Total Pageviews

Sunday, 3 March 2013

ఒక మేనక అన్నది



ఒక మేనక అన్నది

రాత్రికి రహస్యం పోదు
పగటికి పచ్చిదనం రాదు...
ప్రాక్పశ్చిమ దిశల సమావర్తనం కొలవడం దేనికి
చుట్టూచూస్తే అనుభూతికి తెలియడంలేదా ఈ భూమి గుండ్రమని!
కళ్లువిచ్చిచూస్తే తెలిసే
సృష్టిరహస్యాన్ని కన్నులుమూసి కనుక్కోవాలనుకునే
ఓ పిచ్చిబాపడా!
నీకు తెలుస్తోందా నీవేం పోగొట్టుకున్నావో!

రా...
నీకొక కౌగిలింతల స్వర్గం చూపించి
నీకు తపోభంగం చేస్తాను
నిన్ను నాలోకి చేర్చుకుని -
అద్వైతం అంటే ఏంటో నిజంగా బోధిస్తాను.
నా కళ్లలోకి చూడు
నీలినీడలవెనుక తేలుతున్న కాంక్షా విహంగాలను చూడు...

ఈ చలిలో ఈ ఉషస్సులో
ఏ స్వర్గాన్ని కోరి నీకీ తపస్సు
నీ ఉనికిని పూర్తిగా మాయంచెసే
ఏ మోక్ష పరిష్వంగంకోసం నీకీ తమస్సు
రా...
నా విరహపు నిట్టూర్పుల
వెచ్చని మేఘాలను నిన్నావరింపజేసి
నీకు నా శరీరాన్ని చలిమంట చేసి
నా యోగాగ్నిలో నీకు ఆహుతులిస్తాను
నీకిక ఏ స్వర్గమూ వద్దనుకునేటట్లుగా చేస్తాను.

******
 --మాధవ తురుమెళ్ల


1 comment: