Total Pageviews

Friday 20 September 2013

పిచ్చాపాటి: "అన్నం న నింద్యాత్ తద్వ్రతమ్" - వేదం.

పిచ్చాపాటి:  "అన్నం న నింద్యాత్ తద్వ్రతమ్" - వేదం.  ఆహారాన్ని నిందించకు, చులకనగాచూడకు, తృణీకరించకు అది వ్రతం. మా ఇంట్లో  వండిన ఏ ఆహారపదార్ధాన్నీ పారెయ్యం.  అలాగని యామం గడిచిన తర్వాత ఆ పదార్ధాలను తినము.  ఈ విషయంలో మా ఆవిడ మరీ ఖచ్చితంగా వ్యవహరిస్తుంది.  మధ్యాహ్నం వండిన పదార్ధాలను సాయంత్రం తినడానికి ఒప్పుకోదు.  సాయంత్రం వంట మళ్లీ ప్రత్యేకంగా వండుతుంది.  గీతలో యాతయామం గతరసం అంటూ వండి మూడుగంటలు దాటిన అన్నం తనయొక్క మహత్తును కోల్పోతుంది అని చెప్పబడింది.  అయితే భక్ష్య, భోజ్య, చోష్య లేహ్యములని నాలుగురకముల భోజనపదార్ధాలు.  వీటిలో భక్ష్య భోజ్యాలకే ఈ యామం అనే నియమం వర్తిస్తుంది.  కానీ నేను ఈ యామపు నియమాన్ని పట్టించుకోను.  మా ఆవిడ సెలవులకు వెళ్లినప్పుడు, నేను ఆఫీసుపనిమీద వేరేదేశాలకు వెళ్లినప్పుడు ముఖ్యంగా యామం నియమం పెట్టుకోవడం కష్టం.   మా ఇంటివెనుక దాదాపు ఇరవై రకాల పక్షులు - పావురాలు, పిచ్చుకలు, కాకుల వంటివి బ్రతుకుతుంటాయి.  మేము తినగా యామం తర్వాత మిగిలిన ఆహారపదార్ధాలన్నీ ఈ పక్షులకు ఆహారంగా మారతాయి.  అలాగే మా పెరట్లోనే ఒక మూలలో ఒక నక్క తన కుటుంబసమేతంగా బొరియలో కాపురం ఉంటుంది.  అది మాత్రం రాత్రిపూట వచ్చి తనకు కావాల్సిన తిండి తన పిల్లలతో సహా తినేసి వెళ్లిపోతుంది.... ఇప్పుడు అర్ధమైందా "మేము ఆహారాన్ని పారెయ్యము" అన్నదానికి అర్ధం?!  మనమేగాదు మనలను ఆశ్రయించుకుని అనేక జీవజంతువులు నివసిస్తుంటాయి.  మనం వాటిగురించిగూడా మనసులో పెట్టుకుని ఆహారాన్ని సంపాదించడము వినియోగించడము విసర్జించడము చెయ్యాలి.  కాబట్టి మీరు ఆహారం వదిలిపెట్టకుండా తినేస్తే మరి ఆ జంతువులన్నీ ఏమైపోవాలి?  వాటికి భగవంతుడు తిండి ఇవ్వచ్చుగాక కానీ మనం కంచంలో వదిలేసినంతమాత్రాన ఆహారం వృదా అయిపోదు.  కాబట్టి అన్నం వదిలేస్తున్నందుకు బాధపడకండి, ఏదో ఒక జీవం తిండి తింటుందని ఎరుకకలిగి సంతోషించండి.  అవసరమైనదానికంటే ఎక్కువ తినకండి, అవసరం లేకుండా తినకండి.  అవసరమైన ఆహారం కంటే ఎక్కువ కంచంలో పొరపాటున పడితే దానిని పారెయ్యడానికి వెరవకండి.  ఇంకొక ముఖ్యవిషయం.  యామం గడిచిన తర్వాత తిండి మనుషులకుగూడ ముష్టిగా వెయ్యగూడదు అని పూర్వం నియమం.  అంటే పాచిపోయిన అన్నం దానం చెయ్యడం మంచిదిగాదు.  అందువల్ల మీరు ఎవరైన మనుష్యులకు అడుక్కునేవారికి అన్నం దానం చెయ్యాలనుకుంటే వీలైనంతవరకు పాడవని భోజనమే అందించండి... యామం దాటిన తర్వాత భోజనం పశుపక్షాదులకు అందించండి.  స్వస్తి

  

1 comment:

  1. Excellent article Sir...chala manchi vishyam chepparu..we must follow this principle from now onwards...tnk u. - Sridhar

    ReplyDelete