్నానని ఊహించి తాత్కాలికంగా దుఃఖపడింది.   మనం ఆనందాన్ని పోగొట్టుకున్నదే లేదు.  కాబట్టి దుఃఖం ప్రసక్తి ఉండగూడదు... ఇక ఫోగొట్టుకొనని దానినిగురించి అసూయ పడే ప్రశ్న ఎక్కడిది?!   మనం ఆనందం ఎప్పుడు పోగొట్టుకున్నాము అంటే ప్రతి ఆలోచనా చీమలాంటిది.. నీలోని ఆనందం అనే తియ్యని పంచదారకుప్పనుండి ఒక్కొక్కరేణువుని మెల్లగా తీసుకుని వెళ్లిపోతుంటుంది.  కాబట్టి నీ ఆలోచనలను గమనించు నీవు ఎందుకు ఆనందాన్ని పోగొట్టుకుంటున్నావో అర్దమవుతుంది....


ఇకపోతే ఎవరో అడిగారు కామక్రోధలోభమోహమదమాత్సర్యములు అనేవి ఒకదానితర్వాత ఇంకొకటి హెచ్చుగా చివరకు మాత్సర్యం అన్నింటికంటే గొప్ప ప్రమాదకారిగా అంటూంటారు నిజమేనా అని.....

నాకు నా మహనీయులైన బ్రహ్మవిదులైన మా గురువుల బోధవల్ల అర్ధమైనంతవరకు కామక్రోధమోహమదమాత్సర్యాలు ఒకదానికంటే ఇంకొకటి హెచ్చు ప్రమాదకారులు కావు. అన్నీ సమానంగా ప్రమాదకారులే. అయితే వీటిలో మూడు చాలా ఎక్కువ ప్రమాదకారులు ఈ మూడిటితో మిగిలిన మూడు కూడినప్పుడు జరిగేది ఉపద్రవమే! అగ్నికి ఆజ్యం జోడిస్తే ఎంత ప్రమాదమో అలాగ కామానికి క్రోధం జోడయితే ప్రమాదం!

మోహము మదము మాత్సర్యము ఈ మూడూ అనుసంధానాలు. అంటే కామానికి మోహం అనుసంధానం, క్రోధానికి మదం అనుసంధానం అలాగే లోభానికి మాత్సర్యం అనుసంధానం.

త్రివిధం నరకస్యేదం ద్వారం నాశనమాత్మనః కామం క్రోధం తధా లోభం తస్మాదేతత్రయం త్యజేత్| (గీత 21/16) అర్జునా ఇక్కడ మూడు నరకములున్నాయి అవి ఆత్మసాక్షాత్కారానికి ఉన్న ద్వారాన్ని నాశనం చేస్తాయి అవి కామము, క్రోధము, లోభము కాబట్టి ఈ మూడిటినీ వదిలిపెట్టెయ్యాలి.

కామమును క్రోధమును లోభమును వదిలిపెట్టగలము ఎందుకంటే అవి మనను జన్మతరువాత మాయలో పుట్టి పట్టుకునేవి కానీ మోహము మదము మాత్సర్యము అనేవి సహజ జంతు లక్షణాలు ఇవి శాంతింపబడాలేతప్ప మనం వాటిని వదిలిపెట్టలేము. అగ్నికి ఆజ్యం జోడించకపోతే ఎలా అది దానంతట అదే నశించిపోతుందో అలా అన్నమాట.

క్రోధం అనేది ఉపయోగపడుతుంది అంటే తనే గొప్ప అనుకోవడం ’మదం’ ఇక ఈ మదానికి అంటే తన గొప్పదనానికి ఆటంకం ఏదైనా కలిగితే పుట్టే క్రోధం అత్యంత ప్రమాదకారి. కానీ మదంలేని క్రోధం ఉపయోగపడుతుంది. మహాత్ములు సత్యక్రోధులు శ్రీరామచంద్రుడిని సత్యక్రోధుడు అంటారు. అంటే తమలోని సహజ ప్రకృతులను ఆత్మోద్ధరణకు లోకోద్ధరణకు వాడేవారు.

నిజానికి ఆలోచించి చూస్తే అసూయలేనినాడు విశ్వామిత్రుడు వశిష్ఠునితో పోటీపడేవాడా?! కానీ విశ్వామిత్రునిది లోభంతో కూడిన అసూయ. అంటే లోభిగా లుభ్దత్వానికి లోనయి బ్రహ్మర్షి అని పిలిపించుకోవాలని తాపత్రయపడ్డాడే గానీ తనలోని లోభం మాయమైననాడు తను సహజంగానే బ్రహ్మర్షిగా అవుతాడు అని గ్రహించలేకపోయాడు. ఆ తర్వాత ’తపసా బ్రహ్మవిజిజ్ఞాసస్వ’ తపస్సుద్వారా బ్రహ్మవిజిజ్ఞాసకలిగి లోభంపోగొట్టుకున్నాడు, లోభం పోయిననాడు అసూయ అనుకుండానే సమసిపోయింది. అందువల్ల బ్రహ్మర్షి అయాడు.

అలాగే మోహం అనేదిగూడా ఉపయోగపడుతుంది. తల్లితండ్రులకు కలిగే మోహమే పిల్లలను పుట్టించేటట్లు చేస్తుంది. మోహంలేనినాడు సృష్టికార్యం జరగదు. భర్త తన భార్యపట్ల ప్రేమికుడు తన ప్రియురాలిపట్ల మోహం పెట్టుకోవడం సహజం. కానీ భర్త పరాయివాని భార్యపట్ల కామవాంఛ పెట్టుకుంటే దానివల్ల అనుసంధానించబడ్డ మోహం అత్యంత ప్రమాదకారి. అటువంటి కామపూరితమైన మోహమే పౌలస్త్యవధ (రామాయణం) కు కారణమయింది.

అందువల్ల మనకు తెలిసేదేంటంటే మోహము, మదము మాత్సర్యము వాటంతట అవిగా ప్రమాదకారులుకావు. వాటివల్ల కొంచెం ఉపయోగం ఉంది. కానీ కామం, క్రోధం, లోభం వల్ల ఏవిధమైన ప్రయోజనమూ లేదు. అలాగని అవి పొమ్మంటే పోవు అభ్యాసం వల్ల కామక్రోధలోభాలు పోతాయి, వైరాగ్యంవల్ల మోహమదమాత్సర్యాలు సద్దుమణుగుతాయి. ఇలా అని నేను సాధన గ్రంధములలో చదివాను.


ఓం స్వస్తి....

-మాధవ తురుమెళ్ల, మాడ్రిడ్, స్పెయిన్ 12-మార్చి-2013









No comments:

Post a Comment