Total Pageviews

Saturday 14 December 2013

సమాజసేవపై ఒక సలహా

సమాజసేవపై ఒక సలహా:-

కర్ణుడు పుట్టగానే కవచకుండలాలతో ఎందుకు పుట్టాడా అని ప్రశ్నించుకుంటే అతడి జీవితంలో అతడు అనేక బాధలు పడ్డాడు.  ఎక్కడోపుట్టి ఎక్కడో పెరిగాడు. దాతృత్వంలో మొనగాడైనా, అరివీరభయంకరుడైనా, అతిగొప్పశూరుడైనా అతడు శాపగ్రస్తుడు.  ఈ విషయం అతడికిగూడా తెలుసు.  అనేకులు అతడిని తమ తమ అవసరాలకు వాడుకున్నారు.  చివరకి శాపాలనే వరంగా ఇచ్చివెళ్లారు.  అందరూ అతడిగురించి గుసగుసగా అవమానిస్తూ మాట్లాడుకునే మాటలు అతని చెవిన పడకుండా ఉండాలని కుండలాలు, అందరూ అతడివైపు సరాసరి విసిరే  బాణాలు అతనికి తగలకుండా ఉండాలని కవచము ఇచ్చి అతడిని ఈ దుష్టప్రపంచంనుండి కాపాడాలని అతడి తండ్రిసూర్యుడు చేసిందంతా ఒక వృధా ప్రయత్నంగా మారింది ! ఎందుకంటే లోకానికి ఉపకారం చేద్దామనుకునే మత్తుమందుకు బానిస అయినవాడు కర్ణుడు.  ఆడిగినవానికి లేదనకుండా ఇచ్చేవాడు.

నిజానికి  కర్ణుడికి కవచం ఉన్నట్లే భారతదేశం రాజకీయాలలో ఉండాలంటే ఖడ్గమృగంలాంటి అతి బలమైన చర్మం నీకు కవచంగా ఉండాలి.  దీన్నే ఇంగ్లీషులో Having a thick skin అంటారు. నీవు కర్ణుడిలాగా మంచి చెయ్యబోతే నీచేష్టలవెనుక ఏ మర్మం దాగిఉందా అని వెదుకుతుంది సమాజం.  నీవు కర్ణుడిలాగా ఒకరికి మంచిచెయ్యబోతే నీకు తెలియకుండానే నీవు నీ మాటలద్వారానో లేక నీ చేష్టలద్వారానో వేరెవరికో మనస్తాపం కలిగించి తీరతావు.  నీవు ఒకరికి కలిగించే సుఖం వేరొకొరికి ఖేదంగా మారుతుంది. ఆ ఖేదించేవాడు చేసే ఆక్రోశంలో వాడు నిన్నుచేసే అవమానాల్ని తట్టుకోగలిగే కవచం నీకు ఉండి తీరాలి. కానీ ఒకటిమాత్రం సత్యం.  ఈ సమాజసేవలో ఈ రాజకీయాలలో ఈ హైందవధర్మంలో ఈ భగవత్సేవలో స్వంతానికి సుఖంలేదు, సంసారానికి శాంతిలేదు.  కాబట్టి స్వసుఖాన్ని ఆశించి సమాజసేవలో దిగడం అనవసరం.  ఉన్నది ఒక్కటే! అదే స్వధర్మం... అదే ఆత్మత్యాగం... ’త్యాగేనైకే అమృతత్వం ఆనసుః’ అంటుంది వేదం. త్యాగం ఒక్కటే నీకు అమృతత్వాన్ని అందిస్తుంది.

కానీ గుర్తుంచుకో... నీవు నడిచే ఈ సమాజసేవలో ఈ దారిలో ఏదో  ఒకనాడు నీవారిచేతిలోనే నీవు నేలకొరగాల్సి రావచ్చు.  సీజర్ లాగా ’యూటూ బ్రూటస్’ అంటూ నీ ఆత్మీయులచేతిలోనే నమ్మినవారి చేతిలోనే నీవు వంచనకు గురికావచ్చు..  . కానీ అలాగని అందరినీ అనుమానించకు. సమాజసేవలో అనుమానానికి తావులేదు. తన నీడని తాను అనుమానించేవాడు ఏ లోకాన్నీ ఉద్ధరించలేడు.  కాబట్టి నిష్కల్మషమైన హృదయంతో నిస్వార్ధంగా నీ దారి నీవే ఎంచుకుని నడిచిపో... నీవుచేసే పనులను నీ ఆలోచనలను ఎదుటివాడు సమర్ధించాలని ఆశించకు.  భంగపడకు.   హిందువునని గర్వంగా చెప్పుకు తిరిగిన గాంధీగారినిగూడా హిందువుని అనుకొని అపోహపడిన కర్కోటకుడొకడు కాల్చి చంపాడు.  యాదవవంశ చందృడు అని పొగడబడ్డ శ్రీకృష్ణుడుగూడా యాదవుల చేతిలో చాలా తీవ్రమైన దెబ్బలుతిని చెట్టుక్రింద బాణంతగిలి తనప్రక్క తన అనేవారు ఎవరూలేకుండా చనిపోయాడు.  ఒంటరిగా పుట్టి ఒంటరిగా పెరిగి ఒంటరిలోకే మాయమయేది ఈ జీవితం... నీటిబుడగలాంటిది నిద్రిస్తున్న స్వప్నంలాంటిది... ఆశించకు... అలాగని ఆలసించకు...  -మాధవ తురుమెళ్ల, లండన్ 14/12/2013

1 comment: