నిశిరాతిరి కాటుక కళ్ళు నవ్వితే ఒలికినట్లున్న నక్షత్రాలు
కొంచెం బిడియంగా చుట్టుకున్నట్లున్న పల్చటి వెన్నెల చీరలో
దాచాలని ఎంత ప్రయత్నంచేసినా దాగని అందాలు...
సృష్టి రహస్యాలను
చెవుల్లో గుసగుసలుగా చెప్పే
పిల్ల తెమ్మెరల మంద్రద్వ్హనులలో,
నునుసిగ్గుగా -
నా గుండెచప్పుడు నేపధ్యంగా
నాలో నిశ్శబ్దంగా ఆలాపించబడుతున్న ప్రేమ గీతం...
వికసించిందో, పుష్పించిందో, అహ్లాదభరితంగా చలించిందో,
మల్లెలుగా జాజులుగా అగరొత్తుల పొగలు పొగలుగా
సువాసనలుగా ఆఘ్రాణితమైన ఆ మధుర క్షణం
నేను నేను మరిచిపోలేని క్షణం....
నా హృదయపు ప్రేమ సింహాసనం మీద
నమ్మకంగా ఒదిగిన నా నెలవంక
అలవోడ్పుగా నను చూస్తూ హత్తుకున్న సిగ్గుల మొగ్గయింది...
నాకొక అస్తిత్వాన్నందిస్తూ తను నాలో కరిగిపోయింది,
నేనేతనుగా తనే నేనుగా త్వమేవాహంగా
ఆహ్లాదంగా ఆప్యాయంగా ఆనందంగా మారిపోయింది...
- మాధవ తురుమెళ్ల
కౌముది మాసపత్రిక మార్చి ౨౧౦౧౨ సంచికలో ప్రచురితమైన కవిత
http://www.koumudi.net/Monthly/2012/march/index.html
అభినందనలండీ...
ReplyDelete