Total Pageviews

Wednesday, 19 September 2012

అమ్మకు ముద్దులబిడ్డడు


అమ్మకు ముద్దులబిడ్డడు  నమ్మకముగ గాచువాడునమ్మిన వారిన్!

హైందవ పూజలలో మనం ప్రతిపూజకు ముందర మహాగణపతి పూజ చేస్తాము.  మనం గమనించే ముఖ్యమైన విషయం ఎంటంటే గణపతి పూజ అయినవెంఠనే ఆయనకు ఉద్వాసన చెబుతాము. దేనికని?!  దీని వెనుక ఒక కధ ఉంది.

వినాయకుడికి ’భాద్రపద చతుర్థి’ నాడు గణాధిపత్యం లభించింది.  దాంతో భూలోకవాసులందరూ సంబరపడి ఆ విఘ్నపతిని తమతమ ఇళ్లకు పిలిచి బోల్డన్ని కుడుములు ఉండ్రాల్లు పెట్టారట.  గణపతికి తండ్రిపోలిక - ఒట్టి భోళామనిషి, పైగా ఇట్టే ప్రీతిచెందుతాడు, మొహమాటస్తుడు - ’తను కాదు తినను అంటే తన భక్తుడు ఏం బాధపడతాడో’ అనే మొహమాటం!...  అందుకని ఆయన భక్తులు ఇచ్చినవన్నీతినేసరికి కడుపు ఉబ్బి పోయింది.  తర్వాత ఆయన కైలాసానికి వెళ్లాడు.  ధర్మప్రకారం విదేశాలనుండి పొరుగూరినుండి దేవాలయంనుండి తిరిగి వచ్చిన తర్వాత తన తల్లిదండ్రులకు పాదనమస్కారం చెయ్యాలి.  ఆయన ఆ ధర్మం పాటించడానికి తన తల్లిదండ్రులకు పాదనమస్కారం చేయబోతుంటే భారీగా కుడుములు మెక్కిన పొట్టవల్ల శరీరం సహకరించలేదు.  దాంతో ఆయన ఆపసోపాలు పడుతూంటే, ఆ పక్కనే ఉన్న చంద్రుడు చూస్తూ ఊరుకోలేక పొట్టపగిలిపోయేట్లు నవ్వాడు... అందుకే తెలుగులో ’పొట్టపగిలిపోయేట్లు నవ్వడం’ అనే సామెత వచ్చింది.  సరే! ఆ నవ్వుకు గణపతి అసువులుబాసాడు.

దాంతో ఆ అమ్మలగన్నయమ్మకు ఆ చల్లని తల్లికి లోకమాతకు పుట్టెడు దుఃఖం వచ్చింది.. దుఃఖంలోంచి కోపం వచ్చింది.... కోపంలో చందృడిని శపించింది... ముల్లోకాలను ముంచేత్తేంత ఆగ్రహం చెందింది... అప్పుడు బ్రహ్మాది దేవతలందరూ పరిగెత్తుకువచ్చి ఆ గణపతిని తిరిగి బ్రతికించి ఆవిడను శాంతింపజేసారు.  తన కొడుకు బ్రతికాడన్న సంతోషించిన ఆ చల్లనితల్లి ’భూలోకానికి వెళ్లి అందరూ ఇచ్చిన వన్నీ తిన్నాడు కాబట్టే గదా తనకొడుకుకు అంత ఆపద వచ్చింది’ అని భావించి, తన కొడుకును తిరిగి ఇంకొక చోటికి వెళ్లకుండా -- ముఖ్యంగా భూలోకానికి వెళ్లకుండా కట్టడి చేసింది... నిజమే కదా! కొడుకు క్షేమం కోరుకునే ఏ తల్లైనా తన కొడుకుకు ప్రమాదం జరిగే చోటుకు వెళ్లనిస్తుందా?!

కానీ భూలోకవాసులందరకూ ఎనలేని కష్టం వచ్చింది... గణాధిపతిలేకుండా  ఏపనీ జరగదు గదా!  దాంతో తల్లడిల్లిపోయి వాళ్లందరూ ఆవిడకు మొరపెట్టుకున్నారు.  ’అమ్మా!  దయగనవమ్మా! మీ బిడ్డ మాకు నాయకుడమ్మా.... మా నాయకుడిని మేము గౌరవించుకునే అదృష్టం మాకు దూరం చెయ్యకు... విఘ్నపతిని మా ఇండ్లకు పంపు తల్లీ...’ అని మొరలెట్టుకున్నారు.

ఆ మొరలను వినిన ఆ తల్లి శాంతించి ’సరే! ఒక్క షరతుతో నేను నా బిడ్డను మీ ఇండ్లకు పంపుతాను’ అని చెప్పింది....

ఆ షరతేంటంటే: "గణపతిని అవసరం కన్నా ఎక్కువ తమ తమ ఇళ్లలో ఉంచుకోగూడదు... అంటే పూజకు ముందర ఆయనను పిలిచినప్పుడు ఆయన ప్రసాదం ఆయనకు ఇచ్చి ఆయనను ’క్షేమాయ పునరాగమనాయచ’ అని చెబుతూ కైలాసానికి పంపాలి... అంటే ఉత్తరంవైపు జరపాలి."


ఈ కాలంలోగూడా మనం ఎవరైనా వచ్చి  ’ఏమండీ ఈ రోజు మా అబ్బాయి పుట్టినరోజు, మీ అబ్బాయిని పుట్టినరోజు పార్టీకి పంపండి’ అని అడిగితే ’ఎన్నింటికి తీసుకెళతారు? ఎప్పుడు తీసుకొచ్చి దింపుతారు? ఏం తిండి పెడతారు?’ అని సవాలక్ష ప్రశ్నలు అడిగి మన అబ్బాయిని పంపనైతే పంపుతాముగానీ బిడ్డ క్షేమంగా మన ఇంటికి తిరిగొచ్చేదాకా కళ్లలో వత్తులేసుకుని ఎదురుచూడమా!  అదే ఆ పార్వతమ్మ ప్రేమగూడానూ.... ఆ చల్లనితల్లికి తన బిడ్డంటే ఉన్న ప్రేమే మనని ’గణపతికి’ ఉద్వాసన చెప్పేటట్లు చేస్తుంది...  ఉద్వాసన చెప్పగానే ’ఆయన’ వెళ్లిపోతాడు కానీ ప్రతిమ మన ఇంట్లో మిగిలిపోతుంది. దాంతో ఆ మట్టి ప్రతిమని ఒకప్పుడు రైతులు పొలం దున్నుకునేవారు నారుపోసేటప్పుడు పొలాలో నారునీటితోపాటు వదిలేసేవారు.  లేదా కుమ్మరులు ఆ మట్టివాడి మంచినీటి కుండలు చేసేవారు.  ఇప్పుడు పొలాల్లోని నారునీటిలో వదలడంలేదు కానీ నీళ్లలో ’నిమజ్జనమనీ దద్దోజనమనీ హడావుడిచేసి’ వదులుతున్నారు.  అదీ కధ...

[మరి మీరు నన్నడగచ్చు మీకెలా తెలిసింది అని... ’ఆయనే’ చెప్పాడు :-)]  - మాధవ తురుమెళ్ల


No comments:

Post a Comment