ఆత్మ క్షోభ
--------
[చూసావా!]
ఈ సంధ్యని గూడా మనం జారవిడుచుకున్నాము....
ఈ సాయంత్రపు సమయంలో
నీలపు రాత్రి - ఆత్రంగా ప్రపంచంపై పడిపోబోతున్నవేళ
చేయి చేయి కలుపుకు నిలుచోవాల్సిన
మనం ఎవరికీ కనిపించనేలేదు...
దూరదూరపు కొండలపై అంచులపై ముగిసిపోతున్న
ఈ సూర్యాస్తమయపు సంబరాన్ని
నేను ఒక్కడినే నా కిటికీలోంచి పరికిస్తున్నాను.
కొన్నిసార్లు సూర్యుని లోని ఒక భాగం
నా [బీదరికపు] అరచేతిలో నాణెంలాగా మండిపోతుంది...
నీకు తెలుసా -
నా ఆత్మ క్షోభిస్తూన్న
ఆ అంతులేని విషాదంలో
నిన్ను నేను గుర్తుచేసుకున్నానని....
అసలు ఎక్కడున్నావు అప్పుడు నీవు?
ఇంకెవరున్నారు అప్పుడు నీతో?
ఏం చెబుతూ ఉండి ఉంటారు?
నువ్వెక్కడో అందనంత దూరంలో ఉన్నావన్న -
పుట్టెడు దుఃఖాన్ని నేను అనుభవిస్తున్నవేళ
ఎందుకంత అమాతంగా మొత్తంగా ప్రేమ విరహంగా మారి నాపై పడిపోతుంది?
మూసిన పుస్తకం సంధ్యవేళ ఎప్పుడూ కిందేపడిపోతుంది
గాయపడినా విశ్వాసపు కుక్కలాగా
నా నీలపుస్వెట్టర్ నా కాళ్లదగ్గరే పడి నలిగిపోతుంది.
ఇంతే నీవు... ఎప్పుడూ.... ఎప్పుడూ
సంధ్యరంగులలో కరిగిపోతున్న విగ్రాహాలలాగా
సాయంత్రాలలోపాటే కనుమరుగైపోతావు.
-- పాబ్లో నెరుడా [అనువాదం: మాధవ తురుమెళ్ల ]
ఇది నాకు అతిబాగా నచ్చే పాబ్లో కవిత. ఆయన తన బీదరికాన్ని, తనకూ ప్రేయసికి ఉన్న అంతులేని దూరాన్ని తలచుకుంటూ సాయంత్రాన్ని తన అసహాయతను తిట్టుకుంటూన్న ప్రియుడిగురించి రాసిన కవిత....
ఇది 25 September 2011, చిలీదేశంలోని నెరుడా యొక్క ఇంటి పెరటిభాగంలో కూర్చుని ఆలోచిస్తూ ’Clenched Soul' అనే నెరుడా విరహపు కవితకు చేసుకున్న అనువాదం - ఒప్పులుంటే అవన్నీ పాబ్లోవి తప్పులుంటే తెలియక అనువాదానికి సాహసించిన నావని తలచి నన్ను మన్నించండి..
wonderful sir.NUTAKKI raghavendra RAO.(KANAKAMBARAM)
ReplyDeleteమాధవగారూ,
ReplyDeleteఅనువాదం దానికాళ్లమీద అది నిలబడాలి అని నమ్మేవాళ్ళలో నేనొకడిని. మీ అనువాదం చాలా చక్కగా ఉంది.
అభినందనలు.
అభివాదములు
నమస్తె
ReplyDeleteమీ అనువాదం బాగున్నదండీ
పాబ్లో నా అభిమాన కవి.
పాబ్లో ను అనువదించటం అంటే గొప్ప సాహసం.
20 love poems ని మొత్తం అనువదించాను. కొన్ని నా బ్లాగులో పోస్ట్ చేసాను. కొన్ని వివిధ ఇ.పత్రికలలో ప్రచురితమయ్యాయి. ఒక అనువాదం పై అవమానకరమైన విమర్శను ఎదుర్కొనటంతో మిగిలిన వాటిని పోస్ట్ చెయ్యటానికి సాహసించలేదు. ఎందుకొచ్చిన గొడవ అనుకొని. (ఆ గొడవ ఇక్కడ: sahitheeyanam.blogspot.com/2009/12/blog-post_18.html
ఇక్కడ మీరు చేసిన అనువాదం బాగా వచ్చింది. ఇదే కవితకు నా అనువాదం ఈ క్రింది లింకులో
http://sahitheeyanam.blogspot.in/2009/08/blog-post_26.html
కొన్ని వ్యత్యాసాలు ఉన్నాయి - మీరే అన్నట్లు ఒప్పులు మీవి, పాబ్లోవి - తప్పులుంటే నావి :-)
భవదీయుడు
బొల్లోజు బాబా