జీవితంలో తనకు జరిగిన అన్యాయాన్ని గూర్చిగానీ -
తనని నమ్మించి మోసగించిన తను అతిగా నమ్మిన తనవారిని గూర్చిగానీ -
తనకు జరిగిన అవమానాలను గూర్చిగానీ,
ఎవరికీ ఫిర్యాదు చెయ్యకుండా -
చనిపోయిన ప్రియబంధువు శవం చుట్టూ
కుండనీరు తీసుకుని తలదించుకు ప్రదక్షిణలు చేసిన వాడికి మల్లే.,
తనను కికురించిన ప్రేమకు -
ఏనాడో మానసిక దహనసంస్కారం చేసి,
జ్ఞాపకాల నీటికుండలనుండి కావాలని పెట్టిన
కళ్ల చిల్లులద్వారా కన్నీళ్లన్నీ కార్చేసి,
పెదవులు రెంటినీ సంస్కారం అనే దబ్బనపు పురికొసతో కుట్టి
మౌనంగా తలదించుకుని -
తన దురదృష్టం అంతే అని అనుకుంటూ
అక్రమంగా జీవితం తనపై విధించిన కర్కశపు శిక్షని భరిస్తూ,
చిరునవ్వు తొడుగుని ముఖంపై తొడుక్కుని
తనదారిన తానుపోయే వాడు
ఎవ్వరినీ ఏమీ అనేవాడు కాడు...
అయినాసరే -
ఆ అమాయకుడికి శిక్ష ఇంకా చాలదన్నట్లు...
ఎప్పట్లానే
చీకట్లో
ఒక్కసారి నిశ్శబ్దం చుట్టుముట్టినవేళ,
కావాలని బలవంతంగా ఆమూలాగ్రమూ తగలెట్టి మోడువార్చిన
అతడు ప్రేమించిన
ఒకప్పటి పచ్చటి ప్రేమల జ్ఞాపకాల మహావృక్షం వెనుక,
తగలబడక అసహ్యంగా దెయ్యంలాగా
భయపెట్టే భూతంలాగా
ఏజన్మపాపమో పగతీర్చుకోవాలన్నట్లు
కనుమరుగవకుండా
బలవంతంగా మిగిలిపోయిన
ఆ మొండిమాను వెనుక,
నిస్సహాయంగా నిక్కి దాక్కుని నిద్రిస్తున్న వాడిని ...
ఆ అమాయకుడిని ----
కర్కశంగా మెడపట్టి బయటకు ఈడుస్తున్నాయి
నరకపు చెరసాలలో నమ్మినబంట్లవంటివైన కలలు!
తనకు దక్కి దూరమైన అందమైన ఒకప్పటి అందాన్ని
దురదృష్టవశాత్తూ పొందలేక జారవిడుచుకున్న ప్రేమజీవితాన్ని
బలవంతంగా సినిమాలా చూపించేస్తూ ---
అవశుడిని అతడిని ఏడిపిస్తాయి...
కలల కర్కశపు పట్టునుండి ఉలిక్కిపడి
విదిలించుకు మేలుకున్న అతడు
చెమర్చిన కళ్లని తుడుచుకుంటాడు
కలేకదా - అని గొణుక్కుంటాడు
గడిచిపోయిన క్షణాలను, నిమిషాలను, గంటలను, సంవత్సరాలను, దశాబ్దాలను
ఉరిస్థంభానికి వేలాడుతూ ఊగిసలాడుతున్న తాడుని చూస్తున్నట్లు
భయం భయం గానే కానీ ఊరికే లెక్కేసుకుంటాడు...
హఠాత్తుగా పిచ్చిగా నవ్వుకుంటాడు -
ఇవాళో రేపో మరణమనే ప్రియురాలు రాకపోతుందా -
నన్ను కౌగిలించుకోకపోతుందా అని ఆశగా అనుకుంటాడు...
కళ్లపై తిరిగి రెప్పలదుప్పటి కప్పుకుని
కలలని పోగొట్టే మంత్రాలను వెదుక్కుంటూ పడుకుంటాడు.
-- మాధవ తురుమెళ్ల (15 December 2011)
No comments:
Post a Comment