Total Pageviews

Thursday 24 January 2013

నగ్నత్వం అనేది మనిషి యొక్క మానసిక పరిపక్వతమీద ఆధారపడి ఉంటుంది.


నగ్నత్వం అనేది మనిషి యొక్క మానసిక పరిపక్వతమీద ఆధారపడి ఉంటుంది.  ‘మనయేవ కృతం కర్మ న శరీర కృతం కృతం, యానైవాలింగితా కాంతా తానైవాలింగితా సుతా!‘ అని మనుధర్మశాస్త్రంలో ఉన్నది.  అంటే మనిషి మనసే కర్మచేస్తుంది.  శరీరంచేసిన కర్మ కర్మగా పరిగణించగూడదు.  ఎందుకంటే ఏ శరీరంతోనైతే నీవు నీ భార్యని కౌగిలించుకుంటావో అదే శరీరంతో నీ కుమార్తెనిగూడా కౌగిలించుకుంటావు.... శరీరం ఒకటే, చేసే పని కౌగిలింతే, కానీ ఆ కౌగిలింతలవెనుక భావాలు వేరు!  భార్యపట్ల కామం ఉంటే, కుమార్తెపట్ల వాత్సల్యం ఉంటుంది.

ఇకపోతే మనుషుల్లో తన నగ్నత్వాన్ని ప్రదర్శించి ఎదుటిమనిషిలో కామభావనలు రేపాలి అనుకునేవారు కొందరయితే, ‘పుట్టినప్పుడు బట్టకట్టలేదు పోయేటప్పుడు బట్ట వెంటరాదు నడుమబట్టగట్ట నగుబాటుగాదా!‘ అని వేదాంతభావనలో బట్టను వదిలి తిరిగే వేమనలు అవధూతలు మరికొందరు.  ఒకప్పుడు భారతస్త్రీలు పైబట్టవేసుకునేవారుగాదు, అయితే అది అసహ్యమనీ సభ్యతగాదనీ ఎవరూ భావించేవారుగూడాగాదు!  స్త్రీనిచూస్తే గౌరవభావమో, కామభావమో ఈ రెండిట్లో ఏదో ఒకటే కలుగుతుంది.  ఏ స్త్రీనిచూసి నీలో కామభావం కలిగిందో ఆ స్త్రీపట్ల అనేకులకు గౌరవభావం ఉండచ్చు.   అయితే హిందువులయొక్క ఈ సనాతనమైన ఉదారభావాన్ని హిందువులే పోగొట్టుకున్నారు.  కామము (మైధునంపట్ల కోరిక) కలగడం అనేది ‘ఘోరమైన పాపము‘ (Original Sin)  అనియు భగవంతుడు మీరు కలవద్దు అన్నా ఒక ఆదాము ఈవు అను వ్యక్తులు కలిసినందువల్లే ఈ పాపపు ప్రపంచం పుట్టింది అని తమ మతగ్రంధాలద్వారా భావించే మతానుయాయులు హిందువుల నగ్నత్వాన్ని ఈసడించుకున్నారు... హిందువులుగూడా ’తాము చేసేది తప్పేమో’ అన్న ఆత్మగ్లానిలో పడి తమ శరీరాన్ని సభ్యత పేరిట దాచెయ్యడం నేర్చుకున్నారు.  అయితే కాలం మారిపోయింది.... మనుషుల మనస్తత్వాలు మూకుమ్మడిగా మారిపోయాయి..... ఈ కాలంలో నగ్నంగా ఉన్న  వ్యక్తిని చూస్తే కామమేగానీ వారిపట్ల గౌరవం ఇసుమంతైనా కలగని జాతిగా హైందవజాతి మిగిలిపోయింది.... హిందువులు తమ స్వధర్మాన్ని తమదైన నిజమైన ఆలోచనలను పోగొట్టుకున్నారు.  అది దురదృష్టం.

-- తురుమెళ్ల మాధవ

No comments:

Post a Comment