Total Pageviews

Saturday, 23 February 2013

హైందవమతము ’పాపము’ ఒక విశ్లేషణ


నిజానికి ’పాపము’ అన్న పదాన్ని చాలా జాగ్రత్తగా అర్ధం చేసుకోవాలి. హిందువులు ’పాపం’ గా దేన్ని భావిస్తారో దానికి ’క్రైస్తవులు, ముస్లింలు, యూదులు’ భావించే ’పాపానికి’ హస్తిమసకాంతరం తేడా ఉంది. హిందువులకు ’పాపం’ అంటే ’పతనాత్’ అంటే సచ్చిదానంద ఘనుడైన పరబ్రహ్మని ఆశ్రయించుకున్న మాయావరణలో పడి సాక్షాత్తూ ’దేవుడే’ తనని ’జీవుడు’గా భావించుకోవడమే పాపం. అయితే ఈ అర్ధాన్ని ఇప్పుడు హిందువులుగూడా వాడటంలేదు. ’Sin' అని ఇంగ్లీషులో అనేసుకుని ఇతరమతాల అర్ధం తీసేసుకుని తృప్తి పడిపోతుంటారు. 

వేదములలో సూర్యుని బ్రహ్మ అన్నారు. దానికి ప్రశ్నగూడావేశారు... సూర్యమండలావర్తియైన పురుషుడు సూర్యుడా లేక బ్రహ్మయా? దానికి చాందోగ్యంలో సమాధానం ఇస్తూ ’సర్వేభ్యః పాపేభ్యః ఉదితః’ అని చెప్పారు. అంటే సర్వపాపములపైనున్నవాడు అతీతుడు అని విశేషణగా చెప్పారు. 

ఇక మానవజన్మ విషయానికి వస్తే ’సర్వేభ్యః పాపేభ్యః ఉదితః’ అయిన ఆ పరబ్రహ్మ మాయావర్తి అయినపుడు సృష్టి మొదలైంది. చాందోగ్య ఉపనిషత్తులో బహుశ్యాం ప్రజాయేయే (ఛాం 6/2/3) అంటే ఆ పరమాత్మ ’నేను చాలా రూపాలుగా మారాలి అనుకున్నాడు. ఒకడుగా ఉన్న ఆయన నేను అనేకమవ్వాలి అనుకున్నాడు.’ అలా సృష్టిమొదలైంది. 

అలా ఒకడిగాఉన్నవాడు అనేకంగా మారాలి అనుకోవడమే ’పాపం’. అయితే అది ఇంగ్లీషులోని ’Sin' కాదు. అంటే స్వస్వరూపానుసంధానాన్ని మర్చిపోయి మాయలోపడి కొట్టుకుపోవడం. ఇకపోతే ఆయన నేను అనేకంగా అవాలి అనుకున్నపుడు ఎప్పుడు ఏ జన్మ మొదలైంది? సముద్రాన్ని ఊహించుకోండి సముద్రంలో అలలు లేస్తాయిగదా? మరి అలకి సముద్రానికి తేడా ఏంటి? అలయే సముద్రము.... అంటే సముద్రంలోని కొంతనీరు అలగా లేచి కిందపడుతోంది. మరి అలని అలగాను సముద్రాన్ని సముద్రంగాను రెండుగా విడదీసి ఎందుకుచూస్తామో ఆలోచించండి? అదే భిన్నభావము దోషభావము అదే ’పాపము’... మనకు సృష్టిలో కనబడాల్సింది ఆ సముద్రంలాంటి ’పరమాత్మ’ కానీ మనం అలలలాంటి ’మనుషుల్ని’ చూస్తాము. ’అయం నిజః పరోవేత్తి గణనాం’ - వీడు నావాడు వారు పరాయివాడు అని యోచన చేస్తాం... అందుకే నారాయణోపనిషత్తులో ’అయం నిజః పరోవేత్తి గణనాం లఘుచేతసాం ఉదార చరితానాంతు వసుధైవ కుటుంబకం’ అని చెప్పారు... అంటే ’మందబుద్ధులు మాత్రమే వీడు నావాడు వాడు పరాయివాడు అని లెక్కలుగడతారు... ఉదారచరితులు [హిందువులు] ఎప్పుడూ ఈ జగత్తంతా నా కుటుంబమే అనుకుంటారు. అలా అనుకోకపోవడమే పాపం... [Sin కాదు].

