Total Pageviews

Sunday, 18 November 2012

విగతభీః


 చిన్నప్పుడు రేపల్లెలో పెనుమూడి వద్ద ప్రతిరోజూ కృష్ణానదిలో ఈతకొట్టడానికి స్నేహితులతో కలిసి వెళ్లేవాడిని.  ఒక్కోసారి ఒంటరిగా వెళ్లేవాడిని.  నేను గజఈతగాడినని చెప్పుకోనుగానీ ఫర్లేదు బాగానే ఈదగలను.  రేపల్లెవైపు ఒడ్డున చాలా ఎక్కువమంది స్నానాలు చేస్తుండేవారు. అందుకని నేను  ఈదుకొని కృష్ణానది అటువైపున మధ్యల్లో ఉన్న ఇసుకలంకలవద్ద స్నానం చేయడానికి వెళ్లేవాడిని.  ఆ ఇసుకతిన్నెలమీదే కూర్చుని నా జపధ్యానాలు చేసుకునేవాడిని.  ఒకసారి కృష్ణమ్మ మంచి వరదలో ఉంది.  నేను మామూలుగా ఈదుకొని అటువైపు వెళ్లాను.   ఇంతలో పెద్దగా అరుపులు.  రక్షించండి రక్షించండి అని చూస్తే స్నానానికి వచ్చిన ఒక వ్యక్తి కాలుజారిపడి కొట్టుకుపోతున్నాడు.  సరే! మొత్తానికి కష్టపడి ఈదుకువెళ్లి అతడిని రక్షించి ఒడ్డుకు చేర్చాను.  మళ్లీ నేను తిరిగి స్నానానికి వెళ్లిపోయాను.  ఒక గంట తర్వాత నేను రేపల్లె ఒడ్డుకు వచ్చి నా సైకిలు తీసుకుని నడుపుకుంటూ వెళుతుంటే పెనుమూడి బస్టాండు దగ్గర చాలామంది గుమిగూడి ఉన్నారు.  ఏంటా అని వెళ్లి చూస్తే ఇందాక కృష్ణలో ప్రమాదవశాత్తూ పడి మరణించబోయినవ్యక్తి ప్రమాదవశాత్తూ రేపల్లె-పెనుమూడి బస్సుకిందపడి మరణించాడు... చావు రాసిపెట్టి ఉంటే ఎవరూ ఎక్కడా అడ్డుపడలేరు.  అందుకే బ్రతికినన్నాళ్లూ రేపనేది లేనట్లుగా బ్రతకాలి... భయపడకుండా బ్రతకాలి.  హాయిగా బ్రతకాలి...

నాకనిపించేదేంటంటే ‘భయం‘ అనేది ఒక పరదా!  దానికి అటువైపు మరణం ఉంటుంది,  ఇటువైపు ఉండేది మన ఆత్మ.... ఈ ఆత్మ ‘భయం‘ పరదాని చూసి జాగ్రత్తపడుతూంటుంది.  అయితే ఎప్పుడైతే భయంపరదాని మనం తొలగించుతామో అప్పుడు మరణంయొక్క పేలవత్వం అర్ధమవుతుంది.  అది ఎంత శుష్కమైనదో అర్ధమౌతుంది. అందుకే హైందవ ధర్మగ్రంధాలు ’మాచే వ్యధా మాచ విమూఢభావాః’ అనీ  ‘మా భీః‘ ‘భయం వదిలిపెట్టు‘ అని మరలమరల చెబుతాయి.  భయంవదిలిననాడు మనిషి జీవించిఉండగానే ‘అమరు‘డవుతాడు...  అమృతుడవుతాడు...   భయపడని ఆత్మ పక్షిలాగా స్వేచ్చగా తనదైన చిదాకాశంలో విహరిస్తుంది.  అందుకే ‘భయాన్ని వదిలిపెట్టండి‘, హాయిగా ఊపిరిపీల్చండి.  నిర్భీతిగా మీ మనసులో విషయాలను పంచుకోండి.  ప్రపంచాన్ని, మిమ్మల్ని భయపెట్టాలని చూసే అరాచకాన్ని ఎదుర్కోండి.  మరణం ఎప్పుడైనా ఎలాగైనా రావచ్చు కాబట్టి దానిగురించి ఆలోచిస్తూ దాని పరదాయైన ‘భయాన్ని‘ ఎల్లప్పుడూ చూస్తూ నిలబడకండి... జీవితాన్ని గడపండి.

 -మాధవ తురుమెళ్ల, లండన్ 18/11/2012

No comments:

Post a Comment