Total Pageviews

Saturday, 16 February 2013

ఐలయ్య కధ


ఐలయ్య అంటే ఏ హిందూ దేవుడు?  అని నిన్న ఎవరో నన్ను అడిగారు.  దీనికి సమాధానం:
ఐల అనేదేవుని ప్రసక్తి ఋగ్వేదంలో వస్తుంది.  ఇల దేవతకు కు బుధునివల్ల పుట్టినవాడు. కానీ ఇలాదేవత వేరే తండ్రిఅనేది లేకుండా కన్నది అని మహాభారతంలోఉన్నది.  ఈ ఐలదేవుడే తెలుగువారి నోళ్లలో నాని ’ఐల+అయ్య’ ఐలయ్యగా అయాడు.  ఋగ్వేదములో ’మంచివానిగా’, ’మృదుస్వభావిగా’,  [వెర్ర్రిబాగులవానిగా] ’ఊర్వశితో పిచ్చి ప్రేమలో పడినవాడిగా’ ఆడవారి పట్ల గాఢంగా మనసు పారేసుకుంటే జరిగే అనర్ధాలకు ఉదాహరణగా ఐలయ్య గురించి చెబుతారు.

ఐలయ్య  ఋగ్వేదంలో ఊర్వశి నిర్దాక్షిణ్యంగా వదిలి వెళ్లిపోతే  ఏడుస్తూ "ఆడవారితో శాశ్వతస్నేహాన్ని ఆశించగూడదు [అంత తెలివితక్కువపని ఇంకొకటిలేదు] ఆడవారి గుండెలు [బొమికలనిగూడ మిగలకుండా బొందిని కొరికి తినగల] దుమ్ములగొండి గుండెలు" అని చెప్పాడు?! [ఋగ్వేదం 10-95-15]

