Total Pageviews

Thursday, 5 May 2011

మానవ జీవనం - దైనందిన నాటకరంగం

ఇక్కడ నేను ఇచ్చిన త్రికోణపు బొమ్మను చూడండి.  దీంట్లో మూడు కోణాలున్నాయి.  మనం దైనందిన జీవనంలో ఈ మూడుకోణాలలో ఎప్పుడూ ఈ త్రికోణంలో ఏదో ఒక మూల నుంచుని పనిచేస్తూ ఉంటాము.

ఉదాహరణకు ఇంట్లో ఒక భార్య... ఆవిడని భర్త వేధిస్తున్నాడు అనుకోండి.  ఆవిడ "బాధితుడు" అని రాసిఉన్న కోణంలో నిలబడుతుంది. ఇక ఆ భర్త "బాధించువాడు" అన్న కోణంలో నిలబడతాడు.  ఇక ఆ ఇంట్లో అత్తగారు పాపం మంచావిడ అనుకోండి కోడలి కష్టసుఖాలని అర్ధం చేసుకుంటుంది అనుకోండి.... ఆవిడ "రక్షకుడు" కోణంలో నిలబడుతుంది, లేదా ఆ భార్య ఒక "బాబా" గారినో లేదా "మాంత్రికుడినో" నమ్మిందనుకోండి వాళ్లు ఆ రక్షకుడు కోణంలో ఉంటారు.   ---- ఇదీ ఆ బాధించబడిన "బార్య" పాల్గొనే నాటక రంగం [నానాటి బ్రతుకు నాటకము కానక కన్నది కైవల్యము]


ఇక ఆ ఇంట్లో భర్త విషయంలోకి వద్దాము.  అతను ఏ కోణంలో నిలబడ్డాడనుకుంటున్నారు?!  అతని భార్య అతన్ని "బాధించేవాడు" అనే కోణంలో నిలబెట్టింది.  కానీ అతను నిజంగా "బాధించేవాడేనా"?!  అదే అతని భావనలో అతని భార్య ఎప్పుడూ దేవుళ్లనీ దయ్యాలనీ నమ్మి తిరుగుతుంటుందనీ, తనని పట్టించుకోదనీ, తనకి ఇష్టమైన పదార్ధాలు వండి పెట్టడంలేదని అనుకుంటున్నాడనుకోండి?   అ పరిస్థితుల్లో అతను ఏం ఆలోచిస్తాడు?  తన భార్యని "బాధించువాడు" అనే కోణం లో నిలబెడతాడు.  ఒక బ్రాందీ సీసానో, లేదా విస్కీ సీసానో, లేదా కబుర్లు చెప్పే స్నేహితుడొ ఆ భర్త యొక్క "రక్షకుడు" కోణంలో ఉంటారు.  


ఇదే విషయాన్ని మీ ఆపీసులో మీరు చేసే పనికి అనువదించి చూడండి.. మిమ్మల్ని అనవసరంగా హింసించే మీ మేనేజర్ "బాదించువాడు", మీ గోడు విని మిమ్మల్ని ఆదుకోగల మీ మేనేజరు యొక్క పై అధికారి మీకు "రక్షకుడు"...  ఇలా నడుస్తుంది.


ఇదే విషయాని ఒక భక్తుడికి అనువర్తించండి. భక్తుడు తనని తాను "బాధితుడు" కోణంలో నిలబెట్టుకుంటాడు, ఈ కరుణలేని ప్రపంచాన్ని "బాధించేవాడి" కోణంలో పెడతాడు, తనని రక్షించేది ఏడుకొండలవాడనో, ఏసుక్రీస్తనో, అల్లా అనో --- ఇలా ఎవరి మతాన్ని బట్టి ఎవరి నమ్మకాన్ని బట్టి వాళ్లు తమ దేవుని "రక్షకుడి" స్థానంలో ఉంచుతారు.


ఇక పోతే రాజకీయనాయకులున్నారనుకోండి వాళ్లు తమని తాము "రక్షకుల" స్థానంలో నిరంతరం చూసుకుంటారు. అయితే వాళ్లకు మాత్రం బాధించేవాడు ఉండడా? అంటే ఎందుకు ఉండడు!  తమని నిర్ధాక్షిణ్యంగా పదవినుండి తప్పించగల ఓటర్లే తమని బాధించువారు.  తమకు ఓటును కొనుక్కోవడానికి అధికారాన్ని కొనుక్కోగల శక్తిని ఇవ్వగల ఉన్న డబ్బే రక్షకుడు...  ఇకపోతే కొంతమంది నిజాయితీగల రాజకీయనాయకులు తొందరపడి తనని తాను రక్షకుడిగా ఊహించి లేనిపోని సమస్యలకి పరిష్కారం చూబిస్తూ ఎవరినో ఏ వర్గానికి చెందిన వారినో బాధించి, ఆ వర్గానికి చెందినవారి నాటకరంగంలో రక్షించేవాని కోణం నుండి బాధించేవాని కోణంలోకి దిగజారుతారు.


సరే!  ఇలా మీరు చూస్తూ పోతే మనం అందరం మన దైనందిన జీవనంలో ఇలా ఈ జగన్నాటకాన్ని ఆడుతూనే ఉంటాము.  Compartmental Thinking అంటే సమస్యని అన్ని కోణాలనుండి చూడకపోవడం.  పీత కన్నంలో దూరి బాగానే వుంది అని మనం అనుకుంటాము, కానీ పీత కష్టాలు పీతవి, సీత కష్టాలు సీతవి...  అన్ని కోణాలనుండీ చూస్తే సమస్య ఏంటి అనేది అవగాహన అవుతుంది.  సమస్య తెలిస్తే పరిష్కారం ఏదో విధంగా కనుక్కోవచ్చు.  


నేను ఇప్పుడు ఈ పని దేనికి చేస్తున్నాను, ఎందుకు చేస్తున్నాను అని అనుకుంటున్నప్పుడు ఈ త్రికోణం ఒక పేపర్ మీద గీసి పేర్లు రాసుకోండి... తర్వాత అన్ని వైపులా నిలబడి అన్ని కోణాలనుండీ ఆలోచించండి... మమేకం అవకుండా చూడండి... అప్పుడే మీ అస్తిత్వంలో పరిపక్వత వస్తుంది... దీన్నే మనం మన సంస్కృతిలో "నిదానం" గా ఆలోచించడం అని పిలుస్తాము.


మనస్సుకు నిజమైన ప్రశాంతత ఎప్పుడు వస్తుందంటే ఈ నాటక రంగాన్ని గుర్తించినపుడు అందులో మీరు ఆడుతున్న పాత్రని మమేమకవకుండా గమనించగలిగినప్పుడు....  ఆదిశంకరుల మాయావాదం ఈ నాటకరంగాన్ని గుర్తించి ఎరుక ఉన్నప్పుడే ఇందులోంచి తప్పుకోమని చెబుతుంది... దాన్నే వైరాగ్యభావన అంటారు..


ధన్యవాదాలతో.... 


మీశ్రేయోభిలాషి
మాధవ తురుమెళ్ల
లండన్ 15 ఏప్రిల్ 2011 

ప్రేరణ:  శ్రీ ఆదిశంకరుల అద్వైత సిద్ధాంతము - మాయ, మరియు "నానాటి బ్రతుకు నాటకము" అన్న అన్నమాచార్యుని పాట


No comments:

Post a Comment