అయితే అనేకంగా మారాలనుకున్న పరమాత్మకు ’సత్ + చిత్ + జ్ఞానం’ అనేవి మూడు ఉన్నాయిగదా! మరి మనం ఏ పూర్వజన్మ ’పాపం’ చేసి ఈ జన్మకు వచ్చాము? అంటె బహుశా నీకు ఏ పూర్వజన్మో ఉండి ఉండకపోవచ్చు. 

ఒక పెద్ద వృత్తాన్ని (Circle) ని ఊహించుకోండి... ఆ వృత్తం రేఖలో మొదలెక్కడ చివరెక్కడ? కాబట్టి మీరు ఎక్కడ వృత్తంలో మొదలుగాభావిస్తారో తార్కికంగా చూస్తే అదే చివరగూడానూ... అదేవిధంగా మానవజన్మ.... మీ మానవజన్మ మీ మొదటి జన్మ... అదే నిజంగా చూస్తే --- మీరు స్వరూపాను సంధానం చేస్తే --- చివరజన్మగూడానూ... అంటే మాయావృత్తంలో మీరు జీవనం ఎక్కడ మొదలుపెట్టారో అక్కడే మోక్షం (అంతం) మీకోసం సదా ఎదురుచూస్తోంది... తెలుసుకోండి...

పరమాత్మ నేను అనేకులుగా ’ప్రజ’ అన్న పదాన్ని వాడాడు ’పశు’ అనే పదాన్ని వాడలేదుగదా?! ప్రజ అంటే మనుష్యులేగదా! ’ప్రకర్షేణ’ + ’జ’ అంటే విశేషంగా పుట్టినవారు ఎవరు? మనుషులే... ఆలోచించండి!...... కాబట్టి పరమాత్మ తనను పుట్టించుకున్నప్పుడు ’మనిషిగానే’ పుడతాడు... అది ’పాపం’ కానీ Sin కాదు. కాబట్టి నీవు ఈ జన్మలో ఏదైతే అనుభవిస్తున్నావో దేనిని దుర్భరంగా బాధాకరంగా భావిస్తున్నావో అనుభవిస్తూ ’భగవంతుడా ఏ జన్మలో ఏ పాపం చేసానో’ అనుకుంటున్నావో అది నిజానికి ఏ జన్మదో అయిఉండకపోవచ్చు. నీవు శుద్ధుడివి, బుద్ధుడివి నిరంజనుడివి, అవ్యయుడవి కానీ మాయలో పడి నేను ’ఏ జన్మలో ఏ పాపం చేసానో’ అని ఏడుస్తున్నావు అని ఆ తల్లి మదాలస ’శుద్ధోసి బుద్ధోసి నిరంజనోసి’ తన బిడ్డకు జోలపాట పాడింది.... ఆలోచించండి! కాబట్టి దివ్యాత్మ స్వరూపులారా.... లేవండి మీరు ఏ పాపమూ (Sin) చెయ్యలేదు... మీరు సాక్షాత్తూ పరమాత్మ స్వరూపులు.... కాబట్టి మీరు పొందుతున్న అనుభవాలు మీ పూర్వజన్మపాపాలు కావు.... మీరు నిరంజనులు. ఆ విషయాన్ని తెలుసుకోండి... హాయిగా ఆనందంగా నిర్భీతిగా ఏ విధమైన ఆత్మగ్లాని లేకుండా తిరిగి మీ ’స్వరూపానుసంధానం’ చేసుకోండి. మిమ్మల్ని మీరు మాయనుండి ముక్తులు గావించుకోండి... ’నీవు పాపం చేసావు అందుకే ఇలా పుట్టావు, నీవు పాపం చేసావు అందుకే అనుభవిస్తున్నావు’ అన్న మాటలు నమ్మకండి. అదంతా వట్టిది.... కలలో హత్యచేసినవాడు నిజజీవితంలో శిక్ష అనుభవిస్తాడా?! నిరంజనుడైన పరమాత్మ మాయలొ పడి కంటున్న కలకు నిజత్వాన్ని ఆపాదించకండి.... హైందవులుగా పుట్టిన మీరు దివ్యాత్మస్వరూపులు అలాగే నడవండి నిలవండి... ఇతరమతములలోని ’పాపము’ అన్న అర్ధాన్ని మీ మతానికి ఆపాదించుకుని కుంగిపోకండి... -మాధవ తురుమెళ్ల

1 comment:

  1. మీ విష్లేశణ బాగుంది ......మంచి విషయాలని తెలియచేస్తున్నారు,ధన్యవాదములు!

    ReplyDelete