Total Pageviews

Sunday 7 August 2011

స్నేహం

ఎత్తుపల్లాలెరుగని ఈ జీవితపు
సమాంతరపు భూమిపైనుండి
అవకాశాల ఆకాశంపైకి ఎగబాకు
నిచ్చెనలకోసం వెదుకకు
రా....
నీకు నా భుజాలనిచ్చి మోస్తాను...


నీకోసం నేను చేసే త్యాగంలో నీవు వామనుడిలా మారినా
నన్ను బలి చక్రవర్తిలాగా నీ పాదాలతో భూమిలోకి తొక్కినా
నాకు సంతోషమే... నాకు మిగిలేది సంతృప్తే...



నీవెక్కిన ఆకాశం వంకచూసి
నీవు తిరుగాడే మేఘాలను చూసి
నీవందుకుంటున్న విజయాలను చూసి

నీవెక్కిన బరువుని మోసి బరువెక్కి కాయలుకాచిన నా భుజాలను తడువుకుంటూ
నిన్నుగమనిస్తూ ఆనందాశృవులు నిండిన కళ్లతో
సగర్వంగా భూమిలో పాతుకుపోయిన కాళ్లతో
కదలలేని నేను ఇక్కడే మిగిలిపోతాను.

నీవు చూసినా చూడకపోయినా,
జీవితపు చివరి మజిలీ వరకు మనం తిరిగి కలిసినా కలవకపోయినా,
మరణించి భూమిలో మిగిలిపోయే నా శవానికి పైనున్న బండరాళ్ల సమాధిపై
ఒక సున్నితపు స్నేహపు పుష్పాన్నుంచి నన్ను పలకరించడానికి నీవు వచ్చినా రాకపోయినా
ఏమయినా సరే -
నిరంతరం నీకోసం
స్నేహపతాకం ఎగురవేస్తూ నిలబడిపోతాను -

ఏదో ఒకనాడు
స్నేహితునిగా నీ మంచిని నిరంతరం కోరిన అనామకునిగా
భగవంతుని ధర్మపు కౌగిలిలో తృప్తిగా ఒదిగిపోతాను...

[ఇలా అనుకుని జీవితపు మజిలీలలో మిగిలి పోయిన అనేకమంది స్నేహితులు, నాకు అవకాశాల ఆకాశాలందించడానికి వాళ్లవంతు ప్రయత్నం చేసిన వాళ్లకి నా మనస్సులో క్రుతజ్ఞతాభావాన్ని వెలిబుచ్చుకుంటూ,,, శిరసువంచి వాళ్లందించిన ధర్మానికి నమస్కరించుకుంటూ .. - మాధవ తురుమెళ్ల 7th August 2011]

No comments:

Post a Comment