మీ ఇంట్లో చంటి పిల్లలున్నారా? నెలల పాపలున్నారా? అయితే ఈ సారి శ్రద్ధగా వారి చర్యలను గమనించండి. పిల్లలను సాకటంలో ఇప్పటికే అనుభవం ఉన్నట్లయితే నేను ఇప్పుడు చెప్పబోయే విషయం మీరు గమనించే ఉంటారు. ఒక నెలల పసిపిల్లవాడు ఇంటిలోపల ఆడుకుంటున్నాడనుకోండి, ఎవరో అపరిచితుడు తలుపు తీసుకుని లోపలికి వచ్చాడనుకోండి. ఆ పిల్లవాడు ఏంచేస్తాడో గమనించండి... అతను మొట్టమొదటగా తన తల్లి మొహంవంక, ఆ అపరిచితుని మొహంవంక పదేపదే చూస్తాడు. తన తల్లి మనసులో రేగే ‘భావన‘లను అతను పసిగడతాడు. [ఆ తల్లి రక్తమాంసాలనుండి వచ్చిన బిడ్డకాబట్టి అతనికి తన తల్లితో ఒక అదృశ్యమైన బంధం ఉంటుంది] తన తల్లి ఆ అపరిచితుని పట్ల అభద్రతాభావంతో ఉంటే ఈ పిల్లవాడు గుక్కపెట్టి ఏడుస్తాడు; తల్లి మనసులో సంతోషం ఉంటే బోసినవ్వు నవ్వుతాడు; తల్లి అయోమయంలో ఉంటే అపరిచితుడిని చూసి సిగ్గుపడతాడు.... ఇలా మొదలవుతుంది మన అవతారం కధ.
ఇప్పుడు మీరు ఎదిగిపోయిన మనుషులు గదా! కాబట్టి నిదానంగా మిమ్మల్ని మీరు గమనించుకోండి --- ఒక అపరిచితుడిని చూసినపుడు మొదటగా మీలో రేగే భావనలు ఏవయితే ఉన్నాయో అవి మీతో మీ చిన్నప్పటినుండీ వస్తున్నాయి... అవి మీ తల్లి తండృల భావనలు... అవి వారి తలిదండ్రుల భావనలు.. అలా చూసుకుంటూ పోతే ఈ భావనలు అనాది. కాబట్టి మీ వంశపారంపర్యంగా వచ్చే భావనలనే మీరు ఇప్పుడు భావిస్తున్నారు. అంటే ఒక అపరిచితుడు ఎదురుపడితే మీ తల్లిలానో లేదా మీ తండ్రిలానో, లేదా మీ పూర్వీకులలానో ప్రవర్తిస్తున్నారు... ఇందులో ఏ తప్పూలేదు... కానీ అది అంత అవసరం కాదు, అలానే భావించాలని నియమంగూడాలేదు!
సరియైన ఎదుగుదల లేని పిల్లలు నిరంతరం తాము ‘ఏం‘ భావించాలో తెలియక వెదుకులాటలో ఉంటారు. అలా వెదుకుతూ వయసులో పెద్దవారిగా మనసులో పసిపిల్లలుగా మిగిలిపోతారు. ఈ సరియైన ఎదుగుదలలేని అమాయకపు వ్యక్తిత్వంనుండి పుట్టినదే వ్యక్తిపూజ... అంటే ఒక వ్యక్తి మీద పుట్టే సంపూర్ణ భద్రతాభావం... ఇది పెడదారి పట్టకుండా మతం సృష్టించబడింది.మతంలో భగవంతుని ఆరాధనని దీనికోసం ఏర్పాటుచేస్తారు... భగవంతుని పట్ల సంపూర్ణ భద్రతాభావం వుండటంలో లాభంలేకపోయినా మీకు వచ్చే అపాయం లేదు.
అయితే ఆ భద్రతాభావం వ్యక్తులమీద ఏర్పరచుకుంటే మీరు దెబ్బతినే అవకాశం ఉంది. కాబట్టి మీలోని భద్రతాభావంగానీ, అభద్రతాభావంగానీ, భయంగానీ, ప్రేమగానీ ఏ భావన లేచినా దాని మూలం తెలుసుకోండి... అది ఎదుటివ్యక్తి ‘ఇలా భావించాలి‘ అని చెప్పినందువల్ల భావిస్తున్నారా లేదా మీ అంతట మీరుగా భావిస్తున్నారా. ఇది తెలుసుకోవడం అంత తేలిక కాదు.. ఎదుగుదల అంటే మీలో స్వతంత్రంగా లేచిన భావజాలాన్ని మీరు వ్యక్తీకరించగలగడం... ఎదగకపోవడం అంటే అరువుతెచ్చుకున్న భావజాలాన్ని తనదిగా అనుకుని గొప్పలకు పోవడం... ఎంత చెప్పినా అది మనసులో శూన్యతని ఎత్తి చూపిస్తూనే వుంటుంది. కాబట్టి దాన్నించి బయటపడటం ముఖ్యం... - మీ శ్రేయోభిలాషి మాధవ
ప్రేరణ: రాణి మదాలస తన బిడ్డలని ఘనంగా తీర్చిదిద్దిన చరిత్ర (శుద్దోసి బుద్దోసి పరిమోహితోసి సంసారమాయా పరిమోహితోసి)
ఈ భారతీయుల సంస్కృతిక భావనలనే క్రితం శతాబ్దం నుండి సైకోధెరపీలో వాడుతున్నారు. హంగేరియన్ సైకోథెరపిష్ట్ మార్గరెట్ మాలర్ రాసిన "Psychological Birth Human Infant Individuation" అనే పుస్తకం భారతీయులకు తెలిసిన ఈ విషయాన్నే మరింత వివరంగా చెబుతుంది... ‘http://www.amazon.co.uk/Psychological-Birth-Human-Infant-Individuation/dp/0465095542
No comments:
Post a Comment