ఇలాదేవి క్షత్రియుడైన మనువు కూతురు అందువల్ల మనువుయొక్క రాజ్యభాగాన్ని తను పొంది తర్వాత దాంట్లో ’ప్రతిష్ఠాన’ అనే నగరాన్ని ఐలయ్యకు ఇచ్చినట్లు పురాణంలో ఉన్నది. ఈ ఐలయ్యకే పురూరవస్ అని మరొకపేరు  ’విక్రమోర్వశీయం’ నాటకంలో ఇతడు ముఖ్యపాత్రధారి (హీరో). పురూరవస్ విక్రమునిగా ఐలయ్యగా ప్రతిష్టానపుర రాజ్యాన్ని ఏలుతున్నప్పుడు మిత్రవరుణ దేవతలు స్వర్గలోకంలోని ఊర్వశిని భూలోకంలో ఉండమని శపించారు.  ఊర్వశి భూలోకంలో ప్రతిష్ఠానపురంలో అడుగుపెట్టింది.  ఆవిడ అందాన్ని చూసిన ఐలయ్య ముగ్థుడై ఆవిడతో ప్రేమలో పడ్డాడు.  ఆవిడగూడా మంచివ్యక్తి ఐన అతనితో ప్రేమలో పడింది... వాళ్లు కలుసుకుని తిరుగుతున్న రోజుల్లో ’మనం పెళ్లిచేసుకుందాం’ అన్నాడు.  దానికి ఊర్వశి ’సరే... కానీ నావి రెండు షరతులు’ (౧) నావద్ధ రెండు పొటేళ్లు ఉన్నాయి.  ఆ రెండూ నాకు పిల్లల్లాంటివి. అవంటే నాకు ప్రాణం. అవి నా పక్కనే ఉండాలి.  నేను పడుకునే గదిలోనే అవీ పడుకోవాలి (౨) నీవు పూర్తి నగ్నంగా నా కనులకు కనబడగూడదు.  ఈ షరతులకు సరేనన్నాడు ఐలయ్య.  వారిద్దరూ అన్యోన్యంగా కాలం గడుపుతూంటే గంధర్వుల లోకంలో వారికి ఊర్వశి లేని వెలితి తెలిసి వచ్చింది.  ఆవిడ ఐలయ్యని వదిలి రాదు అని వారికి తెలుసు.  అందుకని వారు ఒకరోజురాత్రి ఆ పొటేళ్లని దొంగతనం చేసి పట్టుకుపోతారు.  తన పొటేళ్లని ఎత్తుకుపోతున్నారని తెలిసి ఊర్వశి పెద్దగా కేకలు వేస్తుంది.  పక్కగదిలో బట్టలు మార్చుకుంటానికి నగ్నంగా తయారయిన ఐలయ్య ఆ కేకలు విని ’ఒక్క క్షణం ఆగు నేను నగ్నంగా ఉన్నాను బట్టలు కట్టుకుని ఆ దొంగల వెంట పడతాను’ అంటాడు.  ’నన్ను నిజంగా ప్రేమించినవాడివైతే ఉన్నఫళంగా బైటికిరా పో నా పొటేళ్లు ఎత్తుకుపోతున్నవారిని నాలుగు తన్ని నా పొటేళ్లను నాకు తెచ్చిపెట్టు’ అంటుంది. దాంతో ’తను నగ్నంగా కనబడను’ అన్న ప్రతిజ్ఞను తెలిసినాగూడా ’నన్ను నువ్వు నిజంగా ప్రేమిస్తే’ అన్నదిగదా! అందుకని నగ్నంగా కత్తి తీసుకుని ఆ పొటేళ్ల దొంగలవెంట పడతాడు. కానీ ఆ పరుగులో ఊర్వశి కనులకు నగ్నంగా కనబడతాడు.  ఆవిడ శాపవిమోచమనం పొంది మాయమైపోతుంది.  దాంతో ఊర్వశిని పోగొట్టుకుని పిచ్చివాడై ఏడుస్తూ నగ్నంగా వీధులవెంట ఐలయ్య తిరగడం మొదలుపెట్టాడు. తన రాజ్యాన్ని త్యజించి దేశ సంచారం చేస్తూ ’ఊర్వశీ ఊర్వశీ’ అని పిలుస్తూ తిరుగుతుంటాడు.  అప్పుడు కురుక్షేత్రంలోని తీర్ధంలో తన స్నేహితురాళ్లు నలుగురితో కలిసి స్నానం చేస్తున్న ఊర్వశి ఆయన కంట కనబడుతుంది.  ’నన్ను అలా అర్ధాంతరంగా వదిలి వెళ్లడం నీకు భావ్యమా? నీవులేక నాకు జీవించాలనిపించడంలేదు ’ అని ఊర్వశి కాళ్లు పట్టుకుని ఏడుస్తాడు. ఎంత చంచలస్వభావి అయినా ఊర్వశికి ఐలయ్యపట్ల మనసులో ఎక్కడో ప్రేమ ఉంది. ఆయనని లేపి ’బాధపడకు నిజానికి నేను ఇప్పుడు గర్భవతిని నీ బిడ్డకు తల్లిని’ అని అతనికి చెప్పి తిరిగి రాజ్యభారం స్వీకరించమని చెబుతుంది.  కానీ ఐలయ్యతో తిరిగివెళ్లడానికి అంగీకరించదు.  ’చంచలస్వభావినైన నేను నీతో భార్యగా కాపురం చెయ్యలేను అందువల్ల నీవు తిరిగి ఒక సంవత్సరం తర్వాత ఇదే ప్రదేశానికి రా.  అప్పుడు నేను నీతో ఒక్క రాత్రి గడుపుతాను.’ అని వరం ఇస్తుంది. ఆ విధంగా తనని నిర్దాక్షిణ్యంగా విడిచివెళ్లిన ఊర్వశి ఇచ్చిన స్వాంతనతో స్వస్థుడై ఐలయ్య తిరిగి ప్రతిష్టానపురానికి తిరిగివస్తాడు.  మహావీరునిగా అజేయునిగా రాజ్యాన్ని ఏలుతాడు.  ఊర్వశినుండి మొదటిబిడ్డ ’ఆయుస్’ ను పొందుతాడు.  తిరిగి అదేవిధంగా ప్రతిసంవత్సరానికి ఒక్కరాత్రి ఊర్వశితో గడిపి మొత్తం ఆరుగురు పండంటి మగబిడ్డలను పొందుతాడు.  [కొన్ని కావ్యాలలో ఎనిమిదిమంది బిడ్డలు అని ఉన్నది] ఊర్వశిని స్వేచ్చగా తన దారిన తనని వదిలేసినందుకు కట్టడి చెయ్యనందుకు సంతోషించిన గంధర్వులు ’నీవు ఏదైనా వరంకోరుకో ఇస్తాము’ అని ఊర్వశిద్వారా కబురుపంపుతారు.  ఐలయ్య మనసులో ఊర్వశితోనే శాశ్వతంగా గడపాలని ఉన్నది.  అదే విషయం ఐలయ్య గంధర్వులకు చెబుతాడు. దాంతో గంధర్వులు ఒక పాత్రలో అగ్నిని ఇచ్చి "ఈ అగ్నిని తీసుకు వెళ్ళు... వేదములు చెప్పిన ప్రకారం ఈ అగ్నిని మూడుగా విభజించు, తర్వాత ’ఊర్వశితో నేను శాశ్వతంగా నివసించాలి’ అనే కోరిక మనసులో పెట్టుకుని ఆహుతులు అర్పించు... నీకు తప్పనిసరిగా జయం అవుతుంది" అని చెబుతారు.  ఐలయ్య ఆవిధంగా చేసినవాడై గంధర్వలోకంలో స్థానం పొందుతాడు.... అంటే ఊర్వశి చంచలస్వభావి భూలోకంలో ఐలయ్యపక్కన ఉండలేదు అందుకని ఐలయ్యే గంధర్వునిగా యజ్ఞంవల్ల మారాడు.  దాంతో తను అత్యంత గాఢంగా ప్రేమించే ఊర్వశి పొందు ఐలయ్య సొంతం అయింది. ఆ విధంగా అతని కోరిక నెరవేరింది.


పురూరవస్ కు ఊర్వశికి మధ్యన జరిగిన అధివాస్తవికమైన సంభాషణ ఋగ్వేదంలో ఉన్నది.  ఈ పైన చెప్పిన కధ ’శతపధ బ్రాహ్మణం’లో ఉన్నది, ఆ తర్వాత అనేక పురాణాల్లో కనబడుతుంది. భాగవత పురాణంలో ’ఈ పురూరవుడు విభజించిన మూడు అగ్నులే మూడు వేదములుగా త్రేతాయుగం మొదట్లో వేదవిభజన జరిగింది’ అని ఉన్నది.... స్వస్తి.... --మాధవ తురుమెళ్ల

No comments:

Post a Comment